గృహిణి అంటే పని అంతగా ఏముంటుంది ? అనుకుంటారు చాలామంది.
నాకయితే పని ఎక్కువగానే ఉంటుంది. అంటే నేను అలా పని కల్పించుకుని బిజీగా ఉంటాను అన్నమాట. .
నాకు తోచినంతలో పూజ చేస్తాను.
వంట చేయటం, ఇల్లు సర్దుకోవటం, ఇవన్నీ ఎలాగూ ఉంటాయి.
ఇంట్లో పని అంటే పాత్రలు శుభ్రం చేయటం, బట్టలు ఉతకటం ఇవన్నీ కూడా నేనే చేస్తాను.
వాషిగ్ మెషీన్ ఉంది కానీ , అప్పుడప్పుడూ వాడుతాము అంతే. .
పనికి సాయంగా ఎవరినీ పెట్టుకోలేదు. గత మూడు సంవత్సరాలనుంచీ నేనే ఇంటిపని చేసుకుంటున్నాను. దానికి కారణాలు ఉన్నాయి లెండి.
వాళ్ళు వస్తారో రారో అని రోజూ ఎదురుచూడటం, వాళ్ళు వచ్చినా ఒక పూటే వస్తున్నారు ఈ రోజుల్లో .
మరి రాత్రి వంట చేసిన పాత్రలు నేనే శుభ్రం చేసుకోవాలి కదా ! .
ఒక పూట పనికోసం వాళ్ళు ఎందుకులే ! అని మానిపించేసాను.
ఇప్పుడయితే నేనే ఇంటి పనంతా చేస్తున్నానని ఇంట్లో వాళ్ళ వద్ద క్రెడిట్ పొందవచ్చు కదా !
ఎవరినైనా పనికి మాట్లాడుకోమని మా పెద్దవాళ్ళు కోప్పడుతుంటారు. . . . . విదేశాల్లో చాలామంది వారిపని వారే చేసుకుంటారట ! అని నేను వాళ్ళతో అంటాను.
అయినా ఎవరి పని వారు చేసుకుంటే తప్పేముందిలెండి.
నేను ఇంటి పని చేసుకోవటానికి ఇంకో కారణమేమిటంటే మా పెద్దవాళ్ళకి డయాబెటిస్ వ్యాధి ఉంది.
ఆ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలున్నాయట. ఆ వ్యాధి వస్తే బోలెడు ఎక్సర్ సైజులు చేయాలట.
అలా జాగింగులు గట్రా చెయ్యటం నావల్ల కాదు.
అందుకని వ్యాధి రాకూడదని ముందు జాగ్రత్తగా ఇలా పని చేసుకుంటున్నాను . మన ప్రయత్నం మనం చేస్తే ఫలితం దైవాధీనం కదండి.
డయాబెటీస్ ఉన్నవారు రోజూ రెండు రాతిఉసిరికాయలు ( పచ్చివి ) మిక్సీలో రసం తీసుకుని ఉదయాన్నే త్రాగితే చాలా మంచిదట.
మా పెద్దవాళ్ళు ఇలాగే చేస్తుంటారు. ఆ వ్యాధి బాగా కంట్రోల్ అయింది. ( అంటే వ్యాధి ఇంకా పెరగలేదు. )
అసలు ఉసిరి కాయ చాలా వ్యాధులకు మంచిది.
ఇప్పుడు ఉసిరికాయలు బాగా దొరుకుతాయి, ఇప్పుడు ఎండబెట్టి ముక్కలు ,చేసి నిలవపెట్టుకోవచ్చు, పొడి, పచ్చడి చేసుకోవచ్చు.
కొందరు తేనెలో, పంచదారపాకంలో నిలువచేసుకుంటారు. ఉసిరితో చేసే చ్యవనప్రాశ ఎప్పుడూ దొరుకుతుంది.
*******
ఇంకా నాకు వార్తాపత్రికలు పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టం. .
వార్తాపత్రికలు చదవటమంటే చాలామందికి బోర్. కానీ నాకు చాలా ఇష్టం.
ఇలాంటి మంచి అలవాటు కలిగించినందుకు నేను దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
పుస్తకపఠనం ఆసక్తి ఉన్నవారికి బోర్ అనే సమస్యే ఉండదు. సమయం చక్కగా గడిచిపోతుంది.
కొంతకాలం క్రిందట దైవం దయ వల్ల M. A ( చరిత్ర ) ప్రైవేటుగా చదివి పూర్తిచేశానండి.
ఇంకా ఈ మధ్యనే ఒక ఆమె వద్ద సంగీతం నేర్చుకోవటానికి వెళ్తున్నాను.
సంగీతం ఒక మహాసముద్రం. ఎంత నేర్చుకున్నా తరగదు.
సంగీతం సరిగ్గా నేర్చుకోవాలంటే చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. నాకు సమయం సరిపోక సరిగ్గా వెళ్ళటం లేదు.
ప్రస్తుతానికి వెళ్తున్నాను. ఎంతకాలం నేర్చుకుంటానో తెలియదు.
ఇక బ్లాగు మొదలుపెట్టాక ఇంకా బిజీ అయిపోయింది. మరి అందరూ ఎలా వ్రాస్తున్నారో తెలియదు.
నేను పని త్వరగానే చేస్తాను. అయినా ఎంత చేసినా సమయం సరిపోవటం లేదండి.
అయినా నేను ఇలా బ్లాగు వ్రాయటం ఏమిటో తలుచుకుంటే అత్యంత ఆశ్చర్యంగా ఉంటుంది నాకు.
ఇది దైవం వేసిన భిక్షగా అనుకుంటున్నాను నేను.
ఒక సంవత్సరం కన్నా వ్రాయగలనా ? అనుకున్నాను. ఇంకా వ్రాస్తున్నాను మరి.
బ్లాగుల్లో అందరూ ఎంతో విషయపరిజ్ఞానం కలిగినవారుంటారు. నేను ఏం వ్రాయగలను ? అని భయపడ్డాను.
ఏదో దైవం దయవల్ల నాకు తెలిసినంతలో వ్రాస్తున్నానండి. ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు, .
నేను గృహిణిని అయినా కూడా ఇంటిపనీ, సంగీతం క్లాసులు, బ్లాగులు చూడటం, పత్రికలు చదవటం , టివీలో కొన్ని ప్రోగ్రాములు చూడటం ఇలా చాలా బిజీ అన్నమాట.....
అంతా దైవం దయ.
మీకు తెలియనిదనుకోనుగానీ, అయినా చెప్పాలనిపించింది...మిమ్ముల్ను మీరు ఒక సాధారణ గృహిణిగా మాత్రమే అనుకోకండి. మీరొక Home Maker. కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటే ఆ యూనిట్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. మీ భర్త, మీరు కలిసే కదా, దానిని ముందుకు తీసుకెళ్ళాల్సింది. ఇలాంటి కుటుంబాలు కలిస్తేనే కదా సమాజం ఏర్పడేది. అందుకని మీరు చేస్తున్న పని సామాన్యమైనదికాదని, అదొక బృహత్తర బాధ్యత అని మీరు గుర్తుంచుకోవాలని నా అభిప్రాయం. ప్రతి గృహిణి కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది.
ReplyDeletehi
ReplyDeleteపెళ్ళికాకముందు నేను కూడా పెద్ద పట్టించుకునేదాని కాదు కానీ యిప్పుడే తెలుస్తునోంది ఐన ఇవికాక మీరింకా సంగీతం కూడా నేర్చుకుంటునారు.ur great.dont degrade ur self by saying mamulu gruhini.ur a homemaker.
" ur great.dont degrade ur self by saying mamulu gruhini.ur a homemaker."
ReplyDeleteహోం మేకర్ అనే పదం గృహిణి కన్నా ఎలా వున్నతమైన పదము?!
"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి" అన్నారు. హోం మేకర్ అంటే గృహనిర్మాణ కార్మికురాలు అనే అర్థం వస్తుంది, అది ఓ పని మాత్రమే. గృహిణి అనేది ఓ బాధ్యత.
తేజస్వి గారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteస్వాతి గారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఅజ్ఞాత గారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఅందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteకొన్ని కారణాల వల్ల రిప్లై వ్రాయటం ఆలస్యమయింది. సారీనండి.
గృహిణి అంటే నేను తక్కువగా భావించటం లేదండి.
కుటుంబం పట్ల బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే అది గొప్ప విషయమే కదా !
"కుటుంబాలు కలిస్తేనే కదా సమాజం ఏర్పడేది ." అన్నదే నా అభిప్రాయం కూడా..