ఈ మధ్యన ఒకరు నన్ను ధ్యానం గురించి అడిగారు. నాకు ధ్యానం గురించి అంతగా తెలియదండి.
అయితే నేను వ్రాసిన పాతటపాలో కొంత భాగాన్ని + మరి కొన్ని విషయాలను ఇస్తున్నానండి.
నేను పూజ చేసుకొనేటప్పుడు .. మా ఇంట్లో టివీలో వచ్చే సంభాషణలు నాకు చక్కగా వినిపిస్తూనే ఉంటాయి.
వాటి గురించి పూజ తరువాత ఇంట్లో వాళ్ళని నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే .. నువ్వు పూజ చేస్తున్నావు కదా ! అన్నీ ఎలా వినిపిస్తున్నాయి ? అంటారు.
చుట్టుప్రక్కల జరిగేవి తెలియనంత గాఢంగా పూజచేసే అంత దృశ్యం నాకు లేదు మరి. . అలాంటి మహానుభావులు ఎక్కడో ఉంటారు.
ధ్యానం చేద్దామని నేనూ ప్రయత్నించాను. అలా కూర్చుని ధ్యానం చేస్తుంటే దృష్టి ఎటో వెళ్ళిపోతుంది. ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఏకాగ్రత నాకు రాలేదు. అయితే అలా పట్టుదలగా ప్రయత్నిస్తే ధ్యానం చేయటం క్రమంగా అలవాటు అవుతుందట.
ఇప్పుడు నేను సంగీతం నేర్చుకుంటున్నాను. సంగీతంలో ఏకాగ్రత చాలా అవసరం. లేకపోతే అన్నీ తప్పులే వస్తాయి.
నా అభిప్రాయంలో ధ్యానం అంటే దైవాన్ని స్మరించటం.
నేను రోజువారీ పనులు చేస్తూనే బ్లాగులో వ్రాసే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆ విధంగా బ్లాగుల్లో దైవానికి సంబంధించిన విషయాలు వ్రాసేటప్పుడు దైవసంబంధమైన విషయాలను గురించి ఆలోచించటం కూడా ఒక రకమైన ధ్యానమే అని నాకు అనిపిస్తుందండి.
.........................
కొంతమంది టెన్షన్ గా ఉన్నప్పుడు 1 నుంచి 100 వరకు అంకెలు లెక్కబెట్టుకోమని అంటుంటారు. నాకయితే దానికిబదులు దైవనామ స్మరణ మంచిదనిపిస్తుంది.
సాయి నవవిధ భక్తులు గురించి తెలియజేసారు. భక్తి లేని సాధనములన్ని నిష్ప్రయోజనములని చెబుతూ కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే అని తెలియజేసారు.... .. నాకు వీలు కుదిరినప్పుడల్లా దైవనామ స్మరణ చేస్తానండి. అయితే ప్రారంభములో యధాప్రకారం కొన్ని సందేహములు వచ్చాయి.
అసలు ఏ దేవుని నామము ? నెమ్మదిగా అనుకోవాలా ? లేక త్వరత్వరగానా ? కష్టం లేకుండా సుఖంగా ఎలా స్మరించుకోవాలి ? ఇలాంటి విషయములన్నీ ఎవరి వీలునుబట్టి కాలక్రమేణా వారికే తెలుస్తుందండి.
మొదట్లో ఎన్నో దేవుని నామములు ప్రయత్నించానండి. ఆఖరికి ఏ పేరు కాకుండా అమ్మా అమ్మా .. అని కూడా అమ్మవారిని స్మరించుకోవచ్చు కదా ! అని అలా కూడా చేసాను. కానీ అలా అనుకోవటం కొంచెము కష్టముగా అనిపించిందండి.
తరువాత సాయిసాయి ....అన్న నామము సౌకర్యముగా, సులువుగా అనిపించిందండి.
యోగాసనములు సరిగ్గా వెయ్యకపోతే ఒళ్ళు నెప్పులు వస్తాయి. అలాగే మనకు సులువు అలవాటు అవటానికి కొంచెం సమయము పడుతుంది.
శ్రీ మాత్రే నమః, ఓం నమఃశివాయః, ఓం నమో భగవతే వాసుదేవాయ .....ఇలాంటి నామములు చెయ్యాలంటే కొన్ని నియమములు పాటించాలేమోనని నాకు అనిపించిందండి.
{ నియమములు పాటించాలో అవసరం లేదో నాకు తెలియదు. }
అలా పాటించటం నావల్ల అవుతుందో ? లేదో ? ఎందుకులే అనుకుని ప్రస్తుతం వీలు కుదిరినప్పుడల్లా ఓంకారం లేకుండా ..సాయిసాయి అనుకుంటున్నాను. ( కొన్నిసార్లు పనులు చేస్తూ కూడా.)
నేను కొంతకాలం క్రితం ఒక నామాన్ని.. తీసుకున్నాను.( ఈ నామాన్ని మాత్రం పూజ వద్ద వీలు కుదిరినప్పుడు అనుకుంటాను. )
ప్రస్తుతం వీలు కుదిరినప్పుడు, ఓంకారం లేకుండా ..సాయిసాయి అనుకుంటున్నాను.
శుచి మరియు అశుచి .. ఇలా అన్ని సమయములలోను సాయినామమునకు ఎటువంటి పట్టింపులు లేవు కదా ..అని ఇలా చేస్తున్నాను.
( అన్ని వేళలా శుచిగా ఉండటం ఎలా కుదురుతుంది?).
ఏ దేవుని పేరు అయినా అంతా పరమాత్మయే కదండి.
నాకు అయితే ఏమని అనిపిస్తుందంటేనండి , కలియుగమున దైవనామస్మరణం తరుణోపాయమని పెద్దలే తెలిపారు కాబట్టి, ఎవరైనా ఎటువంటి సమయములోనైనా ,ఏ దేవుని నామమునైనా నిరభ్యంతరముగా స్మరించుకోవచ్చు అని.
సమస్యలు వచ్చినప్పుడు దైవ నామస్మరణ వల్ల ఎంతో ధైర్యముగా అండగా అనిపిస్తోంది.
నాకు దైవ నామస్మరణం పధ్ధతిప్రకారం ఎలా చెయ్యాలో తెలియదండి. నేను చేస్తున్న పధ్ధతి నాకు ఇప్పటికి బాగానే ఉంది.
భోజనం చేసేటప్పుడు, టి.వి. చూసేటప్పుడు , ప్రయాణములు చేసేటప్పుడు కూడా నామస్మరణకు మంచి అవకాశం కుదురుతుంది.
ఒక్కొక్క నామము ఒక్కొక్క మందు బిళ్ళలాగ పనిచేస్తూ ఎప్పటికయినా మన పురాతన పాపకర్మలన్నీ నశిస్తాయి .మరియు క్రొత్తగా మనము పాపకర్మలు చేయకుండా ఆ నామములు అడ్డుకుంటాయి.
నా కయితే నామస్మరణ శ్రధ్ధగా చేసినప్పుడు నా తెలివితేటలకు మించిన ఆలోచనలు రావటాన్ని గమనించాను.
బ్లాగ్ లో దైవానికి సంబంధించిన విషయములు వ్రాసినప్పుడు ....ఆ ఆలోచనలు ఇలా వచ్చినవే.
టి.వి చూస్తూ దైవనామస్మరణ అంటే ..ఉదా...ఎప్పుడైనా మన మనస్సు బాగోనప్పుడు దేవుని పూజ చేస్తూ అలవాటయిన సహస్రనామములను అంటూ ఉంటాము. కానీ మనస్సు మాత్రం వేరే సమస్య గురించి ఆలోచిస్తుంటుంది. ఇలా రెండు పనులు చేస్తున్నాము కదా.
ఇక ఆడవాళ్ళు ఉదయం పూట ఒక ప్రక్క వంట, ఒక ప్రక్క ఇంట్లో అందరికి అన్నీ చూస్తూ ఒక రకంగా అష్టావధానమే చేస్తుంటారు.
అలాగే మగవాళ్ళు కొందరు ఒకోసారి భోజనం చేస్తూ, ఫోన్ లో బిజీగా మాట్లాడుతూ ఉండటం చూస్తూంటాము.
ఇలాగే ఏదీ అసాధ్యం కాదండి.
అయితే టి.వి. చూస్తూ దైవనామస్మరణ వల్ల శ్రధ్ధ అంతగా ఉండచ్చు, ఉండకపోవచ్చు.
కానీ పూజ, దైవనామస్మరణ పూర్తిగా మానివేయటం కన్నా అసలంటూ చేయటం వల్ల ఎంతోకొంత పుణ్యం వస్తుంది కదండి.
నెమ్మదిగా దాని యందు శ్రధ్ధ పెరగటానికి కారణమవుతుంది. సాధన చేయగా,చేయగా అదే అలవాటవుతుంది.
సాధనలో ఒక స్థాయికి వెళ్ళిన వారికి తమ పనులు తాము చేసుకుంటూనే , మనస్సుతో, శ్వాసతో దైవనామస్మరణం చేయటం అలవాటవుతుందట. జనమేజయ మహారాజు, జనక మహారాజు వంటి వారికి సంసారములో స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నా మనస్సు మాత్రం దైవం యందు ఉంటుందట.
.....................
(ఈ క్రింద కొన్ని విషయాలను కొంతకాలం తరువాత వ్రాసానండి...
కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలనుకున్నప్పుడు ఆలోచనలు వేరే విధంగా వెళ్ళకుండా ఉండే విషయం గురించి ...క్రొత్త ఆలోచనలు కలిగాయండి.
ఉదా...లలితా సహస్ర నామములు పుస్తకం చూసి చదవటం కాకుండా, నోటికి వచ్చిన వారు.. కళ్లుమూసుకుని లలితా సహస్రనామములను అనుకోవచ్చు. మనస్సులో వేరే ఆలోచనలు వస్తే నామములలో పొరపాట్లు వస్తాయేమోననే భయం వల్ల.. శ్రద్ధ కుదిరే అవకాశం ఉంటుంది.
లలితా సహస్రం రానప్పుడు, ఎక్కువ సమయం పడుతుందని అనిపించినప్పుడు..లలితా అష్టోత్తరం కూడా అనుకోవచ్చు. లేదా ఇంకో అష్టోత్తరం అయినా అనుకోవచ్చు.
దైవనామములను త్వరత్వరగా కాకుండా...
నిదానంగా అనుకోవటం మంచిది.
మంత్రం లేకుండా కూడా ధ్యానం చేయవచ్చు. నిరాకారంగా కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు.
సుఖంగా కూర్చుని, కళ్ళు మూసుకుని, ఏ విధమైన మంత్రం కూడా లేకుండా ప్రశాంతంగా కొంత సమయం ఉన్నా కూడా ధ్యానమే అని కొందరు తెలియజేస్తున్నారు.
ధ్యానం చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా మనస్సుకు విశ్రాంతి కలిగేలా ప్రశాంతంగా ఉండాలి. కూర్చోలేకపోతే పడుకుని కూడా ధ్యానం చేయవచ్చు.
కన్నులు మూసుకొని భక్తిగీతాలను విన్నా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఎవరి శక్తిని బట్టి వారు ధ్యానం చేయవచ్చు.
* ధ్యానం విషయంలో ఏమైనా సందేహాలు కలిగితే.. గురువు యొక్క సలహాలను పొందటం మంచిది.
శ్వాసలు గబగబా తీసుకుంటే ఆయువు త్వరగా ఖర్చయిపోతుందని కొందరు అంటున్నారు.
దైవనామస్మరణ ..మంత్రం చేసేటప్పుడు దైవంపైన ధ్యాసను చక్కగా నిలుపుకోగలిగితే మంచిది.
పూజలో తెలిసీతెలియని పొరపాట్లు జరిగితే క్షమించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.
సరైన విధంగా పూజ చేసేలా అనుగ్రహించమని దైవాన్ని వేడుకోవాలి.
ధ్యానం(మెడిటేషన్) ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ధ్యానం చేయాలనుకుంటే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా స్థితులు అభ్యసించి తర్వాత ధ్యానం చేయడం ప్రారంభించాలి. లేకుంటే అనవసరంగా వైద్యులు కూడా గుర్తించలేని అనారోగ్యాలు సంభవించే ప్రమాదం ఉంటుంది...అని అంతర్జాలం ద్వారా తెలుస్తున్నది. )
* ప్రాణాయామం, ధ్యానం..వంటివి గురువుల ద్వారా నేర్చుకుని ఆచరిస్తే మంచిదని తెలుస్తున్నది.
***********
గతజన్మల కర్మల ప్రభావం వల్ల మరియు వర్తమానంలో చేస్తున్న కర్మల వల్ల జీవితంలో లాభ నష్టాలు, కష్టసుఖాలు కలుగుతాయి.
మనస్సు చంచలమైనది... జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, మరియు సమాజం యొక్క ప్రభావం వల్ల మనస్సు ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి.
అందువల్ల, వీలైనంతలో దైవ స్మరణ, దైవనామ స్మరణ చేయాలి.
మనము జీవితంలో సరైన విధంగా ప్రవర్తించేలా సహాయం చేయమని దైవాన్ని ప్రార్ధించాలి.
దైవనామము, మంత్రము ఎక్కువసేపు చేయలేకపోతే... కండ్లు మూసుకొని దైవాన్ని స్మరించుకున్నా చాలు.
****************...
.
దేవుని పూజ చేస్తూ అలవాటయిన సహస్రనామములను అంటూ ఉంటాము. కానీ మనస్సు మాత్రం వేరే సమస్య గురించి ఆలోచిస్తుంటుంది. ఇలా రెండు పనులు చేస్తున్నాము కదా.
దీన్నే తిరగవేసి .. జీవితంలో స్వధర్మాన్ని పాటిస్తూ అన్ని పనులు చేస్తూనే.. మనసు మాత్రం దైవాన్ని స్మరిస్తూ ఉంటే .. వాళ్ళని నిష్కామకర్మ యోగులు అనవచ్చేమో అనిపిస్తుంది నాకు.
1. ప్రతి రోజు కనీసం ఓ అరగంట వ్యాయాయం, లేదా నడక వంటివి చేయాలి.
ReplyDelete2. రోజుకి కనీసం రెండు సార్లు (కనీసం పది నిముషాలు) ప్రాణాయామం చేయాలి.
3. మనం రోజూ చేసే పనులు క్రమం తప్పక/ ఆలస్యం అవకుండా చేసుకోవాలి.
4. ఆందోళనలు, ఉద్రిక్తత తగ్గించుకోవాలి,
5. మనం చేసిన తప్పులకు మనమే భాధ్యత వహించాలి, వాటిని ఇతరులపై రుద్దరాదు.
6. మన పనిలో మనమే లీడర్ అవాలి. ఏ పని చేసినా నిరుత్సాహంగా కాక ఆనందంతో చెయ్యాలి.
7. ఎవరు మన గురించి చెడుగా/ వ్యతిరేకంగా మాట్లాడినా, మన గురించి పట్టించుకోక పోయినా బాధ పడకుండా, వారితో వాదనకు దిగకుండా వుండాలి..
దీనిపై మీ ప్రతిస్పందనను బట్టి, ధ్యానం ఎలా చేసుకోవాలో తరవాత రాస్తాను..
విలువైన విషయాలను తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి. శ్రమ అనుకోకపోతే ధ్యానం గురించి చెప్పగలరు.
Delete1. నూనెలు, మసాలాలు ఎక్కువగా వున్న పదార్ధాలు తినకూడదు.
ReplyDelete2. కాఫీ, టీ వంటి ఉత్ప్రేరకాలు మానేయాలి.
3. కొవ్వు పదార్ధాలు, పాలు పాల వుత్పత్తులు కల్గిన పదార్ధాలు ఎక్కువగా వాడరాదు.
4. జీవంతో కూడిన పప్పు ధ్యాన్యాలు (నానబెట్టినవి). వీలైతే పచ్చి కూరగాయలు (రా ఫుడ్) ఒకపూట అయినా తినాలి. (కంపల్సరీ లేదు)
5. నీళ్ళు ఎక్కువగా తాగాలి. చోడు పిండి తో కూడిన జావ తాగితే మంచిది.
ధ్యానానికి ఇవన్నీ అవసరమా అంటే.. శరీరం బరువుగా వుంటే ధ్యానం చేసుకోవడం కష్టం.. మాంశాహారముతో, కొవ్వు పదార్ధాల్తో పొట్టను నింపుకుని, శారీరక శ్రమ చెయ్యకుంటే ధ్యానం కష్టం, అలాంటి వాళ్ళకే నిద్ర వస్తుంది..
అ) మనస్సుని ప్రశాంతంగా వుంచుకోవాలి.
ఆ) కష్టమొచ్చినా, లాభం కల్గినా ఒకలాగే స్పందించే గుణం అలవరచు కోవాలి..
ఇ) ధనము పై, వస్తువులపై, ఆస్థిపై ఎక్కువ ఆపేక్ష, కాంక్షతో కాక, దురాశ వుండక, న్యాయ బద్దమైన సంపాదన కల్గి వుండాలి.
ఈ) జరిగి పోయిన కాలాన్ని, ఆ కాలంలో జరిగిన విషయాల్ని గురించి గాని, భవిష్యత్తులో జరగ బోయే వాటి గురించి గాని ఎక్కువ ఆలోచించ కుండా వర్తమన కాలం లో మన ప్రవర్తనపై శ్రద్ద పెట్టాలి..
ఉ) జారిపోయిన క్షణ కాలం గురించి కాక, ఈ క్షణం గురించి ఆలోచించి పనిలో శ్రద్ద వహించాలి.. ఈ క్షణం లో చేసిన పనులు మధురంగా వుండి, ధర్మ బద్దంగా వుంటే, మనం ధ్యానం లోకి వెల్లినప్పుడు ఇబ్బంది వుండదు.. చెడ్డ పనులు/ మాటలు మాట్లాడితే మనం ధ్యానం లోకి వెళ్ళగానే ఆ చెడు తలంపులే వస్తాయి, అయ్యో అలా చేసి వుండకూడదే అనుకుంటూనే సమయం మించిపోతుంది..
please see my post:
ReplyDeletehttp://shankaratnam.blogspot.in/2012/02/blog-post.html
సార్ ! శ్రమ తీసుకుని ఎంతో విలువైన విషయాలను తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలండి. ధ్యానం గురించి మీరు వ్రాసిన టపాను చదివాను.
Deleteధ్యానం గురించి మీరు వ్రాస్తున్న విషయాలు అందరికీ ఉపయోగపడతాయి. చాలా చక్కటి ప్రయత్నం చేస్తున్నారు. . మీకు కృతజ్ఞతలండి.
ReplyDeleteశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి, కుర్తాళం పీఠాధిపతి వారు తెలియజేసిన విషయములలో కొన్ని విషయములు..
......................
వ్యత్యాసం అదే...
ధ్యానానికి ఏకాగ్రత అవసరం కానీ మంత్రానికి అలా అవసరం లేదు. మంత్రోచ్చాటన జరుగుతున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. అవి వస్తూ, పోతూ ఉన్నా పట్టించుకోవద్దు. అవి ఒక రోజు నిశ్శేషమవుతాయి. తద్వారా మనస్సుకు, శరీరానికి అనంతమైన శక్తి కలుగుతుంది. మంత్రంతో మనస్సుకు శక్తినివ్వటం ద్వారా రోగాలను నయం చేసే శక్తిని కూడా పొందొచ్చని నిరూపించిన సంఘటనలున్నాయి.
.............
ఈ విషయాలను వార్తాపత్రికలో చదవటం జరిగింది. విలువైన విషయాలను తెలియజేస్తున్న అందరికీ ధన్యవాదములండి.
ధ్యానం కన్నులు తెరచి కూడా చేయవచ్చని అంటున్నారు.
ReplyDeleteఎక్కువసేపు కండ్లు మూసుకుని కూర్చోలేకపోతే ..కొంతసేపు కళ్ళు మూసుకుని, కొంతసేపు తెరచి కూడా చేయవచ్చు.
ప్రక్కన ఏదైనా దైవభక్తి గీతాలు వింటూ కూడా ధ్యానంలో ఉండవచ్చు.
ధ్యానం చేసేటప్పుడు కన్నులు మూసుకుంటారు కదా..అలాంటప్పుడు కన్నులు తెరవకూడదని కన్నులను గట్టిగా బిగబట్టటం కాకుండా తేలికగా మూసుకుంటే మంచిది.
ReplyDeleteఎక్కువసేపు కన్నులు మూసుకుని ధ్యానం చేయలేనప్పుడు కొద్దిసేపు కన్నులు మూసుకుని..కొద్దిసేపు కన్నులు తెరచి కూడా ధ్యానం చేయవచ్చు.
ఉదా..శ్రీలలితాసహస్రనామస్తోత్రం తో ధ్యానం చేయాలనుకుంటే..
కన్నులు మూసుకుని చేయవచ్చు. కన్నులు తెరచి చేయవచ్చు. కొద్దిసేపు కన్నులు మూసుకుని ..కొద్దిసేపు కన్నులు తెరచి కూడా చేయవచ్చు అని నాకు అనిపిస్తున్నది.