koodali

Wednesday, November 4, 2020

కొన్ని విషయములు.. కలశజలాన్ని నేలపై ..ఆహారంలో వెండ్రుకలు కనిపిస్తే..

 

దేవాలయాలలో పూజలు, హోమాలు జరిగినప్పుడు పూజ తరువాత కలశంలోజలాన్ని  భక్తుల శిరస్సులపై చల్లుతారు. 

అలాంటప్పుడు ఆ మంత్రజలం నేలపై పడి  ప్రజలు ఆ నీటిని త్రొక్కడం కూడా జరుగుతుంది. 

పవిత్రంగా భావించే కలశజలాన్ని అలా నేలపై విచ్చలవిడిగా పడేటట్లు చల్లటం మంచిది కాదు.

 పూజ తరువాత అందరూ తీర్ధ ప్రసాదాలు తీసుకుంటారు. తీర్ధం ఇచ్చే దగ్గర  నేలపై చిన్న పట్టా వేసి, పైన స్టూల్ వేసి, దానిపైన కలశం పెట్టి.. తీర్ధం తీసుకోవడానికి వచ్చే భక్తుల శిరస్సులపై  కలశ జలాన్ని ఆకుతో కొద్దిగా చిలకరిస్తే సరిపోతుంది.

ఒక పంతులు గారు  కలశం వద్ద ఉండి,  ఒకటి లేక రెండు మామిడాకులతో ఒక్కొక్క భక్తునిపై  కలశజలాన్ని చిలకరించవచ్చు.  ఇంకొక పంతులుగారు తీర్ధాన్ని ఇవ్వవచ్చు.

 అప్పుడు నేలపై కలశజలం పడటం.. భక్తులు త్రొక్కటం.. అంతగా జరగదు. కొద్దిపాటి జలం పడినా అంతవరకూ తుడిచేస్తే సరిపోతుంది.

*********

వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తే మంచిది కాదు. 

దైవానికి నివేదించే పదార్ధాలలో వెంట్రుకలు  కనిపిస్తే ఆ పదార్ధాన్ని దైవానికి నివేదించకూడదు. 

కష్టపడి వంట చేసిన తరువాత వెంట్రుకలు కనిపిస్తే ఎంతో బాధగా ఉంటుంది. 

బంధువులెవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి వడ్డించిన భోజనంలో వెంట్రుకలు  కనిపిస్తే బాగోదు కదా..

వంట చేసేటప్పుడు   తలకు కాప్ ధరిస్తే మంచిది.  

ఇంట్లో వంట చేసేటప్పుడు స్త్రీలు జుట్టును పైకి మడిచి కట్టుకుని కాప్  పెట్టుకుంటే సులభంగా ఉంటుంది.

 పెద్ద పెద్ద హోటల్స్ లో వంటచేసే వాళ్ళు(చెఫ్ లు)ధరించే పెద్ద కాప్  ధరించాలంటే అందరికీ కుదరకపోవచ్చు. 

చిన్నగా ఉండే షవర్ కాప్  బాగుంటుంది. ఇది 100 రూపాయలకే లభిస్తుంది. చెవులు కూడా కవర్ చేస్తుంది. ఈ ప్లాస్టిక్ కాప్ ను శుభ్రం చేయటం తేలిక.

వెంట్రుకలు, గోళ్ళు .. ఆహారం ద్వారా కడుపులోకి వెళ్తే అనారోగ్యం వచ్చే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయట.

 జుట్టుకు నూనె రాసి జడ వేసుకుంటే వెండ్రుకలు ఎగిరిపడే అవకాశం తక్కువ. జుత్తు విరబోసుకున్నప్పుడు లేక తలస్నానం చేసి, జుట్టు ఆరటానికి వదిలేసినప్పుడు వెంట్రుకలు రాలిపడే అవకాశాలు ఎక్కువ.

ఇంట్లో వంట చేసేటప్పుడు స్త్రీలు రోజూ కాప్ పెట్టుకోవటం కష్టం అనుకుంటే .. తలస్నానం చేసినప్పుడు జుట్టు వదులుగా ఉండేలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని  కాప్ ధరించవచ్చు. కాప్ ధరించనప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది.

..................... 

అయితే, ఎక్కువసేపు ప్లాస్టిక్ కాప్ తలకు పెట్టుకుంటే తల వేడిగా ఉండి చెమట వస్తుంది.

అందువల్ల, పెద్ద కాటన్ కర్చీఫ్ 
(లేక స్కార్ఫ్) తలనుంచి చెవులను కప్పుతూ..కర్చీఫ్ కొనలు మెడ క్రింద వరకు రానిచ్చి వదులుగా ఒక ముడి వేయాలి. ఇలా చేయటం వల్ల వెంట్రుకలు క్రిందపడవు,  ఎంతసేపైనా చెమట పట్టదు. చెమట వచ్చినా కర్చీఫ్ పీల్చుకుంటుంది. 

 ...................

వండిన గిన్నెలపై మూతలు పెట్టకుండా నేలపై ఉంచితే.. నేలపై ఉన్న వెండ్రుకలు వచ్చి ఆహారపదార్ధంపై పడే అవకాశం ఉంది. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 తలపైనుంచి రాలిపడే వెండ్రుకలు దుస్తులపై ఉండి, వంట చేసేటప్పుడు ఆ  వెంట్రుకలు  ఆహారంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 

నోటి నుండి తుంపరలు పడకుండా నోటికి మాస్క్ కూడా ధరించవచ్చు.

************

పెద్దవయస్సు వారికి చాలామందికి నిద్ర సరిగ్గా  రాదు.రాత్రి అందరూ నిద్ర పోతుంటే తమకు నిద్ర రావటం లేదని బాధపడుతూ కూర్చుంటారు. నిద్ర బిళ్ళలు వేసుకుంటారు కొందరు. 

నిద్ర త్వరగా రావటానికి ఆయుర్వేద చిట్కాలు చెబుతున్నారు కొందరు.ఇంటర్నెట్ ద్వారా కూడా ఈ చిట్కాలను తెలుసుకోవచ్చు.

నిద్ర పట్టనప్పుడు.. కూర్చుని కాని, పడుకుని కానీ కన్నులు  మూసుకొని  దైవస్మరణ.. ధ్యానం చేస్తే పుణ్యం వస్తుంది. నిద్రకూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిద్ర రాకపోయినా ..ధ్యానం వల్ల శరీరానికి, మనస్సుకు చాలా విశ్రాంతి లభిస్తుంది.

అయితే, డీప్ మెడిటేషన్ , ప్రాణాయామం వంటివి   తెలిసిన వారి వద్ద నేర్చుకుని ఆచరించటం మంచిది. 

 దైవస్మరణ, దైవస్తోత్రాలు, భక్తిపాటలు మొదలైనవి మెల్లగా  ఎంతసేపైనా చక్కగా అనుకోవచ్చు. 

************
  ఇక, దైవం యొక్క చిత్రాలను ఎక్కడపడితే అక్కడ ప్రింట్ వేసి, తరువాత చెత్త కుప్పలలో పడవేస్తున్నారు. ఇలా చేయటం సరైనది కాదు.

న్యూస్ పేపర్లలోనూ, హారతి కర్పూరం పాకెట్ పైనా, ఇంకా అనేక చోట్ల దైవ చిత్రాలను ముద్రించటం.. తరువాత ఆ పేపర్లను, ప్లాస్టిక్ కవర్లను చెత్తలో వేయటం జరుగుతోంది. 
 ఈ విషయాన్ని ఈ బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలోనే వ్రాయటం జరిగింది. 



   విషయాలను ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా .. ఆచరణ సరిగ్గా ఉంటేనే ప్రయోజనం కలుగుతుంది.


Sunday, November 1, 2020

జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?

 Friday, April 21, 2017


 చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సుకతతో జాతకాలను చూపించుకుంటారు. జాతకం మంచిగా ఉంటే సంతోషాన్ని , ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు.

( ఈ రోజుల్లో జాతకాలు చెప్పటం సరిగ్గా తెలిసిన వారు అరుదుగా ఉన్నారు .)

ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది.
*******************

రాసిపెట్టిఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.


 దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు..

ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును  మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.

 భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని  పొందగలిగితే  మంచి జరుగుతుందని తెలుస్తుంది.

*********

జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా .. తమ చెడు ప్రవర్తనను మార్చుకుని,  దైవప్రార్ధన, పుణ్యకార్యాలు చేయటం, సత్ప్రవర్తనతో మెలగటం, ఇలాంటివి చేయటం ద్వారా రాబోయే కష్టం చాలావరకూ తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు.

పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంధాలలో కనిపిస్తాయి.

*************

ఈ రోజుల్లో కూడా ..జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనను కలిగిఉన్నప్పుడు , ప్రభుత్వం వారు , వారి శిక్షా కాలాన్ని తగ్గించి ముందే వదిలిపెట్టడం, ఒకోసారి శిక్షను రద్దు చేయటం జరుగుతోంది కదా!

************
భగవంతుడు ఎంతో దయామయుడు. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపపడిన వారిని వారు తప్పక క్షమిస్తారు.
....................

కొందరు ఎంత మంచిగా జీవిస్తున్నా వారి జీవితం కష్టాలమయంగానే ఉంటుంది. అంటే.. వారు క్రితం జన్మలో అంత ఎక్కువ తప్పులు చేసారని అర్ధం చేసుకోవాలి.( ఇలా కాకుండా మనకు తెలియని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.)

అలాంటివారు ఈ జన్మలో ఎంతో శ్రమకు ఓర్చి  నియమనిష్టలు కలిగిఉండటం, దానధర్మాలు చేయటం ద్వారా ఆ కష్టాలనుంచీ బైట పడగలరు.
..........................
 
కొన్నిసార్లు మొక్కులు మొక్కుకుని చేయలేరు. అందువల్ల కూడా కష్టాలు వస్తాయేమో? అనిపిస్తుంది. అందువల్ల, ఎట్టిపరిస్థితిలోనూ గభాల్న మొక్కులు మొక్కటం కాకుండా,  కష్టాలు తీరాలని దైవప్రార్ధన చేయటం మంచిది. 
 
జీవితంలో ఎప్పుడూ మొక్కులు మొక్కుకోనని ఒకసారి గట్టిగా అనేసుకోండి. కుదిరితేనే చేస్తానని జీవితానికి అంతటికి ఒకసారి మీకుమీరే చెప్పుకోండి. 
 
మనం చేయాలనుకున్న పని చేయగలమో ? లేదో? తెలియదు. అందువల్ల, కుదిరితే..చేస్తాను..అనుకోవటం మంచిది.

 ప్రతిపనికీ ముందు అలా అనుకోవటం కష్టం కాబట్టి..ఒకేసారి అనేసుకోవచ్చు. జీవితంలో ఏ పనైనా.. కుదిరితే చేస్తాను.. అనుకోవచ్చేమో .. అనిపిస్తోంది. 
 
 కొన్నిసార్లు మనం చేయగలిగింది ఏమీ ఉండదు. ఇంతే శక్తి ఉంది,  క్షమించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి అంతే.
 
కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా మొక్కులు తీర్చే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఇక ఏం చేస్తారు? మొక్కు తీరే దారి చూపమని దైవాన్ని ప్రార్ధించాలి. ఇంకా తీరకపోతే క్షమించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి. దేనికైనా దైవమే దిక్కు.

 మనకర్మ ఫలితం కూడా ఉంటుంది కదా..ఏం చేయాలో దైవము చేస్తారు.


****************
 దైవం ఎన్నో జీవులకు ఇవ్వని తెలివితేటలను మానవులకు ఇచ్చారు. అయితే, ఎన్నో జీవులు లోకానికి ఉపయోగపడుతుండగా , మనుషులు మాత్రం  దైవానికి ఇష్టం లేని అధర్మమైన పనులు చేస్తూ.. సమాజానికి సమస్యగా తయారవుతున్నారు.  ఇలా ప్రవర్తించటం సరైనది కాదు.

**********

* ఏ జాతకాలూ తెలుసుకోకపోయినా చెడుపనులకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనను కలిగిఉండి, దైవభక్తి కలిగి జీవించే వ్యక్తికి దైవమే సరియైన దారిని చూపిస్తారు.

***********
 
 కొందరు ఏమంటారంటే, మంత్రాల అర్ధాలను తెలుసుకుని పఠించాలి లేకపోతే ఫలితం ఉండదంటారు.. అర్ధాలను తెలుసుకుని పఠించటం మంచిదే. మంత్రాలలో ఎన్నో అంతరార్ధాలు కూడా ఉంటాయి. అవి అందరికి అర్ధం కాకపోవచ్చు.


 ఎవరైనా మంత్రాలను పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయినా ఫరవాలేదు. శ్రద్ధగా దైవాన్ని స్మరించుకుంటూ మంత్రాలను పఠిస్తే చక్కటి ఫలితముంటుంది.


 దైవము సర్వశక్తివంతులు. దైవాన్ని ఆరాధించాలి. ఏదైనా విషయాలను అదేపనిగా అనుకుంటే కొన్ని సంవత్సరములకు అయినా అవి నోటికి వచ్చేస్తాయి. అలాగే దైవాన్ని స్మరించగాస్మరించగా కొంతకాలానికి దైవాన్ని(మోక్షాన్ని) పొందగలము.


దైవకృపను పొందటం కొరకు..దైవస్మరణ, దైవనామస్మరణ..కలియుగంలో సులభమైన ఉపాయమని ప్రాచీనులు తెలియజేసారు. ఓంకారము ఎంతో గొప్పది. బీజాక్షరములు గొప్పవి..కొందరు ఏమంటారంటే, ఒక్క బీజాక్షరములనే అనుకుంటే..ఆ శక్తిని అందరూ తట్టుకోలేరని, బీజాక్షరములను దైవనామముతో కలిపి అనుకోవాలని అంటారు. దైవనామములలో కూడా బీజాక్షరములు ఉంటాయి.దైవనామములను  ఎవరైనా సులభంగా అనుకోవచ్చు.


 ఇవన్నీ ఎలా ఉన్నా కూడా,  దైవము అత్యంత గొప్పవారు. భగవంతుని, వారి నామాన్ని దృఢమైన ప్రేమభక్తితో స్మరించుకుంటే భక్తులు భగవంతుని కృపను పొందగలరు.
 
వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
*****************

జాతకాలు విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు....

 

రెండు పంచాంగాలలో ..ఒకే నక్షత్రం విషయంలో గంటల సమయం తేడా చూసి ఈ విషయం గురించి వ్రాయాలనిపించింది.

 సమయం విషయంలో ఇంత తేడా ఉంటే ..ఈ  మధ్యలో జన్మించిన పిల్లలు  ఏ నక్షత్రంలో జన్మించినట్లు? అనేది సందేహం కలుగుతుంది.

 

 ఉదాహరణ .. ఒక కాలెండర్లో  ఆశ్లేష నక్షత్రం రాత్రి 8 గంటల 38 నిమిషాల వరకూ అని ఉంటే, అంతర్జాలంలో కొన్ని పంచాంగాలలో అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకూ ఆశ్లేష నక్షత్రం ఉన్నది..అని ఉంటే ఏ సమయాన్ని తీసుకోవాలో అర్ధం కాదు.

 

  సుమారు నాలుగు గంటల సమయం తేడా ఉంటే.. ఈ నాలుగుగంటల మధ్య జన్మించిన పిల్లలు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినట్లా ? లేక  మఘ నక్షత్రంలో జన్మించినట్లా ? అనేది సందేహం.

 

  చాలామంది వివాహసంబంధాల విషయంలో నక్షత్రపొంతన వంటివి చూస్తారు. సంబంధాల విషయంలో చాలా విషయాలు నచ్చినా.. వివాహపొంతన కుదరలేదని సంబంధాలు వదులుకునే వారూ ఉంటారు.

  ఇలాంటప్పుడు జాతకాలు మొదలైన వాటి విషయంలో ఎన్నో సందేహాలు వస్తాయి.

  పంచాంగం రాష్ట్రంలోని వేరువేరు ప్రదేశాలలో ప్రింట్ వేసినా కూడా ఒకే రాష్ట్రంలో గంటల సమయం తేడా ఉండదు కదా? మరి ఎందుకు ఇలా జరిగిందో అర్ధం కాదు.

 ఇంకో ఊరిలో ఏదైనా ముహూర్తం రాయించుకునేటప్పుడు, ముహుర్తం జరిగే ఊరి యొక్క సూర్యోదయ సమయాన్ని బట్టి ముహుర్తాన్ని చూస్తారు.

 ..........................

మేము ఒక ముహూర్తం కొరకు సాధనతార, నైధనతార ..చూద్దామని వెతుకుతుంటే నక్షత్రం సమయంలో తేడా కనిపించింది.

  వివాహం విషయం మాత్రమే కాకుండా, ముహూర్తాల కొరకు సాధనతార, విపత్తార .. వంటివి పరిశీలించడానికి కూడా నక్షత్రం యొక్క సమయం అవసరం ఉంటుంది.

    ఇవన్నీ గమనిస్తుంటే ఏమనిపిస్తుందంటే.. కాలెండర్లను, కంప్యూటర్లో విషయములను చూడవచ్చు కానీ, తరువాత ముఖ్యమైన విషయముల కొరకు ..తెలిసిన పండితులను సంప్రదించటం మంచిది.

  సాయనవిధానము, నిరయన విధానము ..అయనాంశ..ఈ విధానాల గురించి  అభిప్రాయ భేదాలు ఉన్నాయట. అందువల్ల కొన్నిసార్లు .. సమయంలో  తేడా వచ్చే అవకాశముందని పండితుల ద్వారా తెలుస్తోంది. 

ఏ విధానాన్ని అనుసరించేవారు ఆ విధానాన్ని అనుసరించి చెబుతారు. 

***********

పై విషయములలో కొన్నింటిని క్రింద పోస్ట్ యొక్క  కామెంట్ వద్ద గమనించగలరు.

******************

 దయచేసి కామెంట్స్ వద్ద కూడా చదవండి.

 

 

Sunday, September 13, 2020

మహిళలు వాడే శానిటరీ నాప్కిన్స్ ...


 మహిళలు నెలసరి రోజులలో వాడే శానిటరీ నాప్కిన్స్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. పాతకాలంలో కాటన్ క్లాత్ వాడి ఉతకటం చేసేవారు.

కొన్నినెలల తరువాత వాటిని  బకెట్లో వేసి కాల్చివేసి, కొత్త క్లాత్ వాడే పద్ధతి కూడా కొందరు అనుసరించేవారు.  (వాడకంలో లేని పాత.. స్టీల్ లేక అల్యూమినియం బకెట్ లో ..)

********

ఇప్పుడు కొత్తవి రకరకాలు అందుబాటులోకి వచ్చాయి.

ఎప్పటికప్పుడు వాడి పడేసే శానిటరీ నాప్కిన్స్ లో కొంత ప్లాస్టిక్ కూడా కలుస్తుందట.

 చాలామంది మహిళలు వీటిని శుభ్రం చేయకుండానే ఎక్కడపడితే అక్కడ పారవేయటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.

***********

 ఈ మధ్య కొత్త శానిటరీ నాప్కిన్స్ కొన్ని రకాలు మార్కెట్లోకి వచ్చాయి.

 ఇవి ఒకసారి కొంటే, ప్రతినెలా వాడి పడేయకుండా ... ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని సుమారు ఒక సంవత్సరం వరకూ వాడుకోవచ్చట.

అలాగని పాతకాలంలోలా పెద్ద వస్త్రం ఉండదు. చిన్న సైజు నాప్కిన్ ఉంటుంది. వీటివల్ల పర్యావరణం సమస్యలు ఉండవట.

ఖరీదుకూడా ఎక్కువేమీ కాదు. నెలనెలా వాడిపడేసేవి నెలకు సుమారు 60 నుంచి 150 వరకు ఖరీదు అవ్వచ్చు.

కొత్తరకం నాప్కిన్లు  సంవత్సరానికి ఒక్కసారి 499 రూపాయలు ధరకు కొంటే సుమారు ఒక సంవత్సరం వరకూ వాడుకోచ్చంటున్నారు.

వీటిని గదిలో ఫాన్ క్రింద వేసినా ఆరిపోతాయి.

ఎప్పుడయినా బయట ఎండలో కుర్చీ పైన వేసి.. కొంతసేపు ఎండిన తరువాత తీసుకోవచ్చు.

******

  వివరాలను క్రింద లింక్ వద్ద చూడగలరు..

PEESAFE Brand.. Reusable Sanitary Pads ..12 + Months ..ZeroWaste.. Cost..499 Rupees .

100% Organic Cotton | Pee Safe Biodegradable Sanitary Pads

*********

అరటినార వంటి వాటితో కూడా శానిటరీ నాప్కిన్స్ తయారుచేస్తున్నారు, వీటిని వాడి ఎప్పటికప్పుడు బయటపడేయవచ్చు. ఇవి త్వరగా మట్టిలో కలిసిపోతాయట. 

మెన్స్ట్రువల్ కప్స్ కూడా వచ్చాయట.

******************

నెలసరి గురించి కొన్ని విషయాలు..కొన్ని పోస్టులు..

  కొందరి ఇళ్ళలో మగవారు వంట చేయరు. బయట హోటల్స్లో వాళ్ళు  మాత్రం ఎంతవరకు శుభ్రంగా చేస్తారో? చెప్పలేము. బయట తింటే అనారోగ్యాలు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల వల్ల కొందరు స్త్రీలు
నెలసరిలో  తప్పనిసరిగా ఇంట్లో వంట చేస్తారు.


  కొందరు, వాళ్ల కుటుంబంలోని స్త్రీలు నెలసరిలో ఉద్యోగాలకు బైటకు వెళ్తే ఏమీ అనలేరు. ఈ రోజుల్లో బయటకు వెళ్ళక తప్పదుకదా..అని సర్దిచెప్పుకుంటారు. తప్పనిపరిస్థితిలో స్త్రీలు ఇంట్లో వంటచేస్తే మాత్రం , అలా చేయకూడదు..కష్టాలొస్తాయని గట్టిగా వాదిస్తారు.


 బయట దేవాలయాలకు వెళ్లేవారు ఉంటారు. పూజ చేసుకుని ఆఫీసులకు వచ్చేవారుంటారు. మరి, నెలసరి వాళ్ళు బయటకు వెళ్లి వాళ్ళందరికి కలిపేయటం దోషమే కదా..

 అయితే, కొందరు స్త్రీలు తప్పనిపరిస్థితిలో బయట ఉద్యోగాలకు వెళ్తారు. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోతే , ఇల్లు గడవటానికి ఉద్యోగాలకు వెళ్లే స్త్రీలు కూడా ఉంటారు. అలాంటప్పుడు కూడా బయటకు వెళ్ళక తప్పదు.


  ఈ రోజుల్లో నెలసరిలో  ఎన్నో సమస్యలు వస్తున్నాయి. నెల మధ్యలో కొద్దిగా కనబడటం వంటి.. ఎన్నో సమస్యలు ఉన్నాయి. పాతకాలంలో స్త్రీలు చదువులు, ఉద్యోగాలకు బయటకు వెళ్లేవారు కాదు కాబట్టి, ఇంట్లో పక్కన కూర్చునేవారు. వాళ్ళను కూడా విసుక్కుంటూ చూడకూడదు. మంచిగా చూసుకోవాలి. నెలసరి విషయంలో ఎందరో స్త్రీలు ఎన్నో చీత్కారాలు, బాధలు అనుభవించారు. ఇప్పటికీ కొందరు అనుభవిస్తున్నారు.


 ఆచారం ఖచ్చితంగా పాటించాలంటే నెలసరిలో ఎవ్వరూ బయటకు వెళ్లకూడదు. ఇలా చెపితే ఎందరు వింటారు? వినరు కాబట్టి, కుదిరినంతలో పాటించటం తప్ప, ఏం చేయలేని పరిస్థితులున్నాయి.


  కొందరు తమకు తోచినట్లు కొత్తకొత్త ఆచారాలు చెబుతున్నారు. అవన్నీ పాటించటం గురించి ఇళ్ళలో గొడవలు కూడా జరుగుతున్నాయి. వ్యక్తులు, కుటుంబవ్యవస్థ, సమాజము బాగుండాలని ప్రాచీనులు చక్కని ఆచారవ్యవహారాలను ఏర్పరిచారు.


 కాలక్రమేణా కొందరు తెలిసితెలియనివారివల్లా, కొందరు స్వార్ధపరుల వల్లా గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు ప్రవేశించాయి. మూఢాచారాలు పెరిగాయి. మూఢాచారాలవల్ల  కుటుంబాల్లో గొడవలు జరిగితే, ఆ ఉసురు మూఢాచారాలను చెప్పిన వారికి తగలదా? అందువల్ల జాగ్రత్తగా చెప్పాలి.


  ప్రాచీనులు ఎన్నో ధర్మసూక్ష్మాలను కూడా తెలియజేసారు. ఉదా..అబద్ధం చెప్పటం దోషమేకానీ, మనం చెప్పే నిజం వల్ల అన్యాయంగా ఎవరికైనా హాని, సమాజంలో హింస వంటివి..జరిగే పరిస్థితి ఉంటే, అప్పుడు సందర్భాన్ని బట్టి విచక్షణతో,వివేకంగా మాట్లాడి  హింస జరగకుండా ప్రవర్తించటం న్యాయం.


  మనం సాధ్యమయినంతలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండదు, మనమూ ఇబ్బందులు పడకూడదు. కొన్ని ఆచారవ్యవహారాలను పాటించటం విషయాల్లో పరిస్థితిని బట్టి కొంత పట్టువిడుపుతో ప్రవర్తించాలని అనిపించి వ్రాసాను.. తప్పుగా అర్ధం చేసుకోవద్దండి.

 

 Friday, December 15, 2023
ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..

Friday, October 5, 2018   చేతనైతే ఈ సమస్యలను.....

Monday, April 18, 2016 ఇది వివక్ష కాదా ?

Wednesday, April 20, 2016 కొన్ని ఆచారాలు..

 Wednesday, January 3, 2018 కొన్ని పద్ధతులు..కొన్ని సంగతులు..

Sunday, August 27, 2023 అంటుముట్టు ..

Monday, June 13, 2022
జీవితంలో ఒక్కసారి వచ్చే సొంత సోదరుని వివాహంలో పాల్గొన.... 



Thursday, May 21, 2020

దైవభక్తి...


దేవాలయాలు త్వరలో  ప్రజలందరి  కొరకు తెరుచుకోనున్నాయి..

ఇంతకాలం  అందరు  ప్రజలకు దేవాలయాలలో దైవదర్శనం లేని పరిస్థితి ఏర్పడటం ఆశ్చర్యం మరియు బాధ కలిగించే విషయం.

***********
కోరోనా వల్ల ప్రపంచంలో జనజీవనం చాలావరకు   స్థంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో దేవాలయాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది.

దైవానికి ఆగ్రహం కలిగిందేమో..  అని  చెప్పాలని కాదు.. కానీ, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో ఇప్పటికైనా ఆలోచించుకోవాలి.

చాలామంది మనుషుల అత్యాశ, అంతులేని కోరికలు,  అవినీతి,   అనేకవిషయాలలో తమకు తోచినదే సరైనదని మొండిగా ముందుకు వెళ్ళటం, పర్యావరణానికి హాని కలిగించటం..ఇలాంటివాటి  గురించి మనుషులకు కనువిప్పు కలగటం కొరకు దైవం ఒక హెచ్చరిక  చేసి  ఉండవచ్చు కదా.. అని నాకు అనిపించింది.

ఇక నుంచి అయినా సమాజంలో మంచిమార్పులు రావాలని కోరుకుందాము.

**********************
లాక్ డౌన్ సమయంలో  అనువుగాని పరిస్థితి వల్ల  దేవాలయాలకు  వెళ్లలేకపోయారు.

  దేవాలయాలకు వెళ్ళి దైవాన్ని దర్శించుకోవటం విషయంలో ....  పరిస్థితి అనుకూలించనప్పుడు మనస్సులో దైవాన్ని దర్శించుకుని, పరిస్థితి అనుకూలించిన తరువాత దేవాలయాలకు వెళ్ళవచ్చు.

************
ఇంతకాలం ప్రజలు దేవాలయ దర్శనాలకు ఎందుకు దూరమయ్యారో ? తెలియదు కానీ, కొన్ని విషయాల గురించి  ఆలోచించుకోవాలి.

వేలమంది ప్రజలు దేవాలయాలకు వెళ్తుంటారు. వీళ్ళందరూ నిజజీవితంలో ధర్మాన్ని పాటిస్తూ.. అవినీతి వంటి పనులకు దూరంగా జీవిస్తే దైవానికి ఎంతో ఇష్టులవుతారు.


 దైవపూజ దైవ ప్రీతి కొరకు చేయటం మంచిది.

మనం జీవించడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం, వాతావరణం..వంటివెన్నో ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవటం కూడా పూజయే.

కోరికలు తీరటం కోసం, బాధలు తీరటం కోసం కూడా దేవాలయాలకు 
వెళ్ళటం తప్పు కాదు కానీ , జీవితంలో మన నడవడికలో తప్పులుండకూడదు. 

దైవకృపను పొందాలంటే ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి.


****************************
దేవాలయాలలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు   కొన్నిసార్లు ఒకరినొకరు నెట్టుకుంటూ ఉండేవారు.

అలా కాకుండా ఒక పద్ధతిలో వెళ్తే ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోవచ్చు.

ఇప్పుడు కొరోనా భయంతో కొన్నాళ్ళైనా ఒకరినొకరు నెట్టుకోకుండా దైవదర్శనం చేసుకుంటారేమో?

రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే దైవం ముందు నిలబడి దర్శించుకోవటానికి కుదరదు. వెనుక చాలామంది ఉంటారని గుర్తుంచుకోవాలి.
****************
హిందువులకు ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలలో సనాతనకాలం నుండి వచ్చినవీ ఉంటాయి. మధ్యలో  కొందరి  చేత చేర్చబడ్డవీ కూడా ఉంటాయి. వాటిని గమనించుకోవాలి.

 మూఢాచారాలను వదిలేయాలి. సమాజానికి ఉపయోగపడే ఆచారాలను పాటించాలి.సమాజానికి  నష్టం కలిగించేవాటిని వదిలేయాలి.


***************
దయచేసి ఈ లింక్ ల వద్ద కూడా క్లిక్ చేసి చదవగలరు.

 దైవం యొక్క చాకచక్యం ఎవరి అంచనాలకూ అందనిది.

కొన్ని ఆచార వ్యవహారాలు.. కొన్ని మార్పులుచేర్పులు.....

మాకు తెలిసిన ఒక కుటుంబం ఇంకో మతం ..

ఆచారవ్యవహారాలు ...మరి కొన్ని విషయములు...

భక్తి ముఖ్యం.

మూఢనమ్మకాలను , మూఢత్వాన్ని వదిలి......

**************

దైవభక్తి కలిగి, జీవితంలో నైతికవిలువలను పాటిస్తూ జీవించటానికి ప్రయత్నిస్తే   దైవానికి ఇష్టులవుతారు.  దైవకృప కలుగుతుంది. 

*******
జీవితంలో సరైన విధంగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. 

సరైన విధంగా ప్రవర్తించే శక్తిని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

మంచిగా అందరూ దైవకృపను పొందాలి.



దైవమే దిక్కు....



ఏదైనా పుణ్యక్షేత్రం వద్ద 10 కిలోమీటర్లు నడవాలంటేనే పెద్దవాళ్ళకు కూడా కాళ్లు లాగేస్తాయి..

అలాంటిది కొందరు వలస కార్మికులు  ఎండలలో వందల కిలోమీటర్లు నడవటం ఏమిటో.... పిల్లలు మేము నడవలేమంటూ ఏడుస్తున్నా కూడా పెద్దవాళ్లు నడిపించటం ఏమిటో.

దేశంలోని  ప్రభుత్వాలు కూలీల కోసం తాము రైళ్ళను ఎక్కువగానే వేశామంటారు.కొందరు కూలీలను రైళ్ళలో వారి స్వస్థలాలకు పంపారు.

మరి, రైళ్ళలో ప్రయాణం కొరకు ఆన్ లైన్  బుకింగ్ తెలియకపోవటం వల్లనో? లేక ట్రైన్ దిగిన తరువాత క్వారైటైన్లో ఉండాలని భయం వల్లనో ? లేక మరేదైనా కారణాలో తెలియటం లేదు..  నడిచే వాళ్లు కొందరు నడుస్తూనే ఉన్నారు.

*************
ఏం చేయాలో తెలియని నిస్సహాయతతో కుటుంబసభ్యులు అందరూ అలా నడుస్తూ ఉండవచ్చు. నిస్సహాయత ఉన్నాకూడా అంతదూరాలు  అలా నడవటం  సరైనపనికాదు.

 పరాయి చోట ఉపాధి లేక చనిపోతామేమోనని భయం వల్ల  నడిస్తే.. నడవలేక కూడా చనిపోవచ్చు .. చనిపోకపోయినా .. తరువాత జబ్బు పడొచ్చు.

**************
లాక్డౌన్ సమయంలో ప్రజల కష్టాలు తీరటానికి ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు సహాయక చర్యలు చేసారు.

దేశంలోని ప్రభుత్వాలు పేదలకు కొంత ఆహారాన్ని అందించారు, కొన్ని రైళ్ళను వేసారు. కొందరిని స్వస్థలాలకు పంపించారు.

అయితే, ఆహారధాన్యాలు దండిగా ఉన్నాయంటున్నారు కాబట్టి, మొదటిసారి లాక్ డౌన్ నుండి ఉపాధి లేక ఆహారానికి ఇబ్బందులు పడుతున్న వారికి సరిపడా ఆహారధాన్యాలను ఇవ్వటం.... 


రెండవ లాక్ డౌన్ కు ముందు రెండు రోజులు గాప్ ఇచ్చి  స్వస్థలాలకు వెళ్తామనేవారిని సరైన వాహన ఏర్పాట్లు చేసి పంపించటం వంటివి మరింత సమర్ధవంతంగా చేస్తే ,
 వలసకూలీలు రోడ్లపై నడవటం ఉండేది కాదు.

 ఇళ్ళలో ఉన్న కొందరు పేద కుటుంబాల వాళ్లు ఆకలితో బాధలు పడేవారు కాదు. కరోనా లాక్డౌన్ సమయం లో వలసకూలీల  విషాదగాధల జ్ఞాపకాలు ఉండేవి కావు.

అయితే, సమాజం బాగుండాలంటే .. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు ఎవరి పని వారు సక్రమంగా చేయాలి.


*********************
ఈ మధ్య ఒక చిన్న పిల్లతో కొందరు పోలీసులు ఒక గది తుడిపించటం చూసి  అందరూ అన్యాయం అన్నారు. చిన్న పిల్లతో పనిచేయించటం అన్యాయమే.

మరి వలసకూలీలు తమ చిన్నపిల్లలను  అలా నడిపించటం కూడా అన్యాయమే. తల్లితండ్రి ..పిల్లలను కని, పెంచుతున్నారు కాబట్టి వాళ్లు వాళ్ల పిల్లల్ని కష్టపెడితే అన్యాయం అనకూడదా ?

తల్లితండ్రి తమ పిల్లలను కష్ట పెట్టకూడదు. అలాగని పిల్లలను అతి గారాబం చేసి పెంచకూడదు.

******
మరికొంత మంది తల్లితండ్రి చదువుల్లో ర్యాంకుల కోసం పిల్లల్ని దండిస్తారు. పిల్లల మంచికోసమే అలా చేస్తున్నామంటారు.

కొన్నిసార్లు పిల్లలు వాళ్ల శక్తికి మించిన చదువులు చదవలేక, తమ బాధలు ఎవరూ పట్టించుకోవటంలేదనే అభిప్రాయంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

ఈ రోజుల్లో  చదువు, ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. ఇష్టమైన చదువులో సీటు లభించాలన్నా విపరీతమైన పోటీ ఉంది.
 పిల్లల శక్తిని, ఇష్టాఇష్టాలను కూడా పెద్దవాళ్లు కొంత పట్టించుకోవాలి.

****************
 ఇక కొందరు పెద్దవాళ్ల విషయాలను గమనించితే,  సమాజానికి మంచి చెప్పవలసిన కొందరు పెద్దవాళ్లే... మద్యపానం  చేయటం , స్త్రీ పురుషులు తమ ఇష్టానికి తిరగటం .. వంటివి తప్పులేదంటున్నారు.

***********
ప్రభుత్వాలు ..ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. తల్లితండ్రి..తమ పిల్లలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటారు.

అయితే, కారణాలు ఏమైనా..సమాజంలో బలహీనులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

 సమాజంలో ...పేదవారు బలహీనులు. కుటుంబంలో...పిల్లలు బలహీనులు.

 సమాజంలో ఏదైనా సమస్య వస్తే,  పేదవారు ఎక్కువ ఇబ్బందులు పడతారు.

 కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే,  పిల్లలు ఎక్కువ ఇబ్బందులు పడతారు.

****************
 పిల్లలు తప్పులు చేస్తే పెద్దవాళ్ళు దండిస్తారు. ప్రజలు తప్పులు చేస్తే ప్రభుత్వాలు, చట్టం ద్వారా దండన ఉంటుంది. 

మరి, ఎప్పుడైనా  సమాజంలో పెద్దవాళ్ళు, ప్రభుత్వాలు..ఏమైనా తప్పులు చేస్తే ఎవరు దండిస్తారు ?

ఇప్పుడు చాలామందికి  నైతికవిలువల సంగతి అలా ఉంచి, డబ్బు సంపాదనా, విలాసంగా జీవించటం వంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎవరి ఖర్మ వారిది.  

ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయో దైవానికే తెలియాలి.  దైవమే దిక్కు.



Saturday, May 16, 2020

ఎంత కాలమో ?.....


వలస కార్మికుల బాధలు ఎంతో దారుణంగా ఉన్నాయి.

కనీసం రెండో విడత లాక్డౌన్ ముందు అయినా.. కొంత సమయం ఇచ్చి స్వస్థలాలకు వెళ్ళాలని అనుకున్న వారిని పంపించవలసింది.

వాళ్ళు నడిచి వెళ్ళకుండా అవసరమైనన్ని రైళ్ళు వేయాలి.


 రైళ్లలో ప్రయాణించటానికి సవాలక్ష రూల్స్ పెట్టకుండా.. తేలికగా టికెట్ బుక్ చేసుకునే విధానం ఉండాలి.

వాహనాలలో ఊళ్ళకు వెళ్ళాలంటే ఆన్లైన్లో వివరాలు ఇవ్వటం వంటివి వాళ్ళకు చేతనవుతుందా ?

రోజులతరబడి వాళ్ళు అలా బాధలుపడవలసి రావటం దారుణం.


ఊళ్ళకు వెళ్లనీయకుండా బలవంతంగా వారితో పనిచేయించాలనుకుంటే మానవహక్కులను ఉల్లంఘించటమే అవుతుంది.

**************

వలస కార్మికులు రోజుల తరబడి సరైన సౌకర్యాలు లేకుండా గుంపులుగా ఒకే దగ్గర ఉండటం వల్ల కూడా వారికి కోరోనా వచ్చే అవకాశం ఉంది.

కొరోనా వచ్చిన వారిని స్వస్థలాలకు రానివ్వమని అనటం కూడా అన్యాయం.

వ్యాధిలేనివారే.. తమను పరాయి ప్రాంతంలో సరిగ్గా పట్టించుకోవటం లేదని అంటున్నప్పుడు, ఇక వ్యాధి వచ్చిన వారిని పరాయిప్రాంతంలో ఏం పట్టించుకుంటారు? ఇవన్నీ గమనిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

స్వస్థలాలకు వెల్తామనే వారిని స్వస్థలాలకు పంపించి , వారిని హోం క్వారైటైన్ లో ఉంచవచ్చు. అప్పుడప్పుడు వైద్యులు రోగుల ఇళ్లకు వెళ్లి వారిని పరీక్షించవచ్చు.

వేరే ఊరి నుండి వచ్చే వారివల్లే కోరోనా వస్తుందని అనుకోనక్కర లేదు. ఇప్పటికే కోరోనా దేశంలోకి వచ్చి ఉంది . 

స్వస్థలంలో ఇళ్ళలో ఉన్న వారికి కూడా కోరోనా వస్తోంది కదా!


************
మద్యం షాపులు తెరిచినప్పుడు ఇక లాక్డౌన్ ఎందుకు ?

మద్యం తాగిన వారు ఆ మత్తులో సోషల్ డిస్టెన్స్, 
చేతులు శుభ్రం చేసుకోవటం  వంటివి   పాటిస్తారా ?

మద్యం తాగిన వారి వల్ల ఇంట్లో వారికి, బయట వారికి కూడా కొరోనా సోకే అవకాశం ఉంది.


**********
వలస కార్మికులు మాత్రమే  కాకుండా .. ఎన్నో రంగాల వారు , ఎందరో వ్యక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీరి  బాధలు ఎప్పుడు తీరుతాయో?

**********
మద్యం తాగితే కొరోనా తగ్గుతుందని కొందరు అపోహపడుతున్నట్లున్నారు. మరి, అమెరికాలో, ఇంకా కొన్ని దేశాలలో   చాలామంది మద్యం త్రాగుతారు. అక్కడ  కొన్నివేలమంది చనిపోయారు కదా. 

ఇందువల్ల ఏం తెలుస్తుందంటే, మద్యం త్రాగితే కోరోనా తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశముంది అని .

**********

క్రమంగా  లాక్ డౌన్  తీసి డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తగా పనులు చేసుకోవచ్చు.

బయటకు వెళ్ళి ఎక్కడైనా కుర్చీలో కూర్చుని లేస్తే... ఇంకొకరు  వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే... అప్పటికే కుర్చీకి అంటుకుని ఉన్న కొరోనా వైరస్... కుర్చీలో కొత్తగా వచ్చి కూర్చొన్న వారికి వచ్చే అవకాశం ఉండొచ్చు కదా ? 

ఇకమీదట.. లిఫ్ట్ బటన్లు, బస్సు లో సీట్లు, షాపింగ్ మాల్స్ లో వస్తువులు..ఇవన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలేమో ? 

**********
లాక్డౌన్ వల్ల పర్యావరణ కాలుష్యం కొంత తగ్గింది. లాక్డౌన్ తరువాత కూడా పర్యావరణ కలుషితం కాని విధంగా ఉపాధి పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. 

పారిశ్రామిక వ్యర్ధాలు విచ్చలవిడిగా గాలిలోనూ,నీటిలోనూ (నదుల్లోను, సముద్రంలోనూ..)  కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

పర్యావరణకాలుష్యం వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. జబ్బులు వచ్చి మనుషులు చచ్చిపోయినా ఫరవాలేదు.. ఆర్ధికవృద్ధి రేటు పెరగటమే ముఖ్యం..  అనుకుంటే మాత్రం కష్టం.

అయితే, దైవం చూస్తూ ఊరుకోరు..ఎవరిని ఎలా దారిలోకి తీసుకురావాలో సమయం వచ్చినప్పుడు చూపిస్తారు.

ఇప్పుడు చిన్న కోరోనా వైరస్  వల్ల ప్రపంచమే విలవిలలాడే పరిస్థితి  జరుగుతోంది కదా.

టెక్నాలజీకి మరీ అలవాటుపడకండి. భవిష్యత్తులో సోలార్ తుఫాన్లు వంటివి వచ్చి టెక్నాలజీ కూడా స్థంభించే పరిస్థితి కూడా రావచ్చు? 

అందుకే టెక్నాలజీ లేకుండా కూడా జీవించటం ఎలా? అనేదానికి కూడా మనం  సిద్ధపడి ఉండాలి.

ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి,  పద్ధతిగా జీవించాలి. 

టెక్నాలజీ అవసరమే కానీ, టెక్నాలజీ ఎంతవరకూ అవసరమో అంతవరకే వాడుకోవాలి.

( సోలార్  తుఫాన్  గురించి కొన్ని వివరాలను కామెంట్స్ వద్ద చదవగలరు. )

*************
ఎవరైనా సరే, ఇతరులను బాధపెడితే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది.

తప్పుచేసిన వారు ఇహలోకంలో  తీర్పు నుండి తప్పించుకున్నా కూడా... దైవం యొక్క తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేరు.