koodali

Wednesday, December 13, 2017

స్త్రీ స్వేచ్ఛ .....

ఆధునిక కాలంలో  స్త్రీ స్వేచ్ఛ  పేరుతో స్త్రీలపై ఎన్నో అదనపు బాధ్యతలు పడ్దాయి.

ఈ రోజులలో స్త్రీల కష్టాలు కూడా మరింత పెరిగాయనిపిస్తుంది. 

ఆర్ధికాభివృద్ధి అంటూ .. ఇంటాబయటా పనిచేస్తూ స్త్రీలు ఎంతో కష్టపడవలసి వస్తోంది. 

ఈ రోజులలో,  స్త్రీలు ఇంటాబయట పని నెత్తినేసుకుని పనిచేయటం గమనిస్తే..ఇది స్త్రీల  విజయం కాదు ... ఇది పురుషుల గెలుపుగా అనిపిస్తోంది. 

 
పాతకాలంలో స్త్రీలు ఇంటిపట్టున ఉండేకాలంలో పురుషులకు  పరాయి స్త్రీలతో మాట్లాడాలన్నా కష్టంగా ఉండేది. 


ఆధునిక కాలంలో అతివలను  మోసం చేయడానికి మగవారికి  ఎన్నో అవకాశాలు దొరుకుతున్నాయి. 

ఈ రోజులలో, కొందరు  వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకోవటం..వంటివీ  జరుగుతున్నాయి. 


పనిచేసేచోట లైంగిక వేధింపులు  జరుగుతున్నా బైటకు చెప్పని వారెందరో ఉన్నారు.


 బయటకు చెప్తే తమనే తప్పుపడతారేమో ? అనే భయం వల్ల కొందరు,

 చదువు .. ఉద్యోగం మానివేస్తే ఎలా ? అనే సందేహాలతో కొందరు ..వేధింపులను మౌనంగా భరించే పరిస్థితీ  ఉంది. 

 ప్రేమపేరుతో టీనేజ్ అమ్మాయిలను మోసం చేయటం గురించిన కొన్ని కేసులు ...

మరి కొందరు స్త్రీలు ఎన్నో కారణాలతో మోసపోయి వ్యభిచార గృహాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.


ఈ  విషయాలను గమనిస్తే .. ఈ రోజులలో  స్త్రీలను మోసగించటం మగవారికి మరింత తేలికయ్యింది ..అనిపిస్తుంది. 

నిర్భయ వంటి కేసులు  పెరిగాయి. చిన్నపిల్లల పట్లా లైంగిక వేధింపులు  పెరిగాయని  తెలుస్తోంది.

 చదువుకునే పాఠశాలలోనూ లైంగిక వేధింపులు, కార్యాలయాలలోనూ వేధింపులు, బయటకు తెలుస్తున్నవి కొన్నే. తెలియనివి ఎన్ని ఉన్నాయో?


బయటకొస్తే ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టే  , ప్రాచీనులు  స్త్రీలకు సంపాదనా బాధ్యతలను అప్పగించలేదు.


 ఎంత టెక్నాలజీ పెరిగినా మనుషులలో నైతిక విలువల పట్ల గౌరవం పెరగనంతవరకూ ఈ వేధింపులు  జరగకుండా ఆపటం చాలా కష్టం . 
.......... 
 
చిన్నపిల్లలు ఆటోలో స్కూలుకు వెళ్లేటప్పుడు అమ్మాయిలపట్ల అఘాయిత్యం జరిగిన సంఘటనలు  గురించి వార్తలు విన్నాము. అమ్మాయిలను స్త్రీ ఆటోడ్రైవర్లు ఉండే ఆటోల్లో స్కూలుకు పంపిస్తే బాగుంటుంది. 
 
పాతకాలంలో అమ్మాయిలకు ప్రత్యేకంగా స్కూల్స్, కాలేజీలు ఉండేవి. ఇప్పుడు కూడా అలా ఉంటే బాగుంటుంది. 
 
**********
 స్త్రీలను సాటి స్త్రీలే మోసం చేస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నప్పుడు, ఇంకా ఏం చేస్తారు? మనుషుల్లో నైతికవిలువలు పెరగాలి.
 ********** 
 
స్త్రీలు సంపాదనా బాధ్యతలను తీసుకోవటంతో స్త్రీలకే కాదు , పిల్లలకీ కష్టాలు మొదలయ్యాయి.

చంటిపిల్లలు కూడా పగలు ఇంటిపట్టున తల్లి వద్ద కాకుండా.. బయట  కేర్ సెంటర్లలో ఉండవలసి వస్తోంది.


పాతకాలంలో స్త్రీధనం..ఆభరణాలను అత్తింటి వారు వాడుకోవటం అంతగా  జరిగేది కాదు. స్త్రీలకు కష్టకాలంలో ఆ సొమ్ము ఆసరాగా ఉండేది.
..............

ఆర్ధిక ఆలంబన కోసం ,  స్త్రీలు కొందరు కలిసి తమకు అనుకూలమైన సమయాల  ప్రకారం పరిశ్రమలు ఏర్పాటుచేసుకోవచ్చు. 
 
 బయట పనిచేసే స్త్రీల విషయంలో..ఉదయం సుమారు 9.30 నుండి సాయంత్రం 4.30 వరకు స్త్రీలకు పనిగంటలు ఉంటే, ఇంటికి త్వరగా వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుని ఇంటిపని, పిల్లల్ని చూసుకోవచ్చు. (వైద్యరంగంలో పనిచేసే వారు ఈ సమయాల ప్రకారం పనిచేయలేకపోవచ్చు..)

******************
  విద్య,ఉపాధి.. వంటి వ్యవస్థలలో ఎన్నో మార్పులు వచ్చాయి. టెక్నాలజి వల్ల కూడా సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
******************  
 
కష్టాలలో ఉన్న స్త్రీలు  సమస్య పరిష్కారాల కోసం ఎవరైనా మగవారి సాయం కోరితే.. ఆ మగవారు కూడా నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. 

అలా కాకుండా,  కష్టాలలో ఉన్న స్త్రీలను  ఆదుకోవటానికి, వారి   సమస్యల పరిష్కారం కోసం మహిళామండలులు సహాయం చేస్తే బాగుంటుంది.

  కష్టాలలో ఉన్న స్త్రీలు ఒంటరిగా ఉండేకంటే, అపార్ట్మెంట్స్ వంటివి   తీసుకుని  ఒకే చోట ఉంటే ఒకరికొకరు తోడుగా ఉండవచ్చు.

కుటీరపరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవచ్చు. 

 
మహిళామండలులు..  స్త్రీ నిధి ఏర్పాటు చేసి , నా అన్నవారు లేని స్త్రీలను ఆదుకోవచ్చు.



ఈ రోజుల్లో, మానవ సంబంధాల విషయంలో ఏవేవో జరుగుతున్నాయి. ...


ఈ రోజుల్లో స్త్రీపురుష సంబంధాల విషయంలో ఏవేవో జరుగుతున్నాయి.

కొందరు  ఏమంటున్నారంటే, పురుషులు  ఇష్టం వచ్చినట్లు  తిరుగుతున్నప్పుడు స్త్రీలు  తిరిగితే తప్పేమిటని ?  ప్రశ్నిస్తున్నారు. 


అయితే,  అక్రమ సంబంధాల వల్ల  అందరికీ  కష్టాలు వస్తాయని ఇలా మాట్లాడే  వారికి  తెలియదా?


ఈ రోజు
ల్లో ,  స్త్రీపురుషులు కలసిమెలసి  తిరిగే పరిస్థితి వల్ల..  కొందరిలో అక్రమసంబంధాలు, వివాహేతర సంబంధాలు ఎక్కువయ్యాయి.

భార్యాభర్త కలసి ఉండే సమయం కన్నా,  పరాయివాళ్ళు కలసి ఉండే సమయం ఎక్కువయ్యింది. ఈ పరిస్థితి చాలా కుటుంబాల్లో కల్లోలాలను కలిగిస్తోంది. 


........................................
ఈ రోజుల్లో కొందరు స్త్రీలు, పురుషులు  స్వేచ్చగా కలిసి జీవించటాన్ని ఇష్టపడుతున్నారు. 


అంటే ఇక్కడ చెబుతున్నది.. జీవితాంతం కలిసి జీవించటం కాకుండా, సహజీవనం అంటూ..   ఇష్టం ఉన్నంతవరకు మాత్రమే కలిసి జీవించటం ...ఇష్టం పోయినప్పుడు ఎవరికి వారు విడిపోవటమనే పద్దతి.


 మరి పెద్దవాళ్లు తమ ఇష్టం వచ్చినప్పుడు విడిపోయినప్పుడు, వాళ్ళకు జన్మించిన సంతానం సంగతేమిటి ? 


బాధ్యతలు వద్దంటూ వివాహబంధానికే కట్టుబడని వాళ్లు .. సంతానం యొక్క బాధ్యతను తీసుకుంటారా ? తీసుకోరా?

సంతానాన్ని రోడ్దుమీదో లేక అనాధశరణాయంలోనో వదిలివెళ్లిపోతే ఆ పిల్లల కష్టాలకు ఎవరు బాధ్యులు ?


 కుటుంబ సంబంధాలు లేని ఇలాంటి జీవనవిధానం నాగరికత అవుతుందా ? స్వేచ్చ అంటే ఇదేనా ?

పెద్దవాళ్లే వివాహేతర సంబంధాలంటూ మాట్లాడుతుంటే ఇక  పిల్లలకు  ఏం విలువలను నేర్పుతారు ?

  .....................

స్త్రీలు బాధలు పడటంలో కొందరు మగవారి పాత్ర ఉన్నట్లే .... స్త్రీల బాధలకు కొందరు స్త్రీలు కూడా కారణమే.


కోడలిపై కిరోసిన్ పోసే అత్త స్త్రీనే కదా !


కాళ్ళు చేతులు పనిచేయని అత్తను కాలువ ప్రక్కన పడేసిన కోడలు స్త్రీనే కదా !


వివాహితుడైన పురుషుని వెంటపడి అతని భార్య, పిల్లల కష్టాలకు కారణమయ్యే స్త్రీ ....స్త్రీనే కదా ! 


***********


కొందరు ఏమంటారంటే, స్త్రీలను గౌరవించాలని అబ్బాయిలకు నేర్పండి అంటున్నారు.

పిల్లలను పెంచే విషయంలో తండ్రుల కన్నా తల్లుల పాత్రే ఎక్కువ.


తల్లులు పిల్లలను పెంచేటప్పుడు.... మగపిల్లలకు స్త్రీల పట్ల గౌరవం ఉండే విధంగా ...


ఆడపిల్లలకు పురుషుల పట్ల గౌరవం ఉండే విధంగా పెంచవచ్చు కదా! అలా  పెంచితే చాలా సమస్యలు తగ్గుతాయి.

***********************
ఇంకొక విషయం ఏమిటంటే, 

కొందరు తమకు వయస్సు పైబడిన తరువాత, తమ జీవితభాగస్వామి మరణించిన తరువాత..ఒంటరితనం భరించలేక తోడుకోసం అని మళ్ళీ వివాహం చేసుకోవటం జరుగుతోంది. ఇలా వృద్ధులకు వివాహాలు చేయడానికి ప్రత్యేకంగా కొన్ని సంస్థలు కూడా వెలిసాయి.

నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే, కొంతకాలానికి వాళ్ళల్లో  ఒకరు చనిపోతే ఏం చేస్తారు? అప్పుడు జీవించి ఉన్నవాళ్ళు మళ్ళీ ఒంటరి వాళ్ళే కదా! 
 
 చనిపోయేవరకూ మళ్లీమళ్ళీ వివాహాలు చేసుకుంటూనే ఉంటారా?

మలివయస్సులో మళ్ళీపెళ్ళి వల్ల  కొత్త సమస్యలు వచ్చే అవకాశముంది. 



Monday, December 11, 2017

ఆచారవ్యవహారాలు ...మరి కొన్ని విషయములు.....



ప్రజల మంచికోసం  ప్రాచీనులు  ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను  తెలియజేసారు.

అయితే , ఆధునిక కాలంలో కొందరు ఆచారవ్యవహారాలను కొత్తగా మార్చుకుంటూ , తమకుతామే మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుంటున్నారు.


 ఆధునిక కాలపు పరిస్థితులను ఊహించిన పూర్వీకులు ఎన్నో విషయాలను తెలియజేసారు. 

ఉదా..కలికాలంలో కేవలం దైవనామాన్ని స్మరిస్తే చాలు ..గొప్ప ఫలితం లభిస్తుందని  కూడా  సడలింపులను తెలియజేయటం జరిగింది.


**************

ఆచారవ్యవహారాలలో ఏమైనా పొరపాట్లు వస్తే కష్టాలు వచ్చే అవకాశముందని కొందరు చెప్తుంటారు. ఇవన్నీ వింటుంటే భయంగా ఉంటుంది.

ఇలాంటప్పుడు దైవంపై ధ్యాస కన్నా ...ఆచారవ్యవహారాలను పాటించటానికి ఎక్కువ దృష్టి పెట్టవల్సి వస్తుంది.


ఆచారవ్యవహారాలను పాటించటం అవసరమే కానీ , దైవంపై ధ్యాస ఎంతో ముఖ్యం కదా!

మూఢత్వం పెంచే విధంగా కాకుండా,  విచక్షణతో  పాటిస్తూ.. దైవం పై ధ్యాస పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలన్నది నా అభిప్రాయం.


  ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించాలనుకుంటూ  విసుగు వచ్చేలా చేసుకోవటం కాకుండా..తమశక్తికి తగినంతలో  పూజలు చేయవచ్చు.

***************

 పెద్దలు తెలియజేసిన ఒక కధ...

ఒక భక్తుడు భక్తి పారవశ్యంలో పూజ చేస్తూ దైవానికి అరటిపండ్లను నివేదించబోయి, భక్తి పారవశ్యంలో అరటిపండ్లను ప్రక్కన పడవేసి వాటి తొక్కలు తీసి దైవానికి నివేదిస్తారు. 


ఆ భక్తుని భక్తికి మెచ్చిన దైవం అతనికి దర్శనాన్ని అనుగ్రహించారని అంటారు.

 తరువాత కొంతసేపటికి భక్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకుని.. 


ఈ సారి  పొరపాటు రాకుండా పూజ చేయాలనే తాపత్రయంలో భక్తి కన్నా, పూజను చేసే విధానంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగా ఈసారి దైవం ప్రత్యక్షం కాలేదట.

 ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే,  పూజా విధానాలను, ఆచారవ్యవహారాలను చక్కగా పాటించటం మంచిదే కానీ, దైవంపై భక్తి అన్నింటికన్నా ముఖ్యం..  అని గ్రహించాలి.


శక్తి ఉన్నవారు ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించుకోవచ్చు. 
 అంత ఓపిక లేనివారు తమకు వీలున్నంతలో పాటించుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. 

************
ఈ రోజుల్లో కొందరు ఏమంటారంటే, మర్చిపోతారేమోనని గుర్తుచేస్తున్నామంటూ..రోజూ ఏదో ఒక పూజ గురించి చెబుతూ నియమాలు పాటించాలని చెబుతుంటారు. 
 
రోజూ ఏదో ఒక పూజ అంటే, ఇక భార్యాభర్తలకు సంసారం ఎప్పుడు చెయ్యాలో తెలియక భయంగా ఉంటుంది. రోజూ బ్రహ్మచర్యం..వంటి నియమాలు పాటిస్తే ఇక హిందువులు అందరూ సన్యాసుల్లా బ్రతకాలో ఏమిటో?

 రోజూ పూజలు చేసినా కూడా బ్రహ్మచర్యం వంటి నియమాలు రోజూ పాటించనక్కరలేదు. ముఖ్యమైన కొన్ని పూజలకు, పండుగలకు.. ఉపవాసం, బ్రహ్మచర్యం..వంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది.
 
 ****************
భార్యాభర్త చక్కగా అన్యోన్యంగా ఉంటే అక్రమసంబంధాలు చాలావరకు తగ్గుతాయి.కుటుంబాలూ బాగుంటాయి.. తద్వారా సమాజం కూడా బాగుంటుంది. సంసారంలో అతి లేకుండా ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకోవచ్చు.


బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్తం, సన్యాసాశ్రమం..గురించి ప్రాచీనులు తెలియజేసారు. సన్యాసాశ్రమంలో అడవులకు వెళ్ళలేకపోయినా, ఇంట్లో ఉండి కూడా  లౌకికవిషయాల పట్ల ధ్యాసను తగ్గించుకుని, మనస్సును ఎక్కువగా దైవస్మరణతో గడపవచ్చు.


సమాజం సజావుగా సాగాలంటే అనేక వృత్తులు అవసరం. ప్రాచీనులు అనేక వృత్తుల గురించి తెలియజేసారు. అలాంటి వ్యవస్థను ఏర్పరిచారు. కొన్ని వృత్తులవారు అనేక నియమాలను పాటిస్తూ..  ..బోలెడుసమయం కూర్చుని పూజలు చేయాలంటే చేయలేరు. ఇవన్నీ ఆలోచించి, సమాజక్షేమం కొరకు ఎక్కువసేపు పూజలు చేయడానికి కొందరు ఉండాలని భావించి, అలాంటి పద్ధతిని కూడా ఏర్పరిచారు.

 సమాజంలో లౌకికమైన విషయాలను ఎవరూ పట్టించుకోకుండా ఉంటే ఎలా.. శత్రువులను  ఎదుర్కోవాలి ....కుటుంబనిర్వహణకు అవసరమైన వస్తువులను తయారుచేయాలి .....వ్యవసాయం, వ్యాపారం, చేతిపనిముట్లు....ఇవన్నీ  చేయాలి కదా..

  ఇవన్నీ ఆలోచించి ప్రాచీనులు ఎన్నో వృత్తుల గురించి తెలియజేసారు. ఎవరు చేసే పనిని వారు చక్కగా చేయాలని తెలియజేసారు.

ఉదయం కొంతసేపు పూజ చేసుకుని, తరువాత ఎవరి పనిని వారు చక్కగా చేస్తే అది కూడా పూజయే.. అని తెలియజేసారు. అప్పుడప్పుడు పండుగలు , కొన్ని ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు అందరూ చేసుకోవచ్చు.

 ************************

మరికొన్ని విషయాలు..
 
కొందరు ... గ్రంధాలలోని విషయాల గురించి వాళ్ళకు తోచినట్లు చెబుతున్నారు.
 
 గ్రంధాలలో కొన్ని విషయాలు ...ఉదా..ఎవరైనా స్త్రీలు, కోరి  పరాయి  పురుషుల వద్దకు వస్తే, వారిని తిరస్కరించకుండా ఆ స్త్రీ కోరికను పురుషుడు తీర్చాలని ఉన్నదట.

ఇంటికి వచ్చిన అతిధి ఇంటి ఇల్లాలిని కోరుకుంటే, ఆమెను ఆ అతిధి వద్దకు  పంపించాలని ఉన్నదని కొందరివ్యాఖ్యలను చదివాను.ఉదా..ప్రాచీనకాలంలో శ్వేతకేతు కధలోని విషయాలు.

 ఇవన్నీ మూఢనమ్మకాలే. గ్రంధాలలో ఇలాంటి సంఘటనలను కొందరు చేర్చి ఉండొచ్చు. గ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని అందరికి తెలుసు.
  కొందరు తమకు నచ్చిన విషయాలను గ్రంధాలలో వ్రాసి ప్రక్షిప్తాలు చేశారనిపిస్తుంది.

ఇలాంటివాటిని  ప్రోత్సహిస్తే, ఇవన్నీ ఉదాహరణగా చూపుతూ కొందరు స్త్రీలు, పురుషులు విచ్చలవిడిగా తిరుగుతారు. అందువల్ల, ఇలాంటి విషయాలను సమర్ధించకూడదు.

 
  ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలకు   సంసారం చేయడానికి మాత్రం..  ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి..అంటూ అనేక ఆంక్షలు చెబుతారు. అక్రమసంబంధాలుగా ఉన్న వాటికి మాత్రం  సరైనదే అంటూ సమర్ధించటం ఏం న్యాయం?
 
 
 ప్రాచీనకాలంలో కొందరు కొంతకాలం  ఇలాంటి ఆచారాలను పాటించినట్లు, కాలక్రమేణా ఈ ఆచారవ్యవహారాలను సంస్కరించుకుని, పాటించటం మానేసినట్లు చెబుతున్నారు.  ఏకపత్ని, ఏకపతి ...పద్ధతులను పునరుద్ధరించి ఉండవచ్చు.

కొందరు గొప్పవారు కూడా కొన్ని మూఢనమ్మకాలను పాటించినట్లు అనిపిస్తుంది.కొందరు కొన్ని విషయాలలో ఎంతగొప్ప అయినాకూడా, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొందరికి కొన్ని బలహీనక్షణాలలో పట్టుతప్పవచ్చు.
 

 వేదాల్లో ఏకపత్ని, ఏకపతి...గురించిన విషయాలున్నాయట...
 
మన వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది. భార్యను " అర్ధాంగి ' అంటారు. అంటే భర్తలో సగభాగం అని అర్ధం. వివాహం తరువాత భార్యాభర్తల శరీరాలు వేరైనా వారు ఒకటే . అని పెద్దలు చెబుతారు కదా !

ఒకరికొకరు అర్ధభాగాలైన భార్యాభర్తల జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించటం జరగదు. పెద్దలు ఏర్పరిచిన వివాహమంత్రాలు, నాతిచరామి...వీటిని పరిశీలిస్తే పెద్దల అభిప్రాయం మనకు తెలుస్తుంది.

ఇవన్నీ గమనిస్తే బహువివాహాలను పెద్దలు సమర్ధించలేదనిపిస్తుంది. ( అయితే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటే, భార్య మరణించినప్పుడు, భార్య ఇతరులను వివాహం చేసుకున్నప్పుడు...ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేరొక వివాహం చేసుకోవచ్చేమో..)


పురాణేతిహాసాల్లో ఎక్కువవివాహాలు చేసుకున్న వారి గురించిన విషయాలున్నాయి. వారు అలా చేసుకోవటానికి వెనుక ఎన్నో కారణాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ( అవన్నీ గమనించి మనం జీవితంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దల అభిప్రాయం కావచ్చు.)


పర స్త్రీ తల్లి వంటిదని పెద్దలు చెప్పటం జరిగింది. అలాంటప్పుడు, ఇంటికి వచ్చిన అతిధి , ఇల్లాలిని కోరుకోవటాన్ని పెద్దలు అస్సలు సమర్ధించరు. అతిధి మర్యాదలకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా !

ఎవరు కోరుకుంటే వారి కోరికలు తీర్చాలంటే ఇక వివాహవ్యవస్థ ఎందుకు? కుటుంబవ్యవస్థ ఎందుకు?  
వివాహం మరియు కుటుంబవ్యవస్థకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిన వ్యవస్థ మనది. 

అందువల్ల, ఇలాంటి మూఢనమ్మకాలను, ప్రక్షిప్తాలను గుర్తించి వదిలిపెట్టాలి. అంతేకానీ, వాటిని సమర్ధించి.. పాటించాలనుకుంటే  కుటుంబవ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది.  హత్యలు, ఆత్మహత్యలు జరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. గ్రంధాలలో ఉన్నాయి కాబట్టి, వాటిని ఎలాగైనా బలపరచాలనుకోవటం తప్పు.
 

సనాతనధర్మం మూఢత్వాన్ని, విచ్చలవిడితనాన్ని.. ఒప్పుకోదు. 
 
**********
 
కధలో, దైవము భక్తులను కఠినంగా పరిక్షించినట్లు చెబుతారు. ఉదా...దైవము మనిషి రూపంలో అతిధి లా వచ్చి,  వారి కొడుకుని చంపి మాంసం కూర వండిపెట్టమని ఒక కధలో ఉంది. 

 
ఎవరైనా స్వార్ధపరులు, తెలిసితెలియనివాళ్లు ఇలా ప్రక్షిప్తాలను చేసారేమో?
 ద్వేషాలతో కొందరు కొన్ని కల్పితాలను కల్పించి గ్రంధాలలో చొప్పించారేమో? అనిపిస్తుంది.


భక్తులకు కష్టాలొస్తే కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తారు. మరి, దైవం ఇలా ఎక్కడైనా అడుగుతారా? మనుషులు చేసిన పనుల వల్ల మనుషులకు కష్టాలు వస్తాయి కాని, దైవము కష్టపెట్టరు. 
 
ఈ కధలో చిన్న అబ్బాయిని చంపి మాంసం వండటం.. విషయాలను వింటే చాలా బాధ కలుగుతుంది. 

అయితే, కొందరు మనుషులు పశుపక్ష్యాదులను చంపితింటారు. 
పశుపక్ష్యాదులకు కూడా ప్రాణభయం, బాధ ..ఉంటాయి. 
 
పశుపక్ష్యాదులకు కూడా ప్రేమలుంటాయి. తమ బిడ్దలను మనుషులు చంపినప్పుడు వాటి పేరెంట్స్ బాధపడతాయి. తమ పేరెంట్స్ ను చంపి తిన్నప్పుడు వాటి పిల్లలూ బాధపడుతాయి.
 
కొందరు అనేక పాపాలు చేసి తమ పాపాలు పోవాలని, ఎన్నో కొబ్బరికాయలు కొట్టడం,  బంగారపు నగలు దేవాలయాలకు సమర్పించటం..వంటివి చేస్తారు.
 
 సృష్టిని, సృష్టిలో బంగారపు గనులనే సృష్టించిన దైవానికి అవి ఒక లెక్కా..
 
మనుషుల్లో ధర్మబుద్ధిని దైవము మెచ్చుకుంటారు. దైవభక్తిని కలిగి ధర్మబుద్ధితో జీవించటానికి ప్రయత్నిస్తే దైవకృపను పొందగలరు.
..................................

  వేదాలు ఎంతో గొప్పవి. అలాంటి వేదాలను కూడా కొందరు రాక్షసులు ఎత్తుకుపోతే..  దైవం రాక్షసులను వధించి,  వేదాలను తిరిగితీసుకువచ్చినట్లు గ్రంధాల ద్వారా  తెలుస్తుంది. వేదాలు ఒక పద్ధతి ప్రకారం ఉంటాయని, ఎవరూ మార్చడానికి వీలు ఉండదని ..తెలిసినవారు చెబుతున్నారు. 

 గ్రంధాలు మాత్రం ఎవరైనా మార్పులుచేర్పులు చేసే అవకాశం ఉందని.. తెలిసినవారు చెబుతున్నారు. ప్రాచీనకాలం నుంచి  కొందరు స్వార్ధపరులు, కొందరు తెలిసితెలియనివాళ్లు, కొందరు అతి భయస్తులు.. గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు చేసి ఉంటారు.

అందువల్ల, జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలో అర్ధం కానప్పుడు దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

************

వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 ...........

 oka link

 *  ఓం ..నిష్కామ కర్మ యోగం అద్భుతమైన మార్గం..

  

Saturday, December 9, 2017

విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ....మరియు..


విజయవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్టు వద్ద చాలా దీపాలు వెలిగించటం వల్ల విగ్రహానికి వేడి తగులుతోందని,   అలా జరగటం మంచిది కాదని పండితులు అంటున్నారు.


 మరి అలాంటప్పుడు  పరిస్థితి చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటే మంచిది కదా!  


అలా చర్యలు తీసుకోవటంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందో అర్ధం కావటం లేదు. 

ఇంత ముఖ్యమైన విషయంలో కూడా ఆలశ్యం జరగటం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  


 దేవాలయంలో  ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే బాగుంటుంది. 

**********************

ఇంకో విషయం ఏమిటంటే,

దేశంలో అనేకచోట్ల ప్రాచీన ఆలయాలు కొన్ని శిధిలావస్థలో ఉన్నాయి. 

ఇలాంటి ఆలయాలు శిధిలావస్థకు చేరకుండా పురావస్తు శాఖ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.  

**************
మార్గశిర మాసంలో అష్టమి న  ఎక్కువమంది  అనఘాష్టమి  వ్రతాన్ని ఆచరిస్తారు.




Friday, December 8, 2017

మన మనస్సు .....

మా ఇంటి ప్రక్క దేవాలయం  నుంచి  మైక్ లో దైవానికి సంబంధించిన  పాటలు,  స్తోత్రాలు వేస్తుంటారు.

  మైక్  సౌండ్ మామూలు  రోజులలో  మరీ పెద్దగా  పెట్టరు.  కొన్ని  పండుగ రోజుల్లో  మాత్రం  పెద్ద సౌండ్ పెడతారు.


ఈ మధ్య ఒకరోజు సడన్ గా  కొద్దిసేపు సౌండ్ పెద్దగా వినిపించింది. అప్పుడు నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. 


పుస్తకంలో చూడకుండా
పఠించడానికి ప్రయత్నిస్తున్నాను.

 దేవాలయం నుంచి  పాటలు  వినిపించేసరికి  నాకు  ధ్యాస  తగ్గి,   నేను పఠించే  వాటిలో తప్పులు  వస్తున్నట్లు అనిపించింది. 


ఎంత ప్రయత్నించినా  సరిగ్గా
పఠించడానికి కుదరటం లేదు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. 

నేను పూజ చేసేటప్పుడు అలవాటుగా దైవస్తోత్రాలు చదువుతున్నా కూడా ...మనస్సులో  అప్పుడప్పుడు వేరే విషయాల గురించి ఆలోచనలు వస్తుంటాయి. 


అంటే నోటితో దైవస్తోత్రాలు చదువుతుంటే..మనస్సు దాని ఇష్టానికి  అది వేరే ఆలోచనలు చేస్తుంది.


 అంటే ఒకేసారి రెండు పనులు జరుగుతుంటాయి. ఈ విషయం గుర్తు వచ్చింది. 

  దేవాలయం నుంచి వచ్చే శబ్దాలు వినిపిస్తున్నా కూడా,   మనస్సును  నేను పఠించే విషయంపై పెట్టడానికి ప్రయత్నించవచ్చు కదా! అనిపించి అలా ప్రయత్నించాను. 


 కొంత వరకు బాగానే పఠించగలిగాను. అంతా దైవం దయ. 

ఇంకో విషయం ఏమిటంటే,  దైవస్తోత్రాలు చదువుతున్నా కూడా ...మనస్సులో   వేరే విషయాల గురించి ఆలోచనలు  చేయగలుగుతున్నప్పుడు.... 


.లౌకికజీవితంలో పనులు చేసుకుంటూనే ...మనస్సుతో  దైవారాధన చేయవచ్చు కదా ! అని కూడా అనిపిస్తుంది. .అయితే, ఇలా చేయడం  చాలా కష్టం.


మన మనస్సు అని మనం చెప్పుకోవడమే కానీ ,  మన మనస్సును మనం నియంత్రించటం చాలా కష్టం.

మన మనస్సు మన మాట వినాలన్నా దైవాన్ని ప్రార్ధించవలసిందే. 



Thursday, December 7, 2017

ఏది తప్పో ? ఏది ఒప్పో ?



కొందరు ఏం చేస్తారంటే, ఏదో అశుభ్రత అంటుకుందని పదేపదే స్నానాలు చేస్తారు.

 అలా పదేపదే స్నానాల వల్ల నీళ్లు వేస్ట్ అయిపోతాయి. పొదుపుగా వాడవలసిన నీటిని వృధా చేయటమూ పాపమేకదా!


 అశుచి అనుకుంటే పదేపదే స్నానాల బదులుగా  కాసిన్ని పసుపునీళ్లు చిలకరించుకుంటే సరిపోతుంది. ఇదీ పెద్దలు చెప్పిన విధానమే కదా! 


*************
మరికొందరు ఎన్నో సందేహాలతో సతమతమవుతుంటారు.  ఉదా.. పూజ కోసం  దీపాన్ని ఏ దిక్కుగా వెలిగించాలి ? వంటి సందేహాలు.

దైవం ఏ దిక్కునైనా ఉంటారు. ఏ దిక్కుగా దీపాన్ని వెలిగించినా తప్పులేదు.


*************

మనవల్ల ఎవరికీ అన్యాయం జరిగితే తప్పు కానీ ...అలా కానప్పుడు  ప్రతి విషయానికి ఎక్కువ  సందేహాలు అవసరం లేదు.


. ఎవరి శక్తిని బట్టి , వీలునుబట్టి వారు పూజ చేసుకోవటం మంచిదని నాకు అనిపించింది. 


 ఏది చేస్తే తప్పో? ఏది ఒప్పో ? అనుకుంటూ ఎన్నో సందేహాలతో సతమతమవటం కంటే , వీలుకుదిరినంతలో దైవంపై ధ్యాస ఉంచి పూజ చేసుకోవటం మంచిది. 

...........
 
కొందరు కలల గురించి భయపడుతుంటారు.  
 
కొన్నిసార్లు పుస్తకాలలో చదివినవి, ఎక్కడైనా విన్నవి విషయాల గురించి  మనము మర్చిపోయినా, మనస్సు లోతులో గుర్తుండి అవి  కలలుగా వచ్చే అవకాశముంది.

 అయితే, ఆశ్చర్యంగా కొన్నిసార్లు మనము ఎప్పుడూ ఆలోచించని విషయాలు కూడా కలల్లో వచ్చి, అవి భవిష్యత్తులో జరగటం కూడా కొందరికి అనుభవంలో ఉంటుంది. అలా ఎలా జరుగుతుందో తెలియదు.
 
 కొన్నిసార్లు భ్రమలను నిజమని నమ్ముతారు కొందరు. అది భ్రమా? నిజమా? అని తెలుసుకోవాలి. 
 

Wednesday, December 6, 2017

ఏవి పెద్దలు చెప్పినవో? ఏవి మార్పులుచేర్పులతో మధ్యలో వచ్చిచేరినవో ?

మంగళవారం, శుక్ర వారం గోళ్లు కత్తిరించ  కూడదంటారు.

 అయితే  నా విషయంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ,  గోళ్ళు పెరిగాయని, కత్తిరించుకోవాలని  కొన్నిసార్లు 
అదేంటో  సరిగ్గా మంగళవారం, శుక్రవారమే గుర్తు వస్తుంది.

గోళ్ళు పెరిగాయని గుర్తువచ్చాక  చిరాగ్గా అనిపిస్తుంది. 


పెరిగిన గోళ్ళలో మురికి ఉంటుంది  కాబట్టి , ఆ మురికి చేతులతో  వంట చేసి   దైవానికి నివేదించాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది.  గోళ్ళు కత్తిరించేస్తాను.


 మరీ ముఖ్యమైన పండుగల రోజులలో అయితే కత్తిరించను కానీ,  మామూలుగా మంగళవారం, శుక్రవారం అని తెలిసినా చేసేదేమీ లేక   కత్తిరించేస్తాను.  


నా అభిప్రాయం ఏమిటంటే,  మంగళ, శుక్ర వారాల్లో గోళ్లు కత్తిరిస్తే వచ్చే పాపం కంటే... మురికి చేతులతో వంట చేయటం వల్ల వచ్చే పాపం ఎక్కువ ..అనిపిస్తుంది. అందువల్ల అలా చేస్తాను. 


పండుగ రోజు అయినా గోళ్ళు కత్తిరించాలని అనిపిస్తుంది కానీ, అలా చేయటం మరింత ఎక్కువ పాపమేమో ? అని భయం వేసి ఊరుకుంటాను. 

 చేసేదేమీ లేక  అప్పటికి గోళ్ళను నీటితో కడిగి ,   పండుగ తరువాత రోజు కత్తిరిస్తాను.

ఇదంతా కాకుండా,  వారంలో ఒక రోజు తప్పనిసరిగా గోళ్లు కత్తిరింపు  ప్రోగ్రాం పెట్టుకుంటే సరిపోతుంది.  

***********

 కొన్ని ఆచారాలు పాటించటం కష్టంగా ఉంటుంది.

ఉదా..నెలసరి సమయంలో ఉన్న స్త్రీలు.. పూజలు చేసే వద్దకు కూడా  వెళ్లకూడదంటారు. ఇలాంటివి పాటించటం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. 

ఉదా.. దగ్గరి బంధువుల ఇళ్ళలో వివాహం, గృహప్రవేశం..వంటి వాటికి వెళ్ళాలంటే  ఏం చేయాలో అర్ధం కాదు. 

అలాగని అతి దగ్గర బంధువుల శుభకార్యాలకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. 

వెళ్తే పూజా  కార్యక్రమానికి దూరంగా ఉండాలనే ఆంక్షలుంటాయి. 

శుభకార్యానికి వెళ్ళి అందరికీ దూరంగా కూర్చోవటం వల్ల  చుటుపక్కల వాళ్ళు వింతగా చూసే అవకాశముంది.

దూరంగా ఉంటే , ఎందుకు దూరంగా ఉన్నావని అడుగుతారు, విషయం అందరితో చెప్పవలసి ఉంటుంది. ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది. 

అలాగని దగ్గరి బంధువుల వివాహాలకు వెళ్ళకుండా ఉండటమూ ఇబ్బందే. 

 ఫంక్షన్లకు వెళ్ళకుండా ఉంటే, ఫంక్షన్ కు రాలేదని  కొందరు  బంధువులు  నిందిస్తారు. 

నిందిస్తారేమోనని మైల రోజులలో శుభకార్యానికి వెళ్తే ,తరువాత వాళ్ళింట్లో ఏమైనా కష్టాలు వస్తే,   మైల ఉన్న వాళ్ళు శుభకార్యానికి రావటం వల్లే కష్టాలు వచ్చాయని నిందించే వారూ ఉంటారు.

అలాగని  నెలసరి వాయిదా వేసే మందులు   ఎక్కువసార్లు  వేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
............... .........................
దూరపు బంధువులు మరణించిన సమయంలో కూడా మైల  వల్ల శుభకార్యాలకు వెళ్ళకూడదనే ఆంక్షల  వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
.......... .........................
  కొన్ని సార్లు ఇవన్నీ పాటించే విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి.
.......................
 కొందరు చెప్పే విషయాలలో  కొన్ని విషయాలను  పాటించలేక, పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయంతో.. కుటుంబాల్లో గొడవలవుతున్నాయి.
   
కొన్నివిషయాలను విని,  కొందరు యువత  సంసారానికి దూరమవుతారేమోనని అనిపిస్తోంది. 
ఉదా..ప్రతిరోజు ఏదో ఒక పూజ అయితే భార్యాభర్త సంసారం చెయ్యాలంటే భయపడేవారుంటారు. అందువల్ల, కొన్ని పండుగలు,కొన్ని సందర్భాలలో,  కొన్నిప్రత్యేకమైన పూజలప్పుడు తప్ప , మిగిలిన రోజులలో నిత్యపూజ చేసుకుని భార్యాభర్త సంసారం చేయవచ్చని బ్లాగులో రాసాను. ఇలాంటివి ఎవరిని అడగలేరు కదా..
 
మరికొందరు,  తమ ఇంట్లో పెద్దవాళ్లు పాటించే అతి నియమాలను..ఆ కష్టాలను చూసి విసుగొచ్చి,  నియమాలకు దూరమవుతారేమోనని కూడా అనిపిస్తోంది . మూఢాచారాలను వదిలి, ప్రశాంతంగా పాటించవచ్చు.
 
అందుకే యువత కొన్ని విషయాలను  వినకుండా ఉంటే బాగుండని కోరుకునే పరిస్థితి కూడా వచ్చింది.  గ్రంధాలలోకూడా కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి. అవి కూడా బాధాకరం.

అలా చెప్పినవారు ఎన్నో గొప్ప విషయాలను కూడా తెలియజేసారు. అందుకు వారికి ధన్యవాదములు. 

 లౌకికజీవితంలో మంచి ఉద్యోగం రావాలన్నా చిన్నతనం నుంచి కష్టపడి చదవాలి. మరి, మోక్షాన్ని పొందాలంటే కొన్ని నియమాలను కష్టమైనా పాటించాలి.
 
 సమాజం మంచికొరకు ప్రాచీనులు ఎన్నో చక్కటి నియమాలను ఏర్పరిచారు. కాలక్రమేణా కొందరు, కొన్ని మూఢత్వంతో ఉన్న నియమాలను, అతినియమాలను ప్రవేశపెట్టారు. వీటివిషయంలో విచక్షణతో వ్యవహరించాలి. 
 
మూఢత్వంతో కూడిన నియమాలను పాటించనక్కరలేదుకాని, చక్కటి నియమాలను పాటించాలి.
....................................... 
పెద్దలు  మనకు ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను తెలియజేశారు.  

అయితే  పెద్దలు తెలియజేసిన ఆచారవ్యవహారాలలోని అసలు అంతరార్ధాలను సరిగ్గా అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.

ప్రాచీనులైన వారు తెలియజేసిన విషయాలు కొన్నైతే,  మధ్యలో వచ్చిచేరినవి కొన్ని. 
 
ఏవి పెద్దలు చెప్పినవో? ఏవి  మార్పులుచేర్పులతో మధ్యలో వచ్చిచేరినవో ? తెలియటం లేదు.