ఓం.
రామాయణం లోని కొన్ని విషయాలు శ్రీ దేవీ భాగవతము గ్రంధములో చెప్పబడ్డాయి.
సీతాదేవి అగ్ని పరీక్ష జరిగిన సందర్భంలో అగ్నిదేవుడు చాయా సీతను తీసుకుని అసలు సీతాదేవిని శ్రీరామునికి అప్పగించటం గురించి , వేదవతి గురించి శ్రీ దేవీ భాగవతము లో చెప్పబడింది.
వ్యాస మహర్షి జనమేజయ మహారాజుకు ....రామ కధ లోని కొన్ని విషయాలను .చెప్పటం జరిగింది.
దశరధుడు శ్రీ రామునికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్నారు. ఏర్పాట్లు అన్నీ జరిగాయి.
అయితే ఊహించని విధంగా ఎన్నో సంఘటనలు జరగటం, సీతారామలక్ష్మణుల వనవాసం, తరువాత సీతాపహరణం, హనుమంతుడు రామలక్ష్మణులకు సుగ్రీవుని పరిచయం చెయ్యటం, రాముడు వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కింధకు రాజుని చెయ్యటం, ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి కదా !
తరువాత సీతాన్వేషణ , తదుపరి యుద్ధప్రయత్నాలలో అవకాశం కొరకు ఎదురు చూస్తూ వర్షాకాలం గడిచేవరకూ ప్రస్రవణ గుహలో తలదాచుకున్నారు రామలక్ష్మణులు.
అప్పుడు ఒక రోజు , తమ్ముడూ ! మన వంశంలో నా అంతటి దురదృష్టవంతుడూ దుఃఖభాజకుడూ మరొకడు గతంలో లేడు భవిష్యత్తులో ఉండడు.... అంటూ ........ రాముడు విలపిస్తూంటే లక్ష్మణుడికీ దుఃఖం ముంచుకొస్తుంది. అయినా నిబ్బరించుకుని అన్నగారిని ఓదార్చగా రాముడు శోకం నుంచి తేరుకున్నాడు.
( మానవ జన్మ ధరించిన తరువాత అవతారమూర్తులైనా సంతోషం, శోకం వంటి మానుష లక్షణాలను ప్రదర్శించటం జరుగుతుందట.)
సరిగ్గా అదే సమయానికి నారదుడు ఆకాశం నుంచీ వచ్చాడు.
రామా ! అసలు నువ్వు జన్మించిందే రావణసంహారం కోసం. ఇందుకే సీతాపహరణం జరిగింది. అంటూ ఇంకా ఎన్నో విషయాలను తెలియజేస్తారు. ..... పూర్వ జన్మలో వైదేహి గొప్ప తపస్విని.అని ,.(.... ఆమె పూర్వ జన్మ గురించి , ఆమె రావణుణ్ణి శపించటం గురించి చెప్పి ) .... అదిగో ఆ తపస్విని సీతగా జన్మించింది రమాంశ సంభూత.
( వొళ్ళు మరిచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు రావణుడు. )
మరో రహస్యం విను. నువ్వు సాక్షాతూ విష్ణుమూర్తివి. చావుపుట్టుకలు లేనివాడివి. అయితేనేమి, దేవతల ప్రార్ధనను మన్నించి రావణవధ కోసం రఘురాముడిగా అవతరించావు. మానవజన్మ ఎత్తేవు కాబట్టి మానవుడిగా విలపిస్తున్నావు. అంతే, ధైర్యం వహించు.
అక్కడ లంకలో సీతాదేవి రేయింబవళ్ళు నిన్నే ధ్యానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ధర్మపరురాలై సాధ్వీ నియమాలను పాటిస్తూ నీ కోసం విలపిస్తోంది. ఇది అంతా దేవతల కోసం జరుగుతోంది కనక దేవేంద్రుడు స్వయంగా కామధేనువు పాలను బంగారు గిన్నెలో సీతాదేవికి పంపించాడు. ఆ అమృతాన్ని జానకీమాత స్వీకరించింది. ఇక ఆకలిదప్పికల బాధ లేదు. నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను.(అని చెప్పి)
రావణాసురుడు మహాబలశాలి.. వరగర్వితుడు. అతణ్ణి సంహరించేదుకు నేనొక ఉపాయం చెబుతాను ..... ఆశ్వయుజమాసం వచ్చింది. దేవీ నవరాత్ర వ్రతం శ్రద్ధగా చెయ్యి . కష్టాలలో ఉన్నవారు తప్పనిసరిగా చెయ్యవలసిన వ్రతం ఇది. అందుచేత రావణ వధ కోసం నువ్వు ఈ వ్రతాన్ని చేసి తీరాలి. తేలికగా విజయం పొందుతావు. ....నేనే పురోహితుడిగా దగ్గర ఉండి జరిపిస్తాను . దేవకార్యం కోసం ఈ పాటి సాయం చెయ్యాలని ఉత్సాహంగా ఉంది..( అని రామునితో వ్రతాన్ని చేయించాడు. ) .
రాముడు ఉత్సాహంగా నవరాత్రి వ్రతం చేశాడు. అష్టమి నాటి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది. మహావీరా ! రఘురామా ! నీ భక్తి శ్రధ్ధలకు మెచ్చాను. కావలసిన వరం కోరుకో ఇస్తాను. . ..అని అనుగ్రహించటం జరిగింది. రాముడు సంతుష్టాంతరంగుడై వ్రతాన్ని దీక్షగా పూర్తి చేశాడు. సేతుబంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుణ్ణి సంహరించాడు.
(అయితే చాయా సీత అయినా అమ్మవారి అంశే కాబట్టి , ఆమెకు ఆకలిదప్పులు లేకుండా ఇంద్రుడు ఆమెకు అమృతాన్ని పంపించటం అనేది సముచితమే అని నాకు అనిపించింది..)
....................
శ్రీ దేవీ భాగవతంలోనే ఇంకో దగ్గర వేదవతి గురించి మరిన్ని వివరాలు ఉన్నాయి.
నారాయణమహర్షి నారద మహర్షికి వేదవతి గురించి, ఛాయా సీత గురించి చెప్పటం జరిగింది.
కుశధ్వజ మహారాజుదంపతులు లక్ష్మీదేవిని ఉపాసించి ఆ తల్లి అనుగ్రహం వల్ల ఎన్నో వరములను పొందారు. లక్ష్మీదేవి అంశతో వారికి ఒక పుత్రిక కూడా కలిగింది. ఆమెకు వేదవతి అని పేరు పెట్టారు.
వేదవతి శ్రీహరిని పతిగా పొందాలని తీవ్ర తపస్సు చేసింది. అప్పుడు, ఒక అశరీరవాణి వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతాడు అని చెప్పగా వేదవతి మరల తపస్సు కొనసాగించింది.
ఒకనాడు అక్కడికి రావణాసురుడు వచ్చాడు. ఆమె సౌందర్యాన్ని చూసి చలించి చెయ్యి పట్టుకుని కౌగలించుకోబోయాడు. వేదవతి కోపంతో కళ్ళల్లో నిప్పులు రాల్చింది. అతడిని శిలాప్రతిమలా నిశ్చేష్టుణ్ణి చేసింది. రావణుడు రాతిబొమ్మ అయిపోయాడు.
వేదవతి కన్నులు మూసుకుని మనస్సులో మహాదేవిని స్మరించింది. రావణా ! నా కారణంగానే నువ్వు నశిస్తావు. సపుత్రబాంధవంగా అంతరిస్తావు. అంటూ యోగశక్తితో దేహం చాలించి వెళ్ళిపోయింది.
వేదవతి జనకమహారాజు ఇంట సీతాదేవిగా అవతరించింది. పూర్వజన్మ తపఃఫలితంగా శ్రీరాముణ్ణి పరిణయమాడింది.
తండ్రి మాట నిలబెట్టడం కోసం సత్యసంధుడైన రాముడు అరణ్యవాసం చేశాడు.
ఒకనాడు అగ్నిదేవుడు విప్రవేషంలో వచ్చాడు. రామా ! ఒక నిజం నీకు చెప్పివెడదామని వచ్చాను. ఇది సీతాపహరణకాలం కాబట్టి ఈ జగన్మాతను నాకు అప్పగించు. చాయా సీతను నువ్వు కాపాడుకో. పరీక్షా సమయం వస్తుంది. అప్పుడు తిరిగి నీ సీతను నీకు అప్పగిస్తాను. దేవతలు పంపితే వచ్చాను నేను. కేవలం విప్రుణ్ణి కాను. హుతాశనుణ్ణి.
హుతాశనుడు తన యోగశక్తితో చాయాసీతను సృష్టించి రాముడికి అప్పగించాడు. అసలు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రహస్యం లక్ష్మణుడికి కూడా తెలియదు.
అగ్నిదేవుడు అటువెళ్ళాడో లేదో బంగారు లేడి రాముడి కంటబడింది. దాన్ని పట్టి తెమ్మని సీతాదేవి రాముణ్ణి కోరింది. (
రావణసంహారం అనంతరం సీతకు అగ్ని పరీక్ష పెట్టారు. . అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రాముడికి అందించారు. అసలు సీతను స్వీకరించి రాముడు అయోద్యకు తిరిగి వచ్చాడు.
అవతార సమాప్తి అనంతరం రాముడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు.లక్ష్మీదేవి అంశ అయిన వేదవతి లక్ష్మీదేవిలో ప్రవేశించింది. .
chala chakkaga chepparu,,,
ReplyDeleteteliyani vishayalu baga chepparu
thank u
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీ వ్యాఖ్యను ఇప్పుడే చూసాను.. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.