koodali

Thursday, June 19, 2014

దేశం తప్పక అభివృద్ధిలోకి వస్తుందనటంలో.............

 
 
మనదేశం  ఇప్పుడు  పేదదేశం  అని  అంటున్నారు. డబ్బుతో  లెక్కలు  వేస్తే  మనది  పేదదేశం  అనిపిస్తుందేమో  కానీ , సహజసంపదలు  ఎన్నో  ఉన్నదేశం  పేదదేశం  ఎలా  అవుతుంది  ?

 దేశంలో  ఎందరో మేధావులు  ఉన్నారు.  అయినా  దేశం  ఇలా  సమస్యలు  ఉన్నాయంటే  ఎంతో  సిగ్గుపడవలసిన  విషయం.

మనలో  మనకు  ఐకమత్యం  తక్కువ.  మన  ప్రాచీన  సంస్కృతిని  మనం  కించపరిచినంతగా  ఏ  దేశం వాళ్ళూ   తమ  ప్రాచీన సంస్కృతిని  కించపరచటం  జరగదేమో..


మనదేశంలో  వినోదం  కూడా  ఎక్కువయ్యింది.  ప్రజలు  వినోదంలో  మునిగితేలుతున్నారు.  సినిమాలు, సీరియల్స్, అంతర్జాలం, సెల్ ఫోన్స్   ...అంతటా  వినోదమే.

ఇంట్లో  టీవీ  చానల్స్,  బయటకెళ్తే ..  బస్టాండ్,  రైల్వే స్టేషన్, బస్సులో వీడియో  ... ఇలా  చాలా  చోట్ల   వినోదకార్యక్రమాలు  ఉంటాయి .  ఇక  జనం  వాటికేసి  కళ్ళప్పగించి  చూస్తుంటారు.


చిన్నపిల్లల్ని  సినిమా  పరిజ్ఞానం ,
సినిమా పాటల   పరిజ్ఞానం  గురించి   నేర్పిస్తూ, పోటీలు  పెడుతూ  తల్లితండ్రులు  తెగ హైరానా  పడుతుంటారు.


ఇప్పుడు  ఈ  దేశం  అభివృద్ధి  చెందాలంటే  ప్రధాని,  ముఖ్యమంత్రులు  మాత్రమే  బాగా  పనిచేస్తే  చాలదు. ప్రతి  ఒక్కరూ  కష్టపడి  పనిచేయాలి.  అందరూ  పూనుకుని  కష్టపడితే  దేశం  ఎందుకు  అభివృద్ధి  చెందదు  ? 



మన  ప్రాచీన గ్రంధాలను  అదేపనిగా  చదవటం  మాత్రమే  కాదు  వాటినుంచి  మనం  ఎన్నో  నేర్చుకోవాలి. 


 ఉదా..హనుమంతుడు  సీతమ్మను  వెదకటానికి  వెళ్ళే  సమయంలో ... తన  దైవమైన  రాముని  యందు   భారం  వేసి,   లక్ష్యం  పట్ల  ఎంతో  ఏకాగ్రతగా   , పట్టుదలగా    కార్యాన్ని  సాధిస్తారు. వెళ్ళే  దారిలో  మైనాకుని  ఆతిధ్యాన్ని  స్వీకరించటానికి  కూడా   సమయాన్ని  వృధా  చేయలేదు.    


హనుమంతునికున్నంత    పట్టుదల  మనకు  లేకపోయినా    మనమూ  దైవం   యందు   భారం  వేసి,  మనకు  చేతనైనంతలో    పనిచేస్తే  దేశం  తప్పక  అభివృద్ధిలోకి  వస్తుందనటంలో  ఎటువంటి   సందేహమూ  లేదు.



 జపాన్  చూడండి  రెండవ  ప్రపంచయుద్ధంలో  ఎంతో  నష్టపోయినా  కూడా  త్వరగానే  కోలుకుంది.  అక్కడ  వాళ్ళు  మనలా  ఎప్పుడూ  వినోదమాధ్యమాన్ని   అంటిపెట్టుకుని  కూర్చోరు  అనుకుంటా.



మనదేశంలో   చిన్న,  పెద్ద  అందరికీ  క్రికెట్  లేక  సినిమాలపై  ఉన్న  ఆసక్తి  సమాజంలోని  సమస్యల  పరిష్కారం  గురించి  ఆలోచించటంలో  ఉండదు.  ఇలాంటివి  మాట్లాడాలంటే  బొర్  ఫీలవుతారు.  

వినోదం  అవసరమే.  అయితే  రోజూ  టీవీలు  చూసినా  పరీక్షల  సమయంలోనైనా   టీవీ  చూడటం  తగ్గిస్తాము  కదా  ! 


పరీక్షలు  జరిగేటప్పుడు  చదివీచదివీ   రిలాక్స్  అవటానికి  కొంతసేపు  వినోదకార్యక్రమాలను  చూస్తాము.  అంతేకానీ,  రోజూ  చూసినంతసేపు  చూడము  కదా  !

 ఇప్పుడు మనదేశానికీ  పరీక్షా  సమయమే.


  ఈ  దేశానికి  అపారమైన  సహజవనరులున్నాయి.   ఖనిజవనరులను  ఖాళీ  చేయకుండా  పొదుపుగా  వాడుకోవాలి.

చాలాదేశాలకు  లేని    అపారమైన  సూర్యరశ్మి  మనకు   ఉంది.  మనకు  లేనిదల్లా  ఒక్కటే. మనమీద  మనకు  ఆత్మవిశ్వాసం. 

 
కొన్ని  సంవత్సరాలు  మనలో  మనం  కొట్లాడుకోవటం  మాని  ,  వినోదాన్ని  కొంత  తగ్గించుకుని ,  మన  కుటుంబం  కోసం  కొంత  దాచుకుని ,  సమాజ  అభివృద్ధి  కోసం  కూడా  కష్టపడితే  మన  దేశం  బంగారు భారతదేశమై  సగర్వంగా  తిరిగి  పూర్వవైభవాన్ని  సంతరించుకుంటుంది.   అందరికి  ఆహారం, ఆరోగ్యం, విద్య, రక్షణ..ఇలా  అభివృద్ధి  చేసుకోగల  సత్తా  మనకుంది.




Tuesday, June 17, 2014

మా బామ్మగారు..


మా  అమ్మగారు  ప్రభుత్వబాలికల  పాఠశాలలో  ఉద్యోగం  చేసేవారు. ( చాలాకాలం  ఉద్యోగం  చేసిన  తరువాత  వాలంటరీ  రిటైర్మెంట్  తీసుకున్నారు.  )

ఉద్యోగం  చేసే  స్త్రీలకు  పిల్లల్ని  పెంచటం  విషయంలో  ఇబ్బందులు  ఉంటాయి  కదా  !

మా  పేరెంట్స్  నన్ను  చూసుకోవటానికి  ఒక  అమ్మాయిని  పనిలో  కుదుర్చుకున్నారట.  అయితే  ఆ  అమ్మాయికి   సరిగ్గా  చూడటం  చేతయ్యేదికాదట. 

ఈ  బాధలన్నీ  ఎందుకని  మా  అమ్మగారి  తరపు  బంధువయిన  ఒక  బామ్మగారు  మా  ఊరు  వచ్చేసారు. వేరే  ఇల్లు  తీసుకుని  ఉండేవారు. 



మా  అమ్మగారు  ఉదయం  స్కూలుకు  వెళ్ళేటప్పుడు   పిల్లల్ని  బామ్మగారి  ఇంటివద్ద  వదలటం  సాయంత్రం  మళ్ళీ  ఇంటికి  తీసుకురావటం  జరిగేది.

మా  బామ్మగారికి  పిల్లలు  లేరు. అయితేనేం  మమ్మల్నీ  మా  బంధువుల  పిల్లల్నీ  తన   సొంత పిల్లలుగా  చూసుకున్నారు.


మేము , మా  బంధువుల  పిల్లలం   పెద్దయిన  తరువాత  కూడా  బామ్మగారింటికి  తరచూ  వెళ్ళేవాళ్ళం.  కాలేజీకి  సెలవిస్తే  బామ్మగారింటికి  వెళ్ళేవాళ్ళం.



 మా  బామ్మగారు  జోక్స్  వేసేవారు.  పిల్లలం  పొట్ట  నొప్పి  పుట్టేంతగా  నవ్వే  వాళ్ళం. అయితే,  కొన్ని  విషయాలలో  స్టిక్ట్ గా  కూడా  ఉండేవారు. ఆమె  వంట  చాలా  బాగా  చేసేది.


ఆమె  ఎన్నో  నియమాలను  పాటించేవారు.  ఆమె  ఒక  దగ్గర  దీక్ష   తీసుకున్నారని   బంధువుల  ద్వారా  విన్నాను.



మా  బామ్మ  వల్ల  మేము  క్రెచ్  ల  లోనో  లేక  పనివాళ్ళ  వద్దో  కాకుండా  ఇంటివద్దే  పెరిగాము.    ఆమె  సుమారు  80 సంవత్సరాల  వరకూ  జీవించారు.


  మా  తాతగారునాయనమ్మగారు ,   మా  తాతగారుఅమ్మమ్మగారు వాళ్ళు  పల్లెటూరిలో  ఉండేవారు.   వాళ్ళు  మా ఊరు  వచ్చినప్పుడు  ఊరి నుంచి  ఎన్నో  తినుబండారాలను  తెచ్చేవారు. 



 మేము  వేసవి  సెలవులకు  వాళ్ళ  ఊళ్ళు  వెళ్ళేవాళ్ళం. ఎంతో  సరదాగా  ఉండేది.

వాళ్ళ  దగ్గరికి   వెళ్ళటానికి  సెలవులు  ఎప్పుడిస్తారా  అని  సంవత్సరమంతా  ఎదురుచూసేవాళ్ళం.  


మా  అమ్మమ్మగారి  ఊరు  వెళ్ళేటప్పుడు  మా  బామ్మగారు (మా  తాతగారికి  అక్క (  మా  అమ్మకు  మేనత్త ) ) కూడా  వచ్చేవారు.



Tuesday, June 10, 2014

సంతాన ఫల మంత్రం...మరి కొన్ని విషయములు.

ఈ  సంతాన  ఫల మంత్రం  ఎంతో  మహిమ  కలది. 

మా  బంధువులలో   ఒక  జంటకు  వివాహం  జరిగిన  చాలా  సంవత్సరాల  వరకూ  సంతానం  కలుగలేదు.  సంతానం  లేదని ఎంతో  బాధపడేవారు.  వాళ్ళు    ఎంతో  డబ్బు  ఖర్చుపెట్టి  వైద్య  సలహాలను  పాటించారు.



ఒకసారి   సంతానఫలమంత్రాన్ని  వాళ్ళకు  పంపించాను.  తరువాత  వాళ్ళకు  బాబు పుట్టాడు.  వాళ్ళు  ఎంతో సంతోషంగా  ఆ  విషయాన్ని  నాకు   తెలియజేశారు.  ఆమె  సంతానఫలమంత్రాన్ని  చదువుకుందట. ఆ  విషయాన్ని  నాకు  తెలియజేసింది.



ఇందులో  నేను  చేసింది  తక్కువ.  వాళ్ళు  చేసుకున్న  పూజలు పుణ్యాల  వల్ల  సంతానఫలమంత్రం  వారికి  అందటం  జరిగి   దైవానుగ్రహం  వల్ల   సంతానాన్ని  పొందారు. 


మా  బంధువులలో  ఇంకొక  ఆమెకు  కూడా  ఈ  సంతాన  ఫల మంత్రం  చదువుకున్న  తరువాత  అంతకుముందు   ఉన్న  ఇబ్బంది  తొలగి  సంతానం  కలిగింది.   అంతా  దైవం  దయ. 


ఇవన్నీ   నాకు  ఎంతో  సంతోషాన్ని  కలిగించాయి .  అంతా  దైవం  దయ. 
..............

ఇంకొక  విషయం .. నిన్ననే  వ్రాయాలనుకుని  మర్చిపోయి  ఇప్పుడు  వ్రాస్తున్నానండి.

  ఈ  సంతానఫలమంత్రాన్ని  ఇంతకు  ముందే  రెండు సార్లు  బ్లాగులో  వేసాను.

 అయితే,   అప్పుడు   విషహారేతి చ.....  అన్న  దగ్గర  విహహారేతి చ ......... అని  వేయటం  జరిగింది.  ఇలా     ఎలా  జరిగిందో  ?  నాకు  తెలియదు. 


( చిత్రమేమిటంటే ,  ఎంత  జాగ్రత్తగా  ఉన్నా  కొన్నిసార్లు  పొరపాట్లు  జరుగుతుంటాయి.)

ఈ  మంత్రాన్ని  మళ్లీ  వేయాలనిపించి  చూస్తే  జరిగిన  పొరపాటు  కనిపించింది .
  పొరపాటును   సరిదిద్దాను.




Monday, June 9, 2014

సంతాన ఫల మంత్రం..


సంతానం లేకపోవడానికి నాగదోషం లేదా సర్పదోషం కారణమని అంటారు.

ఈ నాగదోషం తొలగాలంటే గర్భం ధరించిన నెలలోపులో లేదా గర్భధారణకి పూర్వమే అయినా ఈ క్రింది శ్లోకాన్ని రోజూ స్నానం చేశాక ముమ్మారు పఠించాలి. ఇలా చదివితే తప్పక 108 రోజుల్లో నాగదోషం తొలగుతుందన్నది అనుభవంలో ఉన్న సత్యం.

చక్కని సంతానం కలిగారన్నది వాస్తవం.

ఏ నిత్య నివేదనలూ నియమాలూ లేవు. 108 వ రోజు చదవటం పూర్తయ్యాక నువ్వుల చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఆ మంత్రం లాంటి శ్లోకం ఇదిగో,


జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ .

వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా ..

జరత్కారుప్రియాస్తీకమాతా విషహారేతి చ .

మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా ..

ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ .

తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్యచ.

పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు వంటివి  ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



Tuesday, June 3, 2014

ఆయుర్వేదం ఎంతో గొప్పది.


కొన్ని  సంవత్సరాల  క్రితం  మా  నాన్నగారు  ఇల్లు  కట్టించే  సమయంలో  పై  నుంచి  క్రింద  పడ్డారు.   ఎత్తు  నుంచి   క్రింద  పాతి  ఉన్న  ఇనుపచువ్వల  పైన  పడటం  వల్ల    ప్రక్కటెముకలు  కొన్ని  దెబ్బతిన్నాయట.  



 ఆయుర్వేద  వైద్యుని  సంప్రదించగా  కొన్ని  మందులు  ఇచ్చారట.  విరిగాయనుకున్న  ఎముకలు   కొన్ని  రోజులలో    అతుక్కున్నాయట. 



(  అందరినీ    శ్రమపెట్టడం  ఎందుకని , జరిగిన   విషయాలను  మాకు  ఎవరికీ  వెంటనే    చెప్పకుండా  కొన్ని  రోజుల  తరువాత  తెలియజేసారు.    )



పెద్దపెద్ద  కట్లు, బోలెడు  డబ్బు  ఖర్చు  లేకుండానే    ఆశ్చర్యకరంగా  ఆయుర్వేద  మందులతో  అంత  పెద్ద  దెబ్బలు   తగ్గిపోయాయి.



ఆయుర్వేదం   ఎంతో  గొప్పది.   పూర్వకాలంలో   సుశ్రుతుడు  వంటి   ఆయుర్వేదవైద్యులు  శస్త్రచికిత్సలు  కూడా  చేసేవారట.  


ఉదా..యుద్ధాలలో  గాయపడ్డ  సైనికులకు  శస్త్రచికిత్సలు  చేయటం  వంటివి.


పూర్వకాలంలో   ఇప్పటిలా  రోగాన్ని  కనుగొనటానికి  స్కానింగులు  వంటివి  లేకపోయినా ,  రోగి  యొక్క  ముఖాన్ని  పరిశీలించి  లేక  రోగలక్షణాలను    బట్టి   చక్కగా  రోగనిర్ధారణ  చేసే  గొప్ప  వైద్యులు  ఉండేవారట.



 మన  దురదృష్టం  వల్ల  ఆయుర్వేదాన్ని  ఎంతో  నిర్లక్ష్యం  చేశాం.  ఇప్పుడిప్పుడే  మళ్ళీ   ఆయుర్వేదం,  యోగా  వంటి   వాటిపట్ల    ఆసక్తి  పెరుగుతోంది.  ఇది  మంచి  పరిణామం.



Monday, June 2, 2014

పెద్దవాళ్ళు చేసిన పుణ్యఫలం పిల్లలకు కూడా వస్తుందంటారు.

 
 
మా  తల్లితండ్రికి   చేతనైనంతలో   ఇతరులకు  సహాయం  చేయాలనే  తపన  ఎక్కువ.

తోటివాళ్ళు  బాధపడుతుంటే  ..  మనకు  చేతనైనంతలో  సాయం  చేయాలి .  అంటారు. 

మా  చిన్నతనంలో    మా  ఇంటికి  బంధువులు,  పరిచయస్తులు  ఎక్కువగా  వస్తుండేవారు.

(   అందులో  కొందరు ,   కష్టాలలో  ఉన్నామని  చెప్పి    ధన  సహాయాన్ని  పొంది , తీసుకున్న  డబ్బును    మళ్ళీ  తిరిగి   ఇచ్చేవారు  కాదు. మరి  కొందరయితే   మాట  సాయాన్ని  పొందిన తరువాత,    వాళ్ళు  చేసిందేముంది..అని  తేలికగా  మాట్లాడేవారు. )


  మా  అమ్మగారికి  పనివత్తిడి  ఎక్కువగా  ఉండేది.   వచ్చిన  వాళ్ళకు  ఫలహారాలు,  భోజనాలు  వండి  పెట్టి  స్కూలుకు   ఉద్యోగానికి   వెళ్ళేవారు.  



 మా  నాన్నగారి  బంధువులు,   మా  అమ్మ గారి   బంధువులు  అనే  తేడా  లేకుండా  ఇరుప్రక్కల  వారికి    మా  పేరెంట్స్  ఎంతో  సహాయం  చేసారు. 



 తోటి వారికి  సహాయం  చేస్తే  దైవం  మనకు  సహాయం  చేస్తారని  మా  పేరెంట్స్   అభిప్రాయం.  


 పెద్దవాళ్ళు  చేసిన  పుణ్యఫలం  పిల్లలకు  కూడా   వస్తుందంటారు.    ఈ  రోజు  మేము  మంచిగా   జీవిస్తున్నామంటే  దాని  వెనుక    మా  పేరెంట్స్  చేసిన  పుణ్యకార్యాల  ఫలితం  ఎంతో  ఉన్నది.


Sunday, June 1, 2014

కాలకృత్యాలను ఆపుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు....

 
 
ఇంతకు  ముందు  టపాలో  కొన్ని  విషయాలను  వ్రాసాను.  కొనసాగింపుగా  ఈ  విషయాలను  వ్రాస్తున్నాను. 

 మా  పేరెంట్స్  వేరే  రాష్ట్రంలో  ఉంటున్నారు.    బంధువుల  ఇళ్ళలో    ఫన్క్షన్లు ,  ఇంకా  కొన్ని      కారణాల  వల్ల     అక్కడకు  
ఇక్కడకు  తరచూ   ప్రయాణాలు  చేస్తూ  ఉంటారు. 


  మన  రైళ్ళలో   టాయిలెట్స్  విపరీతమైన  గబ్బు  కొడుతుంటాయి  కదా  !  అందువల్ల,   ట్రైన్  ఎక్కితే  ఇక  దిగే  వరకూ  కొన్ని  గంటలు   అయినా  సరే,   బాత్రూం  కు  వెళ్ళటానికి  మా  అమ్మగారు  అంతగా  ఇష్టపడరు. 



 బస్సు  ఎక్కితే  మరీ   ఇబ్బంది.   బస్సు   మనకు  అవసరమైనప్పుడల్లా   ఆపరు  కదా  ! బస్టాండ్లలో  టాయిలెట్స్   కూడా  అశుభ్రంగానే  ఉంటాయి.

....................................

మా  నాన్నగారు    ప్రభుత్వ  ఉన్నత  పాఠశాలలో  ఉపాధ్యాయునిగా  చేసి  రిటైర్  అయ్యారు.

 మా  అమ్మగారు    గర్ల్స్  హైస్కూల్   టీచర్ గా  చేసి  వాలంటరీ  రిటైర్మెంట్  తీసుకున్నారు. ( బాలికల  ప్రభుత్వ  పాఠశాలలో   పిల్లలకు   ఆటలు , వ్యాయామం ,  డ్రిల్ ... నేర్పించేవారు. )


 మా  అమ్మగారు   ఉద్యోగం  చేసే  రోజుల్లో  ,  ఉదయం  స్కూల్ కు  వెళితే  తిరిగి  సాయంత్రం  ఇంటికి  వచ్చేవరకూ  టాయిలెట్  వెళ్ళేవారు  కాదట. 

 ఇదంతా  ఎందుకు  వ్రాశానంటే  ,  ఇలా  కాలకృత్యాలను  ఆపుకోవటం  వల్ల  కూడా  కిడ్నీలు  పాడయ్యే  అవకాశాలు  ఉన్నాయట. 

...........................................


ఇంతకు  ముందు  మాకు  కిడ్నీ  జబ్బు  గురించి    ఏమీ  తెలియదు. అక్కడ  హాస్పిటల్స్ లో  చూస్తే  చాలా  మంది  ఈ  వ్యాధితో  బాధపడేవాళ్ళున్నారు.  


చిన్నవయస్సు  వారికి  కూడా  ఈ  వ్యాధి  వస్తుందట.
.......................

 ఈ  రోజుల్లో  స్కూళ్ళలో  పిల్లల్ని  టాయిలెట్ కు  కూడా  పంపకుండా    వరసగా   గంటల  తరబడి  చదువు    చెబుతున్న  టీచర్లు  ఉన్నారు.  



 అర్జంటుగా  టాయిలెట్ కు  వెళ్ళాలి  పర్మిషన్  ఇవ్వండి  టీచర్  ...ప్లీజ్  !  అని   పిల్లలు  ప్రాధేయపడినా  పర్మిషన్  ఇవ్వకుండా ...


టాయిలెట్కు   తరువాత  వెళ్దువు .. కూర్చుని  పాఠం  విను ... అనే  టీచర్లూ  ఉంటారు.

ఇలాంటి   టీచర్లు  ఏమంటారంటే,  కొందరు  పిల్లలు   క్లాస్  నుంచి  బయటకు  వెళ్ళటం  కోసం  టాయిలెట్  అని  అడుగుతారు.  అంటారు.  అయితే    అందరు  పిల్లలూ    అలా  ఉండరు  కదా  !



నిజంగా  టాయిలెట్  వెళ్ళవలసిన  పిల్లల్ని   అర్జంటుగా   పంపకపోతే  పిల్లలు  ఎలా  ఆపుకోగలరు  ?  ఆపుకోలేక  క్లాస్ రూములో    చేస్తే   మళ్ళీ  పిల్లల్నే  తిట్టేస్తారు. 

................................


చాలా  కాలేజీల్లో  కూడా    సరైన  టాయిలెట్స్  ఉండక  ఎందరో  టీనేజ్  పిల్లలు  ఇబ్బందులను   అనుభవిస్తున్నారు. 


 ఇక  హాస్టల్స్  లో  ఉండే  పిల్లలకు  ఉదయం  టాయిలెట్స్  ఖాళీ  ఉండక   అలాగే  కాలేజీలకు  వచ్చేస్తుంటారట.

ఇందువల్ల  భవిష్యత్తులో  కిడ్నీ  ప్రాబ్లెంస్  వచ్చే  అవకాశముంది.

....................................


మాకు  తెలిసిన  ఒకామె  బాంకులో  జాబ్  చేసేది.  ఆమెకు   కిడ్నీ   జబ్బు  బాగా  ముదిరే  వరకూ    తెలుసుకోలేకపోయారు.

 ఈ  రోజుల్లో  చాలామంది  ఉద్యోగినులు     ఆఫీసుల్లో  సరైన    టాయిలెట్   సదుపాయాలు  లేక  కాలకృత్యాలను  ఆపుకుని  జబ్బులు    తెచ్చుకుంటున్నారు.  


ఇంట్లో  ఉండే  ఆడవాళ్ళు  కూడా  కొందరు  పూజలు  అంటూ  కాలకృత్యాలను  ఆపుకుంటారు.  


 కారణాలు  ఏమైనా ,   కాలకృత్యాలను  బలవంతంగా  ఆపుకోవటం  వల్ల  జబ్బులు  వచ్చే  అవకాశాలున్నాయంటున్నారు  .


..........................................

 
కాలకృత్యాలను   ఆపుకోవటం   ఆరోగ్యానికి  మంచిది  కాదు  కాబట్టి ,  ఈ  విషయంలో  అందరూ  జాగ్రత్తలు   తీసుకోవాలి. 

.................................................

ఇంతకు  ముందు  టపా........
బాధాకరమైన సంఘటన ...తద్వారా మంచి జరగటము ...

*********
 
ఈ రోజుల్లో చంటిపిల్లలకు డయపర్స్ వేస్తున్నారు. పాతకాలంలో డయపర్స్ వాడేవారుకాదు. కాటన్ తో డయపర్లా చేసి పిల్లలకు కట్టేవారు. వాటిని మారుస్తూ ఉండేవారు. అవి ఎక్కువ బరువు ఉండవు. ఆధునిక డయాపర్లు చాలాసార్లు తడిస్తే తప్ప మార్చరు. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళినప్పుడు  అవి బరువెక్కుతాయి. చంటిపిల్లలు అలాగే నడుస్తుంటారు. ఈరోజుల్లో చాలామంది పెద్దవాళ్లకు పిల్లలకు డయాపర్లు మార్చే సమయం కూడా లేదు కాబట్టి వాళ్లను అలా ఉంచేస్తారు. ఏం చేస్తాం? పరిస్థితి అలా మారిపోయింది.  కాటన్ డయపర్లు మార్కెట్లో అమ్ముతున్నారట. వాటిని వేసినా కొంతలోకొంత మంచిది.


 ఆధునిక డయాపర్స్ ఎక్కువసేపు పిల్లలకు వేయటం వల్ల పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది. స్త్రీలు నెలసరిసమయంలో వాడే నాప్కిన్స్ కే ఇబ్బందిపడుతారు. పిల్లలు ఏమీ చేయలేరుకదా..తమ బాధను చెప్పలేరు కాబట్టి  వాళ్ళకు అలా వేస్తున్నారు. ఎప్పుడైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు అలా వేయవచ్చు కానీ, 24 గంటలు వేయటం మంచిదికాదు. మంచాలు తడవకుండా పైన బొంత వేయవచ్చు. పాత కాటన్ చీరలు, దుప్పట్లు వంటివాటితో మెత్తటి బొంతలా కుట్టి, దానిని డబల్ కాట్ పైన వేయవచ్చు. పిల్లలు కొంత పెద్దయ్యాక ఆ బొంతను పడేయవచ్చు.