koodali

Monday, June 2, 2014

పెద్దవాళ్ళు చేసిన పుణ్యఫలం పిల్లలకు కూడా వస్తుందంటారు.

 
 
మా  తల్లితండ్రికి   చేతనైనంతలో   ఇతరులకు  సహాయం  చేయాలనే  తపన  ఎక్కువ.

తోటివాళ్ళు  బాధపడుతుంటే  ..  మనకు  చేతనైనంతలో  సాయం  చేయాలి .  అంటారు. 

మా  చిన్నతనంలో    మా  ఇంటికి  బంధువులు,  పరిచయస్తులు  ఎక్కువగా  వస్తుండేవారు.

(   అందులో  కొందరు ,   కష్టాలలో  ఉన్నామని  చెప్పి    ధన  సహాయాన్ని  పొంది , తీసుకున్న  డబ్బును    మళ్ళీ  తిరిగి   ఇచ్చేవారు  కాదు. మరి  కొందరయితే   మాట  సాయాన్ని  పొందిన తరువాత,    వాళ్ళు  చేసిందేముంది..అని  తేలికగా  మాట్లాడేవారు. )


  మా  అమ్మగారికి  పనివత్తిడి  ఎక్కువగా  ఉండేది.   వచ్చిన  వాళ్ళకు  ఫలహారాలు,  భోజనాలు  వండి  పెట్టి  స్కూలుకు   ఉద్యోగానికి   వెళ్ళేవారు.  



 మా  నాన్నగారి  బంధువులు,   మా  అమ్మ గారి   బంధువులు  అనే  తేడా  లేకుండా  ఇరుప్రక్కల  వారికి    మా  పేరెంట్స్  ఎంతో  సహాయం  చేసారు. 



 తోటి వారికి  సహాయం  చేస్తే  దైవం  మనకు  సహాయం  చేస్తారని  మా  పేరెంట్స్   అభిప్రాయం.  


 పెద్దవాళ్ళు  చేసిన  పుణ్యఫలం  పిల్లలకు  కూడా   వస్తుందంటారు.    ఈ  రోజు  మేము  మంచిగా   జీవిస్తున్నామంటే  దాని  వెనుక    మా  పేరెంట్స్  చేసిన  పుణ్యకార్యాల  ఫలితం  ఎంతో  ఉన్నది.


6 comments:

  1. శిపాపం గురు వ్రజేత్ అని నానుడి. పెద్దల పాపపుణ్యాలు పిల్లలైకి సంక్రమిస్తాయంటారు.

    ReplyDelete

  2. ఈ పెద్ద వాళ్ళ పాప పుణ్యాలు గట్రా పిల్లకు రావండోయ్ ! ఎవరికీ వారే యమునా తీరే !

    దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్ ...

    జిలేబి

    ReplyDelete

  3. మీ వ్యాఖ్యలను ఇప్పుడే చూసానండి. వ్యాఖ్యానించినందుకు kastephale శర్మ గారికి, జిలేబి గారికి కృతజ్ఞతలండి.

    ఒకరేమో పెద్దల పాపపుణ్యాలు పిల్లలకు సంక్రమిస్తాయన్నారు. ఒకరేమో పెద్ద వాళ్ళ పాప పుణ్యాలు పిల్లలకు రావంటున్నారు. ఇద్దరి అభిప్రాయాలూ నిజమే అనిపిస్తోంది.

    పెద్దలు చేసిన పాపపుణ్యాలు పూర్తిగా కాకపోయినా కొంతవరకూ పిల్లలకు సంక్రమిస్తాయనుకోవచ్చు.

    లోకంలో పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులను పిల్లలు తీసుకుంటారు. పెద్దవాళ్ళు చేసిన అప్పులను కూడా పిల్లలు తీర్చవలసి ఉంటుంది.

    పెద్దవాళ్ళ ఆస్తులు, అప్పులలో పిల్లలకు భాగం ఉన్నట్లు, పెద్దవాళ్ళ పాపపుణ్యాలలో కొంతభాగం పిల్లలకూ సంక్రమిస్తాయనిపిస్తోంది.

    రావణాసురుడు చేసిన పాపాల వల్ల అతని పిల్లలూ ప్రాణాలను కోల్పోయారు. మంచివారైన సీతారాములు కష్టాలను అనుభవించినా వారి సంతానం చక్కగా జీవించి రాజ్యపాలన చేసారు .

    ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తుందంటేనండి, పిల్లల క్షేమం కోరుకునే పెద్దవాళ్ళు పాపాలు చేయకూడదు అనిపిస్తోంది.

    ReplyDelete
  4. "రావణాసురుడు చేసిన పాపాల వల్ల అతని పిల్లలూ ప్రాణాలను కోల్పోయారు"

    అవునా! మరి, హిరణ్యకశిపుడు/ప్రహ్లాదుడు కధేంటి తేడాగుంది? ఎక్కడో లాజిక్కు మిస్సయినట్టుందే?

    నాకు ఇంకో డౌటు… ఈ పాపపుణ్యాలు ఓన్లీ తల్లితండ్రులనించి పిల్లకేనా లేక భర్త నుంచి భార్యకి, భార్య నించి భర్తకి సంక్రమించే సదుపాయం కూడా ఉందా? మరి తోబుట్టువుల పరిస్థితి ఏమిటి?

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    చిత్రమేమిటంటే, పైన వ్రాసిన టపాలో ప్రహ్లాదుని గురించి కూడా వ్రాయాలని అనుకున్నాను. మళ్ళీ వ్రాయకుండా ఊరుకున్నాను. మీరు ప్రహ్లాదుని గురించే వ్యాఖ్యానించారు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

    నాకు తోచినంతలో ....................

    ప్రహ్లాదుని విషయంలో గమనిస్తే , హిరణ్యకశిపుడు ఎన్నో పాపాలు చేశాడు. ప్రహ్లాదుడు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. తండ్రి అయిన హిరణ్యకశిపుడే కుమారుని మంటలలో తోయించటం, ఏనుగులతో త్రొక్కించటం..వంటివి చేయించాడు.

    మరి ఇవన్నీ తండ్రి అయిన హిరణ్యకశిపుని పాపపు బుద్ధి వల్ల కుమారుడైన ప్రహ్లాదుడు ఎదుర్కొన్న కష్టాలే కదా !

    అయితే, ఇక్కడ ఏం జరిగిందంటే, దైవాన్ని ఆశ్రయించటం వల్ల ప్రహ్లాదుడు తండ్రి వల్ల కలిగిన కష్టాల నుంచి సురక్షితంగా తప్పించుకున్నాడు.
    .........................................

    శ్రీ హరిని నిందించమని తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఆదేశించాడు. అయితే, ప్రహ్లాదుడు ధర్మాన్ని తప్పలేదు. దైవాన్ని శరణువేడిన ప్రహ్లాదుడు సురక్షితంగా ఉండి రాజ్యాన్ని ఏలాడు.

    సీతాదేవిని అపహరించిన తరువాత శ్రీ రామునితో జరిగిన యుద్ధంలో పాల్గొని తండ్రి అయిన రావణాసురుడికి సహకరించి రావణాసురుని పుత్రులు ప్రాణాలను కోల్పోయారు.


    ReplyDelete
  6. నాకు తెలిసినంతలో, తల్లితండ్రులు చేసిన పాపపుణ్యాలలో కొంతభాగం పిల్లలకు సంక్రమిస్తాయంటారు.

    ( ఎవరి పూర్వ జన్మ పాపపుణ్యాలు వారికి ఎటూ ఉంటాయి + తల్లితండ్రులు చేసిన పాపపుణ్యాలలో పూర్తిగా కాకున్నా , కొంతభాగం పిల్లలకు సంక్రమిస్తాయనుకుంటున్నాను. )

    నాకు తెలిసినంతలో, భర్త చేసిన పాపాలు భార్యకు రావట. కానీ, భర్త చేసిన పుణ్యాలలో మాత్రం భార్యకు సగభాగం వాటా సంక్రమిస్తాయట.

    ( ప్రాచీనులు స్త్రీలకు అన్యాయం చేసారని కొందరు గోలపెడతారు కానీ, స్త్రీలకు ఎంత వెసులుబాటును ఇచ్చారో తెలుస్తోంది కదా ! )

    తోబుట్టువుల పరిస్థితి గురించి నాకు తెలియదు. తోబుట్టువుల ఆస్తిపాస్తులు ఒకరికొకరికి సంక్రమించవు కదా ! అలాగే పాపపుణ్యాలూ సంక్రమించవేమో ?


    ReplyDelete