koodali

Wednesday, February 22, 2012

ఇద్దరమూ వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలిసాము. .....


నన్ను మా ఊరిలోని మహిళా కళాశాలలో ఆర్ట్స్ గ్రూప్ లో చేర్పించారు.

నాకేమో డాక్టర్ లేక అలా ఏదన్నా చదవాలని కోరికలు ఉండేది.

మా ఇంట్లోవాళ్ళకేమో అలాంటి కోరికలు ఏమీ లేవు. సామాన్యమైన డిగ్రీ చదివించి వివాహం చెయ్యాలని వాళ్ళ కోరిక .

నేను సైన్స్ గ్రూప్ తీసుకుంటానని అడిగాను. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు.

ఇక చేసేదేమీ లేక ఆర్ట్స్ గ్రూప్ లో చేరి చదువుతున్నాను.

పది రోజులు గడిచేసరికి లెక్చరర్లు నా ప్రతిభను గుర్తించి మెచ్చుకున్నారు.

ఒకరిద్దరు లెక్చరర్లు నువ్వు సైన్స్ గ్రూప్ ఎందుకు తీసుకోలేదు ? అని ప్రశ్నించటం కూడా జరిగింది.

నేను సమాధానం చెప్పలేదు. ( నేను ఏం చెప్పగలను ? )

ఆ రోజుల్లో సైన్స్ గ్రూప్ చదవటం అంటే గొప్పగా ఫీలయ్యేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియం లో అంటే మరింత గొప్ప.


పాత స్కూల్ ఫ్రెండ్స్ కొందరు కూడా నన్ను అడగటం మొదలుపెట్టారు ....
అదేంటి ! నువ్వు ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నావా ? అని ఆశ్చర్యాన్ని ప్రకటించారు.

ఇదంతా చూసి ....నాకు అన్యాయం జరిగిపోతోందని గట్టిగా అనిపించింది.

ఇంతలో మా క్లాసులో ఒక అమ్మాయి తను గ్రూప్ మార్చుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇక నాకు దారి దొరికింది. ఆ అమ్మాయి దగ్గరకెళ్ళి నేను కూడా గ్రూప్ మార్చుకుంటాను . ఏం చెయ్యాలో సలహా చెప్పమన్నాను.

ఇద్దరమూ వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలిసాము.

మా ప్రిన్సిపల్ కు చండశాసనురాలని పేరు.

మేము వణుకుతూనే వెళ్ళి మా సమస్య చెప్పాము.

ఆమె పెద్దవాళ్ళ పర్మిషన్ కావాలి.. అన్నారు.

అదే కాలేజీలో నాకు బాగా ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి ఉంది.

మావి ఎదురుబొదురు ఇళ్ళు అవటం వల్ల చిన్నప్పటినుంచి మేము బాగా ఫ్రెండ్స్.. తనకి ఈ కధంతా చెప్పి గ్రూప్ మారటంలో సాయం అడిగాను.

మా ఇంట్లో వాళ్ళ సంగతి తనకి తెలుసు .

కాబట్టి ఇదంతా ఎక్కడికి దారితీస్తుందోనని భయపడింది.

ఫరవాలేదు. మనమేమీ తప్పు చేయటం లేదు. ఇదంతా నేను పెద్ద చదువులు చదవటానికే కదా ! అని ధైర్యం చెప్పాను.

మరుసటి రోజు ఇద్దరం ప్రిన్సిపల్ వద్దకు వెళ్ళాము. మా పెద్దవాళ్ళకు రావటం కుదరలేదని చెప్పి దయచేసి గ్రూప్ మార్చమని ప్రాధేయపడ్డాము.

ఏమనుకున్నారో మరి ఆవిడ బైపిసి ఇంగ్లీష్ మీడియం లోకి మార్చేసారు.

అప్పుడు ఇంగ్లీష్ మీడియంకు, తెలుగు మీడియంకూ నాకు తేడా తెలియలేదు.

ఇక మరుసటి రోజు వెళ్ళి క్రొత్త క్లాసులో కూర్చున్నాను.

టెక్స్ట్ బుక్స్ లేవు. లెక్చరర్ చెబుతున్నది ఒక్క ముక్కా నాకు అర్ధం కావటం లేదు.

నేను తెలుగుమీడియం నుంచి వచ్చాను కదా !

నా ఖర్మ కొద్దీ ఆ లెక్చరర్ నన్నే ప్రశ్నలు అడిగేవారు.

ఆమె అడిగేది నాకు తెలియదు. నేను చెప్పేది ఆమెకు తెలియదు.

క్లాసులో ఘొల్లున పిల్లల నవ్వులు.

ఆప్పటివరకూ స్కూల్లో బాగా చదివే విద్యార్ధినిగా ఒక వెలుగు వెలిగిన నేను.... అందరిముందు అవహేళనలను ఎదుర్కోవటం మొదలయ్యింది.


మళ్ళీ ప్రిన్సిపల్ వద్దకెళ్ళి తెలుగు మీడియంలోకి మార్చమని అడిగాను. ఆవిడ నన్ను కోప్పడ్డారు. ( ఇన్నిసార్లు మార్చమంటే ఎవరైనా కోప్పడతారు మరి. )

ఇక చేసేదేమీ లేక వచ్చి క్లాసులో కూర్చున్నాను.

ఇలా వారం రోజులు గడిచేసరికి , కాలేజీలో కొందరు ఈ వార్తను ఆయాసపడుతూ మా ఇంటికి మోసేసారు.

మీ అమ్మాయి తనకుతానే గ్రూప్ మార్చుకుని వేరే క్లాసులో కూర్చుంటోంది అని.

ఇది ఒకరకంగా నాకు సంతోషాన్నీ, ఒక రకంగా భయాన్నీ కలిగించింది.

మా ఇంట్లో వాళ్ళకు నేను చెప్పే బాధ తప్పిందన్న సంతోషం...ఇక ముందు ఏం జరగబోతుందో ? అన్న భయం.

విషయం ఇంట్లో తెలిసింది.... ఇక చెప్పటానికి ఏముంటుంది లేండి.

మా నాన్నగారు నాలుగు రోజులు నాతో మాట్లాడలేదు. మా అమ్మగారు నన్ను బాగా తిట్టిపోసారు.

అలా ఇంగ్లీష్ మీడియం అర్ధం కాకపోవటం వల్ల ఇంటర్లో ఫిజిక్స్ , కెమిస్ట్రీ తప్పటం జరిగింది.

నాకు మొదట్నించీ బట్టీపట్టి చదవటం ఇష్టం ఉండేది కాదు. సబ్జెక్ట్ అర్ధమయిన తరువాతే చదువుతాను.

నాకు తెలిసిన కొందరు మాథ్స్ కూడా బట్టీపట్టి చదివే వాళ్ళున్నారు..

నాతోపాటు స్కూల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కొందరు మా క్లాసులో ఇద్దరుముగ్గురు ఉన్నారు.

వారిని నా సందేహాలు అడుగుదామంటే ఎంచేతో కాని ....వారు నాతో పూర్వంలా మాట్లాడటం తగ్గించారు.( ఇప్పుడు నేను యావరేజ్ స్టూడెంటును కదా ! )

పూర్వం కూడా మేము ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు కూడా వారికీ నాకూ కొంచెం గాప్ ఉండేది.

కారణమేమిటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కలిసి మెలిసి సినిమాలకు , ఒకరి ఇళ్ళకు ఒకరు వెళ్తూ అందరూ బాగా స్నేహంగా ఉండేవారు.

( వాళ్ళ ఇళ్ళలో పెద్దవాళ్ళు వాళ్ళని సినిమాలకు, ఫ్రెండ్స్ ఇళ్ళకు పంపించేవారు. )

కానీ మా ఇంట్లోనేమో ..... అలా ఫ్రెండ్స్ తో వెళ్ళటం అంటే ఒప్పుకునేవారు కాదు.

ఆడపిల్లలు అలా వెళ్ళకూడదు అనేవారు.


( ఇప్పుడు మా అమ్మగారు, నాన్నగారు ఏమంటారంటే .......

* నిన్ను చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో సినిమాలకూ, వాళ్ళ ఇళ్ళకు పంపించటం లేదని మాతో వాదించేదానివి కదా !

* మరి ఇప్పుడు నువ్వు కూడా మీ పిల్లల్ని
ఫ్రెండ్స్ తో అంతగా పంపించటం లేదుకదా ! అని నవ్వుతూనే.... అంటారు.

* అది నిజమే కాబట్టి, నేను జవాబు చెప్పలేను.

* మాతృ భాషలో చదవటాన్ని ప్రోత్సహించాలి.

* జపాన్ వంటి దేశాలలో మాతృ భాషలోనే విద్యాభ్యాసం ఉంటుందట.

* ఇంగ్లిష్
ఒక సబ్జెక్ట్ గా మాత్రమే ఉండాలి.

* కొద్దోగొప్పో తెలివి ఉన్న నాకే ఇంగ్లీష్ చదువు ఇంత కష్టంగా ఉంటే
,
 ఇక
పల్లెల నుంచి వచ్చిన పిల్లలుఇంగ్లీష్ చదువులు చదవలేక,
 
చదువును మధ్యలోనే మానేస్తారు... అని నా అభిప్రాయం.

 

7 comments:

  1. వెనుకటి తరంలో ఆడపిల్లల చదువులు చాలావరకు పెళ్ళిళ్ళ చదువులుగానే ఉండేవి.

    అంతకు ముందు తరాలలో ఆడపిల్లల సంగీతవిధ్య కూడా పెళ్ళిళ్ళ కోసం నేర్పించటంగానే ఉండేది.

    అయితే ప్రస్తుతం చాలా మార్పు కనబడుతోంది. ఈ తరంలో ఆడపిల్లలకు తలిదండ్రులు నిజాయితీగానే చదువు చెప్పిస్తున్నారు. చాలా హర్షించవలసిన విషయం.

    ఆడపిల్లల సంఖ్య దురదృష్టవశాత్తు తగ్గిపోతూ ఉండటంతో, దానికి తోదు అమ్మాయిలు బాగా చదువుతూ ఉండటంతో, పెళ్ళిళ్ళ మార్కెట్ లో అమ్మాయిల హవా నడుస్తోంది. ఇది ఒక రకంగా మంచిదే లెండి.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరన్నట్లు ఇప్పుడు ........పెళ్ళిళ్ళ మార్కెట్ లో అమ్మాయిల హవా నడుస్తోంది.

      ఉపాధ్యాయ వృత్తి, వైద్య వృత్తి వంటి కొన్ని రంగాలలో ఆడవాళ్ళ అవసరం ఉందండి.

      ఈ రోజుల్లో కొందరు ఆడవాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ హుందాగా జీవిస్తున్నారు.

      కానీ కొందరు ఆడవాళ్ళు చదువు, ఉద్యోగం వల్ల ఆర్ధికాభివృద్ధిని సాధించి ఇక భర్తను, అత్తింటివారిని బెదిరించే స్థాయిలో ప్రవర్తిస్తున్నారు.

      పిల్లలు ఉన్నా వేరే వివాహం చేసుకుంటున్నారు.

      వీటన్నింటికీ కాలమే జవాబు చెబుతుంది అనిపిస్తుందండి.

      Delete
    2. కొన్నాళ్ళ క్రిందటి వరకు ఆర్ధికస్వాతంత్ర్యం పురుషులకు మాత్రమే పరిమితమైన వ్యవహారంగా ఉండేది. అప్పట్లో చాలామంది దృష్టికి అది స్త్రీపురుష అసమానతగా తోచలేదు. పురుషులు తమ ఆర్ధికస్వాతంత్ర్యం అనే ఆయుధం సహాయంతో స్త్రీలపై జులుం చెలాయించటం సమాజంలో ఒక సహజమైన వ్యవహారంగా పరిగణింపబడుతూ ఉండేది. అయితే ఆర్ధికస్వాతంత్ర్యం అనేది స్త్రీలకు కూడా లభిస్తూ ఉండటం ప్రారంభమయాక రెండు కొత్త పరిణామాలు ప్రస్ఫుటం కావటం సమాజం గమనించసాగింది. ఒకటి కొత్తగా దొరకిన ఆర్ధికస్వేఛ్ఛను స్త్రీలలో కొందరు తాము కూడా ఒక ఆయుధంలాగా వాడతం మొదలు పెట్టటం (మీరన్నట్లు బెదిరించే మానసిక స్థితికి చేరుకోవటం). రెండవది కొత్త కొత్త సామాజిక సర్దుబాట్లు వెలుగులోకి రావటం (స్త్రీలు కుటుంబంలో నిర్ణాయక పాత్రపోషించటానికి, విడాకులకు, పునర్వివాహాలకు, ఒంతరి జీవనానికి ఇలా అనేక కొత్త పరిధులలోనికి ప్రవేశించటానికి సిధ్ధపడటం) ప్రారంభమయింది.
      కొత్త అవగాహనలు సమాజంలో సరిగా స్థిరపడటానికి ఇంకా కొంత సమయం పడుతుంది. వేచి చూడాలి.

      Delete
  2. బాగుంది

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  3. Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete