koodali

Wednesday, April 15, 2020

ప్రజలు ఆందోళన చెందే విధంగా ...



 మీడియాలో ..  లాక్డౌన్ ఇలాగే ఉంటే రాబోయే కాలంలో ఆర్ధికపరిస్థితి  కృంగిపోయి ,  జనం ఉద్యోగాలు లేక ఊళ్ళమీద పడే పరిస్థితి వచ్చేస్తోందంటూ చెబుతున్నారు.


అసలే కరోనా భయంతో ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్ళలేక నలిగిపోతున్న కొందరు జనాలకు  ఇవన్ని వింటే..  మరింత  ఆందోళన కలిగే  అవకాశముంది. 

వేరేదారిలేక తప్పనిసరి పరిస్థితిలో లాక్డౌన్ పెట్టారుకానీ, ఊరికే లాక్డౌన్ అనలేదు.

ఆర్ధికవ్యవస్థ దెబ్బతింటుందనే భయంతో లాక్ డౌన్ విధించడాన్ని ఆలస్యం చేసిన దేశంలో 
 ఆరోగ్య పరిస్థితి ఎలా విషమించిందో విన్నాం.

 అయినా , ఆర్ధికమాంద్యం అనేది ప్రపంచానికి ఇప్పుడు కొత్త కాదు, ఇప్పటికి చాలాసార్లు ఆర్ధికమాంద్యం వచ్చింది, మళ్ళీ కోలుకుంది ..మళ్లీ ఆర్ధిక మాంద్యం వస్తుంది...   మళ్ళీ కోలుకుంటుంది .

లాక్డౌన్ వల్ల పారిశ్రామికవేత్తల సంపద విలువ మరికొంత తగ్గవచ్చు, ప్రజలకు కొంత కష్టం కలగవచ్చు, అంతకుమించి పెద్ద ఉపద్రవాలేమీ రావు.

అదేపనిగా ఆర్ధికమాంద్యం అంటూ భయపడినా .. ఇప్పుటికిప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. 

ఆగలేక అందరూ ఒకేసారి బయటకు వస్తే, కరోనా వేగంగా వ్యాపిస్తే ఏంటి గతి?

అయినా లాక్డౌన్ నెలలతరబడి ఏమీ ఉండదు కదా! కొన్ని రోజులు ఓపిక పడితే ..త్వరగా పరిస్థితి చక్కబడుతుంది.

ఆర్ధికపరిస్థితి గురించి నిపుణులు చర్చించటం అవసరమే కానీ, 

మీడియాలో విస్తృతంగా చర్చించటం వల్ల చూస్తున్న ప్రజలలో  కొందరు తమ భవిష్యత్తు  గురించి అధికంగా ఆందోళన చెందే అవకాశం ఉంది. 

ఉన్న పరిస్థితి గురించి ప్రజలకు కొంతవరకూ తెలియటం కూడా అవసరమే కానీ, మరీ భయపడేవిధంగా చెప్పవద్దు.

ఏమీ కాదు, అంతా సర్దుకుంటుంది. మనం కొంత  శ్రమపడితే ఆర్ధికమాంద్యం  నుంచి  తట్టుకోగలం .. అని ప్రజలకు భరోసా ఇవ్వాలి.

ఈ క్లిష్టసమయంలో ప్రభుత్వాలు, అధికారులు, ఎన్నో రంగాల ప్రజలు ఎంతో సహాయాన్ని అందిస్తున్నారు.

లాక్డౌన్ తరువాత త్వరలో  మళ్లీ ప్రజలు పనులు చేసుకుంటారు, మళ్ళీ పరిస్థితి మెరుగవుతుంది.


Thursday, April 9, 2020

ఎవరూ ఆహార కొరతతో బాధపడకుండా...


మనదేశంలో ప్రభుత్వాలు ..లాక్ డౌన్ ప్రకటించటం మంచిదయింది. ఇంకా కొంతకాలం లాక్డౌన్ పొడిగించటం కూడా ఎంతో అవసరం.

అయితే, సడన్ గా లాక్డౌన్ చేయటం వల్ల.. కొందరు ప్రజలు తమ బంధువుల ఇళ్లకు వెళ్లి అక్కడే ఉండవలసిరావటం, పనివల్ల ఇతర ఊళ్లకు వెళ్లిన వాళ్లు సొంత ఉళ్ళకు రాలేకపోవటం వంటి వార్తలు వింటున్నాము.

కొందరు విద్యార్ధులు, ఉద్యోగస్తులు , వలసకార్మికులు కూడా సొంత ఉళ్ళకు గుంపులుగా ప్రయాణమయిన దృశ్యాలను చూశాం. 

అయితే, వాళ్ళను ఎక్కడికక్కడే ఆపి ప్రభుత్వాలే వారికి వసతి, ఆహారాన్ని అందించటం జరుగుతోంది.

అలా గుంపులుగా వచ్చినప్పుడు,  వారి మధ్య వైరస్ అంతగా వ్యాపించినట్లుగా వార్తలు వినలేదు. అంతా దైవం దయ.

ప్రభుత్వం, కొందరు ప్రజలు, సంస్థల వారు కూడా అన్నదానం నిర్వహిస్తున్నారు.

అయితే, ప్రభుతం అందిస్తున్న ఆహారశిబిరాల వద్దకు  అందరూ రాకపోవచ్చు. 

దూరంగా ఉన్నవారు ఆహార శిబిరాల వద్దకు రావాలన్నా కష్టమే.

 బయటకు వస్తే ఎందుకు బయటకు వచ్చారని అడుగుతారు కదా!

ఇలాంటిపరిస్థితిలో కొన్ని హోటల్స్ వారికి అనుమతినిచ్చి, ఫోన్ ద్వారా ఆహారం తెప్పించుకునే అవకాశముంటే బాగుంటుంది.(ఇలాంటి అవకాశం ఇచ్చారేమో నాకు తెలియదు.)

బాచిలర్స్లో తక్కువ ఆదాయం ఉండేవారు కూడా ఉంటారు కాబట్టి, తక్కువ ధరకు ఆహారం అందే విధంగా కూడా ఏర్పాటు చేయాలి.

ఇప్పుడు కొంతమందికి వాళ్ళు పనిచేసే సంస్థలు తగినంత జీతాలు కూడా ఇవ్వటం లేదని అంటున్నారు.

 ఎప్పుడు ఎవరికి జబ్బు వస్తుందో తెలియని ఈ సమయంలో కూడా డబ్బే సర్వస్వం.. అని బ్రతుకుతున్న  వారి గురించి కూడా వింటున్నాము.

ఉదా..పరిశ్రమల యజమానులు కొందరు తమ వద్ద పనిచేసే కార్మికులకు ఈ నెల జీతం ఇవ్వటం లేదట.  

ఒక్క నెల జీతం కార్మికులకు ఇస్తే యజమానుల సంపద అంతా తగ్గిపోతుందా? వారు వారివద్ద పనిచేసే కార్మికులే కదా!

ఉదా..కొందరు అద్దె ఇళ్ల యజమానులు  నెల అద్దె కట్టలేదని అద్దెకు ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీ చేయమంటున్నారట. అద్దె కొరకు కొన్ని రోజులు  ఓపికపట్టవచ్చు  కదా?

*****************

ఇంతకాలంగా చాలామంది బాచిలర్స్ రోడ్ల ప్రక్కన బండ్ల  వద్ద  తక్కువ ధరకు లభించే ఆహారాన్ని తిని కడుపు నింపుకునే వారు. 

ప్రస్తుతం సడన్ గా ఎవరూ ఊహించని పరిస్థితి ఏర్పడి, లాక్ డౌన్ సందర్భంగా రోడ్ల ప్రక్కన బండ్లు లేవు కదా!

చాలామంది బాచిలర్స్ కు వంటచేయటం రాదు. గదిలో స్టవ్ కూడా ఉండదు.  వంట చేయటం తెలియక గదుల్లో పొయ్యి కూడా లేనివారికి ఆహారం ఎలా లభిస్తుంది ?

కొందరు బాచిలర్స్.. కామెంట్స్ ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే.. 

తాము చదువు, ఉద్యోగాల వల్ల వేరే ప్రాంతాల్లో ఉన్నామని, ప్రస్తుతం తమ దగ్గర సరిపడినంత డబ్బు లేదని, తాము ఒకపూట తినీ మరొక పూట తినక చాలా కష్టాలు పడుతున్నామని, లాక్డౌన్ పొడిగించే ముందు కొంత సమయం బ్రేక్ ఇస్తే ..తమ సొంత ఊళ్ళకు వెళ్తామని అంటున్నారు.


లాక్ డౌన్ కు రెండురోజులు బ్రేక్ ఇస్తే బాగానే ఉంటుంది..

అయితే, లాక్ డౌన్ కు బ్రేక్ ఇస్తే, మళ్ళీ పెద్ద ఎత్తున జనం గుంపులుగా వెళ్తే ప్రమాదముంటుంది అనుకుంటే మాత్రం..  బ్రేక్ ఇవ్వకపోవటం మంచిది.

తప్పనిసరిగా ఊరు వెళ్ళవలసిన కొద్దిమందికి మాత్రం అనుమతి ఇవ్వవచ్చు. 

అయితే, ప్రయాణికులు పెద్ద ఎత్తున గ్రూపులుగా కాకుండా తగుమాత్రం దూరం పాటించి ప్రయాణించాలి.

బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి , భోజనం లభించక ఇబ్బందులు పడుతున్న బాచిలర్స్ ప్రభుత్వానికి ఫోన్ ద్వారా తమ ఇబ్బందులను తెలిపి, ఆహారం లభించే విధంగా ప్రభుత్వాల నుండి సహాయాన్ని పొందవచ్చు.
 
 చాలామంది దినసరి కూలీలు వంటి వారికి  కూడా  ఇప్పుడు బయటకు వెళ్ళి పనిచేసి, ఆహారం సంపాదించుకునే పరిస్థితి లేదు . 

ఇప్పుడు ఎవరూ బయటకు రావద్దు అని ఆంక్షలు ఉన్న నేపధ్యంలో ... ఎవరూ ఆహార కొరతతో బాధపడకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత.

బయటకు వెళ్ళకూడదనే ఆంక్షల నేపధ్యంలో (సుమారు ఒక నెల వరకూ ?)  ఆహారం లభించక ఇబ్బందులు పడుతున్నవారికి ప్రభుత్వాలు ఆహారాన్ని అందిస్తే, ఆంక్షల  తరువాత ఎవరి పని వారు చేసుకుని ఆహారాన్ని సంపాదించుకుంటారు.



సామూహికంగా భోజనాలు వంటి కార్యక్రమాలు జరిగేటపుడు....కొన్ని జాగ్రత్తలు..


సామూహికంగా భోజనాలు వంటి కార్యక్రమాలు జరిగేటపుడు కొన్ని విషయాలను గమనించాలి. 

వేసవిలో కొన్ని ప్రాంతాల్లో త్రాగటానికే సరిగ్గా నీరు లభించదు. 

 ప్లాస్టిక్ ప్లేట్స్ వంటివి వాడితే వాటిని కడగటానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది.

ఆహారం తిన్న తరువాత ప్లాస్టిక్ ప్లేట్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఒకరినుంచి ఒకరికి రోగాలు వ్యాపించే అవకాశమూ ఉంది.

ఇలాంటప్పుడు  సామూహిక భోజనాలు, ఫంక్షన్స్ జరిగేటప్పుడు విస్తరాకులు వాడటం మంచిది.

రెండుపొరలుగా విస్తరాకులను వేసి వాడితే ఎంగిలి క్రింద పడకుండా ఉంటుంది.

నీరు సమృద్ధిగా లభించే వద్ద ప్లేట్స్  బాగా శుభ్రం చేస్తారు. 

అయితే కొన్నాళ్ళు ప్లేట్స్ పైన విస్తరాకు వేసి కూడా ఆహారాన్ని అందించవచ్చు. ఇలా చేయటం వల్ల చాలా లాభాలున్నాయి.

 ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి పద్ధతిని అవలంబిస్తున్నారు.

ఉదా..కొందరు ప్లేట్లపై అరటాకు వేసి ఇడ్లీలు వడ్దించటం మనం గమనించవచ్చు.

ఆకులు వేసినా కూడా ప్లేట్స్ కడగాలి. అయితే, ఆకులు వేయటం వల్ల పరిస్థితి చాలా మెరుగవుతుంది.

భోజనాలు ముగిసిన తరువాత విస్తరాకులను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఒక దగ్గరే వేయాలి.

ఫంక్షన్స్ లో బల్లలపైన పొడుగ్గాటి పేపర్ వేసి దానిపైన విస్తరాకులు వేసి, భోజనాలు ముగిసిన తరువాత పేపర్ మడిచేసి పడేస్తారు.

అలా అన్నీ ఒక చోట పడేసి కాల్చివేయవచ్చు.

**************

సామూహిక భోజనాల సమయంలో పలుచటి రసం, మజ్జిగ కాకుండా.. చిక్కగా వండిన సాంబారు, కూరలు వడ్డించవచ్చు.

ఇలా చేయటం వల్ల ఆహారం విస్తరాకు నుండి క్రిందకు వెళ్ళకుండా ఉంటుంది.

పార్సిల్స్ విషయంలో.. ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో కాకుండా, విస్తరాకులలో పెట్టి పొట్లంలా చుట్టి పంపించవచ్చు. 

పులిహోర కానీ, అన్నం, పప్పు, కూరగాయలు కలిపి చేసే బిసిబిలేబాత్ వంటివి ఇతరులకు ఇస్తే వాళ్ళకు బలవర్ధకంగానూ ఉంటుంది.

కొందరు ప్లాస్టిక్ మంచినీళ్ళబాటిల్స్ ను ఉచితంగా రోడ్లపై వెళ్లే వారికి ఇస్తున్నారు.

 మంచినీరు ఇవ్వటం మంచిదే కానీ, ప్లాస్టిక్ బాటిల్ వల్ల పర్యావరణానికి జరిగే నష్టం సంగతేమిటి ?

**********

కొన్ని దేశాలలో అరటి చెట్లను కొట్టేసిన తరువాత నారతీసి, ఆ నారతో పేపర్ బ్యాగులు వంటివి తయారుచేస్తున్నారు.

 మన దేశంలో కూడా అలా అరటినారతో భోజనం ప్లేట్లు, బ్యాగులు తయారుచేయవచ్చు.




Tuesday, March 24, 2020

కరోనా.... కొన్ని విషయాలు...



 ప్రజలు నిత్యావసర సరుకులకు బైటకు రాకుండా.. ప్రభుత్వాలు కొన్ని షాప్స్ వాళ్ళకు  అనుమతి ఇచ్చి, వారు మాత్రం సరుకులను వాహనాల ద్వారా వీధుల వెంట తిరుగుతూ,  ప్రతి ఇంటికి అందుబాటులో సరుకులను విక్రయించే విధానాన్ని అమలుచేయవచ్చు. 

 (అయితే  ప్రజలు  గుమికూడకుండా  పోలీసుల సహాయం తీసుకోవటం మంచిది. ప్రజలు సరుకులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేయకుండా చూసుకోవాలి.)

ఫోన్ చేస్తే నిత్యావసర సరుకులను ఇంటికి తెచ్చే  విధానాన్ని పాటించవచ్చు.

అయితే, భారతదేశంలో చాలామంది  ప్రజలకు  షాప్స్ వారికి ఫోన్ చేసి  సరుకులను తెప్పించుకునే పరిస్థితి లేదు. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇంటికే సరుకులను అందుబాటులోకి తెస్తే బాగుంటుంది.

*********************
 మాస్కులు దొరకనప్పుడు , మాస్కులు లేవని కంగారుపడకుండా, కర్చీఫ్ను మడిచి మాస్క్ తయారుచేసి వాడుకుని, ఉతుక్కుంటే మంచిది.

How to make easy handkerchief mask Without stitching at home? - YouTube

www.youtube.com

**************
శానిటైజెర్  లేకపోతె  ఉప్పు నీరు  వాడవచ్చు.

కూరగాయలు, పండ్లను  మార్కెట్లో ఎందరో చేతులతో తాకుతారు. వాటిని  తెచ్చిన వెంటనే ఫ్రిజ్లో పెట్టకుండా , ఒక బకెట్ నీళ్ళలో రెండు స్పూన్ల ఉప్పు వేసి ఆ నీటిలో కూరగాయలను వేసి 5 నిముషాలు ఉంచి, క్రింద న్యూస్ పేపర్ గాని, పాత టవల్ కానీ వేసి దానిపైన కూరగాయలను పరిచి, తడి ఆరిన కొన్ని గంటల తర్వాత ఫ్రిజ్లో పెడితే వైరస్ ఫ్రిజ్లోకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు.లేదంటే బయటే కూరగాయలను ఉంచుకోవచ్చు.

సరుకులను తెచ్చిన ప్లాస్టిక్ పాకెట్ల పైన కూడా ఉప్పునీటితో తడిపిన  క్లాత్ తో తుడిచి పెట్టుకోవచ్చు.

ఉప్పునీటిలో అదేపనిగా చేతులు కడిగితే చేతులు కొద్దిగా నల్లబడే అవకాశం ఉండవచ్చు కాబట్టి, ఉప్పునీటితో చేతులు కడుక్కున్న వెంటనే మంచినీటితో కూడా కడుక్కోవాలి.

ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీటిలో ఒక స్పూన్ ఉప్పువేసి తుడిస్తే మంచిది.
.................................

డబ్బున్న వాళ్ళు సరుకులను ఎక్కువగా కొని నిల్వ ఉంచుకోగలరు. ఏ రోజు కారోజు సంపాదనతో జీవించే వారికి  నిత్యావసరాలవిషయంలో ఇబ్బందులు లేకుండా  ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి.ధనవంతులు కూడా సహాయం చేయవచ్చు.

ఇంట్లోనే ఉన్నాం కదాని బోలెడు సరుకులు కొనేసి, రకరకాల వంటలు చేసుకుని తింటే అజీర్తి కలిగే అవకాశం ఉంది.

  భవిష్యత్తులో నిత్యావసర సరుకుల కొరత వచ్చినా రావచ్చు. అందువల్ల తగుమాత్రం వంటలు వండుకుని తినటం మంచిది.

**********
కొన్ని చోట్ల..   చదువుకునే పిల్లలను, వివాహం కాకుండా ఉద్యోగం చేస్తున్న వారిని  హాస్టల్స్  ఖాళీ చేసి వెళ్లమంటున్నారట. 

కరోనా పేషంట్లకు సేవ చేస్తున్న వైద్యవిద్యార్ధులను కూడా అద్దె  యజమానులు ఖాళీ చేయమంటున్నారట.
( అద్దె ఇంటి యజమానులకు కరోనా వస్తే మాత్రం మళ్ళీ డాక్టర్ల వద్దకే వెళ్తారు.)

కుటుంబానికి దూరంగా చదువుకుంటున్నవారికి, ఉద్యోగస్తులకు భోజనం ఎక్కడ లభిస్తుంది?

విదేశాల్లో ఉండేవారికి కాలేజీలు మూసెయ్యటం మంచిదే కానీ, హాస్టల్స్ ఖాళీ చేయమనకుండా వారిని హాస్టల్స్లో ఉండనిచ్చి ఎప్పటిలాగే భోజనం అందిస్తే , వారి గదుల్లో వారు ఉంటారు కదా!

సడన్ గా వారిని హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లమంటే ఫ్లైట్స్ లేని సమయంలో అప్పటికప్పుడు వారు ఎక్కడికి వెళ్ళగలరు?

కొన్నిరోజుల  తర్వాత,  బాచలర్స్ ను స్వస్థలాలకు పంపాలంటే  వేలాదిమందిని గుంపులుగా ఒకేసారి వదలటం కాకుండా, రోజుకు కొంతమందిని చొప్పున పంపిస్తే  గుంపులుగా గుమికూడటం ఉండదు. అందరికీ వైద్యపరీక్షలు చేయటమూ కొంత సులభమవుతుంది.

................
పర్యావరణాన్ని పాడుచేయకూడదు అని ఎందరు చెప్పినా  చాలామంది  లెక్క చేయలేదు.

మూగజీవాలు ఎన్ని బాధలు పడినా  పట్టించుకోలేదు.

ఇప్పుడు తమ ప్రాణాలమీదకు వచ్చేటప్పటికి  ఎంతగా అల్లాడిపోతున్నారో కదా!
...................
కొరోనా నుండి తప్పించమని కొన్ని దేవాలయాల్లో  పూజలు నిర్వహిస్తున్నారు.

అందరూ దైవనామస్మరణ చేయటం మంచిది. సరైన  విధానాన్ని తెలుసుకుని ప్రాణాయామ, ధ్యానం  చేయటం  మంచిది.

దైవం దయ వల్ల  విపత్తు తగ్గుముఖం పడుతుందని ఆశిద్దాము.

***************
ఈ క్రింద  విషయాలను  తరువాత  వ్రాయటం జరిగింది...

దైవప్రీతి కొరకు యజ్ఞయాగాదులు నిర్వహించాలి.

 లోకక్షేమం కొరకు యజ్ఞాలు చేయటం అవసరం.

 ఎవరైనా నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు కానీ, ఆపత్కాలంలో కానీ  యజ్ఞయాగాదులు నిర్వహించవచ్చు.

కొందరు స్వార్ధపరుల వల్ల పర్యావరణానికి హాని కలిగి జీవజాలానికి ముప్పు వాటిల్లుతోంది. మూగజీవులకు కూడా కష్టాలు వస్తున్నాయి. మూగజీవులు యజ్ఞయాగాదులు చేయలేవు. అందువల్ల సమాజ హితం కొరకు మనుషులు యజ్ఞయాగాదులు నిర్వహించవచ్చు. 

*****************
కోవిద్ జబ్బు అంతరించాలని యజ్ఞాలు నిర్వహించటం అవసరమే. ఇలా చేయటం సరైనదే. అయితే, మనుషులు చేస్తున్న అనేక తప్పుల వల్ల కోవిడ్ వంటి జబ్బులు వస్తున్నాయి. 

************** 
  ఉదా:పర్యావరణ కాలుష్యం, జీవితంలో అనారోగ్యకరమైన పనులు..వంటి వాటి వల్ల కోవిద్ వంటివి ప్రబలుతున్నాయి. కోవిడ్ వంటివి తగ్గాలంటే యజ్ఞాలు చేయటంతో పాటు తప్పులను సరిదిద్దుకోవాలి. 

మనుషులు తాము చేసే తప్పులను కొనసాగిస్తూనే.. తద్వారా వచ్చే దుష్ఫలితాలను మాత్రం.. యజ్ఞాలు చేసి తగ్గించుకోవాలనుకోవటం వల్ల పూర్తిగా సరైన ఫలితాలు వస్తాయా? 


 తప్పులు చేయటం కొనసాగిస్తూనే.. తమకు  గొప్ప ఫలితాలు రావాలని దైవాన్ని కోరటం ఎంతవరకూ సరైనది?


తాము చేసే తప్పులను కూడా సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాలి.


 అయితే, ప్రపంచంలో చెడుచేసేవాళ్ళు మాత్రమే ఉండరు. మంచిపనులు చేసేవారు ఉంటారు.కొంత మంచి, కొంత చెడు పనులు చేసే వాళ్లూ ఉంటారు.ముందు చెడ్డగాఉన్నా,తరువాత మంచిగామారేవారూ ఉంటారు. 


అందరూ మంచిగా ఉండటానికి ప్రయత్నించాలి.అప్పుడే సమాజం అంతా బాగుంటుంది.


**********
గంగానదిలో కలిపిన కాలుష్యం వంటి వాటి విషయంలో గమనిస్తే.. 

 రోజూ పరిశ్రమలనుంచి, నగరాలనుంచి వచ్చే మురుగును గంగలో వదలటం ఆపకుండా ..  గంగానదిలో కలిపిన  కాలుష్యాన్ని  యజ్ఞం చేయటం ద్వారా పోగొట్టాలని ఎవరైనా భావిస్తే  ఎంత మాత్రం సరైనది ?

 గంగా నది లోకి వదిలే మురుగును ఆపటం కూడా ముఖ్యం.


Monday, March 23, 2020

జలుబు, దగ్గు తగ్గటానికి పానకం..........



  ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, సామాన్యమైన జలుబు, దగ్గు మొదలయినా  అది మామూలు జలుబునా?  లేక కరోనానా ? అనే భయం కూడా కలుగుతుంది.

 టెన్షన్ పెరిగితే అనారోగ్యం కలిగి  హాస్పిటల్ కు వెళ్ళే పరిస్థితి రావచ్చు.  

  ఇలాంటి పరిస్థితిలో మామూలు జలుబు, దగ్గు లేకుండా చూసుకోవటం ఎంతో అవసరం. 

 కషాయం వాడుకుంటే  మామూలు జబ్బు, దగ్గు  తగ్గిపోతుంది. 

ఆయుర్వేద మందుల వల్ల రోగనిరోధకశక్తి పెరిగి , కరోనా సోకే ప్రమాదం తగ్గే అవకాశం కూడా ఉంది.

***************

ఈ పానకం జలుబు, దగ్గు తగ్గటానికి బాగా పనిచేస్తుందండి. మేము ఎప్పటినుండో వాడుతున్నాము. మాకు తెలిసిన వారు చెప్పారు ఈ మందు.

ధనియాలు...........750 గ్రాములు.
మిరియాలు...............25 గ్రాములు.
శొంఠి...............25 గ్రాములు.

బెల్లపు ముక్క........ ఒక చిన్న ముక్క. ...... {.తీపికి సరిపడినంత.}


శొంఠిని మెత్తగా దంచుకోవాలి. ధనియాలు, మిరియాలు పచ్చివే, వేయించకూడదు. ... బెల్లము ముక్కలు తప్పమిగతావన్ని మిక్సీలో పొడి చేసుకోవాలి. ..... పొడి మరీ మెత్తగా రాకపోయినా పరవాలేదు. ...


ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక గ్లాస్ చొప్పున నీళ్ళు తీసుకుని ఆ గ్లాస్ నీటిలో రెండు స్పూన్లు పొడి వేసి బాగా కాచాలి. ఈకషాయం అరగ్లాస్ నీళ్ళు అయ్యేవరకు కాచాలి. 

అప్పుడు బెల్లపు ముక్కలు వేసి కరిగేవరకు మరిగించాలి. ....... అప్పుడుపొయ్యి మీద నుంచి దింపి , ........ విడిగా కాచిన వేడి పాలు ఇందులో గ్లాస్ నిండా పోయాలి.


ఇలా కాచగా వచ్చిన అర గ్లాస్ కషాయాన్ని జల్లెడలో వడపోసి ....అందులో కాగిన పాలు కలుపుకోవాలి........ ఇది ఒక వ్యక్తికి సరిపడిన కొలత మాత్రమే.


ఇలా రోజూ ఉదయమే ఒకగ్లాస్ త్రాగాలి. ఒక  వారం  రోజులు త్రాగాలి.


ఈ కషాయం చిన్న మంట పైన కాగాలి. ఎందుకంటే పొడి లోని రసం (సారం) అంతా నీటిలోకి రావాలి.


..... పాలు ముందే కలిపి కాచితే బెల్లం వలన విరిగిపోవచ్చు. పాలు కలిపాక మళ్ళి కాయనవసరంలేదు. 

పాలు ఇష్టం లేనివాళ్ళు పాలు కలపకపోయినా పరవాలేదు. సుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బెల్లపు ముక్కలు వెయ్యకపోయినా పరవాలేదు. 


కొంతమందికి ఇది వేడిచేయవచ్చు. కాని బాగా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు చలువ చేసే పదార్ధములు తినాలి.

ఈ  కషాయం త్రాగిన  తరువాత పావుగంటవరకూ  ఏమీ తినకుండా ఉంటే మంచిది. 


కుటుంబానికి దూరంగా ఉంటూ  చదువుకుంటున్న  పిల్లలకు, ఉద్యోగస్తులకు ఇలాంటి పొడిని కొట్టి పంపవచ్చు. చ్యవనప్రాశ వంటివి ఇచ్చి పంపవచ్చు. వాటిని వాడే విధానాన్ని సరిగ్గా తెలియజేయాలి. 

..............

కొంతమందికి
 జలుబు,దగ్గు అప్పటికప్పుడు తగ్గకపోయినా,  వారం రోజులు వాడి ఆపేసిన తరువాత నెమ్మదిగా పూర్తిగాతగ్గిపోతుంది. మళ్ళి చాలాకాలం వరకు జలుబు,దగ్గు రాదు.

అసలు జలుబు అవి లేకపోయినా ఈ కషాయం ప్రతినెలమొదటి  వారం  రోజులు వాడితే మంచిది.


.కొంచెం చిన్న పిల్లలకయితే ఒక గ్లాస్ నీటికి ఒక స్పూన్ పౌడర్ వేస్తే సరిపోతుంది. పిల్లలు జలుబు ,దగ్గుతో చాలా బాధపడుతుంటారు. పెద్దవాళ్ళు కొంచెం ఓపికగా ఇలా కషాయం చేసి ఇస్తే వాళ్ళకు ఆ బాధ ఉండదు. 


ఇలా కషాయం కాయటం కష్టమనుకుంటే చ్యవన్ ప్రాశ్ కూడా బాగా పనిచేస్తుందండి..త్రిఫల, త్రికటు చూర్ణం..వంటివి కూడా బాగా పనిచేస్తాయి. 

అయితే ఆయుర్వేద మందులను కొంతకాలం వాడి,  కొంతకాలం గ్యాప్ ఇవ్వాలట. వాడే విధానం, డోసెజ్..వంటివి ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకుని వాడుకోవాలి. 

************

ఈ కషాయం నెలకు 5 లేక 6 లేక 7  రోజులు వాడాలి. ఎక్కువరోజులు వాడితే వేడి చేస్తుంది.  



ధనియాల కషాయం వాడేరోజుల్లో కూరల్లో ధనియాల వాడకం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ధనియాలు మందు కాబట్టి,  మోతాదు మరీ పెరగకుండా వాడుకోవాలి.


ధనియాలు, పసుపు, అల్లం, వెల్లుల్లి..వంటివి తగు మోతాదులో వాడుకుంటే ఆరోగ్యం కలుగుతుంది. ఎక్కువమోతాదులో వాడితే అనారోగ్యం కలుగుతుంది. 

మందు అంటే తగుమోతాదులో మాత్రమే వాడాలి.



( నాకు తెలిసినంతలో రాసాను. ఎంతకాలం వాడాలనే విషయం గురించి  మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే  ఆయుర్వేదవైద్యులను సంప్రదించవచ్చు.) 

**************

 ఆయుర్వేదం  రెమెడీల  గురించి ఇతర దేశాలకు కూడా వారి భాషలో సమాచారం ఇవ్వవచ్చు.

కరోనాకు ప్రెవెన్షన్ గా కొందరు హోమియోలో  మందులు ఉన్నాయంటున్నారు.

 కరోనాకు  అల్లోపతిలో ఇప్పటివరకు మందులు లేవు కానీ ప్రయోగాలు చేస్తున్నారట . అయితే మందు రావటానికి కొంతకాలం పడుతుందట.



Monday, December 30, 2019

ధర్మామీటర్ మరియు కొన్ని విషయములు...


ధర్మామీటర్ గురించి కొన్ని విషయములు..


  చాలాకాలం క్రిందట మా ఇంట్లో ధర్మామీటర్ ఉండేది.  అంటే, మా పిల్లల చిన్నప్పుడు వాళ్ళకు అప్పుడప్పుడు జ్వరాలు వచ్చేవి. 


తరువాత దైవం దయవల్ల అనారోగ్యాలు తక్కువగా వచ్చాయి. ధర్మామీటర్ అవసరం కలగలేదు.


 కొద్ధి  రోజుల క్రితం ,  నాకు కొద్దిగా జ్వరం, జలుబు..  ఉంటే కొత్త  ధర్మామీటర్ కొన్నాం. నార్మల్ కన్నా వేడి ఒక పాయింట్ ఎక్కువ ఉంది.


అయితే, మేము కొన్న ధర్మామీటర్ చూసిన తరువాత కొన్ని సందేహాలు కలిగాయి.



 పాతరోజుల్లో గాజుతో తయారుచేసిన ధర్మామీటర్ లో పాదరసం కనబడుతూ ఉండేది. 



జ్వరం చూడటానికి పిల్లల నోట్లో ధర్మామీటర్ పెడితే పిల్లలు కొరికేస్తారేమోననే భయం ఉండేది.



అయితే, పాత రోజుల్లో ధర్మామీటర్లు గ్లాసుతో చేసినవైనా ఉపరితలం అంతా నున్నగా ఉండి నీటితో శుభ్రంచేస్తే చక్కగా  శుభ్రం అయ్యేది.



మేము కొన్న కొత్త ధర్మామీటర్ ప్లాస్టిక్ తో చేయటం బాగుంది కానీ, మధ్యలో రీడింగ్ చూసే దగ్గర ఒక నొక్కు ఉన్నది.



నొక్కు ఉండటం వల్ల అక్కడ నీటితో శుభ్రం చేయవచ్చో, లేదో  తెలియలేదు. శుభ్రం చేసినా నొక్కు వద్ద సరిగ్గా శుభ్రం కాకపోవచ్చు.



ఇలా నొక్కు ఉండటం వల్ల హాస్పిటల్స్లో రోగులకు ధర్మామీటర్ వాడేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేయాలి. 



 ధర్మామీటర్ సరిగ్గా శుభ్రం చేయకపోతే ఒకరి నుంచి మరొకరికి జబ్బులు వ్యాపించే  అవకాశముంది.



 ప్లాస్టిక్ ధర్మామీటర్ పైన నొక్కు లేకుండా  నున్నగా ఉండే విధంగా  తయారుచేస్తే శుభ్రం చేయటానికి సులువుగా ఉంటుంది.



ఇప్పుడు ఎన్నో కొత్త రకం ధర్మామీటర్లు వచ్చాయట. రోగులను తాకించకుండానే దూరంగానే ఉంచి జ్వరం చూసే విధంగా డిజిటల్ ఇంఫ్రారెడ్ ధర్మామీటర్లు కూడా విదేశాల్లో వచ్చాయట.


 అయితే మనదేశంలో ఇంకా అవి అంతలా వాడకం లేదు కాబట్టి , మనం  ధర్మామీటర్లు శుభ్రం చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది.


***********


 కొత్త ధర్మామీటర్ చూసిన  తరువాత,  నాకు కలిగిన అభిప్రాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో  ఈ పోస్ట్ రాయటం జరిగింది. 

బయట హాస్పిటల్స్లో ధర్మామీటర్ను స్పిరిట్ తో క్లీన్ చేస్తారట. 


అయినా  కూడా , రీడింగ్ కనిపించే దగ్గర నొక్కు లేకుండా నున్నగా ఉంటేనే శుభ్రం చేయటం సులువని నాకు అనిపించింది. 


***************


*  ప్రస్తుతం  సమాజంలో ,
  సరైన పద్ధతిలో జీవించే విధంగా సహాయం చేయమని దైవాన్ని ప్రార్ధించటం మంచిది.


Saturday, October 19, 2019

విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయం గురించి కొన్ని విషయాలను వ్రాయాలనిపించి.......


  విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి  ఆలయం గురించి కొన్ని విషయాలను వ్రాయాలనిపించి వ్రాస్తున్నానండి.


దైవం, దేవాలయం కొరకు ఎందరో  అర్చకులు, భక్తులు, అధికారులు మరియు సిబ్బంది చక్కటి  కృషి చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు.


అయితే, ఇంకో విషయం ఏమిటంటే,   శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి  దేవాలయానికి సమీపంలో  (మెట్ల  ప్రక్కన )  ఉన్న కొండ ప్రాంతాన్ని పైనుంచి త్రవ్వినట్లు కనిపించింది.


శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి  వారి  ఆలయం కొంతభాగం కొండ అంచుకు సమీపంలో ఉంది.... 

అలాంటప్పుడు,  దేవాలయానికి సమీపంలో అలా  కొండను చెక్కటం ఎంతవరకు సరైనదో? అనే సందేహం కలిగింది.


ఒక ప్రక్క కొండను పటిష్టపరిచే చర్యలు జరుగుతున్నట్లుగా  కూడా అనిపిస్తోంది.


  ఒక  ప్రక్కన కొండను పటిష్టపరిచే పనులు జరగటం మంచి విషయం. 


ఇంకో ప్రక్కన కొండ త్రవ్వి ఉండటం చూసిన తరువాత ఆందోళన కలిగింది.

  ఈ  విషయాలను   రాయాలనిపించి వ్రాస్తున్నాను.


అక్కడ జరుగుతున్న పనుల గురించిన వివరాలు నాకు సరిగ్గా తెలియదు.నాకు తెలిసినంతలో విషయాలను వ్రాసాను.


వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

అంతా  దైవం దయ.
 
*************

ఈ విషయాన్ని ఈ పోస్ట్ వేసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేసానండి.

దేవాలయానికి బహుళ అంతస్తుల మెట్లు ఎక్కి వెళ్ళే దారి అంటే లిఫ్ట్ వద్దకు వెళ్ళే దారి పైన రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. చెప్పులు లేకుండా వచ్చే వారికి.. పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది.
 
 కొందరు పెద్దవాళ్లు తమ పిల్లలను చెప్పులు లేకుండా నడిపిస్తున్నారు. దయచేసి దేవాలయం వారు దారిపైన  రాళ్లు గుచ్చుకోకుండా ఏమైనా చేయిస్తే  బాగుంటుంది.