koodali

Wednesday, November 16, 2016

మరి.. ప్రజలు యుద్ధం చేయాలని ఎందుకు కోరినట్లు?



 ఎక్కువగా 100 మరియు కొత్త డిజైన్ 500 నోట్లు ప్రింట్ చేసి ఉంచుకుని పెద్దనోట్ల రద్దు ప్రకటన చేస్తే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు.

 అయితే ఈ ఇబ్బందుల వల్ల ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.


కొన్ని నోట్లు రద్దు చేస్తేనే ప్రజలు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.


దొంగ నోట్లు మరియు నల్లడబ్బు పై యుద్ధం అంటేనే వస్తే కష్టాలు తట్టుకోలేకపోతున్నాము.


మరి ఇతరదేశాలతో యుద్ధం వస్తే ఏం చేసేవారు?
యుద్ధం అంటే మరెన్నో ఇబ్బందులు ఉంటాయి కదా!


 ఆ మధ్య సరిహద్దులలో మన సైనికులను చంపినప్పుడు దేశంలో చాలామంది పొరుగుదేశంపై యుద్ధం ప్రకటించాల్సిందేనంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

మీడియాలో కూడా యుద్ధం గురించి చర్చలు. యుద్ధం చేయాల్సిందేంటూ అనేకమంది ఆవేశంతో ఊగిపోయారు. 


యుద్ధం ప్రకటించటం లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసారు. 


************
యుద్ధమంటే వారి దృష్టిలో ఏమిటి ?

కార్గిల్ యుద్ధంలా సైనికుల వరకే పరిమితమనా? దేశప్రజలకు అసౌకర్యం కలగకుండా సైనికులు మాత్రమే త్యాగాలు చేయాలనా?


మరణించిన సైనికుల ఆత్మ శాంతి కొరకు అంటూ.. రెండు నిమిషాలు మౌనం, ఒక కొవ్వొత్తి వెలిగించటం అంతటితో అయిపోతుందా?

దేశ ప్రజల రక్షణ కొరకు ..సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా పద్ధతిగా జీవించటానికి ప్రయత్నించాలి.

 ఇప్పటివరకూ సైనికులు ఎంతో  శ్రమపడుతూ శత్రువులను సరిహద్దుల వద్దే  తిప్పికొడుతూ దేశప్రజలకు శ్రమలేకుండా కాపలాకాస్తున్నారు.


 అయితే పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.

 యుద్ధమంటే ... శత్రుదేశం బాంబులు వేస్తుందనే భయంతో రాత్రిపూట విద్యుత్ నిలిపివేస్తారు.


ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో ?ఎందరు మరణిస్తారో ? ఎందరు వికలాంగులు అవుతారో తెలియదు.
 రవాణావ్యవస్థ స్తంభిస్తుంది. ఇంకా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.


 ఇతరదేశాలపై యుద్దం  చేయాలా? వద్దా అనేది మనం నిర్ణయించుకోవచ్చు.


 మనదేశంపై యుద్ధం చేయాలా ? వద్దా? అనేది మన చేతిలో విషయం కాదు.

 అందువల్ల ప్రజలు కష్టాలు ఓర్చుకోవటాన్నినేర్చుకోవాలి.

యుద్ధ పరిణామాలతో పోల్చుకుంటే పెద్దనోట్ల రద్దు పరిణామాల ఇబ్బందులు చాలా చిన్నవి.


 ఈ ఇబ్బందులే భరించలేని  జనాలు యుద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయటం హాస్యాస్పదం.

*****************
పెద్దనోట్ల రద్దు వల్ల నల్లడబ్బు పూర్తిగా పోకపోయినా ఈ విషయం గురించి అందరికీ పెద్ద కదలిక వచ్చింది.

 ఇక మరో పెద్ద విషయం నకిలీ కరెన్సీ..పెద్దనోట్ల రద్దు  అనేది నకిలీ కరెన్సీ విషయంలో చాలా  ప్రభావాన్ని చూపిస్తుంది.


అప్పట్లో .. ప్రభుత్వం యుద్ధం  విషయంలో ముందడుగు వేయటం లేదనే విమర్శలు వినిపించాయి.నిజంగా యుద్ధానికి వెళ్తే ఈ ప్రజలే ప్రభుత్వాన్ని విమర్శించేవారేమో?


యుద్ధం వల్ల ఏ దేశానికైనా కష్టాలు తప్పవు.


 అన్ని దేశాలవాళ్ళు ఇతర దేశాలను రెచ్చగొట్టడం మాని ఎవరిదేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవటంపై దృష్టి పెడితే మంచిది.


*******************
* యుద్ధాలు రాకుండా అన్ని దేశాల వాళ్ళు మంచిగా ఆలోచించాలని దైవాన్ని ప్రార్దిద్దాము.

*************
దయచేసి కామెంట్స్ వద్ద కూడా చూడగలరు. టపా పెద్దదైపోతుందని కామెంట్స్ వద్ద మరికొన్ని విషయాలను వ్రాయటమైనది.



3 comments:

  1. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ చెబుతున్నారు.

    కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజమే.

    అయితే కొందరు ఏం చెబుతున్నారంటే పెద్దనోట్ల రద్దు వల్ల బంగారం షాపులు, మద్యం షాపులు, రియల్ ఎస్టేట్, నాన్ వెజ్ షాపులు..వంటివి వ్యాపారం జరగక వెలవెలపోతున్నాయంటూ వాపోతున్నారు.

    కొన్ని రోజులు బంగారం కొనకపోతే ఏమీకాదు, నాన్ వెజ్ తినకపోయినా ఏమీ కాదు, విపరీతంగా ధరలు పెరిగిన ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్నాళ్ళు ఆగితే నష్టమేమీ లేదు.

    ఇక మద్యంపై వచ్చే ఆదాయంపై ప్రభుత్వాలు ఆధారపడటమనేది ఎంతో దారుణం.

    కొందరు జనం మనస్తత్వం విపరీతంగా ఉంది. ఉప్పు ధరలు పెరిగాయంటూ వార్తలు వస్తే చాలు ముందూవెనుకా ఆలోచించకుండా కిలోలకొద్దీ ఉప్పు కొని దాచేసారు.

    ఇలాంటి మనస్తత్వం ఉన్న జనాలు డబ్బు విషయంలో మరింత ఎక్కువ ఆలోచిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు.

    డబ్బు విషయంలోనూ ఇలాగే జరిగే అవకాశం ఉంది.

    పెద్దనోట్ల రద్దు తరువాత జనాలు కంగారుపడిపోయి తమవద్ద ఉన్న 100 నోట్లను ఎక్కువగా వాడకుండా దాచుకుంటున్నారు.

    ఏటీఎం లలో ఎంత డబ్బు వేసినా నిమిషాలలో ఖాళీ అయిపోతున్నదంటున్నారు.

    క్యూలు పెరగటాన్ని గమనిస్తే కొందరు నిజంగా అవసరాలకు తీసుకుంటుంటే మరికొందరు డబ్బు నిలువ పెట్టుకుకోవటం మంచిదని భావించి క్యూలో ఉంటున్నారనిపిస్తుంది.

    జనాలు ముందస్తు భయంతో అవసరానికన్నా ఎక్కువ నోట్లు తెచ్చుకుని దాచుకోవటం వల్ల నోట్ల కొరత వస్తుంది.

    ఇందువల్ల కొన్ని రోజులు ఈ సమస్యలు కొనసాగే అవకాశం ఉంది.

    ReplyDelete
  2. ఇక, డబ్బున్న పెద్దవాళ్ళను పట్టుకోవచ్చు కదా అంటున్నారు.

    ఈ విషయంలో మరింత ఎక్కువ దృఢత్వం కావాలి. డబ్బున్న పెద్దవాళ్ళు అన్ని పార్టీలలోనూ ఉన్నారు.

    అవినీతి పనులతో డబ్బుకూడబెట్టడం ఎవరి విషయంలోనైనా తప్పే.

    డబ్బు సంపాదన విషయంలో చట్టప్రకారం ప్రవర్తిస్తే అందరికీ మంచిది.

    ఇప్పుడు ఎక్కువమంది ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే నల్లడబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా భయం వస్తుంది.

    అలా కాకుండా,ఇప్పుడు ప్రభుత్వాన్ని తిట్టడం వల్ల ..బ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకు ప్రభుత్వం తమనేమీ చేయలేదనే ధైర్యం వస్తుంది.
    ఇక ప్రజలే ఆలోచించుకోవాలి.

    ReplyDelete
  3. దేశంలో ఎప్పటినుంచో 100, 50, 10..నోట్లు సరిపడా అందుబాటులో లేవు కాబట్టి..
    .పెద్దనోట్ల రద్దు ప్రకటనకు కొన్ని నెలలకు ముందే..100, 50,10..నోట్ల కొరత లేకుండా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఉండవలసింది.

    ఇప్పుడు 2000నోట్లు ముద్రించారు కదా! దాని బదులు కొత్త డిజైన్ 500, 1000 నోట్లు ముద్రించి రడీగా ఉంచవలసింది.

    పెద్దనోట్లు రద్దు ప్రకటన తరువాత వారం లోపే.. కొత్త డిజైన్ 500, 1000 నోట్లు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేసి ఉంటే ఇప్పుడు ఉన్న గందరగోళం ఉండేది కాదు.

    ReplyDelete