మా అమ్మగారు ప్రభుత్వబాలికల పాఠశాలలో ఉద్యోగం చేసేవారు. ( చాలాకాలం ఉద్యోగం చేసిన తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. )
ఉద్యోగం చేసే స్త్రీలకు పిల్లల్ని పెంచటం విషయంలో ఇబ్బందులు ఉంటాయి కదా !
మా పేరెంట్స్ నన్ను చూసుకోవటానికి ఒక అమ్మాయిని పనిలో కుదుర్చుకున్నారట. అయితే ఆ అమ్మాయికి సరిగ్గా చూడటం చేతయ్యేదికాదట.
ఈ బాధలన్నీ ఎందుకని మా అమ్మగారి తరపు బంధువయిన ఒక బామ్మగారు మా ఊరు వచ్చేసారు. వేరే ఇల్లు తీసుకుని ఉండేవారు.
మా అమ్మగారు ఉదయం స్కూలుకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని బామ్మగారి ఇంటివద్ద వదలటం సాయంత్రం మళ్ళీ ఇంటికి తీసుకురావటం జరిగేది.
మా బామ్మగారికి పిల్లలు లేరు. అయితేనేం మమ్మల్నీ మా బంధువుల పిల్లల్నీ తన సొంత పిల్లలుగా చూసుకున్నారు.
మేము , మా బంధువుల పిల్లలం పెద్దయిన తరువాత కూడా బామ్మగారింటికి తరచూ వెళ్ళేవాళ్ళం. కాలేజీకి సెలవిస్తే బామ్మగారింటికి వెళ్ళేవాళ్ళం.
మా బామ్మగారు జోక్స్ వేసేవారు. పిల్లలం పొట్ట నొప్పి పుట్టేంతగా నవ్వే వాళ్ళం. అయితే, కొన్ని విషయాలలో స్టిక్ట్ గా కూడా ఉండేవారు. ఆమె వంట చాలా బాగా చేసేది.
ఆమె ఎన్నో నియమాలను పాటించేవారు. ఆమె ఒక దగ్గర దీక్ష తీసుకున్నారని బంధువుల ద్వారా విన్నాను.
మా బామ్మ వల్ల మేము క్రెచ్ ల లోనో లేక పనివాళ్ళ వద్దో కాకుండా ఇంటివద్దే పెరిగాము. ఆమె సుమారు 80 సంవత్సరాల వరకూ జీవించారు.
మా తాతగారునాయనమ్మగారు , మా తాతగారుఅమ్మమ్మగారు వాళ్ళు పల్లెటూరిలో ఉండేవారు. వాళ్ళు మా ఊరు వచ్చినప్పుడు ఊరి నుంచి ఎన్నో తినుబండారాలను తెచ్చేవారు.
మేము వేసవి సెలవులకు వాళ్ళ ఊళ్ళు వెళ్ళేవాళ్ళం. ఎంతో సరదాగా ఉండేది.
వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి సెలవులు ఎప్పుడిస్తారా అని సంవత్సరమంతా ఎదురుచూసేవాళ్ళం.
మా అమ్మమ్మగారి ఊరు వెళ్ళేటప్పుడు మా బామ్మగారు (మా తాతగారికి అక్క ( మా అమ్మకు మేనత్త ) ) కూడా వచ్చేవారు.
No comments:
Post a Comment