koodali

Friday, March 9, 2012

మన పూర్వీకులు ఎంతో దూరదృష్టి కలవారు.



ఈ బ్లాగును ప్రోత్సహిస్తున్న అందరికి అనేక ధన్యవాదాలండి.

ఈ టపా ఇంతకుముందు వ్రాసిన " ఇంటింటికో కధ " టపా కన్నా ముందు వేస్తే బాగుండేది . ఒకోసారి అంతే.
..............

తమ మాట వినని ,తమను గౌరవించని పిల్లల గురించి అదేపనిగా ఆలోచిస్తూ పెద్దవాళ్ళు తమ ఆరోగ్యాన్ని ఎందుకు పాడుచేసుకోవాలి ?


కొంతకాలం క్రిందట మేము ఒక ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో పెద్దవయస్సు గల భార్యాభర్తలు ఉండేవారు . ఆయనకు డెబ్భైఅయిదు ఏళ్ళకు పైనే వయస్సుంటుంది. ఆమెకు అరవై అయిదుకు పైనే వయస్సు ఉంటుంది. .


ఆయన ఉన్నత ఉద్యోగం చేసి రిటైరయ్యారు. మితభాషి . ఎక్కువగా ఏదో ఒకటి చదువుకుంటూ ఉండేవారు. ఆమె చుట్టుప్రక్కల అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరికీ సాయం చేస్తూ ఉండేవారు. ఆమెకు చాలా భాషలు వచ్చు. ఆమె ఆ వయసులో కూడా పనులన్ని చేసుకుంటూ ఉత్సాహంగా ఉండేవారు.


మేము అక్కడకు వెళ్ళక ముందు ... వారి కొడుకు కోడలు వారితో కలిసి ఉండేవారట. అత్తాకోడళ్ళకు అభిప్రాయాలు కలవక కొడుకు వాళ్ళు .... అదే ఊరిలో వేరే ఇంట్లో ఉంటున్నారట.
పిన్నిగారి కొడుకుకి తల్లితండ్రులంటే బాగా అభిమానం. తరచుగా వచ్చి పోతూ వారి బాగోగులు చూస్తుంటారు...


పిన్నిగారు నాకు కూడా మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆమె ఇంట్లోనే రకరకాల వంటలు వండేవారు. భార్యాభర్తలు బయటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారు కాదు. ( ఆరోగ్యానికి మంచిది కాదని ).


అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఆమె కొడుకు వాళ్ళ విషయాల గురించి అతిగా .
ఆలోచిస్తుండేవారు. అవన్నీ ఆలోచించి మనసు పాడుచేసుకోవద్దు.... అని ఆమె భర్త చెప్పినా పిన్నిగారు మనస్సును నిగ్రహించుకోలేకపోయేది.


అంకుల్ ఎక్కువగా మెడిటేషన్ చేస్తుండేవారు. పిన్నిగారు పూజలు చేసేవారు . కానీ కొడుకు కోడలు గురించే ఎక్కువగా ఆలోచిస్తుండేవారు. ఉదాహరణకు మా ఇంటికి వచ్చి గంటసేపు కూర్చుంటే ఎక్కువ సమయం కోడలికి తనకు ఎందుకు గొడవయ్యిందో లాంటి విషయాలే చెప్పేవారు.


చుట్టుపక్కల అమ్మలక్కలు ఆమె చెప్పేవి విని , ఆమె దగ్గర అయ్యో !
అంటూనే గొడవ పెరేగేవిధంగా మాట్లాడేవారు. సానుభూతి చూపటం అవసరమే కానీ , ఇద్దరిమధ్యన సమస్య వున్నప్పుడు..... వారి మధ్యన గొడవను తగ్గించాలి కానీ , గొడవ పెరిగేటట్లు మాట్లాడకూడదని నా అభిప్రాయం.


వారి కోడలు ఉద్యోగం చేసేవారు. ఆ అమ్మాయి కూడా ఆఫీసులో అందరితో కలుపుగోలుగా అందరికీ సాయం చేస్తూ మంచిపేరే తెచ్చుకుందట. . ఇక్కడ నాకు అర్ధం కాని విషయమేమిటంటే అత్తగారికి, కోడలికి ఇద్దరికీ కలుపుగోలు మనుషులుగా బయట మంచి పేరు ఉంది కదా ! మరి వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు కలుపుగోలుగా ఉండలేకపోయారో? అన్న విషయం నాకు అర్ధం కాలేదు.

అత్తగారి వాదన అత్తగారిది........ కోడలి వాదన కోడలిది. ఎవరి కోణం నుంచి చూస్తే వారికి .... వారి వాదన కరెక్ట్ అని అనిపిస్తాయికదా ! ,. నాకు అయితే ఇద్దరిలోనూ తప్పొప్పులు ఉన్నాయి అనిపించింది.


పాత గొడవల గురించి చెబుతూ అత్తగారు నాకు ఒక సంఘటనను చెప్పారు. కోడలు ఇంట్లోని గొడవలన్నీ ఆఫీసులో తోటి కొలీగ్స్ కు చెపితే .... ఆమె ఫ్రెండ్స్ కొందరు అత్తగారికి ఫోన్ చేసి మీరు కోడలిని ఎందుకు బాధ పెడుతున్నారని అడిగారట. బయటి వాళ్ళు అలా అడగటం అత్తగారికి ఆగ్రహాన్ని తెప్పించగా గొడవ మరింత పెద్దదయ్యిందట. ఇంటి గొడవలో బయటి వారు దూరటం పిన్నిగారికి నచ్చలేదు.


పిన్నిగారి కోడలు కూడా ఆఫీసులోని వారికి .... తన అత్తగారిని తిట్టేంత చనువు ఇవ్వటం తప్పు అని నాకు అనిపించింది.


అయితే, నేను ఆమెతో ఏమన్నానంటే " ఇప్పుడు మీరు నాతో చెప్పినట్లే మీ కోడలు కూడా తన ఫ్రెండ్స్ తో చెప్పిందేమో పిన్నిగారూ ! అయితే బయటివాళ్ళు మీకు ఫోన్ చేయటం చాలా తప్పు. వాళ్ళు మీకు ఫోన్ చేసిన సంగతి మీ కోడలికి తెలిసి జరిగినా ... తెలియక జరిగినా అది చాలా తప్పు " అన్నాను...... ఇలా నేను కోడలివీ , అత్తగారివీ ఇద్దరి తప్పులు ఎత్తిచూపించి మీరు ఇద్దరూ సర్దుకుపోయినట్లయితే బాగుండేది. అన్నాను.


( నిష్పక్షపాతంగా న్యాయం చెప్పాలనుకుని అలా అన్నాను అంతే. . తరువాత కొన్నాళ్ళు ఆమె నాతో మాట్లాడలేదన్నది పాఠకులు గ్రహించగలరు. నేను ఇప్పటికీ మారలేదు కదా ! బ్లాగుల్లో ఉన్నదన్నట్లు నాకు తోచింది వ్రాసి ఇతరులకు కోపం తెప్పిస్తుంటాను కదా ! )


కొన్నాళ్ళ తరువాత మళ్ళీ ఆమె నాతో మాట్లాడారులెండి.


పిన్నిగారు ..వారి కోడలు మధ్య జరిగిన గొడవలు వింటే మనకు తెలిసేది ఏమంటే....అవన్నీ అందరి ఇళ్ళలో ఉండే గొడవలే.



ఈ అత్తాకోడళ్ళ గొడవలన్నీ చూసి కొడుకు .. తాను పెళ్లి అనేది చేసుకోకుండా ఉంటే బాగుండేది అన్నాడట. అత్తాకోడళ్ళు గొడవ పడితే ఇంట్లో అందరికీ సమస్యే కదా మరి !



చాలా మంది పెద్దవాళ్ళు ..... తమ . పిల్లలకు పెళ్లి అయేవరకు పెళ్లి చేసుకొమ్మని గొడవ చేస్తారు. . ఇక పెళ్లి అయిన తరువాత ....... తమ పిల్లలు తమకు దూరం అవుతారేమో ? అని భయపడతారు. .

పెళ్లి తరువాత పిల్లలు...... తమ అమ్మానాన్నతో పాటు........ అత్తా మామ గారిని కూడా గౌరవించవలసి ఉంటుంది.
...... ఇది అందరు అర్ధం చేసుకున్నప్పుడు గొడవలు పెరగవు..


పిన్నిగారు .... కొడుకు కోడలు గురించి వర్రీ అవుతుంటే ఆమెకు నచ్చచెప్పటానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. పిన్నిగారూ ! ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యనే అభిప్రాయభేదాలు వస్తున్నాయి. కోడలు... మీలా ఆలోచించటం లేదని అదేపనిగా చింతించటం వల్ల వాళ్ళు మారకపోగా.... మీ ఆరోగ్యమే పాడవుతుంది .అని చెప్పేదాన్ని... .
అయితే ఇతరులకు చెప్పుకోవటం వల్ల మనస్సుకు కొంచెం ఉపశమనం కలుగుతుందని పిన్నిగారు అలా చెప్పేవారు.


ఎక్కువగా వర్రీ అయితే అల్సర్స్ వస్తాయని వైద్యులు అంటారు కదా ! .తరువాత ఆమెకు అల్సర్ వచ్చి బాధ పడ్డారు.


తరువాత కొంతకాలానికి మేము కొద్దిదూరంలో వేరే ఇంటికి మారాము. ఇంక పిన్నిగారి కబుర్లు అంతగా తెలియలేదు.


ఒకరోజు సడన్ గా మాకు తెలిసిన కబురు ఏమిటంటే ..... పిన్నిగారికి లైట్గా పక్షవాతం వచ్చిందని, హాస్పిటల్లో ఉన్నారని. తెలిసి నాభర్తా నేనూ వెళ్ళి చూసివచ్చాము అంతే . (
ఇరుగుపొరుగు వారు ఎన్ని కబుర్లు చెప్పినా అనారోగ్యం వస్తే కుటుంబసభ్యులే కదా దిక్కు. )


పిన్నిగారి భర్తకు చాలా విషయపరిజ్ఞానం ఉంది. పెరాలసిస్ వచ్చినవారిని వీలయినంత త్వరగా హాస్పిటల్లో చేర్పిస్తే కోలుకునే అవకాశాలు ఉన్నాయట.


ఆమె అదృష్టం వల్ల స్ట్రోక్ వచ్చిన గంట లోపే భర్త గమనించి ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. ఇక పిల్లలు వచ్చారు. కోడలు కూడా వచ్చి కొంతకాలం చూసింది. పిన్నిగారి భర్త పిన్నిగారిని చూసుకోవటానికి .... ఇంట్లోనే ఉండే ఒక నర్సును ఏర్పాటు చేసారు.... వంటకు ఒక ఆమెను ఏర్పాటు చేసారు...... , ఇంటిపనికి అదివరకే ఒక ఆమె ఉంది. ఇలా ఇల్లంతా గజిబిజి అయిపోయింది. ఇంటి ఇల్లాలు మూలన బడితే ఇల్లు అలాగే అయిపోతుంది మరి.


ఒకరోజు నేను ఆమెను పలకరించటానికి వెళ్ళాను.... ఆమె పరిస్థితి బాగా మెరుగయింది .బాగానే మాట్లాడుతోంది . చిత్రమేమిటంటే ఆమెకు అన్ని విషయాలూ పూర్వంలానే గుర్తున్నాయి. , నర్స్ ఆమెను బాత్రూంకు తీసుకువెళ్ళటం, స్నానం చేయించటం.....ఇవన్నీ చేసేది. . ఒక ఫిజియోధెరపిస్ట్ ఇంటికి వచ్చి చికిత్స చేసేవారు. .



నేను వెళ్ళినప్పుడు పిన్నిగారు ఏం చెప్పారంటే ... ఆ నర్సు అందరి ముందు బాగానే ఉంటుందట. ఎవరూలేనప్పుడు ఈమెను కొద్దిగా గదమాయిస్తుందట. ఈ విషయాలను నర్సు దూరంగా వెళ్ళినప్పుడు చూసి
పిన్నిగారు
రహస్యంగా నాతో చెప్పారు. ఇవన్నీ చూసి నాకు బాబోయ్! .... జీవితమంటే ఇలా కూడా ఉంటుందా ? ఇందుకే కాబోలు పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అనిపించింది.


( మనలో మాట....పెద్దవాళ్ళకు అనారోగ్యం వచ్చి మంచాన పడితే చూసుకోవటానికి ..... సొంత పిల్లలకే అంత ఓపిక ఉండటం లేదు. .ఇక నర్సు అలా విసుక్కోవటంలో అంత ఆశ్చర్యం ఏముంది అనిపించింది .)


ఇంతలో నర్సుకు వివాహం నిశ్చయం అయి వెళ్ళిపోవటంతో , క్రొత్త నర్సును వెతికి ఏర్పాటుచేసారట. ఇలా రోజులు భారంగా గడుస్తుండగా ..... సరిగ్గా తినీతినకా పెద్దాయన ఆరోగ్యం పాడయింది. విరోచనాలు, వాంతులతో తేరుకోలేక నీరసించిన పెద్దాయన వారం రోజులు హాస్పిటల్లో చికిత్స తరువాత పరమపదించారు.


పిన్నిగారికి ఇక అసలు కష్టాలు మొదలయ్యాయి.కొన్నాళ్ళ తరువాత ఆమెను కూతురు తన ఇంటికి తీసుకెళ్ళిందట. ప్రస్తుతం పిన్నిగారు కూతురు వద్దనే ఉంటోంది.. కూతురు ,అల్లుడు , కూతురు అత్తగారు .... బాగా చూసుకుంటారట. ( నిజంగా వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనిపిస్తుంది. )


కానీ ఆమెకు తన ఊరు వచ్చేసి ఉండాలని ఉంది. కూతురును ఎందుకు ఇబ్బంది పెట్టాలి . అని ఆమె అభిప్రాయం. కూతురి అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనీ కూడా పిన్నిగారికి మొహమాటం.


తనకు తోడుగా ఇంతకు ముందు తమ ఇంట్లో పనిచేసిన అమ్మాయిని పనిలో కుదుర్చుకుని..... పాత ఇంట్లో తాను ఉండటం తనకు ఇష్టం . అని ఆమె అంటున్నారు. అయినా మన ఇష్టాఇష్టాలు నెరవేరటం అన్నది .. మన చేతుల్లో ఉందా ఏమిటి ? అనిపిస్తుంది ఇలాంటివి వింటుంటే.


పిన్నిగారి అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసుకుని ఈ మధ్యనే ఫోన్ చేసాను. పిన్నిగారు నెమ్మదిగా నడవగలుగుతున్నారట,.... ఎంతైనా ఆమె మాటలో పూర్వపు స్పష్టత రాలేదు. ఆమెకు ఇప్పటికీ పాత సంగతులన్నీ చక్కగా గుర్తున్నాయి.


పిన్నిగారిని తలచుకున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ......ఆమె కుటుంబసభ్యుల గురించి ఎక్కువగా ఆలోచించి వర్రీ అవకుండా ఉన్నట్లయితే ఆమెకు అలాంటి అనారోగ్యం వచ్చేది కాదేమో ? అనిపిస్తుంది.


ఇంకో విషయం ఏమంటే పిన్నిగారితో మాటపట్టింపులు వచ్చి వెళ్ళిపోయిన కోడలికి ఏదో అనారోగ్య కారణాల వల్ల ఇప్పటివరకూ సంతానం కలగలేదు.

 

పెద్దవాళ్ళూ పిల్లలూ సర్దుకుపోయి .... సరిపెట్టుకుని జీవించినప్పుడే కుటుంబంలో అన్నీ మంచిగా కలిసివచ్చి .....సంతోషం వెల్లివిరుస్తుంది . అలాకాకుండా అందరూ ఒకరి మనసును ఒకరు కష్టపెట్టుకోవటం వల్ల ..... అందరికీ కష్టాలు కలిగే అవకాశం ఉంది. అనిపిస్తుంది.


అత్తగారు కోడలిని కోప్పడితే .....తన తల్లి అయినా తనను కోప్పడుతుంది కదా ! అని కోడలు సర్దుకు పోవాలి. కోడలు ఏమైనా పొరపాటు చేస్తే..... తన కూతురు అయినా పొరపాట్లు చేస్తుంది కదా ! అని అత్తగారూ సర్దుకు పోవాలి. ఇవన్నీ చెప్పటానికి తేలికగానే ఉంటాయి. ఆచరించటం కష్టమేలెండి.


ఏమిటో జీవితం. బంధాలూ అనుబంధాలూ...ఇవన్నీ కొందరి విషయంలో బందిఖానాలూ...


మనశ్శాంతి కోసం మన శ్రేయోభిలాషులతో ..మనకు వచ్చిన కష్టాన్ని చెప్పుకోవటం మంచిదే . దానివల్ల గుండెబరువు తగ్గుతుంది, అలా చెప్పటం వల్ల మంచి వారి నుంచి చక్కటి సలహాలూ లభిస్తాయి. అయితే వాటితో పాటూ మనకు మనస్సుని నిగ్రహించుకునే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించాలి.... .



ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే...... మన పూర్వీకులు ఎంతో దూరదృష్టి కలవారు. ఇవన్నీ ఆలోచించే కాబోలు.... తామరాకుమీద నీటిబొట్టులా జీవించ గలిగితే అందరికీ మంచిది అని చెప్పారు .


పూర్వీకులు నాలుగు రకాల ఆశ్రమధర్మాలను చెప్పారు. రోజుల్లో ఆశ్రమధర్మాలను ఆచరించగల మహానుభావులు అరుదుగా ఉంటారేమో? అనిపిస్తుంది. మనలాంటి సామాన్యులు అవన్నీ ఆచరించలేకపోయినా  తాపత్రయాలను కొద్దిగానైనా తగ్గించుకోవటానికి అలా తగ్గించుకోవటానికి కనీసం ప్రయత్నించగలిగితే మనకే మంచిది అనిపిస్తుంది..


2 comments:

  1. జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది. ఏ పాఠం మరిచిపోతే దానికి దెబ్బలు తగులుతాయి, మరి.

    ReplyDelete
    Replies
    1. అవునండి. మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం.
      . మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete