koodali

Monday, March 21, 2016

ప్రకృతి వ్యవసాయం..




 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందరో రైతులు  ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్న  ప్రభుత్వం ఎంతో మంచిపని చేస్తోంది. 

ప్రకృతి వ్యవసాయం గురించి కొన్ని వివరాలను ఈ లింక్ వద్ద తెలుసుకోవచ్చు.

oka link..Margadarshi - Subhash Palekar - YouTube 

 

oka link..సేంద్రియ పద్ధతి..

..........................
 
 marikonni vishayaalu..
 
 రైతులకు కొన్ని సమస్యలున్నాయి.  పరిశ్రమల వాళ్ళు చిన్న వస్తువు తయారు చేసినా దానికి వారికి నచ్చినట్లు ధర చెబుతారు. ఈ రోజుల్లో రైతులకు తను పండించే పంటకు ధరను స్వంతంగా చెప్పుకునే హక్కు ఉందా? వ్యవసాయంలో సరైన ధరరాక రైతులెందరో కష్టపడుతున్నారు.

కూరగాయలు, పండ్లు పండించాలంటే, విత్తనం వేసి మొలకెత్తి, పెరిగి చీడపీడలకు తట్టుకుని, తుఫాన్లు వచ్చి పాడవకుండా పంట చేతికి అందాలంటే ఎంతో కష్టం ఉంటుంది. అలా పంట చేతికొస్తే,  దళారులు, వినియోగదారులు తక్కువ ధరకు అడుగుతారు.

గోడవున్లలో ఆహారపదార్ధాలు పాడవకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి.కొంత తక్కువధరకు పేదవారికి ఇవ్వవచ్చు.
...................................
ఐటి వంటి వారికి నెలకు కొన్నివేలు, కొందరికి లక్ష వరకు ఆదాయం వస్తోంది. రైతులకు కొన్నివేలు, లక్ష ఆదాయం రావాలంటే సంవత్సరం పడుతుందేమో?

ఐటీవాళ్లకు ఎంత కష్టపడి పని చేసినా కూడా, ఉద్యోగాలు ఎన్నాళ్లుంటాయో చెప్పలేము. చాలామంది ఉద్యోగాలు ఉన్నప్పుడే సంపాదించుకుని దాచుకుంటారు. ఒక ఉద్యోగం పోయినా ఇంకో ఉద్యోగానికి వెళ్తారు.

 రైతులకు ఉద్యోగం పోతుందని భయం ఉండదు. కాని,ఉద్యోగాల వాళ్లతో పోలిస్తే ఆదాయం తక్కువ ఉంటుంది. చక్కగా ప్రణాళిక వేసుకుంటే చక్కటి ఆహారం, ప్రకృతి మధ్య జీవితం ఉంటుంది.
..............................

ఈరోజుల్లో పల్లె జీవితం ఎక్కువమందికి నచ్చటం లేదు. సిటీలే నచ్చుతున్నాయి..చాలామంది వ్యవసాయం చేయటం కన్నా, ఉద్యోగాలే కావాలంటున్నారు.

ఉద్యోగాలు చేసేవాళ్ళు నెలకు వేలరూపాయలు సంపాదిస్తుంటే, రైతులు తక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయం చేస్తూ కష్టాలు పడుతూ అందరికి అన్నం పెట్టాలంటే కష్టం కదా..  రైతులు వ్యవసాయం మానకుండా ఉండాలంటే, రైతులకు కూడా ఆదాయం బాగుండాలి కదా.
..............................

పాతకాలంలో పల్లెల్లో వ్యవసాయంచేస్తూ చక్కటి ఆహారం తింటూ, పత్తితో దుస్తులు నేసేవాళ్లు నేస్తుంటే, ఆ దుస్తులు కొనుక్కుని, వృత్తివిద్యలు చేసేవాళ్లు చేసే పరికరాలను కొనుక్కుని ఉన్నంతలో చక్కగా జీవించేవారు.

పాతకాలంలో వృత్తివిద్యలు ఉన్నప్పుడు చదువు, ఉద్యోగం అని వేరే ఊళ్లకు వెళ్ళి హాస్టల్స్ లో ఉండటం తక్కువగా ఉండేది . పిల్లలు తమ పెద్దవారినుంచి వృత్తివిద్యలు నేర్చుకుని ఉన్నఉళ్లోనే ఉండేవారు. కాలేజీల్లో సీట్లకొరకు, ఉద్యోగాల కొరకు ఎదురుచూపులు ఉండేవికాదు.
...............................

పాతకాలంలో ఆధునిక టెక్నాలజి లేదు. సినిమాలు, టీవీ సీరియల్స్, సెల్ఫోన్లు, కార్లు, క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్స్, ఆధునిక విలాసాలు లేవుకదా..ఇప్పుడు ప్రజలు చాలామంది ఇవన్నీ అలవాటుపడ్దారు.

పల్లెలకు కొంతదూరంలో సిటీలు ఉంటే, పల్లెలో వ్యవసాయం చేసి అప్పుడప్పుడు సిటీకి వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు స్కూల్స్, కాలేజిలు ఒకసమస్య అంటారు కానీ, ఈ రోజుల్లో ఉన్నఊళ్లోనే అందరికి సీట్లు లభించటం లేదు కదా..చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారు.

 ఇప్పుడు చాలామందికి సిటీల్లో ఇళ్లు, కార్లు, విలాసవంతమైన ఇళ్ళు, ఆధునికటెక్నాలజి, రకరకాల కొత్తవస్తువులు కావాలి.

 టెక్నాలజి వద్దని నా అభిప్రాయం కాదు. పర్యావరణసహిత టెక్నాలజి మంచిది. టెక్నాలజిని అతిగా కాకుండా, ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవాలి.
....................................
 ఉపాధి అవకాశాలు సిటీల్లోనే ఉండటం వల్ల అక్కడకు వలసలు వెళ్ళి పొల్యూషన్ మధ్య బ్రతకవలసి వస్తోంది.

పరిశ్రమలు అన్ని సిటీల్లోనే కాకుండా, సిటీలకు కొంతదూరంగా చిన్ననగరాల్లో కూడా ఏర్పాటు చేసి అక్కడకూడా మంచి స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, పార్కులు..ఏర్పాటుచేస్తే సిటీల్లో భారం తగ్గుతుంది.
............................... 
 కొందరు సిటీల్లో పొల్యూషన్ ఇష్టపడక, సిటీకు దూరంగా ప్రకృతి వ్యవసాయంతో కూరగాయలు, పండ్లమొక్కలు, పువ్వుల మొక్కలు.. పెంచుకుంటూ,  ఆధునిక వసతులతో కూడా చక్కగా నివసిస్తున్నారు.

Wednesday, March 16, 2016

ఆర్ధిక అసమానతలు తగ్గితేనే సమస్యలు తగ్గుతాయి..

 
 
 
ఈ రోజుల్లో ఎన్నో రంగాలలో ఉపాధి లభించటం చాలా సమస్యగా ఉంది.   ఉపాధి లభించకపోవటం వల్ల ఆదాయం లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు.

ఒక్కో రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరము ఇంజనీరింగ్ కాలేజీల నుండి ఎన్నో వేలమంది వరకూ పట్టాలు పుచ్చుకుని బయటకు వస్తున్నారు.  దేశం అంతటా కలిపితే ఎన్నో లక్షల మంది ఉంటారు. 


 పరిశ్రమల  ద్వారా  కొందరికి  మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయి.  ఆ ఉద్యోగస్తులు కొన్ని సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు. 

ఇలాంటప్పుడు , ప్రతి ఏటా కాలేజీల నుండి బయటకు వచ్చే లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాలంటే ఎలాగో తెలియదు.

 ప్రతి సంవత్సరం ఎన్నని కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయగలరు ?

నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు తగ్గాలంటే ఆర్ధిక అసమానతలు తగ్గించటమే పరిష్కారం. 

 కొందరి వద్ద విపరీతంగా సొమ్ము ఉండటం ....కొందరి వద్ద సొమ్ము లేకపోవటం వల్ల ఆర్ధిక అసమానతలు ఏర్పడతాయి. 

ప్రపంచంలోని వనరులపై అందరికీ హక్కుంది. అయితే, బలవంతులు, తెలివిగలవాళ్ళు సంపదను తమ చేతుల్లో ఉంచుకుని బలహీనులకు అన్యాయం చేస్తున్నంత వరకూ  సమాజంలో ఆర్ధిక అసమానతలు , నిరుద్యోగం, పేదరికం ఉంటూనే ఉంటాయి. 


 ప్రభుత్వాల వద్ద సంపద ఉండటం వల్ల ఎన్నో ఉద్యోగాలను సృష్టించుకోవచ్చు. సంపద ఉండాలంటే సమాజంలో ఆర్ధిక అసమానతలు తగ్గించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.


 నల్లడబ్బును అరికట్టటం, అన్ని రంగాలలో ధరలను అదుపులో ఉంచటం  ..వంటి విషయాలలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. 

అందరికీ కనీస అవసరాలు తీరటం ఎంతో అవసరం. ముఖ్యంగా ఆహారం లభించకపోతే ప్రజలలో నేరప్రవృత్తి పెరిగే అవకాశం ఉంది. 

నిరుద్యోగం, పేదరికం వంటి పరిస్థితులు చక్కదిద్దటానికి ప్రభుత్వాలకు సమయం పడుతుంది. అంత వరకూ ప్రజలకు  ఆకలిబాధలు లేకుండా ప్రభుత్వాలు తక్కువ ధరకు ఆహారాన్ని అందించాలి.  

 కొన్ని రాష్ట్రాలలో  ప్రభుత్వం వాళ్ళు  తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

 ప్రభుత్వాలు ప్రజలకు చేరువ కావాలన్నా  తక్కువ ధరకే భోజనసదుపాయం కల్పించటం అనేది ఒక చక్కటి మార్గం.



Monday, March 14, 2016

తిరుమల తిరుచానూరు, శ్రీ కాళహస్తి ....




మేము తిరుమల తిరుచానూరు, శ్రీ కాళహస్తి వెళ్లి వచ్చాము. దర్శనాలు బాగా జరిగాయి. అంతా దైవం దయ. 

 తిరుమలలో  పూజ కొరకు టికెట్స్ తీసుకున్నాము. ఈ టికెట్స్ కొన్ని సంవత్సరాల క్రిందట తీసుకున్నాము. 

పూజలో పాల్గొనే అవకాశం కలిగింది. అంతా దైవం దయ. 

తిరుమల నడక దారిలో వెళ్ళాము.

 తిరుమలలో కాలినడక భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించటం బాగుంది. 

అయితే ఒక దగ్గర  ఏమంటున్నారంటే..... కాలినడక భక్తులు 24 గంటల లోపే ప్రత్యేకదర్శనం చేసుకునే అవకాశం  ఉంది  అంటున్నారు.

 ఇంకొక దగ్గర ఏమంటున్నారంటే .....24 గంటలు అనే నియమం ఏమీ లేదు. తరువాత కూడా  ప్రత్యేకదర్శనం  చేసుకునే అవకాశం  ఉంది  అంటున్నారు.

 కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులలో కొందరికి కాళ్ళనొప్పుల వల్ల 24 గంటల లోపే దర్శనం చేసుకోవాలంటే కుదరకపోవచ్చు. అందువల్ల 24 గంటలకన్నా ఎక్కువ కాలం పర్మిషన్ ఇవ్వటమే బాగుంటుంది.


 తిరుమలలో అన్నప్రసాదం చాలా బాగా చేస్తున్నారు. రోజూ ఎందరో భక్తులు వస్తున్నా కూడా అవన్నీ అలా నిర్వహించటం ఎంతో గొప్ప విషయం.


 కొన్ని రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం వాళ్ళు  తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

 ప్రభుత్వాలు ప్రజలకు చేరువ కావాలంటే తక్కువ ధరకే భోజనసదుపాయం కల్పించటం అనేది ఒక చక్కటి మార్గం.


 అందరికీ ఉద్యోగాలు కల్పించటం అనేది అంత సులభమైన విషయంకాదు. అందరికీ ఆహారం అందించటం కొంత తేలికైన విషయమే.

 అయితే ఆహారాన్ని వృధా చేయకూడదు. 

 తిరుమలలో ఉన్నట్లు అన్ని ఊళ్ళలోనూ బాగా మొక్కలు పెంచాలి.

శ్రీ కాళహస్తి దేవాలయం కూడా చాలా పెద్దది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూలైన్లు ఏర్పాటు చేసారు. 

దైవదర్శనాలు బాగా జరిగాయి. అంతా దైవం దయ.
**************
 

Tuesday, March 8, 2016

ఓం నమఃశ్శివాయ.....


  ఓం 

శ్రీ విశ్వనాధాష్టకం...


గంగాతరంగ రమణీయ జటాకలాపం

గౌరీనిరంతర విభూషిత వామభాగం

నారాయణప్రియ మనంగమదాపహారం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


వాచామగోచర మనేక గుణస్వరూపం

వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం

వామేన విగ్రహవరేణ కళత్రవంతం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


భూతాధిపం భుజగభూషణ భూషితాంగం

వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం.


శీతాంశు శోభిత కిరీట విరాజమానం

ఫాలేక్షణానల విశోషిత పంచబాణం

నాగాధిపా రచిత భాసుర కర్ణపూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం


పంచాననం దురిత మత్తమతంగజానాం

నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం

దావానలం మరణశోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం



తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం

ఆనందకంద మపరాజిత మప్రమేయం

నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


ఆశాం విహాయ పరిహృత్య పరస్యనిందాం

పాపేరతించ సునివార్య మనస్సమాధౌ

ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


రాగాది దోషరహితం స్వజనానురాగం

వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయం

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజవిశ్వనాధం


వారాణసీ పురపతేః స్తవం శివస్య

వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః

విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంత కీర్తిం

సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం


విశ్వనాధాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే..


ఫలం : ధనధాన్యాలూ, విద్యావిజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు.

శ్రీ అన్నపూర్ణాష్ఠకము...

 
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ

కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్టాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ

కౌమారీ నిగమార్ధ గోచరకరీ ఓంకార బీజాక్షరీ

మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ

లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ

శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ..

ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ

కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ

స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ..

ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ

నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


దేవీ సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ

వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ

భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

చంద్రార్కానల కోటికోటిసదృశా చంద్రాంశు బింబాధరీ

చంద్రారాగ్ని సమాన కుండలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ

మాలా పుస్తక పాశాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతాకృపాసాగరీ

సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిధ్యర్ధం భిక్షాందేహీ చ పార్వతి.

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

భాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం..


ఫలం: ఇహానికి ఆకలిదప్పులూ - పరానికి ఏ కలితప్పులూ కలగకపోడం.

శ్రీ గణేశ స్తుతి...

శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే..

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి

దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికాచ్చేదికి

మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్

మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్

ఫలం: సర్వపాపనాశనం - సర్వ విఘ్న నాశనం - సర్వ వాంచా ఫలసిద్ధి.

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం..

హే స్వామినాధ కరుణాకర దీనబంధో

శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసమేత  మమదేహి కరావలంబం..

దేవాదిదేవనుత దేవగణాధినాధ

దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద

దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్

తస్మా త్ప్రసాద పరిపూరిత భక్తకామ

శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల

పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే

శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ

వల్లీసనాధ మమదేహి కరావలంబం..

దేవాదిదేవ రధమండల మధ్య వేద్య

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం

శూరం నిహత్య సురకోటిభి రీడ్యమానం

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

హారాదిరత్న మణియుక్త కిరీటహార

కేయూర కుండల లసత్కవచాభిరామ

హే వీర తారక జయామర బృంద వంద్య

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః


పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైమునీంద్రైః


పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ


వల్లీ సనాధ మమ దేహి కరావలంబం..

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా

కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం

సిక్త్వాతు మా మవ కళాధర కాంతికాంత్యా

వల్లీసనాధ మమ దేహి కరావలంబం..

సుబ్రహ్మణ్యాష్టకం యే పఠంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదితః.

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి..

ఫలం: సర్వ వాంచా ఫల సిద్ధి - సర్వ పాప నాశనం...


సంతాన ఫల మంత్రం..

సంతానం లేకపోవడానికి నాగదోషం లేదా సర్పదోషం కారణమని అంటారు.

ఈ నాగదోషం తొలగాలంటే గర్భం ధరించిన నెలలోపులో లేదా గర్భధారణకి పూర్వమే అయినా ఈ క్రింది శ్లోకాన్ని రోజూ స్నానం చేశాక ముమ్మారు పఠించాలి. ఇలా చదివితే తప్పక 108 రోజుల్లో నాగదోషం తొలగుతుందన్నది అనుభవంలో ఉన్న సత్యం.

చక్కని సంతానం కలిగారన్నది వాస్తవం.

ఏ నిత్య నివేదనలూ నియమాలూ లేవు. 108 వ రోజు చదవటం పూర్తయ్యాక నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఆ మంత్రం లాంటి శ్లోకం ఇదిగో,.

జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ

వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా !

జరత్కారుప్రియాఽఽ
స్తీకమాతా విషహారేతి చ 

మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా !!

ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్!

తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ !!

శ్రీ కాల భైరవాష్టకం..
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం

వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం

నారదాది యోగిబృంద వందితం దిగంబరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..

భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠ మీప్సితార్ధదాయకం త్రిలోచనం

కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..

శూలటంక పాశ దండమాది కారణం

శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం

కాశికాపురాధినాధ కాలభైరవంభజే..

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం

భక్తవత్సలం స్థితం సమస్త లోక నిగ్రహం

నిక్వనణ్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం

కర్మ పాశమోచకం సుశర్మ దాయకం విభుం

స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం

కాశికాపురాధినాధ కాలభైరవం భజే..


రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం

నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం

మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే.

అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం

దృష్టి పాతనష్ట పాపతజాల ముగ్రనాశనం

అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

భూత సంఘనాయకం విశాల కీర్తి దాయకం

కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుం

నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం

కాశికాపురాధినాధ కాల భైరవం భజే..

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం

శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం..

ఫలం: మనశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం..


శివపంచాక్షరీ స్తోత్రం....
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మ్యై నకారాయ నమశ్శివాయ.

మందాకినీసలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మ్యై మకారాయ నమశ్శివాయ.

శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

తస్మ్యై శికారాయ నమశ్శివాయ.

వశిష్ట కుంభోధ్భవ గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మ్యై నకారాయ నమశ్శివాయ.

యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

సుదివ్య దేహాయ దిగంబరాయ

తస్మ్యై యకారాయ నమశ్శివాయ.

పంచాక్షర మిదం పుణ్యం యః పఠే చ్చివస్సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

 
పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



Friday, March 4, 2016

కొన్ని విషయములు...పాండవులు..దుర్యోధనాదులు...


 
పాండవులు సౌమ్యులు. పాండవులకు మొహమాటం, సహనం..వంటివి ఎక్కువగా ఉండటం వల్ల దుర్యోధనాదులు ఎప్పటికప్పుడు బ్రతికిపోయారు. 
 
 
చిన్నతనం నుంచి తమను దుర్యోధనుడు ఎన్ని బాధలు పెట్టినా పాండవులు ఎదురుతిరగలేదు. లక్క ఇల్లుదహనం చేసి తమను చంపడానికి ప్రయత్నించినా పాండవులు సహించారు. ఇంకా గంధర్వుల చేతిలో చావబోతున్న దుర్యోధనాదులను పాండవులు వెళ్ళి రక్షించారు.


మహాభారతయుద్ధానికి ముందు యుద్ధరంగంలో బంధువులను, పెద్దలను..చూసి వారందరితో తాను యుద్ధం చేయలేనని చెప్పగా.. శ్రీకృష్ణులవారు అర్జునునికి గీతాబోధతో కర్తవ్యాన్ని తెలియజేసారు.


అధర్మపరులు, దుర్మార్గులు, దుష్టులు, రాక్షసప్రవృత్తిగల దుర్యోధనుడు..వంటి వారి పట్ల అతిసహనం, అతిమంచితనం వంటివి పాటించటం సరైనది కాదని నాకు అనిపిస్తుంది. అయితే, ఎవరికైనా పాపం పండే రోజులు రావాలని కొందరు అంటారు.

దుష్టులు, దుర్మార్గులు పట్ల కొంతవరకు సహనం వహించి, వారు మంచిగా మారటానికి కొంత సమయం ఇవ్వవచ్చేమో కానీ, మరీ పరిస్థితి విషమించే వరకు వేచిఉండటం వల్ల ఏమి జరుగుతుందో చెప్పలేము.


కర్ణుడు తోడు లేకున్నాకూడా, దుర్యోధనుడు పాండవులను బాధలుపెడతాడు. అయితే, వానికి కర్ణుని సలహాలు కూడా తోడయ్యాయి. కర్ణుడు ఎలాంటివాడైనా, మహాభారతయుద్ధంలో దుర్యోధనాదులు మరణించడంలో కర్ణునిపాత్ర కూడా ఎంతో ఉంది.


కర్ణుడు దుర్యోధనుని పక్కనచేరి చెప్పిన కొన్ని సలహాల వల్ల కూడా దుర్యోధనుని నాశనం జరిగింది. ద్రౌపదిని నిండుసభకు లాక్కొచ్చి అవమానించటం, అభిమన్యుని అందరూ కలిసి వధించటం..పాండవులకు ఎంతో బాధను కలిగించే విషయాలు. 
 
 
ఇవన్నీ జరిగి.. మహాభారతయుద్ధంలో దుర్యోధనాదుల నాశనం జరగటంలో సూర్యపుత్రుడైన కర్ణుని పాత్ర ఎంతో ఉంది. అలా తనకు తెలియకుండానే దుర్యోధనాదుల వినాశనంలో కుంతిదేవి యొక్క ప్రధమపుత్రుడైన కర్ణునిపాత్ర చాలా ఉంది.


    స్నేహితులు తప్పులు చేస్తుంటే, మంచిస్నేహితులు మంచి సలహాలను ఇచ్చి సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా స్నేహితుని మెప్పుకొరకు, తమ పనులు జరగటానికి తప్పుడు సలహాలిచ్చేవారు మంచి స్నేహితులు కాలేరు. 
 
 
తాము చేసేది తప్పు అనికూడా కొందరు ఒప్పుకోకపోవచ్చు. తాము చేసేది సరైనది అని కూడా వారికి అనిపించవచ్చు.

   **************
 
ఇంకా నాకు ఏమనిపిస్తుందంటే, కర్ణుడు చేసినవాటిలో మంచిపనులు, చెడు పనులు ఉన్నాయి. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో, అభిమన్యుని చంపే విషయంలో కర్ణుడు చేసినది ముమ్మాటికీ తప్పే.


ద్రౌపది విషయంలో వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించటం ఎంతో దారుణం. అందరు పెద్దవాళ్లు ఉండి కూడా ఎవరూ ఆపలేకపోయారంటారు. పాండవులు కూడా
ఆపలేకపోయారంటారు. 

 
జూదంలో ద్రౌపదిదేవిని పణంగా పెట్టిన విషయంలో ద్రౌపది కొన్ని ప్రశ్నలు అడగటం జరిగిందని అంటారు. నిజంగా దాసి అయినా కూడా, వస్త్రాపహరణం చేయడానికి ఎవరికి హక్కు ఉండదు.


అభిమన్యుని విషయంలో అందరు కలిసి ఒక చిన్నవాడిని చంపటం ఎంతో దారుణం. ఇంకా,దుర్యోధనాదులు  పాండవులను చంపడానికి చిన్నప్పటినుంచి ఎన్నో ప్రయత్నాలు చేసారు. ఇన్ని అన్యాయాలను చేసిన  దుర్యోధనాదులను, కర్ణుని ..యుద్ధంలో ఎలా చంపినా దోషం లేదు.

***************

కర్ణునిలో కొన్ని మంచి విషయాలేమిటంటే, కవచకుండలాలను ఇంద్రునికి దానం చేసిన విషయంలో కర్ణుని దానగుణం గొప్పదే. చాలా దానాలుంటాయి. కానీ, ఎవరికైనా తమ ప్రాణం గొప్పది కదా. అలాంటప్పుడు పుట్టుకతో వచ్చిన కవచకుండలాలను కోసి ఇవ్వటం గొప్ప విషయమే.


కర్ణుని వద్దకు కుంతిదేవి వెళ్లి తాను అతని తల్లినని, పాండవులను యుద్ధంలో చంపవద్దని అడిగిన తరువాత, కర్ణుని ప్రవర్తన  హుందాగా ఉంది. 
 
తాను కుంతి పుత్రుడునని జరిగిన విషయమంతా లోకానికి తెలియేజేస్తే కధ వేరేలా ఉండేది. కర్ణుడు తల్లి విషయాన్ని లోకానికి వెల్లడి చేయలేదు.  
 
 ********
 
మనిషి మనస్సు ఒక క్లిష్టమైన వ్యవస్థ. ఏ మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు. ఎవరి మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. 
 
ఎవరినైనా, వారు చేసే పనులను పైపైన చూసి వారి మనస్సులోని విషయాలను సరిగ్గా పూర్తిగా గ్రహించటం కష్టం.


 **************

కుంతిదేవి కర్ణుని పసిబిడ్డగా పెట్టెలో పెట్టి నీటిలో వదిలేసినట్లు అంటారు.అప్పుడు నిజంగా ఏం జరిగిందో కానీ, కొన్ని విషయాలలో నాకు ఏమనిపిస్తుందంటే, పెద్దవాళ్ళు చేసినదానికి పసిబిడ్డ ఎందుకు కష్టాలను అనుభవించాలి? 
 
కుంతీదేవి తాను ధైర్యంగా బిడ్డను పెంచుకోవచ్చు. అయితే, లోకానికి భయపడి తాను పెంచలేక పసిబిడ్డను వదిలేయటం జరిగింది...బిడ్డను వదిలిన తరువాత కుంతీదేవి అలా చేసినందుకు ఎంతో బాధపడింది. 
 
 
కారణాలేమైనా, ఈ రోజుల్లో ఎవరూ కూడా బిడ్దలను అలా వదిలేయటం చేయకూడదని ఈ సంఘటన ద్వారా నేర్చుకోవాలి.


ఇంకా, పాండవులు మత్సయంత్రం సంఘటన తరువాత ద్రౌపదిని తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్న కుంతీదేవికి పాండవులు ద్రౌపదిని తీసుకువచ్చినట్లు తెలియక, పాండవులు తీసుకువచ్చినదాన్ని అందరూ పంచుకోండి ...అనటం జరిగిందట.
 
 అప్పుడు, పాండవులు తాము తీసుకు వచ్చింది పదార్ధాన్ని, వస్తువును కాదని చెప్పాలి. తల్లి తెలియక అన్న మాటను పట్టుకుని అందరూ ద్రౌపదిని వివాహం చేసుకోకుండా ఉంటే బాగుండేదనిపిస్తుంది.

ఎవరైనా, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం. కొన్నిసార్లు తమ ప్రవర్తన ఎలా ఉందో..ఆ వ్యక్తికి కూడా అర్ధంకాకపోవచ్చు. ఏ విషయాలైనా దైవానికే తెలుస్తాయి.
   
దైవం నడిపించిన మహాభారతగాధ అద్భుతం, పరమాద్భుతం. ఏ విషయం ఎందుకు జరిగిందో దైవానికే తెలుస్తుంది.

******************
marikonni vishayamulu 
 
Link...
 
 
 

Wednesday, March 2, 2016

కాలకృత్యాలు ఆపుకునే పరిస్థితి....

 
చిన్నపిల్లలను ఉదయాన్నే హడావిడిగా తయారుచేసి స్కూల్ కు పంపుతున్నప్పుడు.. కొందరు పిల్లలు  టైం అయిపోయిందని టాయ్ లెట్ వెళ్ళకుండానే స్కూలుకు వెళ్తుంటారు.

 స్కూలులో అర్జంట్ గా టాయ్లెట్ వెళ్ళాలంటే కుదరకపోవచ్చు.  పిల్లలు టాయ్ లెట్ వెళ్ళాలని చెప్పినా కొందరు టీచర్లు పంపరు. 

టాయ్లెట్ ఆపుకోవటం అనేది ఎంతో ఘోరమైన పరిస్థితి. ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. 

కొన్నిసార్లు ఫంక్షన్స్ కొరకు స్కూల్ పిల్లల్ని గంటల తరబడి నిల్చోబెట్టేస్తుంటారు.ఇలాంటప్పుడు ఆ పిల్లలు పడే ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. 

పెద్దవాళ్ళకు స్వాగతం పలకటం కోసం  పిల్లలను నిల్చోబెడుతుంటారు. ఆ పెద్దవాళ్ళేమో తీరికగా ఎప్పుడో వస్తారు. వాళ్ళకోసం ఎదురు చూసిచూసి పిల్లలు  నీరసపడిపోతారు. 

 పెద్దవాళ్ళ స్వాగతాల కోసం  చిన్నపిల్లల్ని  నిల్చోపెట్టడం సరైనది కాదు. 

ఇక , చాలా హాస్టల్స్లో ఎక్కువ టాయ్లెట్స్ ఉండవు. అందువల్ల  టాయ్లెట్స్ వద్ద  పెద్ద క్యూ ఉంటుంది.

 క్యూల వల్ల  ఉదయాన్నే టాయ్లెట్స్ వెళ్ళటానికి  కుదరక  ...కొందరు పిల్లలు అలాగే స్కూలుకు, కాలేజీలకు  వెళ్లిపోతుంటారు. 

కొన్ని కాలేజీ  హాస్టల్స్లో  పెద్దపిల్లలు కూడా టాయ్లెట్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారు.

కాలకృత్యాలు ఆపుకునే  సమస్య వల్ల  ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి.
........................

పెద్దవాళ్లు తమ సమస్యలను చెప్పగలరు. పిల్లల విషయం అలా ఉండదు కదా..పసిపిల్లలకు సరిగ్గా మాటలు రావు కాబట్టి తమ సమస్యలను చెప్పలేరు. కొంచెం పెద్దయిన పిల్లలు తమ సమస్యలను చెప్పినా, అర్ధంచేసుకునే పేరెంట్స్ ఎందరు?

ఉదా..పాతకాలంలో పసిపిల్లలకు పల్చటి నిక్కర్ వంటివి వేసేవారు. వాళ్ళు యూరిన్ పోసినప్పుడల్లా ఆ చెడ్డిలను మార్చి ఉతికి ఆరేసేవారు. యూరిన్ నేలమీదపడితే క్లాథ్ తో తుడిచేవారు. ఈ రోజుల్లో పెద్దవాళ్లు ఆ పనులన్నీ చేయలేక, సోఫాలు, మంచాలు పాడవుతున్నాయని చెప్పి, పసిపిల్లలకు రోజంతా పెద్ద నాప్కిన్స్ వేస్తున్నారు.

 ఆ నాప్కిన్స్ తో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల చర్మానికి రాషెస్ కూడా వచ్చే అవకాశముంది.. దురద, మంట వచ్చినా పిల్లలు చెప్పలేరు. గోక్కోటానికి నాప్కిన్  ఉండి గోక్కోలేరు. ఆ బాధతో పిల్లలు ఏడుస్తుంటే, పిల్లల్ని పెంచటం చాలా కష్టం అంటారు. 

పిల్లలు ఇబ్బంది పడినా ఏంకాదు కానీ, సోఫాలు, మంచాలు పాడవ్వకూడదని, తమకు అస్తమాను శుభ్రం చేసే పని ఉండకూడదని పెద్దవాళ్ల ఉద్దేశం కాబోలు.పిల్లలను అలా ఇబ్బంది పెట్టటం చాలా పాపం.

ఇక కొందరు పసిపిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తారు. కొన్ని విదేశాల్లో పసిపిల్లలకు ఎప్పుడూ షూస్ వేసి ఉంచుతారు. పిల్లలను డేకేర్ సెంటర్లలో మధ్యాహ్నం నిద్రపుచ్చుతారు. నిద్రపోయేటప్పుడు కూడా షూస్ తీయకూడదని అక్కడ రూల్స్ అట. 
 
ఇబ్బందిగా ఉండి పిల్లలు షూస్ తీయటానికి ప్రయత్నించినా కూడా, అక్కడిసిబ్బంది మళ్లీ షూస్ వేసేస్తారట. ఇంట్లో అయితే అలా ఉండదు కదా. పెద్దవాళ్లు నిద్రపోయేటప్పుడు షూస్ వేసుకుని పడుకోగలరా?