koodali

Tuesday, June 24, 2014

శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము ..శిరిడి సాయిబాబా..

 


శ్రీ పాద శ్రీ వల్లభ  సంపూర్ణ చరితామృతము  ..అనే  గ్రంధములో ( 45 వ అధ్యాయము లో ..)  శిరిడి  సాయిని  గురించిన  వివరములు   ఉన్నాయి.  

ఈ  గ్రంధమునకు  కాపీరైట్స్  ఉన్నవి.  అందువల్ల  ఇప్పుడు  అందులోని  విషయములను  వ్రాయటానికి  కుదరకపోవచ్చు.  ఈ  గ్రంధము  పిఠాపురములో   కూడా  లభిస్తుంది.

...........................


 ఇంతకు  ముందు  వ్రాసిన  టపాను  తిరిగి  ప్రచురిస్తున్నాను.. 


గతజన్మ పాపఫలితములనుండి భక్తులను కాపాడిన సంఘటనలు .....

తెండూల్కర్ కుటుంబము.

బాంద్రాలో తెండూల్కర్ కుటుంబముండెను. ఆ కుటుంబము వారందరు బాబా యందు భక్తి కలిగియుండిరి.

సావిత్రీబాయి తెండూల్కర్ , "శ్రీ సాయి భజనమాల " యను మరాఠీ గ్రంధమును 800 అభంగములు , పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలన్నియు వర్ణించబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను.

వారి కుమారుడు బాబా తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను.


కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును జూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక యా మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెననియు అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పిరి.


ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి శిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడ చెప్పెను.


ఇది విని బాబా యామె కిట్లనెను. " నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులొక ప్రక్కకు ద్రోసి , తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉతీర్ణుడగును. నాయందే నమ్మకముంచు మనుము. నిరుత్సాహము చెందవద్దనుము. "


తల్లి యింటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చొనెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను గానీ, సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొన నిష్టపడలేదు.


కాని పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాతపరీక్షలో ఉతీర్ణుడాయెననియు, నోటిపరీక్షకు రావలెననియు ఆ పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్య వచనము విని యాతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను.

గ్రహములు వ్యతిరేకముగా నున్నను, బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడాయెను.

సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును : మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో, మన ప్రయత్నములన్నియు తుదకు విజయవంతమగును.
........................................

భీమాజీ పాటీలు

పూనాజిల్లా, జున్నరు తాలూకా నారాయణ గ్రాం గ్రామమందు భీమాజీ పాటీలు 1909 వ సంవత్సరములో భయంకరమైన దీర్ఘమైన చాతీ జబ్బుతో బాధపడుచుండెను. తుదకు అది క్షయగా మారెను. అన్నిరకముల ఔషధములను వాడెను గానీ ప్రయోజనము లేకుండెను.


నిరాశ చెంది " ఓ భగవంతుడా ! నారాయణా ! నాకిప్పుడు సహాయము చేయుము. " అని ప్రార్ధించెను. మన పరిస్థితులు బాగుండువరకు మనము భగవంతుని తలచము అను సంగతి యందరికి తెలిసినదే. కష్టములు మనలను ఆవరించునపుడు మనము భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొనెదము. అట్లనే భీమాజి కూడ భగవంతుని స్మరించెను.


ఈ విషయమై బాబా భక్తుడగు నానాసాహెబు చాందోర్కరుతో సలహా చేయవలెననుకొనెను. కావున వానికి తన జబ్బు యొక్క వివరములన్నియు తెలుపుచు నొక లేఖ వ్రాసి యతని యభిప్రాయమడిగెను.


బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే యారోగ్యమునకు సాధనమని నానాచందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి శిరిడీ పోవుటకేర్పాటు లన్నియు చేసెను. అతనిని శిరిడీకి తెచ్చి మసీదులో నున్న బాబా ముందు బెట్టిరి. నానాసాహెబు శ్యామ గూడ నచ్చట ఉండిరి.


ఆ జబ్బు వాని గత జన్మలోని పాప కర్మల ఫలితమని చెప్పి, దానిలో జోక్యము కలుగజేసికొనుటకు బాబా యిష్టపడకుండెను. కానీ రోగి తనకు వేరే దిక్కులేదనియు, నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షములకై వేడుకొనెను.


" ఆగుము , నీ యాతురతను పారద్రోలుము.; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడయితే మసీదు మెట్లెక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్రహృదయుడు. వారీ రోగమును బాగుచేసెదరు. అందరినీ ప్రేమతోను దయతోనూ , కాపాడెదరు.'"


ప్రతి యయిదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున యొకసారియైనను రక్తము గ్రక్కలేదు. బాబా వానిని దయతో గాపాడెదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను.


వానిని భీమాభాయి యింటిలో బసచేయుమని బాబా జెప్పెను. అది సదుపాయమైనదిగాని, యారోగ్యమైనది గాని కాదు. కాని బాబా యాజ్ఞ దాటరానిది. అతడు అచ్చట నుండునప్పుడు బాబా రెండు స్వప్నములలో వాని రోగము కుదిర్చెను.


మొదటి స్వప్నములో వాడొక పాఠశాలా విద్యార్ధిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టుచున్నట్లు కనిపించెను.


రెండవ స్వప్నములో వాని చాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే చాల బాధ కలుగుచున్నట్లు జూచెను.


స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. అతడప్పుడు శిరిడీ వచ్చుచుండెను.


బాబా వానికి జేసిన మేలును జ్ఞప్తి యందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను.


బాబా తన భక్తుల నుండి యేమియు కాంక్షించెడివారు కాదు. వారికి కావలసినదేమన , భక్తులు పొందే మేలును జ్ఞప్తి యందుంచుకొనుటయు, మార్పు లేని గట్టి నమ్మకమును, భక్తియును.

**************

గతజన్మ పాపఫలితములనుండి భక్తులను కాపాడిన సంఘటనలు "శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణచరితామృతము " గ్రంధము మరియు " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములలో కూడా ఉన్నవి.


No comments:

Post a Comment