koodali

Friday, April 15, 2011

ఏ కష్టం వెనుక ఏ సుఖముందో ......ఏ శాపం వెనుక ఏ వరముందో .............. ఎవరికి తెలుసు ?


అనగనగా ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకు ఇష్టుడైన మంత్రిగారు ఒకరు ఉండేవారు.

ఆ మంత్రి గారికి ప్రతీదానికీ అంతా మనమంచికే అనటం........ అలవాటు.

రాజుగారికి వేట అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడయినా వేటకు వెళితే రాజుగారు మంత్రిగారిని కూడా తప్పనిసరిగా తీసుకు వెళ్ళేవారు.

అలా కాలం గడుస్తుండగా ఒకసారి ప్రమాదవశాత్తు రాజుగారి చేతివేలు తెగిపోయింది. వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తున్నారు.

ఈ సమయంలో మన మంత్రిగారు రాజుగారికి ధైర్యం చెప్పటం కోసం ..అంతా మన మంచికే జరిగింది, బాధపడకండి అనేశారు.

ఇంకేముంది రాజుగారికి ఒళ్ళు మండి వెంటనే మంత్రి గారిని కారాగారంలో పడవేయమని ఆజ్ఞాపించారు. అలాగే అమలుపరచారు భటులు.

కొంతకాలం గడిచి రాజుగారికి నయమయ్యాక వేటకు వెళ్ళాలని ఆయనకు బుధ్ధి పుట్టింది. కొంతమంది భటులను తీసుకుని వేటకు వెళ్ళారు.


ఈ సారి మంత్రిగారు రాలేదు. ( కారాగారంలో ఉన్నారు కదా ! )

రాజు గారి వేట అలా సాగుతుండగా ఇంతలో హటాత్తుగా కొందరు ఆటవికులు వారిని చుట్టుముట్టడం,..... ఆ పోరులో భటులు పారిపోవటం జరిగింది.

రాజుగారిని బందీగా తీసుకువెళ్ళారు ఆటవికులు. రాజుగారిని మరుసటి రోజు తమ కులదేవతకు బలి ఇవ్వాలని నిర్ణయిస్తారు.

జరుగుతున్న పరిణామాలకు రాజుగారు ఎంతో బాధపడతారు.

తెల్లవారాక రాజుగారిని బలికి సిధ్ధం చేయటానికి ఆటవికులు వస్తారు. అలా సిధ్ధం చేస్తూ ఉండగా వారు రాజుగారికి ఒక చేతి వేలు లేకపోవటాన్ని గమనిస్తారు.

ఇక వాళ్ళు రాజుగారిని బలి ఇవ్వటాన్ని ఆపేస్తారు.

కారణమేమిటంటే వారి ఆచారం ప్రకారం అవయవాల లోపం ఉన్నవారిని బలి ఇవ్వకూడదు.

అది వినగానే రాజుగారు పట్టరాని ఆనందముతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.

వెంటనే ఆయనకు అంతా మన మంచికే అనే మంత్రిగారి మాటలు గుర్తు వస్తాయి.

నిజమే కదా ! ఆ రోజు తన వేలుకు అలా ప్రమాదం జరగకపోతే ఈ ఆటవికులు తనను బలి ఇచ్చేవారు కదా ! అనుకుంటారు.

తరువాత తన రాజ్యానికి వెళ్ళిన వెంటనే మంత్రిని కారాగారం నుంచి విడిపించి ........... ఇలా అడుగుతాడు. ..

" సరే నాకు మంచే జరిగింది. మరి మీరు అనవసరంగా ఇన్నాళ్ళు కారాగారంలో ఉన్నారు కదా ! అందులో మంచి ఏమిటి ? " అని .

అప్పుడు ..........మంత్రి ఇలా చెబుతాడు.

" మహారాజా ! నన్ను మీరు కారాగారంలో ఉంచకపోతే నేను కూడా మీతో వేటకు వచ్చేవాడిని........... మీకు వేలు లేనందువల్ల విడిచిపెట్టిన ఆటవికులు ......నన్ను బలి ఇచ్చేవారేమో !............ దేవుని దయవల్ల వేటకు వెళ్ళకపోవటం వల్ల నేను రక్షించబడ్డాను.......... అంతా మన మంచికే " అంటాడు మంత్రిగారు.


రాజు మంత్రికి ఎన్నో బహుమతులను ఇచ్చి సత్కరిస్తాడు. ఇదండీ కధ.

కధలో ఇలా చెప్పారు గదా అని ....... మన కళ్ళముందు ఎన్ని అరాచకాలు జరుగుతున్నా అంతా మన మంచికే అని నిర్లిప్తంగా కూర్చోమని ఈ కధ ఉద్దేశం కాదండి.

*సమస్య వచ్చినప్పుడు మన శాయశక్తులా చెయ్యగలిగినంతా చేసి............. ఇక దైవం పైన భారం వేసి ఏది ఎలా జరిగినా ........... అంతా మన మంచికే అని నిబ్బరంగా ఉండగలగాలి. అప్పుడు ........... మనశ్శాంతి....


*ఎంతో కష్టాన్ని కలిగించి శాపాలుగా అనిపించే కొన్ని సంఘటనలే.............ముందు జీవితంలో వరాలుగా మారే సందర్భాలు చాలా మందికి జీవితంలో జరుగుతూనే ఉంటాయి.

*ఏ కష్టం వెనుక ఏ సుఖముందో ......ఏ శాపం వెనుక ఏ వరముందో .............. ఎవరికి తెలుసు ?

*అందుకే కష్టాలను చూసి అతిగా భయపడకండి. .. దైవం పైన భారం వేసి నిజాయితీగా ముందుకు నడవండి. .... ఇలా చేసినప్పుడు , కాలక్రమేణా............ శాపాలు కూడా వరాలుగా మారుతాయని పెద్దలు చెబుతున్నారు.


2 comments:

  1. Time heals everything అనే సామెత కూడా వుంది. "అంతా మనమంచికే" కూడా దీనికి కలిపితే జీవించటం తేలిక. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. కృతజ్ఞతలండి.
    మీరు చెప్పినది నిజమేనండి. కాలమే అన్ని దెబ్బలను తగ్గిస్తుంది. , ( కాలమే అన్ని సమస్యలకు సమాధానం చెబుతుంది ) అన్నట్లు..........

    ReplyDelete