koodali

Monday, May 1, 2017

గొడవలు లేకుండా అందరూ బాగుండాలని ....


ఇలాంటి సున్నితమైన విషయాలు రాయాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ విషయాల గురించి రాయాలనిపించింది.  

  సైనికులు, పోలీసులు....నక్సలైట్లు..వీళ్ళ మధ్య కాల్పులు జరిగి.... కొందరు మరణించటం అనేది ఎంతో బాధాకరమైన పరిస్థితి.ఈ పరిస్థితి మారాలని ఎందరో కోరుకుంటున్నారు.

 సైనికులు, పోలీసులు ..వీళ్లలో కూడా చాలామంది పేద కుటుంబాల నుంచీ వచ్చిన వారు  ఉంటారు. 

 ప్రజలకు మేలు చేయాలనే విధినిర్వహణలో వీళ్ళు కుటుంబాలకు దూరంగా ఎన్నో కష్టాలను భరిస్తూ దినదినగండంగా పనిచేయాలంటే  ఎంతో  కష్టం. 

 సైనికులు మరణించినప్పుడు టీవీలో వారి కుటుంబాలను చూపిస్తుంటారు. వీళ్ళలో  కొందరివి పేదకుటుంబాలు. 

 మాకు కొద్దిగా పరిచయమున్న కుటుంబం గురించి చెబుతాను. ఇద్దరు  అన్నదమ్ముల  కుటుంబాలు ఉమ్మడి కుటుంబంగా ఉంటారు.

అన్న సైన్యంలో పనిచేస్తుంటే , తమ్ముడు ఊరిలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. 

అన్న కొడుకుకు (చిన్నపిల్లవాడికి)  కిడ్నీ సమస్య వచ్చింది. బాబాయి ఆ పిల్లవాడిని డాక్టరు వద్దకు  తీసుకువెళ్తుండేవాడు.

అన్న అప్పుడప్పుడు సెలవుపై వచ్చి పిల్లవాడిని డాక్టర్కు చూపించి, కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చి తిరిగి సైన్యంలో విధులకు వెళ్లేవాడు. 

 అయితే, కొంతకాలం క్రిందట తమ్ముడు ఏవో అప్పుల  సమస్యతో ఆత్మహత్య చేసుకున్నాడట. అన్న వచ్చి కొంతకాలం ఉండి డ్యూటీకి వెళ్ళిపోయాడు.

 తమ్ముడు చనిపోయినా, కొడుకు జబ్బుతో బాధపడుతున్నా..డ్యూటీకి వెళ్ళక తప్పదు కదా! 

సైన్యంలో ఉద్యోగం మానేద్దామనుకుంటే, ఊళ్ళో ఇప్పటికిప్పుడు ఉపాధి దొరకాలంటే..ఈ రోజుల్లో కష్టంగా ఉంది కదా! 

 నక్సలైట్లు ..వీళ్లలో కూడా చాలామంది పేద కుటుంబాల నుంచీ వచ్చిన వారు ఉంటారు. 

  ప్రజల మేలు కోసం పనిచేస్తామంటారు. కుటుంబాలకు దూరంగా ఎక్కడో అడవుల్లో ఎన్నో కష్టాలను భరిస్తూ దినదినగండంగా బ్రతకాలంటే ఎంతో కష్టం. 

 పోలీసులు అయినా, సైనికులు అయినా,  నక్సలైట్లు అయినా..అందరికీ కుటుంబసభ్యులు ఉంటారు. ఎవరు మరణించినా వారి కుటుంబసభ్యులు ఎంతో బాధపడతారు.

 నక్సలైట్లు వారి కుటుంబాలు, గిరిజనులు వారి కుటుంబాలు, సైనికులు వారి కుటుంబాలు, పోలీసులు వారి కుటుంబాలు..సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!

 నక్సలైట్లు జనజీవనస్రవంతిలోకి వచ్చి , ఎన్నికలలో పాల్గొనవచ్చు. గెలిస్తే ప్రజల మేలు కోసం  మరిన్ని కొత్త సంస్కరణలు తేవచ్చు.  

ఎన్నికలలో  పాల్గొనటం  ఇష్టం  లేకుంటే   ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సహాయం చేయవచ్చు.

 ఉదా..కొందరు ఆదర్శవంతమైన వ్యక్తులు ఏ అధికారం లేకపోయినా ప్రజలను కూడగట్టి తమ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన సంఘటనలు జరుగుతున్నాయి.

 ****************
 అన్ని రంగాలలోనూ మంచి వాళ్ళూ ఉంటారు, చెడ్ద వాళ్ళూ ఉంటారు.

ధనవంతులలో కూడా  మంచి పనులు చేసే వాళ్ళుంటారు. ధనవంతులైనా, పేదవారైనా మంచిగా ఉండటమే   మంచిది.
************************
 ప్రపంచంలో అందరూ గొడవలు లేకుండా సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!



2 comments:

  1. సైనికుల్లో & పోలీసుల్లో దిగువ స్థాయి వ్యక్తులలో అత్యధికం కాదు పేదవారు, అట్టడుగు వర్గాల వారు. ఆఫీసర్లలో వీరి సంఖ్య చాలా తక్కువ.

    గొప్ప ఆదర్శాలు వల్లించే నక్సలైట్లు కూడా ఇంతే. బడుగులు జండాలు మోస్తుంటే సిద్ధాంతాల పేరిట పెద్ద మాటలు మాట్లాడేది "మేధావులు". కులతత్వం, డబ్బు పిచ్చి, అధికార దాహం, ఆశ్రిత పక్షపాతం ఒకటేమిటి సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నీ నక్సలైట్లలోనూ ఉన్నాయి.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete