koodali

Friday, September 5, 2014

శ్రీ దేవీ భాగవతము గ్రంధములోని కొన్ని విషయములు..

ఓం
............................

సజ్జనులకు  ఎప్పుడూ  ఎక్కడైనా  సత్యయుగమే. అసజ్జనులకు  ఎప్పుడూ  కలియుగమే.  మధ్యములకు - మధ్యయుగం.

.................

హర్షమూ, శోకమూ, నిద్ర,  మెలకువ, అలసత  మొదలైన భావాలూ అవస్థలూ సకలప్రాణికోటికీ (దేహధారులందరికీ)సమానం.

దేవతలను  అమరులు ( మరణం  లేనివారు ) -నిర్జరులు (ముసలితనం  లేని వారు ) -  అంటూ  కీర్తించటం ఏదో  మాటవరసకే  తప్ప  పరమార్ధతః ఇది  సత్యం  కాదు.ఉత్పత్తి  స్థితి  వినాశాలూ  దేవతలందరికీ  ఉన్నాయి.  ఇది  సత్యం .  మరింక  అమరులు  ఏమిటి, నిర్జరులేమిటి ? 

పుడుతున్నారు,  దుఃఖాలు  అనుభవిస్తున్నారు, అటుపైని గిడుతున్నారు. వీరిని  దేవ -దేవతా  శబ్దాలతో వ్యవహరించటం  కూడా  సమంజసం  కాదు.( దేవ్యంతి క్రీడంతి సుఖేషు ఇతి దేవతాః =  సుఖాలలో  తేలియాడేవారు )దుఃఖాలలో ఎలా  క్రీడించగలుగుతున్నారు  మరి?  క్షణంలో  ఉత్పత్తినాశాలు  కనిపిస్తున్నాయి  కదా !


 ఆయుర్దాయం  తీరగానే  జలచర  కీటక  మశకాదుల్లాగా  అంతరిస్తున్నారు. అంచేత  వీరిని  అమరులు ( అమరాః ) అనడానికి  వీలులేదు. "మరా" అనవలసిందే. కాకపోతే  ఆయుర్దాయంలో  ఉండే  హెచ్చుతగ్గులను  బట్టి దేవతలనీ  మానవులనీ  భేదాలు  ఏర్పడుతున్నాయి. 

................
సురాసురులందరూ  మాయకు  లొంగినవారే. మాయాధీనులే.  స్వతంత్రురాలు  ఒక్క  మాయాదేవి  మాత్రమే. అందుకని సర్వాత్మనా ఆ  జగదీశ్వరిని  సమర్చించాలి. ఈ  ముల్లోకాలలోనూ  అంతకుమించిన  శక్తి  లేదు. ఆ పరాశక్తి  పదాలను అర్చించడం స్మరించడం - జన్మకు  సాఫల్యం.

భార్యాసమేతులై  త్రిమూర్తులు  ఎప్పుడూ ఈ సచ్చిదానందరూపిణిని  సేవిస్తూ  ఉంటారు.

.............

అకారం  బ్రహ్మస్వరూపం.  ఉకారం  హరిస్వరూపం.  మకారం  రుద్రస్వరూపం.  మహేశ్వరి  అర్ధమాత్ర...

.జగన్మాత  అర్ధమాత్రగా  అనుచ్చార్యగా  ఉన్నప్పటికీ  సర్వోత్కృష్టురాలు.
...................

వ్యాసుల వారు జనమేజయునితో..

జనమేజయా ! నువ్వు  తెలుసుకోవలసిన  రహస్యం  ఏమిటంటే-  ఈ  భువనత్రయ  సృష్టి  ఉందే  ఇది  అహంకారం  నుంచే  ఆవిర్భవించింది. కారణగుణాలు  కార్యంలో  ఉండితీరతాయి. కనక  సృష్టిలో  ఏ  ప్రాణీ  అహంకారవర్జితంగా  ఉండదు. ఉండజాలదు. త్రిమూర్తులే  గుణత్రయస్వరూపులు.  ఇక  మానవమాత్రుల  సంగతి  చెప్పాలా  ? కేవల  సత్వగుణ  సంపన్నుడు  యావత్సృష్టిలోనూ  దుర్లభుడు. అంతటా  గుణత్రయ  సంయోగ స్థితియే  కనబడుతుంది. కాకపోతే  ఒక్కొక్కప్పుడు  ఒక్కొక్క  గుణానిది  పైచేయి  అవుతూ  ఉంటుంది. 


నిర్గుణుడూ  నిర్లేపుడూ  కేవలం  పరమాత్మ  ఒక్కడే. అతడు  అవ్యయుడు,  అలక్ష్యుడు,  అప్రమేయుడు,  సనాతనుడు.  అలాగే  ఆదిపరాశక్తి  కూడా  కేవల  నిర్గుణ. దుర్ జ్ఞేయ,  బ్రహ్మ సంస్థిత,  సర్వభూత  వ్యవస్థిత. ఈ  పరమాత్మపరాశక్తులది  అవిభాజ్యమైన  నిత్య  సంయోగం. వీరు  అభిన్నులు.  ఇది  తెలుసుకుంటే  సర్వదోషాలూ  పటాపంచలవుతాయి. ఈ  జ్ఞానంతోనే  మోక్షమని  ఘోషిస్తోంది వేదాంత డిండిమం . ఇది  తెలుసుకున్నవాడు  త్రిగుణాత్మక  సంసారం  నుంచి  విముక్తుడైనట్టే.

.........................

వైష్ణవులు  ధ్యానించే,  ఉపాసించే  దేవదేవుణ్ణి  గురించి  కూడా  శ్రీ  దేవీ  భాగవతము  గ్రంధములో  వివరములున్నవి.
.................

 ఈ మాయ నుంచి  బయటపడాలి  అంటే  ఆ  మహామాయను ఆరాధించడమొక్కటే  తరణోపాయం.. అని  పెద్దలు  తెలియజేసారు.

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  అచ్చుతప్పుల  వంటివి .. ఉన్నట్లయితే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



No comments:

Post a Comment