koodali

Wednesday, March 14, 2012

బ్రతకటం కోసం ఉద్యోగమా ?...ఉద్యోగం కోసం బ్రతకటమా ?



ఈ రోజుల్లో జీవితంలో పెరిగిపోయిన పనివత్తిడి వల్ల కుటుంబాలలో అనేక సమస్యలు వస్తున్నాయి.

కుటుంబసభ్యులకు ఒకరితో ఒకరికి సరిగ్గా మాట్లాడుకోవటానికే సమయం చాలటం లేదు.

ఎవరికి వారు . ఉదయాన్నే లేచి హడావిడిగా పనిచేసుకుని ఏదన్నా తిని బయటకు వెళ్ళిపోతారు. ఇక రాత్రికి ఇంటికి చేరతారు.


ఇంటికి వచ్చాక కూడా పిల్లలకు చదువే సరిపోతుంది. ( హాస్టల్స్లో లేకుండా ఇంట్లో ఉంటే ) పెద్దవాళ్ళకు ఇంటి పనే సరిపోతుంది.


(
టీవీ చూడటం, నెట్ చూడటం ఎలాగూ ఉంటాయి....... ఏ కారణం చేతనయినా టీవీ పనిచెయ్యకపోతే ఆక్సిజన్ అందనట్లు అల్లాడిపోవటం ( మరీ అంతలా కాదు లెండి. )..... ఈ రోజుల్లో పిల్లా పెద్దా అందరికీ అనుభవమే. అందులో వచ్చే కొన్నిప్రోగ్రాంస్ నచ్చకపోయినా తిట్టుకుంటూ చూడటమే మన బలహీనత. )

తెల్లవారితే ఉరుకులుపరుగులు. ఇదంతా దేనికోసమో ఎవరికీ అర్ధం కాదు....

కానీ పరుగు అపితే ఎక్కడ వెనకపడిపోతామో ? అని జీవితంలో అలా పరిగెడుతూనే ఉంటారు పాపం.

పేరుకి కుటుంబసభ్యులే కానీ , ఈ రోజుల్లో వారి మధ్య కమ్యూనికేషన్ గాప్ బాగా పెరిగిపోతోంది.

కుటుంబసభ్యుల కన్నా బయటి వాళ్ళే ఎక్కువసేపు మాట్లాడుకోగలుగుతున్నారు. .( రోజులో ఎక్కువభాగం కలిసి పనిచెయ్యటం వల్ల., )

అందుకే ఈ రోజుల్లో కుటుంబసభ్యులు అపరిచితుల్లా ...... బయటివాళ్ళు చిరపరిచితుల్లా( సుపరిచితుల్లా ) మాట్లాడుకోవటం ఎక్కువవుతోంది.

భార్యకు ఒక ఊరిలో ఉద్యోగం, భర్తకు ఒక ఊరిలో ఉద్యోగం, పిల్లలు హాస్టల్లో ఉంటూ అందరూ అప్పుడప్పుడూ ఇంటికి ( ?) వస్తూ ఉంటారు.

ఆడవాళ్ళు వంట చేయటమే తప్పు , ....అంటున్నారు కొందరు . తన కుటుంబసభ్యులకు, తనకు వంట చేసుకోవటం అవమానం అనుకుంటే ఎలా ?

ఇంటి ఇల్లాలు వంట చేయటం , కుటుంబసభ్యులు వంట బాగుందని మెచ్చుకుంటూ భోజనం చేస్తుంటే ఆ ఇల్లాలికి ఎంతో సంతోషంగా ఉంటుంది. .

వంట చేయటానికి సమయం సరిపోక హోటల్ వంట తింటున్నప్పుడు , అందరూ హోటల్ వారిని మెచ్చుకుంటూ భోజనం చెయ్యాలి మరి.

వంట చేసే వ్యక్తి యొక్క ఆలోచనల ప్రభావం ....... ఆ వంట తిన్న వ్యక్తి మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే కొందరు , వంట చేసేటప్పుడు దైవనామస్మరణ చేస్తుంటారు.


యాడ్స్ లో చూపిస్తారు కదా... ..ఒక భార్య దుస్తులను తెల్లగా ఉతికితే ఆమె భర్త మెచ్చుకున్నట్లు అలా ......

ఒకరోజు , నా భర్త ,.... దుస్తులు తెల్లగా ఉతికానని నన్ను మెచ్చుకున్నారు.


నేను ఏదో ఆలోచిస్తూ...... ఆ దుస్తులు నేను ఉతకలేదు. మెషీన్లో వేసాను. మీ ప్రశంసలు మెషీనుకే చెందుతాయి అనేసాను.


అన్న తరువాత నాలుక కర్చుకున్నాను. . ( అందుకే బొత్తిగా నాకు లౌక్యం తెలియదని మా పెద్దవాళ్ళు నన్ను కోప్పడతారు. )


కుటుంబంలోని వారు ఒకరికొకరు సహాయసహకారాలు ఇచ్చిపుచ్చుకోవటం వల్ల వారి మధ్యన అన్యోన్యత , అనుబంధం పెరుగుతుంది. రకరకాల కారణాల వల్ల ఈ రోజుల్లో ఇలా తోడునీడగా ఉండటం తగ్గిపోతోంది....


ఈ రోజుల్లో
కొందరు తల్లులు తమ చంటి పిల్లల్ని కూడా పెంచుకోవటానికి సమయం లేనంతగా బిజీ జీవితాలు అయిపోయాయి.


పూర్వం చేతి వృత్తులు మంచి స్థితిలో ఉన్న కాలంలో ఎవరింట్లో వారు వస్తువులను తయారు చేసేవారు. ( ఇప్పటిలా కర్మాగారాలు లేని కాలంలో ) అప్పుడు భర్తకు భార్య కూడా సహాయం చేసేది. అలా భార్యాభర్తలిద్దరూ చేదోడువాదోదుగా ఉండేవారు.... .

ఏమిటో ! ఈ రోజుల్లో ఆడా..మగా..పిల్లా...పెద్దా అంతా విరగబడి పనిచేస్తూ ..... ప్రపంచాన్ని ఇరవై అయిదో శతాబ్దంలోకి ఈడ్చుకుపోదామని ప్రయత్నిస్తున్నారుగానీ , అదేమో . ...... ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది ...


ప్రపంచమంతా పేదరికం, నిరుద్యోగం, విడాకులు, అక్రమసంబంధాలూ ఇలా ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నాయి. ...ఇదే కాబోలు అభివృధ్ధి అంటే..

కొన్ని సంస్థల యాజమాన్యం వారు తమ ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గటానికి ..... ఆటలుపాటలు, సరదా ప్రోగ్రాములు , వంటివి నిర్వహిస్తూ ఉత్సాహపరుస్తుంటారు.


కొంతకాలం క్రిందట ఉత్తరభారతదేశానికి చెందిన ఒక ఆమె , సెలవు రోజుల్లో కూడా ఆఫీసులోనే పనులు ఉండటం వల్ల , తన భర్త ఇల్లు గురించి పట్టించుకోవటం లేదని మొరపెట్టుకోవటం గురించి ...... వార్తాపత్రికల్లో వచ్చింది కదా !


పూర్వం బ్రతకటం కోసం ఉద్యోగాలు చేసేవారు. ........ ఇప్పుడు ఉద్యోగాలు చెయ్యటం కోసమే బ్రతుకుతున్నారనిపిస్తోంది.


ఏంటో ! ఇవన్నీ తెలియక పాతకాలం వాళ్ళు పాపం అమాయకంగా జీవించారు. వాళ్ళను తల్చుకుంటే జాలిగా ఉంది ??

*****************

కొందరు ఏమంటారంటే...
ఆడవారి కష్టాలకు
పురుషాధిక్య సమాజం కారణం అని అంటారు.

పురుషాధిక్య సమాజం అన్నది కొంతవరకూ నిజమే కానీ , ఆడవారి కష్టాలకు చాలా వరకూ .... సాటి స్త్రీలే .... సూత్రధారులూ, పాత్రధారులూ అని కూడా...అనిపిస్తుంది.

.నేను వ్రాసిన పాత టపాను కామెంట్స్ సెక్షన్లో వేసానండి. దయచేసి చదవగలరు....


7 comments:

  1. *స్త్రీకి స్త్రీయే శత్రువా ? కాదా ?..


    స్త్రీలు చాలా మంది పురుషాధిక్య ధోరణి వల్లే తమకు కష్టాలు వస్తాయి అనుకుంటారు.


    సరే, స్త్రీలు అంటే గౌరవం లేకుండా స్త్రీలను పీడించే పురుషులు చాలా మంది ఉన్నమాట నిజమే.


    కానీ, కేవలం మగవారి వల్లే స్త్రీలకు కష్టాలు వస్తున్నాయంటారా ?


    స్త్రీల వల్లే తోటి స్రీలకు వచ్చే కష్టాల మాటేమిటి ?


    అత్తా, కోడళ్ళ గొడవల్లో పోటీపడేది స్త్రీలే గదా !


    ఒక స్త్రీ గర్భం ధరించటం కొంతకాలం ఆలస్యమయితే చాలు, ఇక గొడ్రాలు అంటూ విసిగించి వేధించేది అత్తగారు, ఆడపడుచులు, తోటిస్త్రీలు.... వారూ స్త్రీలే గదా !




    పిల్లలు పుట్టి వారు అందరూ ఆడపిల్లలయితే , అందుకు కోడలినే తప్పుపట్టి కొడుకుకు ఇంకో పెళ్ళి చేయటానికి సిద్ధపడే అత్తగార్లు కూడా ఉంటారు.




    స్కానింగ్ లో ఆడపిల్ల అని తెలిస్తే కడుపులో పిండాన్ని, వీలుకాకపోతే పుట్టిన తరువాత ఆ పిల్లను చంపేసే వాళ్ళలో ఆ ఇంటి ఆడవాళ్ళు కూడా పాత్రధారులే. .



    ఇక కట్నం వేధింపులు, చావులు విషయంలో చెప్పనే అక్కర్లేదు.........

    ఆ విషయంలో ఇంటి కోడలిని వేధించే వారిలో అత్తగారూ, ఆడపడుచుల పాత్ర ఎంతో ప్రధానమైనది. . .



    ఇక కొందరు కోడళ్ళు కూడా తక్కువ వారేమీ కాదు.



    పెళ్ళి అయిన మరుక్షణం నుంచీ ....... ఇక అత్తగారి మీద భర్తకు చాడీలు చెబుతూ భర్తను వారి తల్లిదండ్రులకు దూరం చేయటానికి ప్రయత్నం చేసే కోడళ్ళు ఎందరో ఉన్నారు.




    ఇక కోడళ్ళు కూడా తమ తల్లి కోప్పడితే అంతగా బాధపడరు ..... అదే అత్తగారు కోప్పడితే సీరియస్ గా తీసుకుంటారు.


    ఇక అత్తగారేమో తన కూతురుకు ఒక న్యాయం ....... కోడలికి ఒక న్యాయంగా ప్రవర్తిస్తారు.



    అత్తగార్లు తాము ఒకప్పుడు కోడళ్ళమే అనీ......కోడళ్ళు తామూ కాబోయే అత్తలమే అని గుర్తు పెట్టుకున్న రోజున ఇంట్లో అందరికీ సుఖంగా ఉంటుంది.



    అత్తాకోడళ్ళ మధ్యన ఈ గొడవలకు అభద్రతా భావం, తన చెయ్యే పైన ఉండాలనే పోటీ మనస్తత్వం ఇలా ఎన్నో కారణాలు.



    కోడలికి అత్తగారు, అత్తగారికి కోడలు సపోర్ట్ గా ఉంటే ఎంత బాగుంటుంది !



    ఇవన్నీ కాకుండా కొందరు మగవాళ్ళ వివాహేతర సంబంధ కారణంగా బాధలు పడేది ...... మళ్ళీ స్త్రీయే.


    ఇలా స్త్రీ కష్టాలకు ....... తోటి స్త్రీయే కారణమవుతోంది.



    స్త్రీలలో త్యాగమూర్తులూ ఉన్నారు.........తనకు లభించని అదృష్టం ఇంకొక స్త్రీకి లభిస్తే అసూయతో కాపురాలు కూల్చే పడతులూ ఉన్నారు...



    సెలెబ్రిటీలు అనే వారి విషయంలో చూస్తున్నాము కదా ! మగవారు భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక స్త్రీని వివాహం చేసుకుంటున్నారు.


    కొన్ని సార్లు భార్య కూడా తాను ఇంకొకరిని వివాహం చేసుకుంటుంది.


    ఇలా పిల్లలు పుట్టాక బాధ్యత లేకుండా...... ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్నారు.


    అలాంటి పిల్లలు వివాహవ్యవస్థ అంటేనే నమ్మకాన్ని కోల్పోతున్నారు.


    పిల్లల సమస్యల గురించి సినిమాలు తీసే అమీర్ ఖాన్ వంటివారు ........ ఇలాంటి పిల్లల సమస్య గురించి కూడా ....... గొప్ప సినిమా తీస్తే ఎంతో బాగుంటుంది మరి.



    ఇక, పిల్లలను పెంచేది చాలా వరకూ తల్లులే గదా !


    వారు పిల్లలను పెంచేటప్పుడు అమ్మాయి అయినా........ అబ్బాయి అయినా సమానమే అని పెంచాలి.



    అంతే కానీ ఆడవారిని చెప్పుచేతలలో అణచి ఉంచాలని అబ్బాయికి చెప్పకూడదు.....మగవారిని ద్వేషించేటట్లు అమ్మాయిని పెంచకూడదు.



    ఇలా ....... స్త్రీలు తోటి స్త్రీలను కష్టపెట్టకపోతే అదే చాలు. స్త్రీల బాధలు చాలా వరకూ తగ్గుతాయి..

    ................................

    ReplyDelete
  2. మంచి పోస్టు రాశారు. ఆడవాళ్లు వంట చేయకూడదు అనడమూ తప్పే, ఆడవాళ్లు వంట మాత్రమే చేయాలనడమూ తప్పే. ఏ పని ఎవరు చేసినా తప్పు లేదు.
    సమాజం యొక్క స్వభావం మనిషిపై పడుతుంది. మీరు విశ్లేషించిన అంశాలన్నీ ఈ సమాజ సహజ లక్షణాలు. రోగం అర్ధం అయింది. మందు కూడా తెలుసుకోవాలి. పరుగు ఎందుకు? ఎంతమేరకు అవసరం? పోటీ పరుగును ఎలా ఆపాలి అనేది ప్రస్తుతం సమాజానికి సవాల్ విసురుతున్న అంశం.

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    కుటుంబాల సమాహారమే సమాజం. కుటుంబవ్యవస్థ బాగుంటే సమాజం దానికదే బాగుంటుంది. పూర్వం కుటుంబ అవసరాలు తీరటం కోసం సంపాదించేవారు. ఈ రోజుల్లో కుటుంబసభ్యులను పట్టించుకోవటానికి కూడా తీరికలేనంతగా ఉద్యోగాలు ఉన్నాయి.

    కుటుంబవ్యవస్థ కూలిపోకుండా ఉండాలంటే మీరన్నట్లు " పరుగు ఎందుకు? ఎంతమేరకు అవసరం? పోటీ పరుగును ఎలా ఆపాలి ?" అని అందరూ ఆలోచించాలండి.

    ReplyDelete
  4. ఎక్కడచూసినా హక్కులగురించి మాటాడే వారు కనపడుతున్నారు, బాధ్యతలగురించి మాటాడే వారు తగ్గిపోతున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి. మీరన్నట్లు ఈ రోజుల్లో హక్కుల గురించి మాట్లాడటం ఎక్కువగా జరుగుతోంది.


      పిల్లల విషయంలో అయితే చదువు, విజ్ఞానం పేరుతో వారిపైన మోయలేనంత భారాన్ని వేసేస్తున్నారు. ఇప్పటి పిల్లలకు ఆడుకోవటమంటే కంప్యూటర్ గేంసే.

      భక్తి టీవీలో శ్రీ లలితా అమ్మవారి సహస్రనామముల గురించి చెబుతున్నప్పుడు ... Dr. శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు .....పూర్వం పిల్లలు ఎన్నో ఆటలు ఆడేవారని, ఆ ఆటలు తెలివితేటలను పెంచే విధంగా కూడా ఉండేవని చెప్పటం జరిగిందండి.

      Delete
  5. అవును నేను మీ లాగా ఆలోచించి చేస్తున్న ఉదోగ్యంకి రాజీనామా ఇచ్చాను.అది
    చాల అకస్మాత్తుగా ఈ రోజు అనుకొనే మరుసటి రోజే చేసేసాను అందరు
    చాల రకాలుగా ఆపాలని ప్రయత్నం చేసారు.ఇది జరిగి సరిగా పది రోజులు.
    నాకు ఒక రోజున అనిపించింది దేనికి నేను ఈ పరుగులు. నా స్థితి బాగా వుంది. ఎవరికో నేను శ్రమ అమ్ముకునే బదులు(దానికి తగ్గ ప్రతిఫలం ఎలాగు రావటంలేదు)
    నా ఇంటి కి నావాళ్ళ కి కోసం చేస్తే ఆత్మ సంతృప్తి కలుగుతుంది కదా అని అనుకున్నాను.
    తప్పని పరిస్థితి లో వున్నవాళ్ళు ఇంట బయట కష్ట పడాలి కాని కేవలం ఇంటిపని ని తప్పించుకోవడం కోసమో లేదా అది
    ఒక స్టేటస్ సింబల్ గానో కోసం మాత్రం కాదు.
    అందుకే నేను ఆ పరుగును ఆపేసి నిదానం గా నడుస్తూ
    నాకు నచ్చిన పదం simple living high thinking గాంధీ గారు అన్నట్లు గా
    ఏదో నాకు తోచిన సాయం చెస్తునాను.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీ ఉద్యోగం విషయం గురించి నేను వ్యాఖ్యానించటం బాగుండదు. అయితే , ఉద్యోగం మానివేసినా సొంతగా ఏదైనా ప్రారంభించి ఇతరులకు కూడా ఉపాధిని కల్పిస్తున్న వారెందరో ఉన్నారు.


      నా భర్త కూడా ఈ టార్గెట్ల గోలతో విసిగిపోతున్నానని తాను కూడా ఉద్యోగం మానేస్తానని అంటుంటారు. , ఈ గాడిద చాకిరీ చేసే కన్నా తక్కువ సంపాదన వచ్చినా ఫరవాలేదు నింపాదిగా చేసుకునే ఉద్యోగమో, వ్యాపారమో , వ్యవసాయమో చేసుకోవటం నయం అంటుంటారు.


      . అంత విసుగుగా అనిపిస్తే ఉద్యోగం మానెయ్యమనే నేను కూడా సలహా ఇచ్చానండి. తెలిసినవాళ్ళేమో బంగారం వంటి ఉద్యోగం, ఆయన మానేస్తానంటే నువ్వు కూడా తానా తందానా అనటం ఏమిటి ? అని నన్ను కోప్పడ్డారు.


      మెషీన్లా పనిచేసి ఆరోగ్యం పాడయితే అప్పుడు మరింత కష్టం కదా ! డబ్బు సంపాదనకు అంతం ఎక్కడుంది ? అన్నది నా అభిప్రాయం.


      అయితే తను ఇప్పుడప్పుడే ఉద్యోగం మానరేమో ? కానీ , విసుగొచ్చినప్పుడు అలా అంటుంటారు.


      నిజంగా నా భర్త ఉద్యోగం మానివేస్తానని అంటే గనక నాకు ఏమీ అభ్యంతరం లేదు.


      మేము మరీ అంత స్థితి మంతులం కాదుకానీ , డబ్బు కన్నా మనుషులు ముఖ్యం కదా !

      . తగినంత సంపాదన ఉన్నప్పుడు పరిగెత్తి అలసిపోయేకన్నా నింపాదిగా జీవించటమే మంచిది,. కుటుంబసభ్యులతో కూడా గడపటానికి సమయంలేని సంపాదన ఎందుకు ?అనే . అనిపిస్తుంది ........

      Delete