మేము క్రితం సోమవారం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్ళాము. ఇలాంటి చోట్ల ప్రశాంతంగా దైవదర్శనం జరగాలంటే పండుగల రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లోనే వెళితే బాగుంటుంది.
సరే వెళ్ళాము . దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాము.
కొంత దూరం వెళ్ళాక , ఏ.టి.ఎం వద్దకు వెళ్ళి ఇప్పుడే వస్తానని నా భర్త రోడ్డు పక్కన కారు పార్క్ చేసి వెళ్ళటం జరిగింది.
అక్కడే అరుగు మీద కూర్చున్న ఒక వ్యక్తి కారు టైరులో గాలి తగ్గిందని గమనించి మాకు చెప్పటం జరిగింది.
అప్పటికే సాయంత్రం అవుతోంది. ఇలా జరిగిందేమిటి ? అని విచారిస్తున్నంతలో , నా భర్త తిరిగి వచ్చారు.
పరీక్షిస్తే టైరు పంచర్ కూడా జరిగిందని తెలిసింది.
అక్కడున్న వారిని మెకానిక్ ఎక్కడ ఉంటారని అడగగా కొంచెం దూరంలో ఉంటారని చెప్పారు.
ప్రక్కనే ఉన్న వేరొక కారు డ్రైవర్ సహాయంతో టైరు మార్చటం జరిగింది.
( దైవం దయ వల్ల టైరు ప్రాబ్లం ఊరు దాటక ముందే ఎదురయ్యింది. ఊరు దాటినతరువాత వస్తే ? ఎంతో కష్టమయ్యేది కదా !. అంతా దైవం దయ. అనుకున్నాము. )
టైరు మార్చటం జరుగుతుంటే నేను కారు దిగి బయట నుంచుని చుట్టూ చూస్తుంటే అక్కడున్న వారు కొందరు ఏదో చూస్తున్నారు.
ఏమిటా ? అని నేనూ చూశాను. ఒక చిన్న పాప ఏడుస్తూ నడిచి వెళ్తోంది. పాపం తప్పిపోయింది అనుకుంటున్నారు.
పాప అలా నడిచి వెళ్తూ ఉంది.
నేను ఆ పాప దగ్గరకు వెళ్ళి నీ పేరు ఏమిటి ? అని వివరాలు అడిగితే ఆ పాప ఏడవటం తప్పా ఏమీ చెప్ప లేదు.
నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. అప్పుడు ఆ పాపను ఎత్తుకుని అక్కడకు కొంచెం దూరంలో ఉన్న పోలీసు వారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాను.
ఆ పోలీసులు ఏమన్నారంటే, గుడికి ఎదురుగా తప్పిపోయిన వారిని అప్పగించే కేంద్రం ఉంది అక్కడ అప్పగిస్తారా ? అన్నారు.
( ఉదయం నుంచీ జనం రద్దీ వల్ల వాళ్ళూ బాగా అలసటగా కనిపించారు. పాపం వాళ్ళూ ఎంతకని చేయగలరు. )
నేను, ఆ పాపను ఎత్తుకుని వెళ్తుంటే , ఇదంతా చూస్తున్న ఒకతను నా వద్దకు వచ్చి గుడి కొంచెం దూరంగా ఉంది కదా ! నేను అప్పగిస్తాను అన్నాడు.
నాకు ఇవ్వాలనిపించక మా అబ్బాయిని తోడు తీసుకుని గుడి దగ్గరకు వెళ్ళాను.
( అప్పటికి నడిచి కాళ్ళు నెప్పులుగా ఉన్నాయేమో ఎత్తుకున్న తరువాత పాప ఏడవలేదు. )
గుడి వద్దకు చేరుకుని తప్పిపోయినవారిని అప్పగించే ప్రదేశం ఎక్కడ ఉందా ? అని వెతికాము. మాకు కనిపించలేదు.
చుట్టుప్రక్కల వారిని అడిగితే, కొందరు ఇటువెళ్ళండి అన్నారు. కొందరు అటు వెళ్ళండి అన్నారు.
మేము అలా వెతుకుతుండగా ఒక భార్యా భర్తా హడావుడిగా మా వద్దకు వచ్చారు.
గ్రామీణుల్లా ఉన్నారు . వారి వద్ద చంటి వయస్సు గల ఒక బిడ్డ , కొద్దిగా పెద్ద వయస్సు గల ఇంకొక బిడ్డ ఉన్నారు.
వారు నా దగ్గరున్న పాపను వాళ్ళమ్మాయి అని చెప్పి ,పాపకేసి చేయి చాపారు.
పాప కూడా వారిని చూడగానే తల్లి చేయి చాపగానే నవ్వు ముఖంతో తల్లి వద్దకు వెళ్ళింది.
( ఆ పెద్దవాళ్ళు కొద్దిగా ఏడుస్తున్నారు కూడా . )పాపను తీసుకుని కళ్ళనీళ్ళతో నాకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పటం కూడా జరిగింది.
అయినా నాకు కొంచెం అనుమానాలు ఎక్కువ కదా !
వీళ్ళు ఆ పాప తల్లిదండ్రులేనని ఏమిటి నమ్మకం ? అని అనుమానం వచ్చి పాపను అడిగాను. ( ఈ మాత్రం ఆలోచన రావటం దైవం దయే. )
వీళ్ళు ఎవరు ? నీకు తెలుసా ? అని అలా అడిగాను.
కానీ ,ఆ పాప ఏమీ చెప్పలేదు. కానీ, తల్లి ఎత్తుకునే సమయంలో నేను ఆ పాప ఫీలింగ్స్ గమనించాను.
పాప కొత్త లేకుండా గబుక్కున వారి వద్దకు వెళ్ళింది.
ఇదంతా చుట్టూ కూర్చున్న జనం చూస్తూనే ఉన్నారు. వాళ్ళకు విషయం అర్ధమయిందో లేదో తెలియదు. ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది.
ఇక నేనూ, మా అబ్బాయి ఎంతో సంతోషంగా తిరిగి కారు వద్దకు వస్తుంటే ,కొంచెం దూరం వెళ్ళాక నాకు ఏమనిపించిందంటే ,
తప్పిపోయినవారిని అప్పగించే ప్రదేశం వద్దకు వెళ్ళి ... అక్కడ ఈ పాపను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తే మరింత బాగుండేది కదా ! అనిపించింది.
వెంటనే తిరిగి వచ్చాము. చూస్తే అక్కడెవరూ లేరు.
అంతకుముందు అక్కడున్న వారికి ఈ కధంతా చెప్పి మేము వెళ్ళిన తరువాత ఆ తల్లిదండ్రుల ప్రవర్తన ఎలాగుంది ? అని అడిగాను.
వారు ఏమన్నారంటే , పాప వారి వద్దకు బాగానే వెళ్ళింది కదండీ . తల్లిదండ్రులే అయ్యుంటారు. అన్నారు.
నేను అన్నాను.... పాప నా దగ్గరకు కూడా వచ్చింది కదా ? అన్నాను.
చుట్టుప్రక్కల వాళ్ళు ఇంకా ఇలా అన్నారు..... వాళ్ళు ఆ పాప తల్లిదండ్రులు లాగానే ఉన్నారులెండి. అన్నారు.
ఇక చేసేదేమీ లేక, తిరిగి కారు వద్దకు వచ్చేసి జరిగింది నా భర్తకు, మా అమ్మాయికి, ఇంకా అక్కడివారికి చెప్పాను.
తరువాత ,ఎందుకయినా మంచిదని మెకానిక్ వద్దకు వెళ్ళి కారు రిపేరు చేయించాము.
మళ్ళీ ఎక్కడన్నా టైరుపంచర్ సమస్య వస్తుందేమోనని భయపడ్డాము కానీ, ఆ సమస్య రాలేదు. దైవం దయవల్ల క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకున్నాము.
ఆ పాప తల్లిదండ్రి వద్దకు చేరిందని సంతోషంగానే ఉన్నా కూడా , తప్పిపోయినవారిని అప్పగించే కేంద్రం వెతికి అక్కడ ఈ అప్పగింతలు జరిగితే మరింత చక్కగా ఉండేది కదా ! అనుమానం లేకుండా . అనిపించింది.
ఏం చెయ్యను. నాకు అప్పుడు అంతకన్నా తోచలేదు మరి . ఇక దైవం దయ అంతే.
జీవితంలో ఒకోసారి మనకు ఇలా అనిపిస్తుంటుంది కదా ! . అరే ! అప్పుడు ఇలా కాకుండా ఇంకోలా చేసి ఉంటే బాగుండేది కదా ! అని.
* అందుకే మన తెలివితేటలు ఎంతో గోప్పవి అని మనం ఎప్పుడూ అనుకోకూడదు.
* మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించటమే తెలివైన వాళ్ళు చేయవలసిన పని.
జీవితంలో మనకు కూడా ఆపదలో సహాయం చేసేవారు ఎందరో ఎదురవుతారు.
ఉదా..కారు సమస్య వచ్చినప్పుడు అపరిచితులైన డ్రైవరు, మెకానిక్ సహాయపడటం వంటివి, ఇలా ఎందరో అపరిచితులు మనకు కూడా సహాయపడుతుంటారు.
ఇతరులకు సాయం చేయటంలో నా స్వార్ధం కూడా ఉందిలెండి. ఇతరులకు సాయం చేస్తే మనకు మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్పారు కదా !
అంతా దైవం దయ....
అనుమానాలు ఎక్కువగా పెట్టుకొంటే అశాంతే నని చెప్పక చెప్పారు !!!
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteనిజమేనండి మీరన్నట్లు అనుమానాలు ఎక్కువపెట్టుకుంటే అశాంతే. కానీ, లోకంలో జరిగే సంఘటనలు చూస్తుంటే ఎంత వద్దన్నా అనుమానాలు వస్తుంటాయి.
ఫలితం విషయంలో దైవం మీద భారం వేసి మన ధర్మాన్ని మన నెరవేర్చటం వల్ల శాంతి లభిస్తుంది.
నిజమే, కానీ అంతటి స్థితప్రజ్ఞత రావాలంటే దైవకృప కావాలి. దైవకృప పొందాలంటే ఎన్నో సత్కర్మలు ఆచరించాలి...
సరైన పనే చేశారు. చేసిన తరువాత మళ్ళీ దాని గురించే ఆలోచించారంటే, వదిలిచ్చుకోవడమనే భావన కాకుండా, మీ వంతు బాధ్యతని చక్కగా నిర్వర్తించాలనే తనప ఉన్నట్టే కదా? All's well that ends well...
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఇలాంటప్పుడు మరింతగా తెలుస్తుందండి , దైవం యొక్క చాతుర్యం ముందు మనిషి తెలివితేటలు ఎటువంటివంటే, హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయటం వంటివి అని...
మీ బ్లాగ్ హెడర్ లో ఉన్న ఫోటో చాలా బాగుందండీ! ఎక్కడిదీ ఫోటో?
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఈ ఫోటో ఎక్కడిదో నాకూ తెలియదండి. కంప్యూటర్లో చూసి బాగుందని కాపీ చేసేసాను..
manchi pani.. chesaaru. bhaadyataayutamaina poururaaligaa chesaaru. abhinandanalu.
ReplyDeleteమీకు కృతజ్ఞతలండి.
ReplyDeleteనేను చేసింది చిన్న సహాయమేనండి .
అప్పుడు నాకు ఆ పాపకు సహాయం చేయాలన్న తపనా ఉంది .....
దాంతోపాటు , ఇలా ఇతరులకు సహాయం చేయటం వల్ల వచ్చే పుణ్యం .... మనల్నీ ఆపదల్లో ఆదుకుంటుంది కదా ! అనే . స్వార్ధమూ ఉందండి....
మీరు చేసిన పని కడు ప్రశంసనీయం! ఎదుటి వారికి సహాయం చేస్తే కలిగే ఆనందం అమృత తుల్యమయిన వస్తువులలో ఒకటి అని అంటారు పెద్దలు! కనుక ఆ అమృత ధారలో తడవండి ఎటువంటి అనుమానాలూ సంశయాలూ లేకుండా!
ReplyDeleteనేను చేసింది చిన్న సాయమే అయినా మీరందరూ అభినందిస్తున్నారు. మీకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీరు చెప్పినది నిజమేనండి. ఎదుటివారికి సహాయం చేస్తే కలిగే ఆనందం అమృతతుల్యమయినది. వారి కళ్ళలో కనబడే ఆనందం స్వచ్చమైనది. దానివల్ల మనకూ ఆనందం కలుగుతుంది.
ఆపాప ఇంతకూ వారి పాపేనా? ఆ తల్లిదండ్రుల చిరునామా, ఫోన్ సంఖ్య తీసుకుని వుండాల్సింది.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్య చూశాను. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు సారీనండి.
ReplyDeleteటపాలో వ్రాసినట్లుగా ....... తప్పిపోయిన పిల్లలను అప్పగించే కేంద్రం కోసం వెతుకుతుండగా ఇంతలో తల్లిదండ్రులమని వచ్చినవారికి అప్పగించాము. వారి చిరునామా కనుక్కోవాలన్న ఆలోచన నాకు రాలేదండి. ఆ పాప వారి దగ్గరకు ఏడవకుండా బాగానే వెళ్ళింది మరి. నేను పాపను వారికి అప్పగించి తిరిగివెళ్తుండగా నేను పిల్లలను అప్పగించే కేంద్రం ఎక్కడుందో వెతికి వారి సమక్షంలో ఆ పాపను తల్లిదండ్రులకు అప్పగిస్తే బాగుండేది అని అనిపించింది. వెంటనే తిరిగి వెళ్ళినా వారు అక్కడ లేరు.
కొద్దిసేపు ముందు ఈ ఆలోచన ఎందుకు రాలేదో నాకే అర్ధం కాలేదండి. ఆ పాప వారి పాపేనని నాకు అనిపించింది. మరి వారు పాప తల్లిదండ్రులా కాదా అన్నది భగవంతునికే తెలియాలి. ఈ టపా చదివాక ఇలాంటి సంఘటన ఎవరికైనా ఎదురైతే వారైనా జాగ్రత్త ఆలోచించి వ్యవహరిస్తే బాగుండు.. ..