చాలాకాలం తరువాత ఇక్కడ ఉన్న పాతపోస్ట్ తీసి, ఈ పోస్టును వ్రాసి ఇక్కడ ప్రచురించటం జరిగిందండి.
****************
కొందరు ... గ్రంధాలలోని విషయాల గురించి వాళ్ళకు తోచినట్లు చెబుతున్నారు.
గ్రంధాలలో కొన్ని విషయాలు ...ఉదా..ఎవరైనా స్త్రీలు, కోరి పరాయి పురుషుల వద్దకు వస్తే, వారిని తిరస్కరించకుండా ఆ స్త్రీ కోరికను పురుషుడు తీర్చాలని ఉన్నదట.
ఇంటికి వచ్చిన అతిధి ఇంటి ఇల్లాలిని కోరుకుంటే, ఆమెను ఆ అతిధి వద్దకు పంపించాలని ఉన్నదని కొందరివ్యాఖ్యలను చదివాను.ఉదా..ప్రాచీనకాలంలో శ్వేతకేతు కధలోని విషయాలు.
ఇవన్నీ మూఢనమ్మకాలే. గ్రంధాలలో ఇలాంటి సంఘటనలను కొందరు చేర్చి ఉండొచ్చు. గ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని అందరికి తెలుసు. కొందరు తమకు నచ్చిన విషయాలను గ్రంధాలలో వ్రాసి ప్రక్షిప్తాలు చేశారనిపిస్తుంది.
ఇలాంటివాటిని ప్రోత్సహిస్తే, ఇవన్నీ ఉదాహరణగా చూపుతూ కొందరు స్త్రీలు, పురుషులు విచ్చలవిడిగా తిరుగుతారు. అందువల్ల, ఇలాంటి విషయాలను సమర్ధించకూడదు.
ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలకు సంసారం చేయడానికి మాత్రం.. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి..అంటూ అనేక ఆంక్షలు చెబుతారు. అక్రమసంబంధాలుగా ఉన్న వాటికి మాత్రం సరైనదే అంటూ సమర్ధించటం ఏం న్యాయం?
ప్రాచీనకాలంలో కొందరు కొంతకాలం ఇలాంటి ఆచారాలను పాటించినట్లు, కాలక్రమేణా ఈ ఆచారవ్యవహారాలను సంస్కరించుకుని, పాటించటం మానేసినట్లు చెబుతున్నారు. ఏకపత్ని, ఏకపతి ...పద్ధతులను పునరుద్ధరించి ఉండవచ్చు.
కొందరు గొప్పవారు కూడా కొన్ని మూఢనమ్మకాలను పాటించినట్లు అనిపిస్తుంది.కొందరు కొన్ని విషయాలలో ఎంతగొప్ప అయినాకూడా, కొన్ని బలహీనతలు ఉంటాయి, కొందరికి కొన్ని బలహీనక్షణాలలో పట్టుతప్పవచ్చు.
వేదాల్లో ఏకపత్ని, ఏకపతి...గురించిన విషయాలున్నాయట...
మన వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది. భార్యను " అర్ధాంగి ' అంటారు. అంటే భర్తలో సగభాగం అని అర్ధం. వివాహం తరువాత భార్యాభర్తల శరీరాలు వేరైనా వారు ఒకటే . అని పెద్దలు చెబుతారు కదా !
ఒకరికొకరు అర్ధభాగాలైన భార్యాభర్తల జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించటం జరగదు. పెద్దలు ఏర్పరిచిన వివాహమంత్రాలు, నాతిచరామి...వీటిని పరిశీలిస్తే పెద్దల అభిప్రాయం మనకు తెలుస్తుంది.
ఇవన్నీ గమనిస్తే బహువివాహాలను పెద్దలు సమర్ధించలేదనిపిస్తుంది. ( అయితే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అంటే, భార్య మరణించినప్పుడు, భార్య ఇతరులను వివాహం చేసుకున్నప్పుడు...ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వేరొక వివాహం చేసుకోవచ్చేమో..)
పురాణేతిహాసాల్లో ఎక్కువవివాహాలు చేసుకున్న వారి గురించిన విషయాలున్నాయి. వారు అలా చేసుకోవటానికి వెనుక ఎన్నో కారణాలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ( అవన్నీ గమనించి మనం జీవితంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దల అభిప్రాయం కావచ్చు.)
పర స్త్రీ తల్లి వంటిదని పెద్దలు చెప్పటం జరిగింది. అలాంటప్పుడు, ఇంటికి వచ్చిన అతిధి , ఇల్లాలిని కోరుకోవటాన్ని పెద్దలు అస్సలు సమర్ధించరు. అతిధి మర్యాదలకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా !
ఎవరు కోరుకుంటే వారి కోరికలు తీర్చాలంటే ఇక వివాహవ్యవస్థ ఎందుకు? కుటుంబవ్యవస్థ ఎందుకు?
వివాహం మరియు కుటుంబవ్యవస్థకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిన వ్యవస్థ మనది.
అందువల్ల, ఇలాంటి మూఢనమ్మకాలను, ప్రక్షిప్తాలను గుర్తించి వదిలిపెట్టాలి. అంతేకానీ, వాటిని సమర్ధించి.. పాటించాలనుకుంటే కుటుంబవ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. హత్యలు, ఆత్మహత్యలు జరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. గ్రంధాలలో ఉన్నాయి కాబట్టి, వాటిని ఎలాగైనా బలపరచాలనుకోవటం తప్పు.
సనాతనధర్మం మూఢత్వాన్ని, విచ్చలవిడితనాన్ని.. ఒప్పుకోదు.
*********************
కధలో, దైవము భక్తులను కఠినంగా పరిక్షించినట్లు చెబుతారు. ఉదా...దైవము మనిషి రూపంలో అతిధి లా వచ్చి, వారి కొడుకుని చంపి మాంసం కూర వండిపెట్టమని ఒక కధలో ఉంది.
ఎవరైనా స్వార్ధపరులు, తెలిసితెలియనివాళ్లు ఇలా ప్రక్షిప్తాలను చేసారేమో?
ద్వేషాలతో కొందరు కొన్ని కల్పితాలను కల్పించి గ్రంధాలలో చొప్పించారేమో? అనిపిస్తుంది.
భక్తులకు కష్టాలొస్తే కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తారు. మరి, దైవం ఇలా ఎక్కడైనా అడుగుతారా? మనుషులు చేసిన పనుల వల్ల మనుషులకు కష్టాలు వస్తాయి కాని, దైవము కష్టపెట్టరు.
ఈ కధలో చిన్న అబ్బాయిని చంపి మాంసం వండటం.. విషయాలను వింటే చాలా బాధ కలుగుతుంది.
అయితే, కొందరు మనుషులు పశుపక్ష్యాదులను
చంపితింటారు.
అయితే, కొందరు మనుషులు పశుపక్ష్యాదులను చంపితింటారు. పశుపక్ష్యాదులకు కూడా ప్రేమలుంటాయి. తమ బిడ్దలను మనుషులు చంపినప్పుడు వాటి పేరెంట్స్ బాధపడతాయి. తమ పేరెంట్స్ ను చంపి తిన్నప్పుడు వాటి పిల్లలూ బాధపడుతాయి.పశుపక్ష్యాదులకు కూడా ప్రాణభయం, బాధ ..ఉంటాయి.
కొందరు అనేక పాపాలు చేసి తమ పాపాలు పోవాలని, ఎన్నో కొబ్బరికాయలు కొట్టడం,బంగారపు నగలు దేవాలయాలకు సమర్పించటం..వంటివి చేస్తారు.
సృష్టిని, సృష్టిలో బంగారపు గనులనే సృష్టించిన దైవానికి అవి ఒక లెక్కా..మనుషుల్లో ధర్మబుద్ధిని దైవము మెచ్చుకుంటారు. దైవభక్తిని కలిగి ధర్మబుద్ధితో జీవించటానికి ప్రయత్నిస్తే దైవకృపను పొందగలరు.
******************
******************
ఈ మధ్య ఒక దగ్గర ఒక తండ్రి తన కూతురుతో తప్పుగా ప్రవర్తించాడని..ఆ వార్త క్రింద కామెంట్స్ చూసాను....
చాలామంది ఆ తండ్రిని తిట్టారు. కొందరు మాత్రం ఏం రాసారంటే, బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతిని వివాహం చేసుకున్నాడు కదా..అని అన్నట్లు రాసారు.
శ్రీదేవీభాగవతములో ఏమని ఉందంటే.. అమ్మవారు, బ్రహ్మ.. విష్ణు.. మహేశ్వరులకు, సరస్వతిదేవి.. లక్ష్మిదేవి..పార్వతిదేవిలను భార్యలుగా ఇచ్చారని ఉంది.
గ్రంధాలలో ఒక దగ్గర, బ్రహ్మ సరస్వతిదేవిని (ఈమెకు ఇంకో పేరు కూడా ఉందట..) వివాహం చేసుకున్నందుకు..శివుడు బ్రహ్మయొక్క అయిదవ తలను ఖండించారని ఉందట.
ఇంకోదగ్గర, బ్రహ్మ..విష్ణు మధ్య సంవాదం వల్ల కూడా బ్రహ్మయొక్క అయిదవ తలను ఖండించారని ఇంకో గ్రంధంలో ఉందట.
ఎవరైనా మగవారు తన భార్యతో పొందిన సంతానమైన కూతురుతో తప్పుగా ప్రవర్తిస్తే అది తప్పవుతుంది. అంతేకానీ, ఒక శిల్పాన్నో, పెయింటింగునో వేసి, దానికి ప్రాణం పోసి భార్య చేసుకుంటే ఆమె కూతురు అవదు.
సరస్వతిదేవి బ్రహ్మ తన భార్యతో పొందిన కూతురు కాదు. సరస్వతి బ్రహ్మచెక్కిన శిల్పం కావచ్చు....
అంతరార్ధాలు ఏమిటో తెలియదు కాని, దేవతల గురించి ఏదోగా అనుకోనవసరం లేదు. ఎంత గొప్పవారికైనా కర్మఫలితం ఉంటుందన్నట్లు... కధల ద్వారా మనకు నేర్పించారు అనుకోవాలి.
దేవతలకు మనుషుల్లాంటి శరీరాలుండవు. దేవతలంటే శక్తులు. దేవతల విషయంలో మనుషుల్లా ఆలోచించకూడదు.
****************
గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలున్నాయి. ముఖ్యంగా అభ్యంతకరంగా ఉండే విషయాలను తొలగించితే బాగుంటుందనిపిస్తుంది.
గ్రంధాలలో రకరకాలుగా ఉన్నప్పుడు, ఏది ఏమిటో? తెలియనప్పుడు, అభ్యంతకరంగా ఉన్న విషయాలను.. గ్రంధాలనుంచి తొలగించటం మంచిది. గ్రంధాలను కొత్తగా ప్రచురించినప్పుడు ఆ విషయాలను ప్రచురించకూడదు.
తరతరాలనుంచి గ్రంధాలలో ఎవరు ఎన్నెన్ని మార్పులుచేర్పులు చేసారో తెలియదు. కొందరు స్వార్ధపరులు, కొందరు తెలిసితెలియని వాళ్లు గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు చేసి ఉంటారు.
హిందుగ్రంధాలను తప్పుగా ప్రచారం చేయడం కొరకు ఎవరైనా ఇలా గ్రంధాలలో మార్పులుచేర్పులు చేసారేమో?
ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వారిదన్నట్లు ఉంది వ్యవహారం. ఇక మరెన్ని ప్రక్షిప్తాలు చేస్తారో? ప్రజలు గందరగోళంచెందకుండా ఉండాలంటే, కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
గ్రంధాలలో ప్రక్షిప్తాలు(మార్పులుచేర్పులు) చేయకుండా ఉండాలంటే, ప్రాచీనగ్రంధాలను.. కొత్తగా ఎవరైనా.. తమ ఇష్టం వచ్చినట్లు మార్పులుచేర్పులు చేసి వ్రాయకుండా ...కాపీరైట్ హక్కులు ఉండాలి.
గ్రంధాలలోని విషయాల గురించి చెప్పుకోవచ్చు, చర్చించుకోవచ్చు. కానీ, అభ్యంతకరంగా ఉండేలా విషయాలను మార్పులుచేర్పులు చేయకూడదు..
*************
ప్రక్షిప్తాలు చేసేవారు ..ప్రక్షిప్తాలు చేసేటప్పుడు జనం నమ్మటం కొరకు, దైవము కలలో కనిపించి చెప్పారనో, దైవము చెప్పారనో..ప్రక్షిప్తాలు కూడా చేస్తారేమో?
కొందరు తమకు కొన్ని కలలు వచ్చాయని చెబుతారు. కలలో దైవం కనిపించి ఏమో చేయాలని చెప్పారంటారు. ఈ కలలకు అర్ధం ఏమిటో దైవానికే సరిగ్గా తెలుస్తుంది.
కలలు..భ్రాంతులు..ఆలోచనల గురించి..ఎన్నో అభిప్రాయాలున్నాయి.
కొందరు వారికి దైవం చెప్పినట్లు భ్రాంతి చెందుతారు కానీ, నిజంగా దైవము చెప్పటం కాదని కొందరి అభిప్రాయం. ఎప్పుడో ఎక్కడో విన్న, చూసిన విషయాలు జ్ఞాపకాలలో ఉండి, అవి కలలు, భ్రాంతులుగా బయటకొచ్చే అవకాశం కూడా ఉందని కొందరంటారు.
అందువల్ల, కలలో వచ్చేవి గబుక్కున చేసేయాలని అనుకోవటం కన్నా, బాగా ఆలోచించి, ఎవరైనా తెలిసిన వారిని సంప్రదించి నిర్ణయించుకోవటం మంచిది.
**************
వ్రాసిన వాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment