koodali

Wednesday, February 8, 2012

.యదార్ధవాది....లోకవిరోధి. అన్నారు మరి.



నేను నాకు తెలిసినంతలో నా అభిప్రాయాలను చెప్పుకోవాలని బ్లాగులో వ్రాస్తున్నానండి. . వాటిలో కొన్ని పొరపాట్లు కూడా ఉండవచ్చు.

నన్ను విమర్శిస్తున్న వారికి, విమర్శలు ప్రశంసలను రెండింటిని కలిపి అందిస్తున్నవారికి, ప్రశంసిస్తున్న వారికి, అందరికి నా ధన్యవాదములండి.

నా ఆలోచనలు ఈ కాలంలో చాలామందికి నచ్చవు. కొన్ని అలోచనలు నచ్చినా కొన్ని నచ్చకపోవచ్చు.

నన్ను ఎవరైనా అపార్ధం చేసుకున్నప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వటం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినవాళ్ళు ఇతరులతో స్నేహాన్ని పోగొట్టుకుంటారేమో ! అది నాకు ఇష్టం లేదు.


నేను టపాల్లో వ్రాసిన అభిప్రాయాలు నచ్చినవాళ్ళు మీ మనసులో నా అభిప్రాయాలను మెచ్చుకున్నా చాలు నాకు సపోర్ట్ అందించినట్లేనండి. ( నాకు సపోర్ట్ ఇచ్చిన వారికి ధన్యవాదములండి. )


ఈ ప్రపంచంలో అందరికి నచ్చేటట్లు మాట్లాడాలంటే చాలా కష్టం . ఒకే కుటుంబంలోని  తల్లిదండ్రులు పిల్లల మధ్యే భిన్నాభిప్రాయాలు ఉంటాయి.

పూర్వకాలంలో అయితే భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా సర్దుకు పోయి జీవించి ఈ కుటుంబవ్యవస్థను నిలబెట్టారు.

వేరువేరు అభిప్రాయాలు కలిగి ఉండే వ్యక్తులు కూడా చక్కగా స్నేహంగా ఉండేవారు.

కానీ ఈ రోజుల్లో ఎవరైనా తమకు నచ్చని అభిప్రాయాన్ని చెబితే చాలు ఇక వాళ్ళని నానామాటలూ అంటున్నారు.


ఈ రోజుల్లో ఏం మాట్లాడాలన్నా గొడవగానే ఉంది. ఆడవాళ్ళు పద్ధతిగా దుస్తులు ధరించాలి అని అన్నాము అనుకోండి. ఇక అంతే సంగతులు. వాళ్ళపని అయిపోయిందే.

నా అభిప్రాయాలు కూడా కొందరికి నచ్చలేదు కాబోలు . విమర్శిస్తున్నారు.

చాలామందితో పోల్చుకుంటే నేను ఒక సామాన్య భక్తురాలిని. నా ఆధ్యాత్మిక మార్గంలో నా శక్తికి మించిన పరీక్షలు ఎదురయ్యాయి. వాటితో పోల్చుకుంటే ఈ విమర్శలు పెద్ద కష్టం కాదులెండి.


బ్లాగులలో రాజకీయాల గురించి తెలిసి నేను చాలా కాలం వ్యాఖ్యలకు దూరంగానే ఉన్నాను. అలా ఉంటే అందరితో స్నేహం చెయ్యని వ్యక్తి అని నవ్వుతారేమోనని అప్పుడప్పుడూ వ్యాఖ్యలు వ్రాయటం చేసాను. అయితే నన్ను బ్లాగు రాజకీయాల్లో అనవసరంగా ఇరికిస్తున్నారు.

రమణ గారి బ్లాగులో నా వ్యాఖ్యకు .. ఒకరు ఈ క్రింది వ్యాఖ్య వ్రాసారు.

( హ హ ..శ్రీ పాదుని బాల్యం కాపీ కొట్టి 'బుజ్జి పండు చదువు' అని కవరప్ చేసి, అటు శంకరా భరణం బ్లాగులో పెద్దలని బకారాలని చేసిన రియాల్టీ షో :)

ఈ వ్యాఖ్యను చూసి నాకు అయోమయం అనిపించింది.

బుజ్జిపండు చదువు గురించి నేను వ్రాయటమేమిటో ? శంకరాభరణం బ్లాగులో ఏం జరిగిందో ? ఇవన్నీ నాకు తెలియదు.


ఈ వ్యాఖ్య డైరక్ట్ గా నన్ను అన్నారు. కాబట్టి ఇక్కడ వ్రాసానండి. కొందరు ఇండైరెక్ట్ గా నన్ను విమర్శిస్తున్నారు.


మరి నన్ను ఎందుకు ఇలా విమర్శిస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు.

నేను గృహిణినండి. నేను పుట్టిన సంవత్సరం......1966.


నేను మహిళను కాబట్టి తోటి మహిళల కష్టాల పట్ల నాకు చాలా సానుభూతి ఉంది. అలాగని స్త్రీలు అసభ్యంగా దుస్తులు ధరించటాన్ని నేను సమర్ధించను. ఇలా నా ఆలోచనలు భిన్నంగా ఉంటాయి.


కుటుంబ వ్యవస్థను గురించి, ఇంకా కొన్ని ఇతర విషయాలను గురించి నేను వ్రాసిన పాత టపాలు కొన్నింటిని చూస్తే మీకు ఈ విషయం తెలుస్తుంది. వాటిని ఇక్కడ ఇస్తున్నానండి.


విషయాలు ఎక్కువగా ఉన్నందువల్ల దయచేసి కొంచెం నిదానంగా చదవమని ప్రార్ధిస్తున్నానండి.

.......................................
పాపం పసివాళ్ళు....

ఒకప్పుడు నాకు ఉద్యోగం చెయ్యాలని ఇంకా సమాజాన్ని ఉద్దరించాలనీ అలా ఏవేవో కోరికలుండేవి.


* ముందు నన్ను నేను ఉద్దరించుకుంటే అదే గొప్ప అని ఇంకా, ఎవరి స్వధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తించటం కూడా సమాజ ఉద్దరణలో భాగమే అని, నాకు ఆలస్యంగా తెలిసింది.

( మా టీచర్ ఒకామె ( నాస్తికవాది ) మాకు దేవుడు లేడు అంటూ చెప్తుండేవారు. అవన్నీ నమ్మి నేను దైవ ప్రసాదాన్ని నిరాకరించటం లాంటి తప్పులు కూడా చేశాను.
కానీ, భగవంతుడు దయామయుడు కాబట్టి నన్ను క్షమించారు. )

కొన్ని సంవత్సరాల క్రితం........

ఒక రోజు మా అబ్బాయి చిన్నప్పుడు ( నెలల వయసు ఉన్నప్పుడు ) హఠాత్తుగా విపరీతంగా ఏడవటం మొదలుపెట్టాడు.

ఎంత ఊరుకోబెట్టినా ఆపకుండా గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్నాడు. కడుపు నొప్పి అనుకుని మందు కూడా వేశాను.. బొమ్మలు ఇచ్చినా, బయట తిప్పినా, ఏడుపు ఆపలేదు.

నాకు చాలా భయం వేసింది.......... ఏం జరిగిందో తెలియని ఆందోళన, ఏం జరుగుతుందో తెలియని భయం, అయ్యో పిల్లాడు ఇంత బాధ పడుతున్నాడే అన్న బాధ .

నేను ఎంత ప్రయత్నించినా బాబు ఏడుపు ఆపలేదు.

*ఆ గందరగోళంలో వత్తిడితో కూడిన విసుగుతో నేను బాబును ఒక చిన్న దెబ్బ కూడా వేసినట్లు గుర్తు. అయినా ఏడుపు ఆపలేదు.

ఇక భయం వేసి నా భర్తకు ఫోన్ చేసి హాస్పిటల్ కు తీసుకు వెళ్దాము....... అని చెబుదామనుకుంటుంటే , ఏడ్చిఏడ్చి అలసిపోయి పిల్లాడు నిద్రపోవటం జరిగింది.

* బాబును మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంటే చూశాను. తన చేతి వెనుక ఎర్రటి చీమ కుడుతోంది.

దానిని తీసిపారేశాను. కానీ , ఆ సంఘటన తరువాత నేను ఉద్యోగం చెయ్యలేదని బాధపడటం తగ్గిపోయింది.

ఇదంతా ఆలోచిస్తే నాకు ఎంతో బాధ కలిగింది.

తల్లినయిన నాకే విసుగు కలిగిందే ! అయ్యో ! తన బాధ ఇదీ అని చెప్పటానికి ఇంకా మాటలు కూడా రాని చంటిపిల్లలను పనివాళ్ళకు, లేక క్రచ్ లకు అప్పగించి వెళితే పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని ?

అంటే వాళ్ళు సరిగ్గా చూడరని కాదు. బాగా చూసె వాళ్ళు కూడా కొందరు ఉంటారు లెండి.
ఎంతైనా ఇంటి వాళ్ళంత ఆప్యాయంగా చూస్తారా ? ఏమో !

పూర్వం పేదస్త్రీలు పనులకు వెళ్ళేటప్పుడు తమ చంటి పిల్లలను తమతో పాటు తీసుకువెళ్ళి చీరతో వీపుకు కట్టుకుని పనిచేసేవారట. లేకపోతే పొలం గట్టున చెట్టుకు చీరతో కట్టిన ఉయ్యాలలో పడుకోబెట్టి కొంచెం పెద్దపిల్లలను కాపలాగ పెట్టి పనులు చేసుకొనేవారట.

( అంటే ఇప్పుడు అందరూ అలా చేయమని కాదు. వాళ్ళు పిల్లలను అంత జాగ్రత్తగా చూసుకునేవారు అని చెప్పటానికి అలా చెప్పాను అంతే. )

. మేము ఒక దగ్గర ఉన్నప్పుడు........ మా పొరుగున ఇంట్లో ఒకరి అమ్మాయి బిడ్డ పుట్టాక రెండో నెలలోనే పాలుత్రాగే బిడ్డను తల్లిదండ్రుల వద్ద వదిలేసి ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళిపోయింది.( కెరీర్ కోసమని .)

( ఆమెకు ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరం కూడా లేదు. ( అయినా సంపాదనకు అంతు ఎక్కడుంది ? )

పెద్దవాళ్ళు పనిలో సాయం చేసే ఆమె సహాయంతో ఆ బిడ్డను చూసేవారు. పని ఆమె రానిరోజున వాళ్ళ పని ఇక అంతే.

పూర్వం తల్లిదండ్రులు చంటిపిల్లలను పెంచుతుంటే తాతా బామ్మలు, మనుమలు,మనుమరాండ్ర ముచ్చట్లతో కాలం గడిపేవారు.

కానీ, డాక్టర్ వంటి వృత్తులలో ఉన్న ఆడవాళ్ళ పిల్లలను పెంచటానికి మాత్రం వారి పెద్దవాళ్ళు తప్పక సహాయం చేయటం బాగుంటుంది.

అంటే , నాకు ఏమనిపిస్తుందంటే ..

వీలయినంతవరకు చంటి పిల్లలను పెంపకానికి బయటివాళ్ళ దగ్గర వదలటం కంటే వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర ( తాతగార్లు, అమ్మమ్మ,నాయనమ్మ..) వదలడమే మంచిది అనిపిస్తుంది.

ఇప్పుడు నాకు ఇంటిని చూసుకోవటం, కొంచెం సేపు పూజ చేసుకోవటం, పత్రికలు, పుస్తకాలు చదవటం ఇలా సమయం సరిపోవటం లేదు.

అసలు పుస్తక పఠనం అలవాటు ఉన్నవారికి బోర్ కొడుతోంది అనే సమస్యే ఉండదు.
............................

పాపం .... పెద్దవాళ్ళు.

ఈ రోజుల్లో పెద్దవాళ్ళు తమ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎందుకంటే, ఒక వేళ అనారోగ్యం వచ్చిందనుకోండి వారిని చూసేవాళ్ళు ఎవరు ? ఇంట్లో అందరూ బిజీ కదా !

మా బంధువుల్లో ఒక బామ్మగారు ఉండేవారు. ఆమెకు 6 గురు సంతానం ఉన్నారు.
 
ఈమె భర్త మరణానంతరం 85 ఏళ్ళ వయసులో పల్లెటూరులో ఒక్కరే ఉండేవారు. అక్కడ అందరూ తెలిసిన వారు కాబట్టి ఇరుగుపొరుగు కొంచెం సహాయంగా ఉండేవారు.

ఒకరోజు ఆమె బాత్రూంలో కాలుజారి పడటం వల్ల ఇక మంచానికే పరిమితం అయ్యారు. ఆమెకు సేవ చెయ్యటానికి పనివాళ్ళు దొరకలేదు.

అలా మంచం మీద ఉన్నవారికి స్నానం చేయించటం, ,శుభ్రం చెయ్యటానికి ఎక్కువ డబ్బు ఇచ్చినా .....వాళ్ళు రెండు రోజులు పనికి వచ్చేవారు. తరువాత పని మానేసేవారు.

ఇక ఆమె పిల్లలు ఆమెను ఒక పేరున్న వృద్దాశ్రమంలో వేయాలని అనుకున్నారు. నెలకు 5 వేలు ఇంకా, కొన్ని వేలు డిపాజిట్ వేసి చేర్పించాలనుకున్నారు.

కానీ ఆ ఆశ్రమం వారు ఏమన్నారంటే , కొద్దిగా అయినా లేచి తమ పనులుతాము చేసుకునే వృద్దులనే వారు చేర్చుకుంటారట. ఇలా మంచంపై ఉండేవారిని వారు చేర్చుకోరట.

ఎందుకంటే అలాంటి వారిని చూసుకోవటానికి వారికి మనుష్యులు దొరకరని చెప్పి ఈమెను జాయిన్ చేసుకోవటానికి నిరాకరించారు.

ఆమెకు ఒక 6 రోజులు కొద్దిగా సేవ చేయటానికి మాత్రమే నాకు వీలు కుదిరింది.అలాంటి వారికి చెయ్యటం కష్టమే.

ఆమె పరిస్థితి చూసి నాకు జీవితమంటే ఇంతేనా అని అనిపించింది.

పెద్ద వయసు వచ్చాక ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ? అని భయం కూడా కలిగింది.
యవ్వనంలో ఆరోగ్యంతో ఉండగా మనకు ఏదో సాధించెయ్యాలని తపన తప్పితే ఇలాంటి కష్టాలు తెలియవు.

వృద్దాప్యం అంటే రెండో బాల్యం అంటారు.

ఆ వయసు వచ్చి అనారోగ్యం ఉండేవాళ్ళకు అందరూ తమ దగ్గర కూర్చుని కొద్దిసేపయినా ఆప్యాయంగా మాట్లాడాలని ఉంటుంది.
కానీ,
మనకేమో వీర బిజీ కదా ! మనకు భోజనం చెయ్యటానికే సమయముండదు.

వారికి ఏమీ తోచదు. కానీ ప్రతి చిన్న విషయం వారు పట్టించుకుంటారు. అన్నీ వివరాలు అడుగుతుంటారు.
కానీ ,
మనకేమో అంత ఓపిక ఉండదు.

ఆ వయసులో వారితో మాట్లాడాలంటే ఇంట్లో వారికి విసుగ్గా అనిపిస్తుంది కానీ, 
మనం చిన్నతనంలో ఎంత విసిగించినా ఓపికగా సమాధానాలు చెప్పి మనలను పెంచిన తల్లిదండ్రులే అయినా మనకు వారితో మాట్లాడటానికి విసుగొస్తుంది.

పెద్దవయసు వాళ్ళకు ఏమీ తోచక ఇరుగుపొరుగుతో మాట్లాడాలని ఉంటుంది .......కానీ ,శరీరం సహకరించదు.

ఇంట్లో వాళ్ళతో ఎక్కువ సమయం మాట్లాడాలని ఉంటుంది కానీ , అందరూ ఎవరి బిజీలో వారు ఉంటారు.

అప్పటివరకూ జీవితంలో బిజీగా ఉండి ఒక్కసారే ఖాళీగా ఉండాలంటే తట్టుకోవటం వాళ్లకు కష్టంగా ఉంటుంది.

ఇక వాళ్ళు తమ జీవితంలో జరిగిపోయిన ముచ్చట్లు తలచుకుంటూ గడపటం తప్ప ఏం చేయలేని పరిస్థితి.

ఇలా మంచానికే పరిమితమయిన వారి పరిస్థితి ఎంతో బాధాకరం. నాకు ఏమనిపించిందంటే , నరకం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది.

ఇంకా, ఆ బామ్మగారు నాతో ఏమన్నదంటే , నేను ఇంకా ఎందుకు బ్రతకాలి ? అని ఏడ్చింది ......కానీ దానికి ఏమని సమాధానం చెబుతాము. తరువాత కొన్ని నెలలు మాత్రమే జీవించింది ఆమె.

ఇవన్నీ చూశాక నాకు ఏమిటో ! మనిషి జీవితం అనిపించింది.

నడివయసు వాళ్ళకయినా చిన్న జబ్బు చేసి మంచం మీద ఉంటే ఈ రోజుల్లో వాళ్ళను చూసుకోవటానికే ఎవరికీ తీరికలేని పరిస్థితి ఉంది.

* మొత్తానికి అటు చిన్నపిల్లలుగాఉన్నప్పుడు కేర్ సెంటర్ల సం రక్షణలో , ఇటు వృద్ధాప్యం వస్తే వృద్ధాశ్రమం వాళ్ళ సం రక్షణలో ఉండవలసిన వింత పరిస్థితి వచ్చేసింది.

యవ్వనంలో మాత్రమే అదీ ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనల్ని అందరూ గౌరవిస్తారు.
ఆరోగ్యంగా ఉన్నంతవరకే ఎవరి గొప్పతనమయినా అనిపించింది.

యవ్వనంలో ఉన్నవాళ్ళు కూడా భవిష్యత్తులో పెద్దవాళ్ళు అవుతారు గదా ! అది గుర్తుంచుకుంటే పెద్దవాళ్ళను చూడటానికి విసుగు తగ్గి కొంచెం ఓపిక వస్తుంది.
..............................

*స్త్రీకి స్త్రీయే శత్రువా ? కాదా ?

స్త్రీలు చాలా మంది పురుషాధిక్య ధోరణి వల్లే తమకు కష్టాలు వస్తాయి అనుకుంటారు.
సరే, స్త్రీలు అంటే గౌరవం లేకుండా స్త్రీలను పీడించే పురుషులు చాలా మంది ఉన్నమాట నిజమే.

కానీ, కేవలం మగవారి వల్లే స్త్రీలకు కష్టాలు వస్తున్నాయంటారా?

స్త్రీల వల్లే తోటి స్రీలకు వచ్చే కష్టాల మాటేమిటి ?

అత్తా, కోడళ్ళ గొడవల్లో పోటీపడేది స్త్రీలే గదా !

ఒక స్త్రీ గర్భం ధరించటం కొంతకాలం ఆలస్యమయితే చాలు, ఇక గొడ్రాలు అంటూ విసిగించి వేధించేది అత్తగారు, ఆడపడుచులు, తోటిస్త్రీలు.వారూ స్త్రీలే గదా!

పిల్లలు పుట్టి వారు అందరూ ఆడపిల్లలయితే , అందుకు కోడలినే తప్పుపట్టి కొడుకుకు ఇంకో పెళ్ళి చేయటానికి సిద్ధపడే అత్తగార్లు కూడా ఉంటారు.

స్కానింగ్ లో ఆడపిల్ల అని తెలిస్తే కడుపులో పిండాన్ని, వీలుకాకపోతే పుట్టిన తరువాత ఆ పిల్లను చంపేసే వాళ్ళలో ఆ ఇంటి ఆడవాళ్ళు కూడా పాత్రధారులే.

ఇక కట్నం వేధింపులు, చావులు విషయంలో చెప్పనే అక్కర్లేదు.

ఆ విషయంలో ఇంటి కోడలిని వేధించే వారిలో అత్తగారూ, ఆడపడుచుల పాత్ర ఎంతో ప్రధానమైనది. 

ఇక కొందరు కోడళ్ళు కూడా తక్కువ వారేమీ కాదు.

పెళ్ళి అయిన మరుక్షణం నుంచీ ....... ఇక అత్తగారి మీద భర్తకు చాడీలు చెబుతూ భర్తను వారి తల్లిదండ్రులకు దూరం చేయటానికి ప్రయత్నం చేసే కోడళ్ళు ఎందరో ఉన్నారు.

ఇక కోడళ్ళు కూడా తమ తల్లి కోప్పడితే అంతగా బాధపడరు ..... అదే అత్తగారు కోప్పడితే సీరియస్ గా తీసుకుంటారు.

ఇక అత్తగారేమో తన కూతురుకు ఒక న్యాయం ....... కోడలికి ఒక న్యాయంగా ప్రవర్తిస్తారు.

అత్తగార్లు తాము ఒకప్పుడు కోడళ్ళమే అనీ......కోడళ్ళు తామూ కాబోయే అత్తలమే అని గుర్తు పెట్టుకున్న రోజున ఇంట్లో అందరికీ సుఖంగా ఉంటుంది.

అత్తాకోడళ్ళ మధ్యన ఈ గొడవలకు అభద్రతా భావం, తన చెయ్యే పైన ఉండాలనే పోటీ మనస్తత్వం ఇలా ఎన్నో కారణాలు.

కోడలికి అత్తగారు, అత్తగారికి కోడలు సపోర్ట్ గా ఉంటే ఎంత బాగుంటుంది !

ఇవన్నీ కాకుండా కొందరు మగవాళ్ళ వివాహేతర సంబంధ కారణంగా బాధలు పడేది .. మళ్ళీ స్త్రీయే.

ఇలా స్త్రీ కష్టాలకు .. తోటి స్త్రీయే కారణమవుతోంది.

స్త్రీలలో త్యాగమూర్తులూ ఉన్నారు.........తనకు లభించని అదృష్టం ఇంకొక స్త్రీకి లభిస్తే అసూయతో కాపురాలు కూల్చే పడతులూ ఉన్నారు.

సెలెబ్రిటీలు అనే వారి విషయంలో చూస్తున్నాము కదా ! మగవారు భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక స్త్రీని వివాహం చేసుకుంటున్నారు.

కొన్ని సార్లు భార్య కూడా తాను ఇంకొకరిని వివాహం చేసుకుంటుంది.

ఇలా పిల్లలు పుట్టాక బాధ్యత లేకుండా...... ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారు.

అలాంటి పిల్లలు వివాహవ్యవస్థ అంటేనే నమ్మకాన్ని కోల్పోతున్నారు.

పిల్లల సమస్యల గురించి సినిమాలు తీసే అమీర్ ఖాన్ వంటివారు .. ఇలాంటి పిల్లల సమస్య గురించి కూడా .. గొప్ప సినిమా తీస్తే ఎంతో బాగుంటుంది మరి.

ఇక, పిల్లలను పెంచేది చాలా వరకూ తల్లులే గదా!

వారు పిల్లలను పెంచేటప్పుడు అమ్మాయి అయినా........ అబ్బాయి అయినా సమానమే అని పెంచాలి.

అంతే కానీ ఆడవారిని చెప్పుచేతలలో అణచి ఉంచాలని అబ్బాయికి చెప్పకూడదు.....మగవారిని ద్వేషించేటట్లు అమ్మాయిని పెంచకూడదు.

ఇలా.. స్త్రీలు తోటి స్త్రీలను కష్టపెట్టకపోతే అదే చాలు. స్త్రీల బాధలు చాలా వరకూ తగ్గుతాయి..
................................

*ఇంతకు ముందు కొన్ని టపాలలో కుటుంబాలలో కలతలు రావటం గురించి చెప్పుకున్నాం కదండి.

ఒక 50 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు బయటకు వచ్చి సంపాదించటమనేది తక్కువగా ఉండేది. ఇప్పుడు సమాజం చాలా మారిపోయింది. ఇంకో 50 ఏళ్ళు అయితే ఇంకెన్ని మార్పులు వస్తాయో !

ఈ రోజుల్లో పెద్దవయసు వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కర్మకాలి వాళ్ళు బాత్రూం లో కాలుజారి పడో, లేక పక్షవాతం వచ్చో మంచానికి పరిమితం అయిపోయారనుకోండి. ఈ రోజుల్లో వాళ్ళను చూసే వారే తక్కువ.


భార్యాభర్తలు ఇద్దరూ బిజీ కదా ! ఈ రోజుల్లో చంటి పిల్లలను చూసుకోవటానికి కూడా పెద్దవాళ్ళకు తీరిక లేక పిల్లలను క్రచ్ లలో వేస్తున్నారు.

అది అలా ఉంచితే మీడియాలో వార్తలు చూస్తుంటే వివాహేతర సంబంధాలు, విడాకులు, వివాహవ్యవస్థ విచ్చిన్నమవటం , యువతరంలో సహజీవనం వంటివి పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది.

ఇంకా స్కూల్స్, కాలేజీలలో చదువుతున్న అమ్మాయిల పట్ల , ఆఫీసుల్లో పనిచేసే మహిళల పట్ల కొందరు మగవారి వేధింపులు, వీటిగురించి వింటున్నాము.

ఇవన్నీ వింటున్న భార్యలకేమో తమ భర్తల గురించిన బెంగ, భర్తలకేమో తమ భార్యల గురించిన బెంగ, తల్లిదండ్రులకేమో తమ పిల్లల గురించిన బెంగ ఉంటుంది.

ఇలా పరస్పర అనుమానాలు, భయాలతో ఎన్నో కుటుంబాల్లో గొడవలు జరగటం , అవి విడాకులకు దారితీయటం వింటున్నాము.

ఆడువాళ్ళ మీద జరిగే దాడులు మొదలైన వాటి గురించి ...........

నాకు ఏమనిపిస్తుందంటే, కొంతకాలం క్రిందట అమ్మాయిలకోసం విడిగా పాఠశాలలు, కళాశాలలు ఉండేవి. మళ్ళీ ఆ పద్దతి వస్తే ఈ బాధలు సగమయినా తగ్గే అవకాశముంది.

ఇంకా , చదువుకున్న ఆడవాళ్ళు కొందరు ఒక గ్రూప్ గా ఏర్పడి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. ( ప్రభుత్వం రుణం కూడా ఇస్తుంది. )

అందులో పేద, మధ్యతరగతి మహిళలను ఉద్యోగానికి తీసుకోవటం వల్ల వారికి సహాయం చేసినట్లు అవుతుంది.

పరిశ్రమలంటే కుటీరపరిశ్రమలు, జ్యూట్ సంచుల తయారీ, పచ్చళ్ళు, పిండివంటల తయారీ, ( డ్వాక్రా సంఘాలలా ), బట్టలపై అద్దకం, ఫాషన్ టెక్నాలజీ, ..........ఇంకా రైతుల వద్ద పంట కొని ఉదా...వడ్లు కొని బియ్యం అమ్మటం, కందులు కొని కంది పప్పు చేసి అమ్మటం, టమేటో కొని ఎండబెట్టి అమ్మటం( వరుగులు ) ఇలా ఎన్నో చేయవచ్చు.

ఇవన్నీ చేయటం కుదరకపోయినా ........ సమాజానికి ఏదైనా సహాయం చెయ్యాలని ఉండే ఆడవాళ్ళు సాయంత్రం పూట చుట్టుపక్కల పేద పిల్లలకు ట్యూషన్ చెప్పవచ్చు. తమకు తెలిసిన కుట్లు, అల్లికలు, ఫాబ్రిక్ పెయింటింగ్ నేర్పించవచ్చు.

ఆఫీసుల్లో ఆడవారికి నచ్చినట్లు టైమింగ్స్ ఉండవు కదా ! ఎప్పుడో ప్రొద్దున వెళ్ళి రాత్రికి రావలసి వస్తుంది.

అలా కాకుండా మహిళలే స్థాపించిన పరిశ్రమల్లో అయితే వారు తమకు తగ్గట్లు 10 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే పనిచేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు.

ఆ విధంగా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఇంకా ఆఫీసు దగ్గర్లో చిన్న క్రచ్ ఏర్పాటు చేసుకుంటే చంటి పిల్లల తల్లులు మధ్యలో ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు.

ఆ మధ్య నేను పత్రికలో చదివాను. ఒక పేరున్న బాంక్ వారు పూర్తిగా మహిళా ఉద్యోగులతో ఒక శాఖను బెంగళూరులో ఏర్పాటు చేశారట. అలాగే ఒక పరిశ్రమ వారు స్పేర్ పార్టులు తయారు చేసే ఒక యూనిట్ ను మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేశారట.

ఈ రోజుల్లో వైద్యులు, నర్సులు, అధ్యాపకులు వంటి కొన్ని రంగాలలో మహిళలు పనిచేయటం అవసరం.

ఈ రోజుల్లో మనుష్యుల్లో పడిపోతున్న నైతికవిలువల గురించి ఎన్నో సంఘటనలు వింటున్నా ................ సమాజం పూర్తిగా పాడయిపోయిందని అనుకోకూడదు.

సంప్రదాయాన్ని పాటిస్తూ, పద్దతిగా ఉండేవారు ఎందరో ఉన్నారు.

సినిమా రంగంలోనే చూడండి. భానుమతి గారు తన హుందా ప్రవర్తన వల్ల ఎంత గౌరవాన్ని పొందారో.

రాజకీయాల్లో ,ఇంకా ఇతర రంగాల్లో కూడా కూడా మంచి పద్దతిగల మహిళలు, పురుషులు ఎందరో ఉన్నారు.



15 comments:

  1. మొత్తానికి అటు చిన్నపిల్లలుగాఉన్నప్పుడు కేర్ సెంటర్ల సం రక్షణలో , ఇటు వృద్ధాప్యం వస్తే వృద్ధాశ్రమం వాళ్ళ సం రక్షణలో ఉండవలసిన వింత పరిస్థితి వచ్చేసింది.
    ----------------------------
    చిన్నప్పుడు పిల్లలని సరీగ్గా దగ్గరుండి పెంచకపోతే ప్రేమ వాత్సల్యం ఏర్పడటం కష్టమవుతుంది. అంతేకాదు చిన్నప్పుడు డే కేర్ లో మమ్మల్ని పడేసి పెంచారు పెద్దప్పుడు మిమ్మల్ని ఒల్దేజి హోం లో వేస్తే తప్పేమిటి అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.

    ReplyDelete
    Replies
    1. నా సోది అంతా చదివినందుకు మీకు కృతజ్ఞతలండి.

      మీ కంప్యూటర్ బాగయిందని చదివి మీకు వ్యాఖ్య వ్రాద్దామనుకున్నాను. కానీ నేను ఇప్పుడు ఎవరికీ వ్యాఖ్యలు వ్రాయటం లేదులెండి.. అందుకే ఊరుకున్నాను.

      Delete
  2. చాల బాగా వ్రాశారండీ! ఐతే మీరు మహిళ అనమాట! ఎవరో ఏదో అన్నారని మీరు మానేయటం దేనికండీ? మీకు నచ్చింది మీరు చేయండి మీతో ఉన్నవారు మీ వెంట వస్తారు! నేనూ కూడా బాల్యాలు అని ఇంచుమించు ఇదే భావాన్ని వ్రాశాను. ఆశ్చర్యం! మీరు కూడా నాలా ఆలోచించడం!

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ కృతజ్ఞతలండి. మీ వ్యాఖ్యను ఇప్పుడే చూశాను.

      సద్విమర్శలను నేను తప్పుగా అనుకోనండి. ఎందుకంటే ఇతరులు చేసే సద్విమర్శల ద్వారా నాలోని తప్పులను నేను సరిదిద్దుకుంటాను..

      అలాగే నా శ్రేయోభిలాషుల యొక్క మంచి గుణాలను మెచ్చుకున్నట్లే వారిలోని లోపాలనూ విమర్శిస్తాను...ఇలాంటప్పుడు కొందరు నన్ను సరిగ్గా అర్ధం చేసుకోవటంలేదు.

      Delete
  3. anrd గారు,

    ఎవరో ఒకళ్ళిద్దరు పనికి మాలిన వాళ్ళు కల్పితాలతో కూడిన విమర్శలు చేస్తే దాని గురించి మీరెందుకండీ ఇంత ఫీలవడం.

    మీకు అనిపించినవి మీరు చక్కగా రాయండి. నచ్చేవాళ్ళకి నచ్చుతాయి. నచ్చని వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్తారు అంతేకదా. ఒక్కోసారి మన ఉద్దేశ్యాలు మంచివయినా మన ఆలోచనలూ అభిప్రాయాలూ పొరపాటుగా ఉండే అవకాశం ఉంది. దానిగురించి ఎవరైనా సద్విమర్శ చేస్తే మనకే మంచిది. సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

    గౌరవం లేకుండా అవమానించే రీతిలో ఒకళ్ళిద్దరు మాట్లాడటం ఇంటర్నెట్ ప్రపంచంలో ఉంటూనే ఉంటుంది. వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. మీ అభిప్రాయాలూ ఆలోచనలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మీరు హాయిగా రాసుకోండి. మాకు నచ్చలేదు కాబట్టి మీరు రాయొద్దు అనే హక్కు ఎవ్వరికీ లేదు. అదే విధంగా మాకు నచ్చలేదు కాబట్టి మీ మీద వ్యక్తిగతంగా బురద చల్లుతాం, వెటకారం చేస్తాం అనే వాళ్ళకి రెట్టింపు సంఖ్యలో మంచిగా విమర్శించే వాళ్ళూ, ప్రోత్సహించేవాళ్ళూ ఎప్పుడూ ఉంటారు.

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలండి. మీ వ్యాఖ్యను ఇప్పుడే చూశాను.

      కొన్ని విమర్శల వల్ల నాకు కొంచెం బాధ కలిగిన మాట నిజమే కానీ .... మళ్ళీ అదంతా మర్చిపోయానండి.

      అన్నీ గుర్తు పెట్టుకుంటే జీవితం కష్టం.

      నాకు ఎవ్వరి మీదా కోపం లేదండి.

      నేను కూడా నా జీవితంలో ఎన్నో సార్లు ఇతరులను విమర్శించాను.

      అసలు ఇదంతా నా మంచికే జరిగిందనుకుంటున్నాను.

      ఎందుకంటే .... కొంతకాలంగా నేను ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం మానేద్దాము అనుకుంటున్నాను.

      ఎందుకు ? అంటే .......

      నా కారణాలు నాకు ఉన్నాయి మరి.

      ఇప్పుడు ఈ వంక పెట్టి ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం ( కొంతకాలం ) మానేస్తానన్నమాట.

      అయితే టపాల ద్వారా నా బ్లాగులో నా అభిప్రాయాలను వ్రాస్తాను.

      ( నేను వ్రాసే టపాలలో నాకు నచ్చని విషయాలు కూడా ఉంటాయి. ఉదా.ఉపవాసం చేయటం మంచిది. అని వ్రాస్తాను.
      ఉపవాసం చేయటం అనే విషయం నాకు కూడా నచ్చదు.

      కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి అలా వ్రాయవలసి వస్తుంది మరి. )


      మీ అందరికి మరొక్కసారి కృతజ్ఞతలండి.

      Delete
  4. ఉపవాసం చేయటం అనే విషయం నాకు కూడా నచ్చదు.
    ---------------
    ఉపవాసం చెయ్యటం చాలా మంచిది. మన శరీరం ఒక పూట శలవ తీసుకుని రెఫ్రెష్ అవుతుంది. మీరు చెయ్యగలిగి, చేస్తూ ఉంటే మానవోకండి.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
      నాకు వీలయినంతలో అప్పుడప్పుడూ ఉపవాసాలు చేస్తుంటానండి.

      ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా ఆరోగ్యానికి మంచిది , ఇంకా అనేక ఉపయోగాలు ఉంటాయి కదా అని.

      Delete
  5. చక్కగ మీ ఆలోచనలను వ్యక్త పరిచారు. మన భారతీయ జీవన విధానం గురించి మీ ఆలోచన బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      ఎవరైనా నేను వ్రాసిన విషయం బాగుందంటే , కొంచెం సంతోషంతో పాటు కొంచెం భయంగా కూడా ఉంటుందండి.

      ఎందుకంటే తప్పులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత మరింత పెరుగుతుంది కదా అని. నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ.

      ఈ మాత్రం వ్రాయగలుగుతున్నానంటే అంతా దైవం దయేనండి.

      Delete
  6. anrd గారూ, నేను మీ అభిప్రాయాలతో ఏకీభవించి ఉండకపోవచ్చును. నా భావాలు చెప్పాలనే కామెంట్లు రాసాను తప్ప మిమ్మలిని విమర్శిద్దామని కాదు. నా వ్యాఖల వల్ల మీకు బాధ కలిగి ఉంటె పెద్ద మనుసుతో క్షమించండి.

    ReplyDelete
    Replies
    1. నేను ఇప్పుడే మీ వ్యాఖ్యను చూశానండి. మీ భావాలను చెప్పటంలో తప్పులేదండి.

      అయితే కొందరు బాధాకరమైన వ్యాఖ్యలు చేశారు. ( మీరు కాదు లెండి. ) అలాంటివి బాధను కలిగిస్తాయి.

      నేను వ్రాసిన విషయం నచ్చకపోతే విమర్శించవచ్చు. తప్పులేదు. అయితే ఆ విమర్శలు అసహ్యంగా ఉండకూడదు అన్నదే నా అభిప్రాయం..

      సద్విమర్శలు ఎంతో అవసరం కూడా.

      Delete
    2. మీరు అన్న మాట నూరికి నూరు శాతం నిజం. పైగా మీ బ్లాగు పై మీకే సర్వ హక్కులు ఉంటాయని అందరూ గుర్తించుకోవాలి.

      Delete
    3. neenu chadivina tharvatha telusukunnnadi emitante meeru aadyathmika margaanni anusarinchuthunnaru ani anukuntunnanu

      100% correct

      Delete
  7. కృతజ్ఞతలండి.

    ReplyDelete