koodali

Friday, March 16, 2012

సమాజంలో కొన్ని విపరీత పోకడలు......



బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికీ అనేక కృతజ్ఞతలండి.


......................................

ఈ రోజుల్లో సమాజంలో భార్యాభర్తలు విడాకులు తీసుకోవటం, అక్రమ సంబంధాలు వంటివి పెరిగినట్లు అనిపిస్తోంది. ఆశ్చర్యమేమిటంటే , ఈ రోజుల్లో ఇవి మామూలే ...అనే నిర్లిప్త ధోరణిని ప్రజలు వ్యక్తపరచటం.


కొన్ని విదేశాల్లో , కొందరు భార్యాభర్తలకు .నీ పిల్లలు....నాపిల్లలు, ..... మన పిల్లలు...అనే విధంగా పరిస్థితి ఉంటుందట. మన దేశంలో కూడా అలాంటి విపరీత పోకడలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఇది ఎంతో విచారించవలసిన విషయం.


విడాకులు, అక్రమసంబంధాల వల్ల  కుటుంబవ్యవస్థ కూలిపోవటం, భార్యాభర్తల మధ్యన పరస్పర అనుమానాల
వల్ల .... హత్యలు, ఆత్మహత్యలు, తద్వారా వారి పిల్లలు అనాధలు కావటం వంటి విషాదకర పరిణామాలు చోటుచేసుకుంటాయి. ...


.ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా ! పాతకాలంలో అయితే ఆడవాళ్ళు పరాయి మగవాళ్ళతో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మాట్లాడినా అన్నా అనో, తమ్ముడూ అనో, బాబాయ్ గారూ అనో చక్కటి వరసలు కలిపి మాట్లాడేవారు.
( ఈ రోజుల్లో మాట్లాడుకోకుండా కుదరదు లెండి. హుందాగా మాట్లాడుకోవచ్చు.)


కొంతకాలం క్రిందట ఒక వార్తా పత్రికలో ఒక ఆర్టికల్ వేసారు. ఒక ఉద్యోగి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏమిటంటే ...ఈ ఉద్యోగిని తోటి మహిళా కొలీగ్స్ లిఫ్ట్ అడిగి వారి ఇంటివద్ద డ్రాప్ చెయ్యమంటారట.


( పురుషాహంకారం నశించాలి..అని నినాదాలు చేసే ఆడవాళ్ళు కూడా తమ రక్షణ కోసం  మగవారి సహాయం తీసుకుంటారు కదా ! . )


మొహమాటం వల్ల ఈ ఉద్యోగి " నో " అని చెప్పలేకపోయాడట. ..... ఇరుగుపొరుగు వారు చూసి విషయాన్ని ఆ అబ్బాయి భార్యకు అందించగా ఇద్దరి మధ్యన గొడవ అయిపోయిందట,. ఇదంతా చెప్పి ఆ అబ్బాయి ఏమన్నాడంటే , పూర్వం మహిళలు మగవాళ్ళతో మాట్లాడటానికి బిడియపడేవారని, , ఈ రోజుల్లో కొందరు ఆడ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారని , కామెంట్ చేసాడు.


మగవారు కూడా తమ భార్య ఇతరుల వాహనం మీద తిరగటాన్ని అంతగా ఇష్టపడరు.

ఇలాంటి ఎన్నో విషయాల గురించి  చాలా కుటుంబాలలో అపార్ధాలు వస్తున్నాయి.

వార్తా పత్రికల్లో సైకాలజిస్టులను సలహాలు అడుగుతుంటారు కొందరు. అవి చదివినప్పుడు ప్రపంచం ఎటు పోతోందో ? అనిపిస్తుంది.


ఒకామెకు వివాహం అయిందట. కానీ ఈమె సహోద్యోగిని కూడా ప్రేమిస్తోందట. ఏం చేయాలో సలహా చెప్పమని సైకాలజిస్టులను సలహా అడిగింది.

మరి కొందరు ఆడవాళ్ళు అక్రమసంబంధాలు ఉంటే తప్పేమిటి ? అని కూడా ప్రశ్నిస్తున్నారు ........


ఇలా అడిగే ఆడవాళ్ళ గురించి వార్తాపత్రికల్లో చదువుతుంటే .......

ఇందుకే కాబోలు పూర్వీకులు ఆడవాళ్ళని బయట తిరగటానికి అంతగా ప్రోత్సహించలేదు అనిపిస్తుంది.

ఒక ఆమె ఏమని అన్నదంటే , తన భర్త తప్పు చేసినప్పుడు అతనికి బుద్ధి రావటానికి తానూ అలా ప్రవర్తిస్తే తప్పేమిటని ప్రశ్నించింది.


తోటివాళ్ళు తొడకోసుకుంటే తాను మెడ కోసుకోవటమంటే ఇదే మరి.. పోటీ అనేది మంచి విషయాల్లో ఉండాలి గానీ ఇలాంటి విషయాల్లో కాదు. .............


ఇల్లు అన్నాక అనేక సమస్యలు ఉంటాయి. పూర్వం అయితే ఆడవాళ్ళు తమ బాధలను పొరుగింటి పిన్నిగారికో, వదినగారికో చెప్పుకునేవారు. మగవాళ్ళయితే తన బాధల్ని స్నేహితులతో చెప్పుకునేవారు.


ఈ రోజుల్లో కొందరు ఆడవాళ్ళు మగస్నేహితులతో కొందరు మగవాళ్ళు ఆడస్నేహితులతో తమ ఇంట్లోని బాధలను చెప్పుకోవటం వల్ల  కొన్నిసార్లు ఆ చనువు ,సానుభూతి హద్దులు దాటి ఎక్కడికో వెళ్ళిపోతోంది.


ఈ రోజుల్లో స్త్రీ పురుషుల అతి చనువు వల్ల అనేక కుటుంబాలలో అపార్ధాలు వస్తున్నాయి.

నాకు తెలిసిన ఒక ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యాభర్తలు అపార్ధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ భార్య కు ఉద్యోగరీత్యా మగ కొలీగ్స్ తో టూర్స్ వెళ్ళవలసి వచ్చేది. అలా వెళ్ళటం ఆమె భర్తకు నచ్చలేదు. ఆమె ఏమంటుందంటే , నేను తప్పేమీ చేయలేదు. నాకు కెరీర్ ముఖ్యం . అని విడాకులు తీసేసుకుంది. వారికి పిల్లలు కూడా ఉన్నారు.


ఇంకొక కుటుంబంలో భర్త యొక్క వివాహేతర సంబంధం వల్ల నలుగురు పిల్లల తల్లి ఒకామె ఆత్మహత్య చేసుకోగా , ఇప్పుడు పిల్లలే వండుకు తింటున్నారు.


భర్త తనకు అన్యాయం చేశాడని ఆమె చనిపోయింది కానీ, ఆమె చనిపోకుండా ఉండి , పిల్లలను చక్కగా చూసుకుంటే పిల్లలైనా సంతోషంగా ఉండేవారు కదా !

 
అక్రమసంబంధాలు అంటే ఇంట్రస్ట్ ఉండే ఆడవాళ్ళయినా, మగవాళ్ళయినా వారు వివాహం చేసుకోకుండా ఉండిపోవటమే ఉత్తమం. వివాహం చేసుకుని భాగస్వామిని ఎందుకు బాధపెట్టడం ?


వివాహం అనేది ఒక పవిత్ర బంధం . కష్టంలోనూ సుఖంలోనూ కడవరకూ కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేసి నిలుపుకోవలసిన పవిత్ర బంధం. .


తన భార్య పరాయి పురుషునితో చనువుగా మాట్లాడితేనే పురుషులకు ఎంతో బాధ కలుగుతుంది.


తన భర్త పరాయి స్త్రీ తో చనువుగా మాట్లాడితే భార్యకు కూడా అంతే బాధ కలుగుతుందని పురుషులు ఎందుకు గ్రహించరో ?


. మిగతా విషయాలలో స్త్రీ పురుషుల స్వభావాలలో కొద్దిగా తేడాలున్నా ఈ విషయంలో మాత్రం ఇద్దరి స్వభావమూ ఒకలాగే ఉంటుంది.


.( స్త్రీల స్వభావం ఎలా ఉంటుందంటే..వైధవ్యం కన్నా సపత్నీ దుఃఖం ఎక్కువ అనుకుంటారట. అలాగని హయగ్రీవవృత్తాంతము లో చెప్పటం జరిగింది. )

అయితే ప్రపంచంలో చెడ్డ వాళ్ళూ ఉంటారు. మంచి వాళ్ళూ ఉంటారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా  అన్నట్లు  స్త్రీలలో ఎందరో పుణ్యస్త్రీలు ఉంటారు.


ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్న ఈ రోజుల్లో కూ
డా ఎంతో హుందాగా , నిబ్బరంగా తమ విధులను నిర్వర్తిస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది..


ఏమైనా ఈ రోజుల్లో పాతకాలం నాటి పద్ధతులను మెచ్చుకునేవారిని చాలామంది ఎగతాళి చేస్తున్నారు.

దయచేసి కామెంట్స్ కూడా చదువుతారా....



9 comments:

  1. సైకాలజిస్ట్ ను అడగమెందుకు తన్ హాయి నవల చదివితే అన్ని ఇటువంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి.

    "మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి మూడో వ్యక్తి మీద ఒక ఆకర్షణో లేదా ఇంకేవో మానసిక భౌతిక ఉద్వేగాలు ,అనుభూతులు కలగకుండా ఏదో రెడ్ లైట్ పడ్డట్లు ఆగిపోవు...అసలు ఆ ఫీలింగ్స్ కలగవు కలగ బోవు అని చెప్పడం ఎవరికి వారిని ,ఎదుటి వారిని మోసం చేయటమే అవుతుంది" కల్పనారెంటాల ,తన్హాయి

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      తన్హాయి నవల గురించి కొద్దిగా విన్నాను గానీ నేను ఆ నవల చదవలేదండి. అందుకే ఆ నవల గురించి నాకు అంతగా తెలియదండి.

      Delete
    2. ఈ విషయాలపై మరికొన్ని అభిప్రాయాలను కూడా ..... అందరికీ , చెప్పాలని....

      లోకంలో రకరకాల వ్యక్తులుంటారు.

      కొందరు వ్యక్తులు తన మనస్తత్వానికి వ్యతిరేకమైన జీవిత భాగస్వామి వచ్చినా, .... తాను ఒక అడుగు వెనక్కి తగ్గి అయినా ,.....వారిని తనకు అనుగుణంగా మార్చుకుని చక్కగా జీవిస్తారు.


      మరి కొందరు , అవతలి వారు తమకు అనుగుణంగా మారకపోయినా,,, తనకు అంతవరకే ప్రాప్తం అని సరిపెట్టేసుకుని జీవిస్తారు.( ఇదీ మంచిదే. )

      ( జీవితంలో మనకు న్యాయంగా చెందినదానితో తృప్తి చెందటం ఎంతో మంచిది........ పరాయి వారి వస్తువులు ఎంత నచ్చినా , వాటికోసం ఆశ పడటం ,అవి అందాలని కోరుకోవటం ధర్మం కాదు కదా ! )



      మరి కొందరు ఆకర్షణీయంగా కనిపించే పరాయి వస్తువుల కోసం అర్రులు చాస్తారు. మరి కొంచెం ఎక్కువ ఆకర్షణీయమైన వస్తువు కనిపిస్తే మూడో వస్తువును వదిలి నాలుగో వస్తువు కోసం అర్రులు చాస్తారు. దీనికి అంతం ఎప్పుడో వారికే తెలియదు.


      ( బహుశా ఏదైనా అనారోగ్యం కలిగేవరకూ అలా కొనసాగిస్తారేమో ? అనిపిస్తుంది. )


      మరి కొందరికి నాలుగు, అయిదు అక్రమ సంసారాలు అయ్యాక , ఇక అప్పుడు సర్దుకుపోవటం నేర్చుకుంటారు.

      మొదటే తనకు దొరికినదానితో సర్దుకుపోయి జీవించేవారే విజ్ఞులు.


      ఒక సంసారం యొక్క బరువు బాధ్యతలు ఈదటమే కష్టం అనుకుంటే అక్రమసంసారాలు పెంచుకుంటూ పోయేవారు ఎంత దురదృష్టవంతులో కదా !


      పెళ్ళి చేసుకోకున్నా అక్రమసంబంధాల వల్ల కూడా సంతానం బరువు, బాధ్యతలు ఉంటాయి. మరిన్నీ సమస్యలూ వస్తాయి.


      కష్టాలు పెంచుకుంటాము అనేవారిని ఎవరేమి చెయ్యగలరు ? ఎవరి ఖర్మకు వారే బాధ్యులు..

      Delete
  2. మూడో వ్యక్తి అని ఏముంది. నాలుగు అవ్వచ్చు, ఇదు అవ్వచ్చు, పది అవ్వచ్చు, లేకపోతే వంద అవ్వచ్చు.
    ఇది మగవాడు చేస్తే correct అని, ఆడవారు చేస్తే తప్పని అనట్లేదు. కాని అలా వెళ్ళిపోతే అప్పటి వరకు ఉన్న భాగస్వామి పరిస్తితి ఏమిటి? వాళ్ళ పిల్లల పరిస్తితి ఏమిటి?

    ఇలాంటి పాత చింతకాయ ప్రశ్నలు అడగకూడదు. ఏ వయసులో నైనా ఎవరికి నచ్చిన వారితో వాళ్ళు ఆనందాన్ని అనుభవించాలి. అది మూడో వ్యక్తైనా సరే ఇంకో వంద మందితో నైనా సరే.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      " కాని అలా వెళ్ళిపోతే అప్పటి వరకు ఉన్న భాగస్వామి పరిస్తితి ఏమిటి? వాళ్ళ పిల్లల పరిస్తితి ఏమిటి?." .......ఇలా ఆలోచించేవారు అసలు అలా చేయలేరండి.

      పిల్లల సమస్యల గురించి సినిమాలు తీసే అమీర్ ఖాన్ వంటివారు ..... ఇలాంటి సమస్య గల పిల్లల గురించి ఒక సినిమా తీస్తే బాగుండు.

      Delete
  3. మనుషులలో సర్దుబాటు గుణం తగ్గిపోతుంది. తమ గురించి తాము ఆలోచించుకునే సమయం, విశ్రాంతి తీసుకునే సమయ౦ లేకపోవడం ఇందుకు కారణాలు కావొచ్చు. ఏమైనా ఆలోచించవలసిన అంశం ప్రస్తావించారు.

    "ఇందుకే కాబోలు పూర్వీకులు ఆడవాళ్ళని బయట తిరగటానికి అంతగా ప్రోత్సహించలేదు అనిపిస్తుంది."

    ఎవరో కొంతమంది అలా ప్రవర్తించారని ఇలాంటి వ్యాఖ్యానం చేయడం సరికాదేమోనండీ..

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      మీరు నన్ను అపార్ధం చేసుకున్నారనిపిస్తోంది.

      స్త్రీ స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్న వారి గురించి తెలుసుకున్నాకే అలా అనిపించిందండి.

      వార్తాపత్రికల్లో, వచ్చే వార్తల ద్వారా పరోక్షంగా, చానల్స్ లో వచ్చే వార్తల ద్వారా ..... అక్రమసంబంధాలు తద్వారా జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యల ఉదంతాలు చూస్తుంటే ....... సమాజంలో ఏం జరుగుతోందో తెలుస్తోంది.

      ఈ రోజుల్లో సమాజంలో ఇలాంటివారు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నారు. ( నిజం నిష్టూరంగానే అనిపించవచ్చు. )

      అలాంటివారిని ఉద్దేశించి మాత్రమే .........అలా వ్రాసానండి.

      ఇలాంటి వారి వల్ల సాటి స్త్రీలు కూడా ఎంతో బాధపడుతున్నారు. తట్టుకోలేని కొందరు స్త్రీలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.


      * వ్యాసంలో , పుణ్య స్త్రీల గొప్పతనం గురించి కూడా ప్రస్తావించాను.. .........గమనించగలరు........

      Delete
  4. ఇదేనేటి నాగరికత. ఇలా లేని వాళ్ళని మధ్యయుగాల మనుషులంటున్నారు. మనసు నిర్మలంగా ఉండాలి కాని ఇదంతా ఉత్తిదే అనే వారూ ఉన్నారు.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      మీ వ్యాఖ్య మూలంగా అందరికీ నా అభిప్రాయాలను చెప్పాలని.......ఇలా వ్రాస్తున్నాను.


      ఈ రోజుల్లో కొందరి వస్త్రధారణను చూస్తుంటే ఆటవికయుగాల నాటి వస్త్రధారణ లా అనిపిస్తోందండి......మన ఖర్మ కొద్దీ .ఇప్పుడు అదే నాగరికత అంటున్నారు.


      ప్రపంచంలో అందరూ సజ్జనులే అయితే చట్టం , యొక్క అవసరమే ఉండదు. కానీ, అందరూ సజ్జనులే ఉండరు కదా !


      ఇక మనసు నిర్మలంగా ఉండాలి కాని ఇదంతా ఉత్తిదే అనే వారూ ఉన్నారు.....


      నిజమే మనసు నిర్మలమైనదే, మనసు ఎంతో చంచలమైనదని కూడా ( అప్పటి పరిస్థితిని బట్టి ) పెద్దలు చెప్పటం జరిగింది.



      అందుకే సామాజిక జీవితం సవ్యంగా సాగాలంటే కొన్ని నియమనిబంధనలు తప్పవు..
      అయితే, పూర్వపు పరిస్థితికి, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది కాబట్టి ......అప్పటిలా ఇప్పుడు కుదరకపోయినా....... ఎంతో కొంత నియమనిబంధనలు అవసరం అనిపిస్తుందండి.



      రద్దీగా ఉన్న స్థలాల్లో భద్రతా సిబ్బంది అందరి సామానూ చెక్ చేసి లోపలికి పంపుతుంటారు.

      చెడ్డ వ్యక్తులను ఉద్దేశించి అలా నియమనిబంధనలను ఏర్పాటు చేసినా, మంచివాళ్ళు కూడా వాటిని పాటించవలసి వస్తుంది.


      అలాంటప్పుడు నేను మంచి వ్యక్తిని కదా ! ......మరి , నా సామాను చెక్ చేయటమేమిటి ? అని బాధ పడకూడదు కదా ! నలుగురితో పాటే మనమూనూ.


      ఈ రోజుల్లో కొందరు స్త్రీలు స్వేచ్చ అనే పదాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రవర్తించటం అన్నది ......ఇలాగే కొనసాగితే ....... స్త్రీలకు ఇప్పుడు ఉన్న స్వేచ్చ పోయే పరిస్థితి వచ్చినా రావచ్చు....అనిపిస్తుందండి...

      Delete