koodali

Saturday, May 30, 2015

పాజిటివ్ మరియు నెగటివ్ ఆలొచనలు...

  
ఆలోచనలకు  శక్తి ఉంటుందని పెద్దలు తెలియజేసారు.

పాజిటివ్ గా ఆలోచించటం వలన పాజిటివ్ సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పాసిటివ్ గా ఆలోచించటం మంచిదని అంటారు.  నెగటివ్ గా ఆలోచించటం వల్ల నెగటివ్ సంఘటనలు జరిగే అవకాశం ఉందంటారు.

................

అయితే , కొన్నిసార్లు నెగటివ్ ఆలోచన కూడా అవసరమే అనిపిస్తుంది. ( నెగటివ్ ఆలోచన యొక్క ఫలితం పాజిటివ్ గా ఉన్నప్పుడు..)


 ఉదా..ఒక రాజ్యానికి రాజు అయిన వ్యక్తి  నెగటివ్ గా కూడా ఆలోచించవలసి ఉంటుంది.


 రాజ్యం అంటే శత్రువు దాడిచేసే అవకాశాలు ఎప్పుడూ పొంచి  ఉంటాయి కాబట్టి,  రాజ్యరక్షణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే, శత్రువు దాడి చేసినప్పుడు సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగే సత్తా ఉంటుంది.


 అలా కాకుండా... 
అంతా బాగానే ఉంది. లోకంలో అందరూ మంచివారే , రాజ్యంపై ఎవరూ దాడి చేయరు.. అని కేవలం పాజిటివ్ గా ఆలోచించుకుంటూ  రక్షణ ఏర్పాట్లు చేసుకోకుండా తాపీగా కూర్చుంటే శత్రువు దాడిచేసినప్పుడు పరాజయం పొందే అవకాశం ఉంది.

వ్యక్తుల జీవితంలో కూడా  ముందు  జాగ్రత్తలు  తీసుకోవలసిన  సంఘటనలు ఎన్నో ఉంటాయి .  

.................................. 

చెడు కనకూడదు, చెడు వినకూడదు, చెడు అనకూడదు ..అనే విషయం గురించి నాకు ఏమనిపిస్తుందంటే...


 మనకు  చేతనైనంతలో చెడును అడ్డుకోవటానికి  ప్రయత్నించవచ్చు . అయినా  తగిన ఫలితం లేనప్పుడు మాత్రం  సాధ్యమయినంతలో చెడ్డ విషయాలకు దూరంగా ఉండాలి అనిపిస్తుంది.


ఉదా..ఒక వ్యక్తికి చెడు అలవాట్లు లేవనుకోండి. అతని స్నేహితులలో కొందరికి చెడు అలవాట్లు  ఉన్నప్పుడు ,  చెడ్డ అలవాట్లు ఉన్న స్నేహితులతో  ఆ అలవాట్లను మానిపించటానికి ప్రయత్నించ వచ్చు.. 


ఎంత చెప్పినా వాళ్ళు మానకపోతే అలాంటి వాళ్ళతో స్నేహాన్ని మానివేయటం మంచిది. 


అలాంటి వాళ్ళతో  స్నేహాన్ని  కొనసాగిస్తూనే  ఉంటే , చెడ్డ అలవాట్లు లేని వ్యక్తికి కూడా  ఆ చెడ్డ అలవాట్లు అలవాటు అయ్యే ప్రమాదముంది. 


ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ...  చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు..అని పెద్దలు తెలియజేసారు  కానీ, 


.  సమాజంలో  చెడు విషయాలు  జరుగుతున్నా కూడా  పట్టించుకోకుండా,  తప్పించుకుని   ఎవరి మానాన వాళ్ళు బ్రతకాలని పెద్దల ఉద్దేశం కాదు .. అనిపిస్తుంది.


సమాజంలో తప్పులు జరుగుతుంటే అడ్దుకోకుండా  చూస్తూ ఊరుకోవటం కూడా తప్పేనని పెద్దలు తెలియజేసారు.

..........................

 (అయితే, సమాజంలోని  చెడ్డ వాళ్ళ మధ్య ఉన్నాకూడా .. దృఢమైన దైవభక్తి, ఆత్మ బలం ఉన్న వ్యక్తులు  చెడిపోరు.)

......................... 

.వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను . 



Thursday, May 28, 2015

చిన్నారుల రక్షణ గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది...

 
ఈ రోజుల్లో దారుణమైన  వార్తలను  పత్రికలలో  చదువుతున్నాము. 

 పాఠశాలలో  5  సంవత్సరాల  పాప ను  అత్యాచారం  చేయటానికి  ప్రయత్నించిన  ఉపాధ్యాయుడు,  ప్రక్కింటికి  ఆడుకోవటానికి  వెళ్ళిన  పాప   పట్ల  అత్యాచార  యత్నం  చేసిన  ప్రక్కింటి  వ్యక్తీ ,  బంధువుల  వల్ల  అత్యాచార  యత్నానికి  గురైన  అమ్మాయి.....ఇలా  ఎన్నో  వార్తలు  చదువుతున్నాము.  అభంశుభం  తెలియని      పసిపిల్లల  పట్ల  కూడా  అమానుషంగా  ప్రవర్తిస్తున్నారు.  


ఇవన్నీ  గమనించితే  ఈ  కాలపు  పిల్లల  రక్షణ  పట్ల     సమాజం  ఎంత  నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తుందో  తెలుస్తోంది. 


 ఆ  మధ్య  మీడియాలో  ఒక  విషయం  వచ్చింది.  దేశంలో  ఉత్తర  భాగానికి  చెందిన    ఒక  సెలిబ్రిటి  కూతురు  తాను  చిన్నతనంలో  లైంగిక  వేధింపులకు  గురయినట్లు  తెలియజేసింది.  తనను  వేధింపులకు  గురి చేసిన  వ్యక్తి  తన  తల్లితండ్రులకు  బాగా  తెలిసిన  వ్యక్తేనని,  తరచూ  తమింటికి  వచ్చే  వ్యక్తేనని  పేర్కొంది.



( డిల్లీలో  నిర్భయ  సంఘటన  జరిగిన  తరువాత  ఈ  వార్త  పత్రికలలో  వచ్చింది.  వివరాలు  తెలుసుకోవాలంటే  అప్పటి  పత్రికలను  చూడవచ్చు. )


అయితే  ఇంత  జరుగుతున్నా  అమ్మాయి  తల్లితండ్రి  గమనించలేకపోవటం ...అమ్మాయి  తల్లితండ్రులకు  చెప్పలేకపోవటం  చూస్తుంటే  తల్లితండ్రులకు  పిల్లలకు  మధ్య  పెరుగుతున్న  కమ్యూనికేషన్  గేప్  ఎంతలా  ఉందో  తెలుస్తోంది.  


ఎటువంటి  విషయం  ఉన్నా  భయం,  మొహమాటం  లేకుండా   పిల్లలు  తల్లితండ్రులకు  చెప్పగలిగే  పరిస్థితి  ఉండాలి.


కొందరు  తల్లితండ్రులు   బయటకు  లేక   వేరే   ఊర్లు  వెళ్ళవలసి  వచ్చినప్పుడు  పిల్లలను  ఇతరుల   వద్ద  వదిలి  వెళుతుంటారు. 


  కంటికి  రెప్పలా  కాపాడుకోవలసిన  కన్నబిడ్డలను   పరాయి  వారి  వద్ద  వదిలే  ముందు  ఎన్నో  ఆలోచించాలి. 


పసిపిల్లల  పట్ల  జరుగుతున్న  అత్యాచారాల  విషయంలో  తెలిసిన  వాళ్ళ  పాత్రే  ఎక్కువగా  ఉంటోందని  సర్వేల  ద్వారా  వెల్లడి  అయింది.   


అలాగని  అందరినీ  అనుమానించమని  అనటం  లేదు. అలా  అనుమానించటం  ఘోరమైన  తప్పు  కూడా. 


ఇవన్నీ  ఎవరి  పరిస్థితిని  బట్టి  వారు  ఆలోచించుకోవలసిన  విషయాలు.

.................................

చెడ్డ  పనులు  చేయటానికి  చెడ్డవాళ్ళే  కానక్కరలేదు.  కొన్నిసార్లు  మంచివాళ్ళ  బుద్ధి  కూడా  విచక్షణను  కోల్పోయే  అవకాశం  ఉంది. 


 ఉదా...  మత్తుపదార్ధాలను  తీసుకున్న  వ్యక్తికి  ఆ  సమయంలో  బుద్ధి    విచక్షణను  కోల్పోతుందని   అంటారు.


  ఈ  రోజుల్లో  సెల్ ఫోన్స్, ఇంటర్నెట్  వంటి  వాటి  ద్వారా  హింసా దృశ్యాలను ,  శృంగారదృశ్యాలను  ఎప్పుడుపడితే  అప్పుడు  చూసే  అవకాశం  కలిగింది. అసభ్యకరమైన  దృశ్యాలు  చూస్తున్న  వ్యక్తిపై  ఆ  దృశ్యాల  ప్రభావం  ఎంతో  ఉంటుంది. 


 మత్తు  పదార్ధాన్ని  తీసుకుని ,  అసభ్యకరమైన    దృశ్యాలను  చూస్తున్న  వ్యక్తికి    ఒంటరిగా  ఉన్న   అమ్మాయి   కనిపిస్తే   విచక్షణను   కోల్పేయే  అవకాశం  ఉంది.  అప్పుడు  ఆ  పిల్ల  పరిస్థితి   ఏమవుతుందో  చెప్పలేం.


   ఇలాంటప్పుడు   అఘాయిత్యం  జరగటానికి   చిన్నపిల్ల    లేక  పండుముదుసలి   అనే  అభ్యంతరం  కూడా   ఉండకపోవచ్చు.

............................... 

 పెద్దవాళ్ళయిన  ఆడవాళ్ళ  రక్షణ  గురించి  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతున్నారు. అభంశుభం  తెలియని  చిన్నారుల  రక్షణ   గురించి  కూడా  ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది.  

......................

  ఒక వ్యక్తి  నేరం  చేస్తే  అందుకు  ఎన్నో  కారణాలుంటాయి.  చిన్నతనం  నుండి  తల్లితండ్రుల  పెంపకం,  పరిసరాల  ప్రభావం, ఆర్ధిక  అసమానతలు,  స్నేహసంబంధాలు , మీడియా  ప్రభావం,   మద్యపానం అలవాట్లు.....ఇలా  ఎన్నో  కారణాలుంటాయి. 


  నేరాలను  చేసిన  వారిపట్ల  కఠినమైన  శిక్షలు  ఉండటం  ఎంతో  అవసరం  . అయితే  నేరాలను  తగ్గించాలంటే,  చట్టంతో  పాటు  ప్రజల  బాధ్యత  కూడా  ఎంతో  ఉంటుంది. 

Tuesday, May 26, 2015

ద్వంద్వ ప్రవృత్తి ...నేరాలు...


డబ్బు సంపాదనే ధ్యేయంగా, అక్రమ సంబంధాలు అనేవి తప్పే కానట్లుగా, మద్యాన్ని సేవించటం అనేది అత్యంత సహజంగా మారిన సమాజంలో నేరాలు జరగకుండా ఎలా ఉంటాయి ? 

నేరాలు జరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెట్టడం ఎందుకు ?

మద్యపానం, అసభ్యకర దృశ్యాలను  అదేపనిగా  చూడటం....  వంటి వాటివల్ల  మనుషులు  తమ  విజ్ఞతను, వివేకాన్ని కోల్పోయే  అవకాశం  ఉందని  అందరికీ తెలిసిందే.


 ఈ రెండింటిని కట్టడి చేస్తే అసభ్యకరమైన ప్రవర్తనకు సంబంధించిన నేరాలు చాలా వరకూ తగ్గుతాయి.

................. 
 
పాతకాలం వాళ్ళు.. శృంగార చర్యలు ఇతరులు చూడకుండా జాగ్రత్తపడేవారు. ఇతరుల కంటపడితే సిగ్గుపడేవారు. ఇప్పుడు సిగ్గుపడటం తగ్గిపోయింది. 

 శృంగారం అంటే చాటుగా ఉండవలసిన  విషయం. ఇప్పుడు అది బహిరంగం అయిపోయింది. (బరితెగింపు అనుకోవచ్చు.) 


ఇంట్లో టీవీని ఒక్క నొక్కు నొక్కితే చాలు..  ఆడమగ ఒకరినొకరు కౌగలించుకోవటం, ముద్దులు పెట్టుకోవటం ..వంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. 


 ఇలాంటి దృశ్యాలు   చూసేవాళ్ళ మనస్సు చెదిరే అవకాశం ఉంది. 


చిన్న  పిల్లల మనస్సు మీద , టీనేజ్ పిల్లల మనస్సు మీద ఇలాంటి దృశ్యాలు  ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. 

................

ఇలాంటి దృశ్యాలలో చూస్తుంటే..కొందరు భారతీయ స్త్రీలు కూడా పైన ఒక చిన్న  గుడ్డపేలిక,   క్రింద ఒక చిన్న చెడ్డీ ధరించి కనిపిస్తుంటారు.  ఇలా తిరగటానికి కొందరు ఏ మాత్రమూ సిగ్గుపడటం లేదు.


 సిగ్గుపడక పోగా, మేము తక్కువ దుస్తులే వేసుకుంటాము... సరిగ్గా దుస్తులు వేసుకోమని మాకు చెప్పే హక్కు ఎవరికీ లేదు..అంటూ గొడవ  చేయటం అత్యంత బాధాకరం .  

 ...................

సమాజంలో ఎక్కువమంది ద్వంద్వ ప్రవృత్తితో ప్రవర్తిస్తున్నారు. ఒక ప్రక్క నీతులు చెబుతూనే మరో ప్రక్క పాపపు పనులు చేస్తున్నారు. 


ఎన్నో అసభ్యకరమైన దృశ్యాలున్న సినిమాలు తీసేవాళ్ళు కూడా  సమాజం చెడిపోతూందని స్పీచ్లు ఇస్తుంటారు.


మనుషులను పాడు చేసే మద్యాన్ని అమ్మే వాళ్ళు కూడా  సమాజం చెడిపోతూందని నీతులు చెబుతుంటారు. 


ఇతరులను  మోసం చేసి డబ్బు సంపాదించేవాళ్ళు కూడా సమాజం చెడిపోతూందని గోల పెడుతుంటారు.


కొన్ని వార్తాపత్రికలలో  ఒక పేజీలో నీతులు ఉంటాయి.  ప్రక్క పేజీ తిప్పితే అసభ్యకర చిత్రాలు  కనిపిస్తాయి. ( అంటే అర్ధనగ్న చిత్రాలు,  స్త్రీపురుషుల ఆలింగనాది బొమ్మలను వేస్తుంటారు.)


కొన్ని  చానల్స్  కూడా ఇంతే. ఒక వంక సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల బోలెడు జాలి చూపిస్తూ .. నీతులు వల్లిస్తూనే...   ఇంకొక వంక  అసభ్యకర   చిత్రాల దృశ్యాలను ప్రదర్శిస్తుంటారు.


ఇవన్నీ గమనిస్తే, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు.


 ఎన్నో నీతులు చెబుతూ ధర్మాధర్మాలు తెలిసినవాళ్ళు కూడా  సమాజానికి హాని కలిగించే పనులు  చేయటం అత్యంత బాధాకరం . 

.............
 నేరాలు తగ్గాలంటే....పోర్న్ సైట్లకు నిషేధం విధించటం, అసభ్యకరమైన సినిమాలను, సీరియల్స్ను, దృశ్యాలను ప్రదర్శించకుండా నిషేధం విధించటం, మద్యాన్ని నిషేధించటం..వంటి చర్యలను పటిష్టంగా అమలుపరచినప్పుడు చాలా నేరాలు తగ్గుతాయి.

నేరాలు తగ్గాలంటే.... ఆర్ధిక అసమానతలు తగ్గే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా చాలా అవసరం.


ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా  నేరాలు జరిగితే నేరస్తులను కఠినంగా  శిక్షించాలి. మళ్ళీ అలాంటి నేరం ఎవరూ చేయటానికి భయపడేంత కఠినంగా శిక్షించాలి.

.............................. 

నేరాలు ఎవరు చేసినా తప్పు తప్పే. పేద..ధనిక అనే తారతమ్యం ఉండకూడదు. 

అయితే , నేరాలు జరగటానికి  ప్రేరణ కలిగించిన  మూలకారకులైన వ్యక్తులను  కూడా చాలా  కఠినంగా శిక్షించాలి.

........................ 
 సమాజానికి హాని చేసే విధంగా ప్రవర్తించే వాళ్ళు  ఎవరైనా శిక్షార్హులే. ఒకవేళ  వాళ్ళు ఇక్కడి న్యాయస్థానం ముందు నుంచి తప్పించుకున్నా భగవంతుని తీర్పు నుండి తప్పించుకోలేరు. 


Wednesday, May 20, 2015

ఇంటింటికో కధ ..

 

 

ఒకటవ కధ....ఒక విధానం..

   మాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నారు. వారు అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే ఇంట్లోఉంటారు. వారి తల్లితండ్రితో ఉంటారు. అందరితో సందడిగా ఉంటుంది వారిఇల్లు. తల్లిదండ్రులకు కూడా ఒక గది వేరేగా ఉంది.

 ..... 
ఇంకొక విధానం..
ఇంకొకకుటుంబంలో కొందరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండటం కాకుండా, పక్కపక్క ఇళ్ళు కట్టుకుని ఉండేవారు. వారి తల్లితండ్రితో ఉంటారు..వీరి ఇళ్ళు కూడా అందరితో సందడిగా ఉంటాయి.
 

**********************

మనుషులన్నాక బేధాభిప్రాయాలు సహజం. సర్దుకుపోతేనే కదా జీవితం సవ్యంగా సాగుతుంది.
 అయితే అందరి జీవితాలు ఒకలా ఉండవు కదా ! 
అందరి జీవితాలూ సవ్యంగా ఉంటే ఇక చెప్పుకోవటానికి ఏముంటుంది ?మనం ఎంత బాగా ఉన్నా అవతలి వాళ్ళు సరిగ్గా అర్ధం చేసుకోకపోతే కష్టాలే. 
..........................

రెండవ కధ.......
ఇంకొక కుటుంబం ఉన్నారు. వారిది జాయింట్ ఫామిలీయే. కొడుకుకోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ అత్తగారు ఒకసారి మా ఇంటికి వచ్చారు.

 ఆవిడ చెప్పిన విషయాలు ఏమంటే .....ఆ పెద్దవాళ్ళకు ఉదయాన్నే మెలకువ వచ్చేస్తుందట. వారికి టీవీలో భక్తి కార్యక్రమాలు చూడాలనిపిస్తుందట.



 కానీ ప్రొద్దున్నే టీవీ పెడితే టివీ సౌండ్ వల్ల కొడుకు కోడలు ఏమైనా అనుకుంటారేమోనని వీళ్ళు ఫీలవుతుంటారట. అంటే కొడుకు వాళ్ళు కొంచెం లేటుగా నిద్ర లేస్తారట. .


ఇంకా సాయంత్రం పూట పెద్దవాళ్ళకేమో పండ్లు లేక ఏదైనా లైట్గా తింటే చాలు అనిపిస్తుందట. పెద్దవాళ్ళకు బీపీ, సుగర్ .....వంటి అనారోగ్యాలు ఉంటే దానికి తగ్గట్లుగా ఉప్పు, కారం, పంచదార వంటివి తగ్గించి తీసుకోవాలి కదా ! 


కొడుకు వాళ్ళకేమో స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమట. 
ఇలాంటి సమస్యలతో సర్దుకుపోలేక వారు ఏం చేశారంటే..

వాళ్ళు ఉన్న ఇంట్లోనే ఒక భాగంలోనేమో పెద్దవాళ్ళు ఉంటే , ఇంకో భాగంలో కొడుకు వాళ్ళు ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారట. ఇప్పుడు వాళ్ళకు బాగానే ఉందట.
.. పెద్దవాళ్ళు వాళ్ళకు ఇష్టమయినట్లు ఉదయాన్నే భక్తి ప్రోగ్రాంస్ చూడటం ...తమకు నచ్చినట్లుగా వంట చేసుకుంటున్నారట.


తమకు ఏమైనా అనారోగ్యం వస్తే దగ్గరలో పిల్లలు అండగా ఉన్నారని పెద్దవాళ్ళకు 
ధైర్యంగా ఉంటుంది .......


కొడుకు వాళ్ళకేమో, తాము ఉద్యోగం నుంచి ఆలస్యంగాఇంటికి వచ్చినా లేక ఏదైనా ఊరెళ్ళినా పిల్లలనుచూసుకోవటానికి పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది. 
 మొత్తానికి ప్రస్తుతం బాగానే ఉందనిఆవిడ చెప్పుకొచ్చారు. ఇలా ఉండే కుటుంబాలు ఈమధ్యమరికొన్నింటిని చూసాను.

**********************

మూడవ కధ........
ఇంటిపనీ, ఆఫీసు పనితో సతమతమయ్యే కోడళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఉద్యోగం చేసే కోడలికి ఇంటిపనిలో ఇష్టంగా సహాయం చేసే అత్తగార్లూ ఉన్నారు కానీ ........వారి సంఖ్య తక్కువ.

అలాంటి ఒక అత్తగారికధ....... కోడలికి వంట రాదని అత్తగారే ఉదయం పూటవంట చేసి భోజనం బాక్సులో పెట్టి కోడలికి ఇచ్చేవారట.వారి కోడలు రోజూ ఆఫీసు నుంచీ ఆలస్యంగా వచ్చేదట.సెలవు రోజుల్లో కూడా స్నేహితురాళ్ళతో షాపింగుకు వెళ్ళటం, ఇంటిపని పట్టించుకోకపోవటం .......అలా అత్తాకోడళ్ళకు గొడవలు అయిపోయాయి. ఇలాంటి అత్తకుఇలాంటి కోడలు రావటమే వింత .
***********************
నాలుగవ కధ........
కొందరు పెద్దవాళ్ళు పిల్లల ఉద్యోగాల వల్ల ఈ వయసులో కూడా ఇంటిపనులే సరిపోతున్నాయి. అని వాపోతుంటారు.  
నాకు తెలిసిన ఒక పెద్దామె కూతురు ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయికి ఒక పాప. కెరీర్ పోతుందని చెప్పి ఆ అమ్మాయి తన నెలల వయస్సున్న చంటిపాపను తల్లిదండ్రుల దగ్గర విడిచి ఉద్యోగంలో చేరిపోయింది. . 

పెద్దవాళ్ళకు సాయానికి పనివాళ్ళున్నారు. ఎంతైనా చంటిపిల్లల పని అంటే శ్రమే కదా ! . పనివాళ్ళు రానిరోజున పెద్దవాళ్ళ పని చాలా కష్టమైపోయేది. 

చంటిపాపను క్రెష్  అంటూ పరాయి వారి పెంపకంలో వదలలేక ఆ పెద్దవాళ్ళు అలాగే ఇబ్బందులు పడ్డారు. ఇదంతా చూసి వారి అమ్మాయి పాపను క్రెష్ లో వేసింది.

ఇలాంటివారిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, 
వారు వారి అమ్మాయిని చదివించి ఉద్యోగంలో చేర్పించటానికి ముందే ఈసమస్యల గురించి ఆలోచించుకుంటే బాగుండేది. .
 ఇప్పుడు చంటిపాపను క్రెష్లో చేర్పించటం కన్నా.. ఓపిక తెచ్చుకుని పెద్దవాళ్ళే పాపను పెంచటం న్యాయం అన్నది నాఅభిప్రాయం.

*********************

అయిదవ కధ.....
అయితే మరి కొందరు పెద్దవాళ్ళకేమో తమ మనుమలను,మనుమరాండ్రను పెంచిపెద్దచేయాలని ఎంతో సరదాగా ఉంటుంది. 

కానీ ఆ పిల్లల తల్లిదండ్రులేమో తమ చంటి పిల్లలను పెద్దవాళ్ళ దగ్గరకు పంపరు . తామే పెంచుకుంటాము అని క్రెష్ లో వేస్తుంటారు.

అక్కడ సరిగ్గా చూసినా చూడకపోయినా నోరులేని చంటిపిల్లలు తమ అభిప్రాయాలను పెద్దవాళ్ళకు చెప్పలేరు కదా పాపం !

చంటిపిల్లలను పెంచే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వారి దగ్గరే పెంచటం మంచిది.

*********************

కొందరు పెద్దవాళ్ళు పిల్లల దగ్గర ఉందామని వచ్చి తరువాత బాధ పడుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే ,

 మేము మా పిల్లలను పెంచి పెద్దచేసి ఇప్పుడు కాస్త విశ్రాంతిగా ఉండాలనీ , నాలుగు ఊళ్ళు తిరిగిరావాలనీ అనుకున్నాము. కానీ , పిల్లల ఉద్యోగాల వల్ల ఈ వయసులో కూడా ఇంటిపనులే సరిపోతున్నాయి. అని వాపోతుంటారు. 


అప్పటివరకూ జీవితంలో కష్టపడి మళ్ళీ పిల్లల వద్ద ఇంటిపనీ, వంటపనీ, పిల్లల పనీ నెత్తినేసుకుని చెయ్యాలంటే పెద్దవయస్సు వాళ్ళకి ఇబ్బందే మరి.

( పూర్వం అంటే కోడళ్ళు ఇంటిపనీ, వంటపనీ, చంటి పిల్లల పనీ చేసుకుంటే ....తాత బామ్మలు తమ మనుమలు, మనుమరాండ్రతో ఆడుకోవటం, వారికి కధలు చెప్పటంతో కాలక్షేపం చేసేవారు.
 )

యిలా రకరకాల కారణాల వల్ల ....కొందరు పెద్దవాళ్ళు తమ పిల్లలతో కలిసి ఉండటానికి అంతగా ఇష్టపడటం లేదు.వారికి పిల్లలతోనూ, మనుమలు, మనుమరాళ్ళతో కలిసిజీవించాలని ఉన్నా కూడా .... విడిగా ఉంటున్నారు.

ఇంకొక పెద్ద కారణం ఏమంటే ...... పెద్దవయస్సులో పనిభారం పెరిగి ఏమైనా అనారోగ్యం వచ్చి మూలన బడితే వాళ్ళను చూసేవాళ్ళు ఎవరు ? అన్నది కూడా ఈ రోజుల్లో పెద్ద సమస్య అయిపోయింది కదా! .

*******************

ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే,

 చంటిపిల్లలనుసంరక్షించటానికి..... వృద్ధులను సంరక్షించటానికి,.....కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగినప్పుడువారిని సంరక్షించటానికి ......మరిన్ని రోబోట్లనుశాస్త్రవేత్తలు తయారుచేయాలేమో !!..

( మనుషులు బిజీఅయిపోయారు కదా !)

*******************

పైన వ్రాసిన విషయాలు చదివి నావి అన్నీ నెగెటివ్ ఆలోచనలు అని చాలామంది విమర్శిస్తారు. చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూసే వ్రాసాను . . రోజూ వార్తాపత్రికల్లో ఇంతకంటే చిత్రమైన జీవితకధలను చదువుతున్నాము.

భార్యాభర్తల మధ్య పెరుగుతున్న విడాకులు, టీనేజీ పిల్లలలో పెరుగుతున్న దురభ్యాసాలు, సమాజంలో పెరుగుతున్న అక్రమసంబంధాలు , ఇవన్నీ చూస్తూ కూడా సమాజం అంతా బాగుంది అనుకుంటే అది భ్రమ మాత్రమే..


దురదృష్టమేమిటంటే..  మద్యపానం, అర్ధనగ్నంగా దుస్తులు ధరించటం , ఇలాంటి అలవాట్లు ఉన్న వారికి సమాజంలో గౌరవం లభించటం
.

Friday, May 15, 2015

కొన్ని సమస్యలు...

 
 అత్తగారి సాధింపులు అనే సమస్య వల్ల  చాలామంది స్త్రీలు నరకం అనుభవిస్తున్నారు.. అనే విషయం గురించి ఇంతకు ముందు వ్రాయటం జరిగింది.
..........

స్త్రీల ఇంకొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే, ఒక స్త్రీ యొక్క కాపురంలో సమస్యలు రావటానికి ఇంకొక స్త్రీ కారణం కావటం... 


ఈ సమస్య వల్ల కూడా ఎంతో మంది స్త్రీలు నరకం అనుభవిస్తున్నారు...ఈ సమస్య వల్ల కొందరు స్త్రీలు ఆత్మహత్య చేసుకోవటం కూడా జరిగింది.

.......................... 

ఈ మధ్య కొందరు స్త్రీలు ఏమంటున్నారంటే,  మా ఇష్టం ప్రకారం స్వేచ్చగా  తిరిగితే తప్పేమిటి ? అని ప్రశ్నిస్తున్నారు.


ఇష్టం వచ్చినట్లు తిరగటం అంటే , ఇతరుల జీవితంలోకి ప్రవేశించి వాళ్ల జీవితాలను పాడుచేయటం  జరుగుతుంది . 


స్త్రీలైనా, పురుషులైనా కట్టుబాట్లు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం తప్పే. 


భార్య పిల్లలు ఉన్న పురుషుడు భార్యకు  అన్యాయం చేసి ఇంకొక ఆమెతో జీవితం గడపటం చూస్తున్నాము.

 ఇలాంటి సంఘటనలలో.. పురుషుడు  కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తుండగా.. సాటి స్త్రీ కాపురాన్ని కూలదోసి ఆమె స్ఠానాన్ని పొందటానికి ప్రయత్నించే స్త్రీని ఏమనాలి ?


సాటి స్త్రీ కాపురాన్ని కూలదోసి ఆమెకు మానసికవేదన కలగటానికి కారణ
మయ్యే  స్త్రీలు ఎందరో ఉన్నారు.
..............................  
ఇవన్నీ గమనిస్తే ఏం తెలుస్తుందంటే,  స్త్రీల  కష్టాలకు ..   కొందరు పురుషులు  మరియు    కొందరు   స్త్రీలు కూడా కారణం అని  స్పష్టంగా తెలుస్తుంది.

స్త్రీల  కష్టాలలో  సాటి  స్త్రీల  పాత్ర  ..అనే  సమస్య గురించి కూడా అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది .


 *****************
mari konni vishayaalu..
 
ఈ రోజుల్లో కొందరు సెలెబ్రిటీలు కూడా భార్యభర్తతో విడాకులు ఇవ్వకపోయినా వేరేవాళ్ళతో తిరుగుతున్నారు. వాళ్ళను చూసి ఆహా ఓహో, ఆదర్శమైన దంపతులంటూ మీడియా కూడా ఆకాశానికి ఎత్తేయటం జరుగుతోంది.
 
 భార్యభర్త విడాకులు జరగకుండా వేరొకరితో తిరగటం చట్టవ్యతిరేకం. మరి, అలా తిరుగుతున్నవారిని, వారిని సపోర్ట్ చేసేవారిని ఏం చేయాలి?

స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండటం మంచిది. అందుకే పాతకాలంలో అమ్మాయి తల్లితండ్రి తమ కూతురుకు వివాహ సమయంలో కొంత బంగారమో, ధనమో, ఆస్తో.. ఇచ్చేవారు. 
 
స్త్రీ ధనాన్ని మగవాళ్లు వాడకూడదని గ్రంధాలలో కూడా తెలియజేసారు. ఇప్పుడు చాలామంది కట్నం పేరుతో స్త్రీలను బాధించి వాళ్ల డబ్బు లాక్కోవటం వల్ల ఆ పద్ధతికి చెడ్డ పేరు వచ్చింది.

ఈ రోజుల్లో చాలామందిలో ఇన్సెక్యూరిటి పెరిగింది. పాతకాలంలో స్త్రీలు కొందరు అత్తింటివారి వల్ల చంపబడేవారు. ఈ రోజుల్లో కొందరు స్త్రీలు కూడా భర్తలను చంపుతున్నారు. పరిస్థితి ముందుముందు ఎటుపోతుందో?

.............................................

ఈ రోజుల్లో స్త్రీలకు ఉద్యోగాలు వచ్చాక పరిస్థితి చాలా మారిపోయింది. ఉద్యోగం డబ్బుతో బోలెడు వస్తువులు కొనుక్కోగలరు కానీ, చాలామందికి మనశ్శాంతి, ఆరోగ్యం ఉండటం లేదు.

 కొందరు, చిన్న పిల్లల్ని చదువు పేరుతో హాస్టల్స్లో వేస్తారు. హాస్టల్స్ లో పిల్లల జీవితం పిల్లలది. తల్లితండ్రిని పెద్దవయస్సులో వృద్ధాశ్రమంలో వేస్తే మాత్రం పెద్దవాళ్ళను వదిలేసారంటారు.
...................................

 అస్తమాను సతాయించే అత్తమామలతో..భర్తతో.. భార్యతో ఉండి, వాళ్ల వేధింపులను భరిస్తూ ఉండాలన్నా చాలా కష్టమే. కొంతవరకు ఓర్చుకోగలరు కానీ, తట్టుకోలేని పరిస్థితిలో వేధింపులు ఉంటే మాత్రం విడిపోక చేయగలిగింది లేదు. ఇక, పిల్లల కర్మ పిల్లలది.

విడిపోయిన తరువాత ఉండే కష్టాలు అప్పుడూ ఉంటాయి. ఏం చేయాలనేది ఎవరి పరిస్థితిని బట్టి వారు ఆలోచించుకుని చేయాలి. ఎవరి కర్మ వారిది.

ఈ రోజుల్లో ప్రతి వారికి ఈగో ఎక్కువయ్యింది. అందరూ తమ మాటే వినాలన్నట్లు అనుకుంటున్నారు. కొందరు తాము ఎదుటివారిని బాధపెడుతూ కూడా, ఎదుటివారే తమను బాధపెడుతున్నారని అంటారు.

కొన్నిసార్లు ఇరువైపుల వాళ్ళు తప్పులు చేస్తారు. ఎవరికి వాళ్లు తామే కరెక్ట్ అని వాదిస్తారు.

కొందరు బాధ్యత పట్టకుండా ఉంటారు. అలా బాధ్యత లేకుండా ఉన్నారని భార్య కానీ, భర్త కానీ అంటే, వాళ్లు సతాయిస్తున్నారని అందరితో చెబుతారు.

 కొందరు వేరే వాళ్లతో అక్రమసంబంధాలతో తిరుగుతారు. ఆ మాట అంటే, సతాయిస్తున్నారని అందరితో చెబుతారు. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి...
.....................

పాతకాలంలో చతురాశ్రమ ధర్మాలను పాటించేవారు. పెద్ద వయస్సు వచ్చాక వానప్రస్తం, సన్యాసాశ్రమం కూడా ఉండేవి. అడవులకు వెళ్లకపోయినా, తమ ఇంట్లోనే ఉండి పిల్లల విషయంలో అతిగా కలగజేసుకోకుండా, ప్రశాంతంగా ఉంటూ దైవస్మరణ కూడా చేసుకుంటూ ఉండేవారు.

ఈ రోజుల్లో కొందరు పెద్దవాళ్ళు కూడా తమ పిల్లల కాపురాల్లో అతిగా కల్పించుకుంటూ గొడవలు తెస్తున్నారు. వివాహమైన పిల్లలు కొందరు, సర్దుకుపోయే పెద్దవాళ్ళను కూడా గౌరవించటం లేదు. 
......................................
 
 భార్యాభర్త గొడవలు పడినప్పుడు చాలా సమస్యలు వస్తాయి.

పిల్లలు కూడా బాధలు పడతారు.. భార్యా భర్త విడాకులు తీసుకుని, తరువాత  వాళ్లు వేరే వాళ్లను వివాహం చేసుకుంటే, పిల్లల్ని అమ్మమ్మ తాత వద్ద, నాన్నమ్మ తాత వద్ద, కొందరు హాస్టల్స్లో కూడా ఉంచుతారు.

 ఆ వయస్సులో పెద్దవాళ్ళు తమ పనులే తాము సరిగ్గా చేసుకోలేరు. ఇక చిన్నపిల్లల్ని సరిగ్గా చూడగలరో? లేదో? 

ఈ రోజుల్లో..
కొందరు పెద్దవాళ్లు సెల్ఫోన్లు, టీవీ ఎంతసేపైనా ఓపికగా చూస్తారు.  కానీ, కన్న పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా పిల్లలను కొట్టే తల్లితండ్రి, మనుమలను, మనుమరాళ్లను విసుక్కునే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు కూడా కొందరు ఉన్నారు.
 
కొందరు, ఆఫీసుల్లో ఎంత పని చెప్పినా కిమ్మనకుండా చేస్తారు కానీ, కన్నబిడ్దల్ని చూసుకోమంటే మాత్రం మా వల్ల కాదంటారు.
 
 చిన్నపిల్లలను  ఎంతో ఓపికగా పెంచాలి. చంటి పిల్లలకు ఏమీ తెలియదు. వాళ్ల పనులు వాళ్లు చేసుకోలేరు.  పాతకాలంలో తల్లి ఇంటిపని,వంటపని, పిల్లల పని చేసుకుంటే, పెద్దవాళ్లు కొంతసేపు పిల్లలను ఆడించేవారు.

 ఇప్పుడు కూతుర్లు, కోడళ్లు ఉద్యోగాలు చేస్తూ రాత్రికి ఇంటికి వస్తే, పెద్దవాళ్లే ఇంటిపని, వంటపని, పిల్లల పని చేయాలంటే అంతా చేయలేరు. మరి, పిల్లల పరిస్థితి ఏమిటి? 

కొందరు చంటి పిల్లలను డేకేర్ సెంటర్లలో ఉంచుతారు. అక్కడ పిల్లల్ని సరిగ్గా చూస్తారో? లేదో? ఎవరికి తెలుసు. కొన్ని డేకేర్ ల గురించి కొన్ని సంఘటనలు విన్నాక చాలా భయమేస్తుంది. 

తల్లి దగ్గర చక్కగా పెరగవలసిన పిల్లల్ని ఎక్కడో వేరే వాళ్ల దగ్గర పెంచటం పిల్లల ఖర్మ. అమ్మనాన్నతో తమ ఇంట్లో చల్లగా ఉండవలసిన పిల్లలు ఎక్కడో ఉండవలసి వస్తుంది.

 తల్లితండ్రిని పెద్దవయస్సులో వృద్ధాశ్రమంలో వేస్తే మాత్రం పెద్దవాళ్ళను వదిలేసారంటారు.
........................................
 
పెద్దవాళ్లు తమ సమస్యలను చెప్పగలరు.తమకు ఇష్టమయితే పనులు చేస్తారు, లేదంటే చేయలేమని కూడా చెబుతారు, లేదంటే సర్వెంట్స్ సహాయంతో పనులు చేయించుకుంటారు.

పిల్లల విషయం అలా ఉండదు కదా..పసిపిల్లలకు సరిగ్గా మాటలు రావు కాబట్టి తమ సమస్యలను చెప్పలేరు. కొంచెం పెద్దయిన పిల్లలు తమ సమస్యలను చెప్పినా, అర్ధంచేసుకునే పేరెంట్స్ ఎందరు?

ఉదా..పాతకాలంలో పసిపిల్లలకు పల్చటి నిక్కర్ వంటివి వేసేవారు. వాళ్ళు యూరిన్ పోసినప్పుడల్లా ఆ చెడ్డిలను మార్చి ఉతికి ఆరేసేవారు. యూరిన్ నేలమీదపడితే క్లాథ్ తో తుడిచేవారు. ఈ రోజుల్లో పెద్దవాళ్లు ఆ పనులన్నీ చేయలేక, సోఫాలు, మంచాలు పాడవుతున్నాయని చెప్పి, పసిపిల్లలకు రోజంతా పెద్ద నాప్కిన్స్ వేస్తున్నారు.

 ఆ నాప్కిన్స్ తో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల చర్మానికి రాషెస్ కూడా వచ్చే అవకాశముంది.. దురద, మంట వచ్చినా పిల్లలు చెప్పలేరు. గోక్కోటానికి నాప్కిన్  ఉండి గోక్కోలేరు. ఆ బాధతో పిల్లలు ఏడుస్తుంటే, పిల్లల్ని పెంచటం చాలా కష్టం అంటారు. 

పిల్లలు ఇబ్బంది పడినా ఏంకాదు కానీ, సోఫాలు, మంచాలు పాడవ్వకూడదని, తమకు అస్తమాను శుభ్రం చేసే పని ఉండకూడదని పెద్దవాళ్ల ఉద్దేశం కాబోలు.పిల్లలను అలా ఇబ్బంది పెట్టటం చాలా పాపం.

ఇక కొందరు పసిపిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తారు. కొన్ని విదేశాల్లో పసిపిల్లలకు ఎప్పుడూ షూస్ వేసి ఉంచుతారు. పిల్లలను డేకేర్ సెంటర్లలో మధ్యాహ్నం నిద్రపుచ్చుతారు. నిద్రపోయేటప్పుడు కూడా షూస్ తీయకూడదని అక్కడ రూల్స్ అట. 
 
ఇబ్బందిగా ఉండి పిల్లలు షూస్ తీయటానికి ప్రయత్నించినా కూడా, అక్కడిసిబ్బంది మళ్లీ షూస్ వేసేస్తారట. ఇంట్లో అయితే అలా ఉండదు కదా. పెద్దవాళ్లు నిద్రపోయేటప్పుడు షూస్ వేసుకుని పడుకోగలరా? 

కొందరు స్త్రీలు తాము ఉద్యోగాలు చేసి సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెబుతారు. ఇంట్లో సరిగ్గా చూసుకోలేని వారు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారు. ఎవరి కుటుంబాన్ని వారు సరిగ్గా చూసుకుంటే సమాజం దానికదే బాగుంటుంది.

చిన్నతనం నుంచి పిల్లలకు శుచిశుభ్రతను నేర్పించాలి. రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదని, పబ్లిక్లో ఒకరినొకరు తోసుకోకుండా లైన్లో వెళ్లాలని,గట్టిగా సౌండ్ చేయకూడదని, జీవితంలో న్యాయంగా జీవించాలని నేర్పించాలి.ఇవన్నీ పిల్లలకు ఓపికగా చెప్పటానికి చాలా పెద్దవాళ్ళకు సమయం లేదు.  చాలామంది పెద్దవాళ్లే ఇవన్నీ పాటించరు.

...................................... 
 
ఉద్యోగాలలో పనితో చాలామంది స్త్రీలు అనేక అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు. స్త్రీలు ఉద్యోగాలని ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి వంటపని సరిగ్గా చేయలేకపోతున్నారు. బయట ఆహారం తిని అందరికి అనారోగ్యాలు పెరుగుతున్నాయి.

స్త్రీలు ఇంటి పట్టున ఉండి ఇల్లు శుభ్రంగా సర్దుకోవటం, పుష్టికరమైన, ఆరోగ్యానికి మంచిగా ఉండేలా ఆహారాన్ని కుటుంబసభ్యులకు వండిపెడితే చాలా అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. హాస్పిటల్స్ కు వెళ్లవలసిన అవసరం అంతగా ఉండదు.

ఇంటిని చక్కదిద్దుకునే స్త్రీల పట్ల పురుషులు, ఇంట్లో వారందరూ గౌరవంగా ఉంటే, స్త్రీలు బయట ఉద్యోగాలకు వెళ్లటం గురించి అంతగా  ఆసక్తి చూపించరు..

 ఇంటిపని త్వరగా అయి, ఏదైనా ఉపాధి పొందాలనుకుంటే, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు కొందరు స్త్రీలు కలిసి ఏదైనా చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందవచ్చు.
.....................................

ఈ రోజుల్లో కుటుంబాలలో  గొడవలు ఎక్కువయ్యాయి. ఎవరైనా కొంతైనా ఎడ్జస్ట్ అయితే బాగుండు. అందరికి మంచి బుద్ది ఉంటే బాగుండు.
 

Wednesday, May 13, 2015

ఓం .. కొన్ని విషయములు.. అద్భుతమైన ప్రాచీన విజ్ఞానము ..


ఓం .. శ్రీ రామశ్రీరామశ్రీరామ
సీతారాములకు వందనములు. 
ఈ రోజు హనుమంతుల వారి జయంతి . 
సువర్చలా సమేత ఆంజనేయస్వామికి వందనములు.
..............
పెద్దలు అనేక విషయాలను తెలియజేసారు .
......................... 

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటారు..

మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయః 

మయి సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణా ఇవ||
 భ.గీ..7-7 శ్లో||

ఒక సూత్రంలో మణులు కూర్చినట్లు ఈ జగత్తంతా నాలో ఇమిడి ఉన్నది.


శ్రీ కృష్ణ భగవానుడు చెప్పినట్లు అనంతం నుంచి అణువు వరకూ జగత్తంతా ఒక సూత్రంలో బంధించబడింది.


దీనినే ఆధునిక శాస్త్రవేత్తలు  SuperString అంటున్నారు . 


ఆధునిక శాస్త్రవేత్తలు, స్ట్రింగ్ సిద్ధాంతం ..అనే నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం Quarks,Lepton, కణములు (Particles) కాదనీ,అవి సూక్ష్మమైన,కంపించే గుణం కలిగిన తీగల వంటివని నిర్ధారించారు. 
.............

ఈ జగత్తును ఏడు పదార్ధాలుగా విభజించినది వైశేషిక శాస్త్రం. అవి 1.ద్రవ్యము,2.గుణము,3.కర్మము,4.సామాన్య,5.విశేష, 6.సమవాయ,7.అభావ అని వివరించారు.


"...ద్రవ్యగుణ కర్మ సామాన్య విశేష సమవాయానాం పదార్ధానాం..." - వైశేషిక దర్శనం


ద్రవ్యములను (matter) తొమ్మిది భాగాలుగా గుర్తించాడు.1.పృధ్వి,2.జల, 3.తేజ, 4.వాయు, 5.ఆకాశం,  6.దిక్, 7.కాల, 8.మనస్సు, 9.ఆత్మ.



"పృధ్వి వ్యాపస్తేజో వాయురాజ్కాశం కాలోదిగాత్మా మన ఇతి ద్రవ్యాణి!

-వైశేషిక దర్శనం

కణాద మహర్షి వివరించినట్లుగా మనస్సు- ఆత్మ రెండూ ద్రవ్యములే.(Matters).

.................

"Matter and energy cannot be created or destroyed "......అని ఆధునిక శాస్త్రవేత్తలు తెలియజేసారు. 


అయితే, రూపాన్ని మార్చుకునే అవకాశం ఉంది. 


ఉదా..నీరు ఆవిరి లా మారవచ్చు, ఆవిరి మరల నీరుగా మారవచ్చు, నీరు మంచుగానూ మారవచ్చు. ఇవన్నీ గమనిస్తే జన్మలు,పునర్జన్మలు ఉంటాయని తెలుస్తుంది.

................

పదార్ధాలను చిన్నవి చేస్తూ పోతే ...చివరికి  ఒక స్థితిలో అది తన మూల స్వభావాన్ని కోల్పోతుంది.  -వైశేషిక దర్శనం 7-1-12-14సూ.

......

 బ్లాక్ హోల్స్ .. వంటి ఎన్నో విషయాల గురించి  ఆధునిక శాస్త్రవేత్తలు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. 

ఇక, దైవం మోక్షం..వంటి విషయాల గురించి ఆధునిక భౌతికవాదులకు తెలిసింది చాలా తక్కువ.

............

దైవం మోక్షం..వంటి విషయాల గురించి  దైవానికే తెలుస్తాయి. బహుశా మోక్షాన్ని పొందిన జీవులకు కూడా ఈ రహస్యం తెలుస్తుందేమో..

...............

భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలు..ETERNALLY TALENTED INDIA-108 FACTS..అనే పుస్తకం నుండి కొన్ని వివరములు సేకరించటం జరిగింది. 


 ప్రచురించిన విషయాలలో అచ్చుతప్పులు వంటివి ఉన్నచో ..  దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను .



Monday, May 11, 2015

కొందరు పిల్లలు ....

 
తమ సుఖసంతోషాలను ఎంతో త్యాగంచేసి పిల్లలను పెంచి పెద్ద చేస్తే ......వృద్ధులైన ఆ తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టక, అనారోగ్యం వస్తే పట్టించుకోని పిల్లలు ఎందరో ఉన్నారు. 

అయితే,తల్లిదండ్రులను చక్కగా చూసుకునే పిల్లలు కూడా ఎందరో ఉన్నారు. 
 ..................................
వివాహమైన పిల్లలకు, పెద్దవాళ్ళకు  సరిగ్గా పడకపోతే , ఒకే ఇంట్లో కాకుండా పక్కపక్క ఇళ్ళలో ఉండవచ్చు.ఎవరి ప్రైవసి వారికుంటుంది. అవసరమైనప్పుడు ఒకరికొకరు సాయపడవచ్చు. అలా కుదరదు అంటే, ఒకే ఊరిలో దూరంగా ఉండవచ్చు. ఇంకా కాదంటే, వేరే ఊళ్లలో ఉండవచ్చు.
 
ఈ రోజుల్లో కొందరు స్త్రీలు స్వేచ్చ అంటూ అతిగా ప్రవర్తిస్తున్నారు. సాటి స్త్రీలను కూడా ఇబ్బందిపెడుతున్నారు. పురుషులు కూడా తమ స్వేచ్చ అంటూ అతిగా ప్రవర్తిస్తున్నారు. విడాకులు ఎక్కువయ్యాయి.

అక్రమసంబంధాలు ఉన్నవాళ్ళ వల్ల.. వారిని వివాహం చేసుకున్న పురుషులు స్త్రీలు ఇద్దరికి ఇబ్బందే.  కొందరు స్త్రీలు, పురుషులు తమ అక్రమసంబంధాలకు అడ్డుగా ఉన్నారని సొంత పిల్లల్ని కూడా కొట్టిన వార్తలను విన్నాము.

భార్యాభర్తకు పడనప్పుడు సాధ్యమైనంతలో సర్దుబాట్లు చేసుకుంటూ జీవించటానికి ప్రయత్నించాలి. పిల్లలుంటే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి. ఇంకా భరించలేని పరిస్థితి ఉంటే.. కేసులు, గొడవలు కాకుండా, మధ్యవర్తులను (సైకాలజిస్టులు..)ఉంచి మాట్లాడుకుని విడిపోవటం తప్ప ఏం చేయగలరు?

పిల్లలకు తల్లితండ్రి ఇద్దరితో కలసి ఉండాలని ఉంటుంది. పిల్లలు అమ్మనాన్నతో కలసి తమ ఇంట్లో జీవించాలనుకుంటారు. అయితే, ఈరోజుల్లో కొందరు పేరెంట్స్ విడాకుల తరువాత వేరే వివాహం చేసుకుంటున్నారు. 

పిల్లలకు తల్లి దగ్గర వేరేనాన్న, తండ్రి దగ్గర వేరే తల్లి ఉంటారు. పిల్లలకు ఇది బాధగా ఉంటుంది. అయితే, పెద్దవాళ్ళ హక్కుల గురించే అందరూ మాట్లాడతారు కానీ, పిల్లల హక్కులు, వారి ఆశల గురించి ఎంతమంది తల్లితండ్రి ఆలోచిస్తున్నారు?

ఇక పిల్లలు వాళ్ల అమ్మమ్మతాత లేక నాన్నమ్మతాత లేక హాస్టల్స్లో ఉండవలసి ఉంటుంది. వాళ్లు అప్పటికే వృద్ధులు అయి వాళ్ళకు ఎక్కువ ఓపిక ఉండదు.ఇక ఆ పిల్లలను ఏం సరిగ్గా చూసుకోగలరో?

ఈ రోజుల్లో స్త్రీలు, పురుషులు ఉద్యోగాల వల్ల పనివత్తిడి బాగాపెరిగింది. అలసిపోయి చిన్న మాటకే గొడవలు పెరుగుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే, అమ్మాయి అబ్బాయి తరపు పెద్దవాళ్ళు కూడా కొందరు పంతాలు, పట్టింపులకు పోయి గొడవలు పెంచుతున్నారు.

 కొందరు ఫ్రెండ్స్, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు కూడా ఎందుకు తగ్గాలి, ఎందుకు సర్దుకుపోవాలంటూ గొడవలు పెంచుతున్నారు.