మేము కొంతకాలం క్రిందట దసరా రోజులలో ఒకసారి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ దర్శనానికి వెళ్ళాము. అక్కడ ఏర్పాట్లు బాగా చేసారు.
క్యూలో ఉన్నవారికి మంచి నీరు పాకెట్స్,మజ్జిగ ప్యాకెట్లు అందజేసారు. అయితే ఆ పాకెట్ల పైన దేవుని చిత్రాన్ని ముద్రించారనిపించింది .
కొందరు ప్యాకెట్లు అక్కడే పడేయటం, ఆ పాకెట్లను క్యూలో వెళ్ళే వారు కాళ్ళతో తొక్కే పరిస్థితి ఉంది.
ఖాళీ పాకెట్లు వేయటానికి డస్ట్ బిన్లు ఉన్నా కూడా ఎక్కువ పాకెట్లు క్యూలైన్ల వద్ద పడేసి కనిపించాయి.
ప్యాకెట్ల పైన దేవుని చిత్రం ముద్రించకుండా ఉంటే బాగుండేది.
******************
ఇంకో విషయం ఏమిటంటే..క్యూలో ఉన్న పసిపిల్లలకు చిన్న కప్పులతో పాలు కూడా అందజేసారు.
పసిపిల్లలకు పాలు అందించాలన్న ఆలోచన బాగుంది. అయితే పాలు బాగా వేడిగా ఇచ్చారట.
మాకు ముందు ఒక చిన్నపాప ,తల్లి ఉన్నారు.
పాలు బాగా వేడిగా ఉండటం వల్ల తల్లి చల్లార్చటానికి ఊదుతోంది.
అయితే క్యూ ఆగినప్పుడు ఊదుతోంది. క్యూ కదిలినప్పుడు నడుస్తూ కప్పులోని పాలను చల్లార్చటం కుదరటం లేదు.ఎలాగో చల్లార్చి పాపకు త్రాగించింది.
ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే, పసివాళ్ళకు పాలు సరఫరా చేయాలనే ఆలోచన మంచిదే అయినా సరఫరా చేసేవాళ్ళు వేడిపాలు కాకుండా చల్లార్చిన పాలు ఇస్తే బాగుండేది.
క్యూలైన్లలో అసలే హడావిడిగా ఉంటుంది. ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు సరిగ్గా గమనించక వేడిపాలను పిల్లలకు పట్టించేస్తే నోరుకాలిన పసివాళ్ళు తమ బాధ చెప్పటానికి వారికి మాటలు కూడా రావు కదా..
పొరపాట్లు ఎవరికైనా వస్తాయి. అయితే ఇకమీదట అందించాలనుకుంటే .. పిల్లలకు బాగా వేడిపాలు కాకుండా ..గోరువెచ్చని పాలు అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.
******************
కొంతమంది ఏమనుకుంటారంటే.. నేను మంచిపనులు చేసినా కష్టాలు వచ్చాయని వాపోతారు. దేవుణ్ణి నిందించటానికి కూడా వెనుకాడరు.
అయితే ఇలాంటప్పుడు, తాము మంచి అనుకుని చేసిన పనిలో ఏమైనా పొరపాట్లు వచ్చాయేమోనని ఆలోచించాలి.
చేసిన పనిలో పొరపాట్ల వల్ల ఇతరులకు కష్టం కలిగితే దాని ఫలితాలు ఎలా ఉంటాయో?
ఉదా.. ఎవరైనాఎక్కువ ఆలోచించకుండా లేక ఇతరులకు పనులు అప్పగించేసి వాళ్ళు పెద్దగా ఆలోచించకుండా పొరబాట్లు చేస్తే.. పెద్దవాళ్ళు అనేకకారణాల వల్ల వేడిపాలను పిల్లలకు పట్టించేస్తే తద్వారా బాగా వేడిపాలు త్రాగిన పసిపిల్లలకు బాధ కలిగితే దానిఫలితంగా పొరపాట్లు చేసిన పెద్దవాళ్ళకు పాపం వస్తుందో? పుణ్యం వస్తుందో? పుణ్యము,పాపము కొంచెం కొంచెం వస్తాయో?
************
ఇంకో విషయం ఏమిటంటే..
ఈ మధ్య విజయవాడ దుర్గమ్మ దేవాలయం వారు శత చండీసహిత రుద్రయాగాన్ని నిర్వహించారు.
అయితే యాగాన్ని దేవాలయానికి మరింత సమీపంలో నిర్వహిస్తే ఎక్కువమంది భక్తులు వచ్చేవారనిపిస్తుంది.
అయితే అక్కడే నిర్వహించటానికి వారి కారణాలు వారికి ఉంటాయి లెండి.
********************
పాకెట్లపై దేవుని చిత్రాన్ని ముద్రించటం మరియు క్యూలైన్లలో పిల్లలకు బాగా వేడిపాలను అందించటం గురించి ఇంతకుముందే వ్రాయాలనుకున్నాను. అయితే అనేకకారణాల వల్ల ఆలస్యంగా వ్రాయటం జరిగింది.
No comments:
Post a Comment