ఓం.
శ్రీ సువర్చలా దేవీ సమేత శ్రీ ఆంజనేయ స్వామికి ప్రణామములు.
మేము కొంతకాలం క్రిందట అమరనాధ్........వైష్ణవీ దేవి యాత్రలకు వెళ్ళాము కదండి.
అమరనాధ్ గుహ చేరేసరికి సాయంత్రం 6 అయినట్లు గుర్తు. తరువాత దైవ దర్శనం అయ్యేసరికి సాయంత్రం 7 గంటలు అలా అయినట్లు గుర్తు.
అదంతా ఒక అధ్బుత ప్రపంచం .......
ఇక రాత్రి ఏడు గంటలు దాటితే కొండ దిగటం కష్టమని ఆ రాత్రికి బస చేయటానికి ..... ఒక టెంట్ అద్దెకు మాట్లాడుకుని అక్కడే ఉన్నాము.
( కొంచెం ముందే దర్శనం అయ్యినవాళ్ళు తిరిగి వెళ్ళే దారిలో పంచతరణి, శేష్ నాగ్ దగ్గరకూడా బస చెయటానికి సౌకర్యాలు ఉన్నాయి. ).
సరే, మేము దర్శనం పూర్తయి తిరిగి వస్తుంటే ఒక దగ్గర గుంపు కనిపించింది.
ఏమిటా అని చూస్తే ఒక పెద్దామె తప్పిపోయారు. ఆమె తెలుగు వారు. ఆమెది కరీం నగర్ అట.
ఆమె తాను తప్పిపోయిన సంగతి తెలుగులో చెబుతున్నారు, చుట్టూ ఉన్నవారు కొందరు తాము ఆమెకు సహాయం చేస్తామని చెబుతున్నారు.
మేము కూడా వెళ్ళి ఆమెను వివరాలు అడిగాము. ఆఖరికి ఆమెను మాతో పాటు మా టెంట్ కు తీసుకు వెళ్దామని అనుకున్నాము.
ఆమెను ఇంటికి ఎలా పంపాలో ఆమెను అడిగి ఆలోచిద్దామని ఆమెను తీసుకుని మా బసకు వస్తున్నాము.
అప్పటికే మాకు చాలా నీరసంగా ఉంది. ఏమైనా తిందామని దారిలో ఒక భండారా వద్దకు వెళ్ళాము.
అదృష్టవశాత్తు మేము వెళ్ళిన భండారాలోనే ఈమెతోపాటు వచ్చిన వాళ్ళు కూర్చుని ఉన్నారు.
వాళ్ళూ ఈమె ఏమైపోయారో తెలియక కంగారు పడుతున్నారట. వాళ్ళు ఈమెను చూసేటప్పటికి సంతోషంగా ఎదురొచ్చారు.
మొత్తానికి అలా ఆమె తనవాళ్ళను కలుసుకున్నారు.
( ఈ భండారాల్లో యాత్రికులకు ఉచితంగా ఫలహారాలు ఏర్పాటు చేస్తారు. మనకు తోచిన డబ్బు ఇవ్వవచ్చు. )
అదలా ఉంచితే ఈ మామ్మగారు తప్పిపోయినప్పుడు ఆమెను వివరాలు అడుగుతున్నవారిని చూస్తే ఎంతో ముచ్చట వేసింది.
అందులో రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్ళు, ఎన్నో భాషల వాళ్ళు ఉన్నారు.
అక్కడి ముస్లింస్ తాము వెళ్ళి మైకులో ఈమె పేరు వివరాలు అనౌన్స్ చేయిస్తామని చెప్పారు.
ఒక హిందీ అతను ఈమెను ఆమె ఊరిలో దింపి వస్తాను అన్నాడు. ఇంకా సైనికులు కూడా యాత్రీకులకు సహాయాన్ని అందిస్తున్నారు.
ఇదంతా చూశాక ఇలా మనుషులందరూ చక్కగా కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా ! అనిపించింది.
ఈ అమరనాధ్ గుహకు చాలామంది నడిచి వెళ్తున్నారండి. కానీ మేము నడవలేకపోయాము. గుర్రాలు మాట్లాడుకున్నాము.
కానీ ఆ గుర్రాలు పాపం మమ్మల్ని మోస్తూ అలా నడవటం ................ వాటిని అంత కష్టపెట్టి మేము దైవదర్శనానికి వెళ్ళిరావటం .......... ఇదంతా నాకు నచ్చలేదండి. ఏం చేస్తాం. అదంతా అలా జరిగింది.
కొందరు కాళ్ళు సరిగ్గా లేనివాళ్ళు కూడా కర్రల సహాయంతో నడుస్తున్నారు. వాళ్ళను చూస్తే ఆశ్చర్యమనిపించింది. వాళ్ళ పట్టుదల ఎంత గొప్పదో కదా అనిపించింది.
ఇక అమర్ నాధ్ గుహ అంటే ............ అదేమీ గుహలా ఇరుకుగా చీకటిగా ఉండదు. వెడల్పుగా రెండంతుస్తుల మేడ అంత ఎత్తుగా ఉంటుంది.
సొరంగంలోనుంచి లోపలికి వెళ్ళనవసరం లేదండి.. బయటే ఉంటుంది.
ఈ పరిసరాలన్నీ ఒక అధ్బుత దృశకావ్యం అని చెప్పుకోవచ్చు.
అయితే అక్కడ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్లు కవర్లు , ఇంకా ఇలాంటివన్నీ పడవేస్తున్నారు. .
మరి తరువాత వాటిని ఏరివేస్తారేమో తెలియదు. అలా ఏరటం కష్టమయిన పని.
మొత్తానికి ఆ హిమాలయాలు ఎంతో ఎంతో బాగున్నాయి. ..... దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి.
No comments:
Post a Comment