క్రితం సోమవారం ప్రసిద్ధ దేవాలయానికి వెళ్ళాము కదండి. అబ్బో విపరీతమైన రద్దీగా ఉంది.
దేవాలయాల్లో ధర్మదర్శనంతో పాటూ , 100 , 200 రూ... ఇలా టికెట్ దర్శనాలు కూడా ఉంటాయి కదా !
ఇలా టికెట్ కొని దైవదర్శనం చేసుకోవటం అనే విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి.
దేవుని దగ్గర అందరూ సమానమే కదా ! ఇలాంటి సిస్టం ఎందుకు ? అని కూడా అనిపిస్తుంది. అయితే , మేము కూడా ఇలా టికెట్ కొని వెళ్ళవలసి వచ్చింది
. ధర్మదర్శనానికి, టికెట్ కొన్న వారికి వేరువేరు క్యూలైన్స్ ఉన్నాయి. మేము వెళ్ళి క్యూలో నిలుచున్నాము.
అప్పటికి ఎంతోసేపట్నించీ దర్శనాలు ఆపేసారట.
కొందరు చెప్పటమేమంటే ఎవరో వీఐపీలు వచ్చారట. అందుకే సామాన్యభక్తులకు దర్శనాలు ఆపేసారని చెప్పుకుంటున్నారు.
ప్రక్క క్యూలైన్లో వాళ్ళు ఉదయం 2 గంటల నుంచీ లైన్లోనే ఉన్నారట చిన్నపిల్లలతో సహా. దాంతో వారు నీరసంతో వచ్చే విసుగుతో ఉండటం సహజమే కదా ! .
ఇంతలో మేము ఉన్న క్యూలైన్లోని వారిని దర్శనానికి వదిలారు.
ఇది చూసి అప్పటికే ఉదయం నుంచీ వేచి ఉన్న ధర్మదర్శనం భక్తులు ఇది అన్యాయం. అని డబ్బు పెట్టి టికెట్ కొన్నవారికే దైవ దర్శనమా ? అని అనటం జరిగింది.
వాళ్ళు అన్నది న్యాయమే కదా ! ఇదంతా చూసి నాకు సిగ్గనిపించింది.
మేము పెద్దగా వెయిట్ చేయకుండానే ముందుకు వెళ్ళటం న్యాయం కాదు అనిపించింది.
నేను నా భర్తతో అన్నాను. మనం ఇప్పుడేకదా వచ్చాము . కొంచెంసేపు అయ్యాక వెళ్ళొచ్చు కదా ! అన్నాను.
కానీ, క్యూలో కొచ్చాక మనం ఏం చేయగలం ? ఈ బుద్ధి ముందే ఉండాలి మాకు అని కూడా నాకు అనిపించింది. . నేను ఇదంతా ఊహించలేదు.
టికెట్ కొని వెళ్ళేవారి క్యూ కూడా బాగా రద్దీగా ఉంది.
ఇది ఇలా జరుగుతుండగానే క్యూ కదలటం జరిగింది. ,
ఈ లోపు మావాళ్ళు ఆ జనంలో ముందుకు వెళ్ళ్తూ నన్ను , మా అమ్మాయిని కూడా త్వరగా వాళ్ళ వెనకే రమ్మంటున్నారు.
ఒక ప్రక్క ధర్మదర్శనం వారి కష్టాలు విన్నాక . ఈ తోపుళ్ళు ఇదంతా చూశాక నాకు కొంచెం సేపు అయ్యాక వెళ్ళొచ్చులే అని అనిపించింది.
నేను మా అమ్మాయి అక్కడ క్యూలో ప్రక్కన నిలుచుండిపోయాము.
.మా వాళ్ళేమో మమ్మల్ని త్వరగా రమ్మని పిలుపులు. తొందరేముందని నేను.......
ఇంతలో దేవుని దయవల్ల మా ప్రక్క వారి క్యూలైన్ కూడా కదిలింది.
రెండు క్యూలైన్లలో వారినీ కూడా దర్శనానికి అనుమతించాలని దేవాలయ సిబ్బంది నిర్ణయించారట.
పాపం ! ఎప్పటినుంచో వేచిఉన్న మా ప్రక్కన క్యూలైన్ వారికి కూడా ఉత్సాహం వచ్చింది.
వారు కూడా ఆనందంగా దర్శనానికి వెళ్ళటం చూసాక నాకు ఆనందం కలిగింది.
మేము కూడా దైవదర్శనం చేసుకున్నాము.
క్యూలైన్లలో ఈ తోపుళ్ళు , ఇదంతా జరిగాక అక్కడ భక్తులకు దైవం సర్వాంతర్యామి కదా ! అన్న విషయం బాగా గుర్తుకు వచ్చింది.
మన ఇంట్లో దేవుని పూజ ప్రశాంతంగా చేసుకున్నా దైవం కరుణిస్తారు కదా ! ......అనీ ...
ఇంత రద్దీలో కాకుండా .మన ఊళ్ళో దేవాలయంలో పూజ చేయించుకున్నా దైవం కరుణించరా ఏమిటి ..... వంటి అభిప్రాయాలు భక్తులు చెప్పటం జరిగింది.
కొందరు ఏమన్నారంటే , వీఐపీలను తెల్లవాఝామున మాత్రమే పూజలకు అనుమతిస్తే బాగుంటుంది. సాధారణ భక్తులకు ఇబ్బందులు ఉండవు అన్నారు .
ఇది నిజమే . నాది కూడా ఇదే అభిప్రాయం.
( అసలు సామాన్య ప్రజల దగ్గర మంచి ఐడియాలు ఉంటాయి. వాళ్ళకు అనుభవజ్ఞానం ఎక్కువకదా ! )
అసలు టికెట్ పద్ధతి లేకుండా అందరికీ ఒకటే దర్శనం అన్నది బాగుంటుంది అనిపిస్తుంది, .
కానీ, కొన్ని సందర్భాలలో , కొందరు వ్యక్తుల విషయంలో టికెట్ అవసరమేమో అనిపిస్తుంది.
ధర్మదర్శనంలో వెళ్ళేవారికీ ....... టికెటి కొని త్వరగా దర్శనం చేసుకునేవారికీ .......వచ్చే పుణ్యంలో ఏమన్నా తేడా ఉంటుందా ఉంటుందా ? అనే ధర్మ సందేహం కూడా వచ్చింది నాకు.
ఈ ధర్మ సందేహం తీరాలంటే పరిస్థితిని ఎన్నో కోణాలనుండీ విశ్లేషిస్తే మాత్రమే సరైన సమాధానం లభిస్తుంది. ప్రతి వ్యక్తి పరిస్థితిని ఆలోచించి విశ్లేషించవలసి వస్తుంది.
సరే, రద్దీ రోజుల్లో దేవాలయాలకు వెళ్ళాలనుకునే వారు గమనించవలసిన విషయం ఏమిటంటే,
మామూలు రోజుల్లోలాగ ప్రశాంతంగా దైవదర్శనం కుదరకపోవచ్చు అన్నది ..
తిరువణ్ణామలైలో కార్తీక దీపం సందర్భంగా విపరీతమైన రద్దీ ఉంటుంది.
ఒకసారి మేము ఏం చేశామంటే విపరీతమైన రద్దీ వల్ల దేవాలయంలో మూలదైవం యొక్క దర్శనం కష్టమని భావించి దర్శించుకోలేదు.
తిరువణ్ణామలై గిరిప్రదక్షిణ మాత్రం చేసి తృప్తి చెందాము.
...........................................................
ప్రజల అభిప్రాయాలు గమనించాక నాకు ఏమనిపిస్తుందంటే,
పండుగ రోజుల్లో , ఉదయం సమయంలో మాత్రమే వీఐపీలు పూజలు చేసుకుంటే వారూ ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. సామాన్య భక్తులకూ ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఇంకా ,
టికెట్ కొనుక్కున్న వారిని ముందు పంపించి ధర్మదర్శనం భక్తులను ఆపివేయటం అన్యాయం. ఇద్దరినీ ఒకేసారి అనుమతించటం బాగుంటుంది.అనీ,
ఇంకా,
ఆపవలసివస్తే కొంచెంసేపు టికెట్ కొనుక్కున్న భక్తులనే ఆపాలి గాని .... ధర్మదర్శనం భక్తులను ఆపకూడదు అనీ అనిపించింది.
అసలు టికెట్ పద్ధతి లేకుండా అందరికీ ఒకటే దర్శనం అన్నది బాగుంటుంది.
ఇంకా,
రద్దీ సమయాల్లో కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగి భక్తులు ప్రమాదాలకు గురి అయిన సంఘటనలు కూడా కొన్ని జరిగాయి కదా !
ఇలాంటివి జరగకుండా ఉండాలంటే భక్తులూ, దేవాలయాల సిబ్బందీ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
ఇంకా,
కొన్ని సార్లు కొందరు భక్తులు కూడా , ఎంత రద్దీగా ఉన్నా సరే, ఎలాగోలా ప్రయత్నించి ఒకేరోజు మూడు, నాలుగు సార్లు దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
అలా ఎక్కువసార్లు దర్శనం చేసుకుంటే గొప్ప అనుకుంటారు.
ఒక్కసారి దర్శనం చేసుకున్నా దైవ కృప లభిస్తుంది. ఇతరులకు అవకాశాన్నీ ఇచ్చినట్లు అవుతుంది.
ఇంకా,
కొందరికి వెళ్ళవలసిన ట్రైన్ సమయం మించిపోతుందనో, అనారోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల ఇలా టికెట్ కొని శీఘ్రంగా దర్శించుకౌంటారు.
అయితే ఇలాంటి సమస్యలు పేదవారికి కూడా ఉంటాయి. కానీ వారు అంత డబ్బుపెట్టే తాహతు లేక సర్దుకుపోతుంటారు.
ఏమైనా సాధ్యమైనంత వరకూ ధర్మదర్శనమే మంచిది అనిపిస్తుంది.
ఏమైనా పండుగల వంటి రద్దీ రోజుల్లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలంటే చాలా విషయాలు ఆలోచించుకోవాలి అనిపిస్తోంది.
జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ద్వారా మనకు ఆలోచనలలో మార్పు వస్తుంటుంది... ...
No comments:
Post a Comment