koodali

Friday, August 22, 2014

కొన్ని విషయాలు... రెండవ భాగము..సమాజంలో వ్యవస్థలు..పరిస్థితులు...

 
 
ఈ క్రింద విషయాలను ఈ పోస్ట్ వేసిన చాలాకాలానికి వ్రాసి ఇక్కడ వేయటం జరిగింది.
 
ప్రాచీన సిద్ధాంతం ప్రకారం, పునర్జన్మలు ఉంటాయి.అలాంటప్పుడు ఏ జీవి అయినా పశుపక్ష్యాదులుగా జన్మించాలా? మనిషిగా జన్మించాలా? మనిషి అయితే ఎక్కడ?ఎలా జన్మించాలి? అనే విషయాలను ఏ విధంగా నిర్ణయిస్తారు? అనే సందేహాలు కలుగుతాయి. 
 
జీవులు గత జన్మలో చేసిన కర్మల ప్రకారం అవన్నీ నిర్ణయించబడతాయని ప్రాచీనులు తెలియజేసారు. అర్హతను బట్టి జన్మను నిర్ణయించటం సరైనదే . గతకర్మల ఫలితాలను స్వర్గంలో, నరకంలో కొంత అనుభవించి, మిగతా కర్మతో మరుజన్మను పొందుతారని తెలుస్తుంది.

ఆధునిక విజ్ఞానం కూడా మరణమే జీవులకు ఆఖరిగమ్యం కాదని కనుగొన్నారు.
 
ఆధునికవిజ్ఞానం"Matter and energy cannot be created or destroyed "అని  వివరించటం జరిగింది. ఈ  సూత్రం ప్రకారం చూసినా  జన్మలు, పునర్జన్మలు ఉండే మాట వాస్తవమే  అనిపిస్తుంది. రూపాన్ని మార్చుకోవటం తప్ప, ఏదీ కొత్తగా రాదు..అంతరించదని తెలుస్తుంది.

కొన్ని జీవులు మోక్షానికి వెళ్ళటం జరుగుతుంది.  మోక్షానికి వెళ్లినాకూడా,  
కొందరు కొన్నిసార్లు లోకహితం కొరకు జన్మను ధరించటమూ జరుగుతుందనిపిస్తుంది.

మహాప్రళయంలో చాలా జీవులు సూక్షంగా ఉండి,సృష్టి ఆరంభం తర్వాత మరల జన్మలను ధరిస్తాయని తెలుస్తోంది. విత్తనంలో దాగిఉన్న చెట్టు మహావృక్షం అయినట్లు కాబోలు..

జీవులకర్మల ప్రకారం  జన్మ వస్తుందనేది నిర్ణయమవుతుంది. మంచిపనులు చేస్తే మంచిజన్మ, చెడుకర్మలు చేస్తే దానికితగ్గ జన్మ వస్తుందంటారు. 
 
కష్టాలతో ఉన్న జన్మ వచ్చినాకూడా, మంచిబుద్ధి కలిగి మంచిగా ఉంటే, పాపకర్మ కరిగి మంచిజరిగే అవకాశం ఉంటుంది. 
 
ఈ జన్మలో మనిషిగా జన్మిస్తే, ఇంతకుముందు జన్మలో ఎలాంటి జన్మనో? ఎవరికి తెలుసు?
 
ఎవరైనా చదువులో పరీక్ష పాసవ్వాలంటే అందుకుతగ్గ మార్కులు రావాలి. ఉద్యోగంలోకి తీసుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క విద్యను, నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. మరి ఎటువంటి జన్మను ఇవ్వాలి ..అనే విషయానికి కూడా అందుకు తగ్గ పద్ధతులుంటాయి కదా..
...............................

సమాజంలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. ఒకే కుటుంబంలోని వారికి కూడా ఒకేలా పరిస్థితులు ఉండవు. ఒకే కుటుంబంలో కూడా కొందరికి ఆరోగ్యం బాగుంటుంది, కొందరికి బాగోదు. కొందరికి డబ్బు బాగా ఉంటుంది, కొందరికి ఎక్కువడబ్బు ఉండదు.

వారి గతకర్మల ప్రకారం మరియు ప్రస్తుత జీవనవిధానం 
ప్రకారం జీవితం ఉంటుంది.
  సమాజంలో ఒకే విధంగా పనులు ఉండవు..ఎన్నో పనులు, ఎన్నో వ్యక్తిత్వాలు ఉంటాయి. 

 ఆఫీసులు నడవాలంటే చైర్మన్ ఒక్కరే ఉంటే జరగదు, ఆఫీసర్లు, క్లర్కులు..అందరూ అవసరం. ఏదైనా పని చేయాలంటే, దానికి తగ్గ విద్య తెలియాలి. వారు నేర్చుకున్న విద్యకు తగినట్లు ఉద్యోగాలు వస్తాయి. 

మనకే సొంత ఆఫీసు ఉంటే అక్కడ ఉద్యోగాల్లో తగిననైపుణ్యం, చదువు ఉన్నవారినే నియమిస్తాము. తగినంత అర్హత లేనివారిని నియమించముకదా..పెద్ద ఉద్యోగం రావాలంటే కష్టపడి చదవాలి.

ఉద్యోగాన్ని బట్టి జీతాలుంటాయి. వ్యక్తులు చదివిన చదువును బట్టి, శ్రమను బట్టి, సమాజంలో దానికి ఉన్న విలువను బట్టి జీతాలుంటాయి. ఈ విషయాల్లో కొందరికి అభిప్రాయభేదాలుంటాయి.

స్త్రీలు తాము ఇంట్లో కష్టపడి చాలాపనులు చేస్తారు కాబట్టి, తమ పనులు ఎంతో విలువైనవని భావిస్తారు. పురుషులు తాము బయట కష్టపడి చాలాపనులు చేస్తారు కాబట్టి, తమ పనులు ఎంతో విలువైనవని భావిస్తారు.  సమాజం సవ్యంగా సాగాలంటే ఎందరో ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది.
....................................................
ఒక మహారాజు.. ఒక సేవకవృత్తిలో ఉన్న వ్యక్తి..ఇద్దరూ గౌరవనీయులే. 
 
 మహారాజుకు కొంత ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వటం జరుగుతుంది. సేవకవృత్తిలో ఉన్నవారిని  మహారాజులా గౌరవించకపోయినా, గౌరవించాలి.
చులకనచేయకూడదు. 
 
ఏ వృత్తిలో ఉన్నవారికైనా నిత్యావసరాలకు తగినంత డబ్బు ఉండాలి. ఏ వృత్తిలో ఉన్నవారినైనా అగౌరవించకూడదు.మంచిగా ఉండాలి.  ఏ వృత్తి తక్కువది కాదు.

 పారిశుధ్యకార్మికులు కొన్నాళ్ళు చెత్త తీయకపోతే చాలా కష్టం.అప్పుడువారి విలువ తెలుస్తుంది. పారిశుధ్యకార్మికులకు కూడా సరైన జీతభత్యాలుంటే, వారిని ఎవరూ తక్కువగా చూడకపోతే వారు ఆ పనిని చేయడానికి బాధపడకపోవచ్చు.

..........................................

నియమాలతో వేదములు నేర్చుకోవటం, యుద్ధవిద్యలు నేర్చుకోవటం, వ్యవసాయం, చేతివృత్తులు..వీటన్నింటికన్నా వ్యాపారం కొంత బాగుంటుందని ఎక్కువమంది వ్యాపారం చేయడం మొదలుపెడితే, మిగతా పనులు చేసేవాళ్లు లేక సమాజం సరిగ్గా జరగదు. 
 
వ్యవసాయం, వృత్తివిద్యలు చేయకపోతే, అమ్మటానికి సరుకులు లేక వ్యాపారం కూడా చేయలేరు. సమాజంలో అన్ని పనులు చేసేవాళ్లు అవసరమే.
........................................
 
కొందరు మనుషులకు డబ్బు ఎక్కువలేకున్నా, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కొందరికి డబ్బు బాగా ఉన్నా, చెడు ఆలోచనలు, పాపాలు చేసేవారిగా ఉంటారు. ఇలాంటప్పుడు డబ్బుఎక్కువ లేకున్నా కూడా,  మంచివ్యక్తులే గౌరవనీయులు.
.............................. .................
 
 మరికొన్ని విషయములు...
  నాకు సంస్కృతము తెలియదు.  
 
  సంస్కృతములో కొన్నిచోట్ల (కొన్నిసార్లు)  ఒకే పదానికి కూడా ఒకే అర్ధము అని కాకుండా,  మరికొన్నిఅర్ధాలుంటాయట,  ఒక్క అక్షరం మారినా, పలకటంలో తేడా వచ్చినా..అర్ధం మారే పరిస్థితి ఉంటుందట. 
 
ఉదా..వంద్యా అంటే ఒకవిధమైన అర్ధం, వంధ్యా అని వత్తి పలికితే వేరే విధమైన అర్ధం అని తెలిసింది. అందువల్ల జాగ్రత్త తీసుకోవాలి. 
 ..............................
 వర్ణసంకరము అంటే అర్ధము ఏమిటోనని నాకు సందేహాలు కలిగాయి. 
 
సంస్కృతములో వర్ణము అంటే కొన్ని అర్ధములు ఉండవచ్చు. సాంకర్యము అంటే  కొన్ని అర్ధములు ఉండవచ్చు. వర్ణసాంకర్యము అంటే కొన్ని అర్ధములు ఉండవచ్చు. 
 
 వర్ణసాంకర్యము అంటే ఏమిటో దైవానికే తెలుస్తుంది.
 ......................................
 నాకు తోచిన ఆలోచనలు...
  
  వర్ణసాంకర్యము తప్పు, వర్ణసంకరం జరగకూడదని అంటారు...అంటే ఎవరూ తమ వృత్తిని మార్చుకోకూడదని అర్ధం అయితే,  

ప్రాచీనకాలంలో కూడా కొందరి విషయంలో వృత్తులు మారటం, ఒకే కుటుంబంలో వివిధవృత్తులు చేయటం జరిగిందట. ఉదా..పాండవులు కొంతకాలం విరాటరాజుకొలువులో వివిధ వృత్తులను చేసారు.

మనుషులలో గుణాలు, స్వభావము మారటం అనేది కూడా ఉంటుంది.ఎవరైనా చెడుగా మారకూడదుకాని, మంచిగా మారటం మంచిదే. 
 
 ఉదా..అరణ్యాలలో సామాన్యంగా జీవించే వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకుని వాల్మీకి మహర్షిగా మారారు.  
.................................................
 
 వర్ణము అంటే వృత్తులు అని కూడా అనుకుంటే, వర్ణసాంకర్యము చేస్తే తప్పు.. అని అంటే, 
 
స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా.. వారి పనిని మంచిగా చేయాలి, పనిలో చెడును కలపకుండా మంచిగా పద్ధతిగా  పని చేయాలి అని ( తమ వృత్తిలో మోసం, పాపాలు..వంటివి చేయకూడదని ..). 
 
వర్ణసంకరం కాకూడదు.. అంటే,  ఈ అర్ధాన్నికూడా భావించవచ్చని నాకు అనిపించింది. 
 ......................................................
 
అత్యంత ప్రాచీనకాలంలో వర్ణవ్యవస్థ, పుట్టుకతో వచ్చేదిగా ఉండి, క్రమంగా వృత్తులతో వచ్చే కుల వ్యవస్థగా మారి ఉండవచ్చని కొందరి అభిప్రాయం.

అత్యంత ప్రాచీనకాలంలో వర్ణవ్యవస్థ, వ్యక్తుల స్వభావము మరియు పనిని బట్టి ఉండేదని, క్రమంగా పుట్టుకతో వచ్చే కుల వ్యవస్థగా మారి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. 

అయితే, అగ్రవర్ణాలుగా ఉన్నవారిలో..ఉపనయనం  జరగకుండా వారికి ద్విజత్వం రాదు, అందాకా వీళ్ళు శూద్రుల కిందనే  లెక్క..అని కూడా అంటారు.

వర్ణము  
లేక  కులము..అనేది పుట్టుకతోను ఉండవచ్చు, వృత్తిని(పని..)బట్టి కూడా ఉండవచ్చని కొందరి అభిప్రాయం.
  
స్త్రీకి వివాహానికి ముందు తండ్రి యొక్క వర్ణము(కులము..), వివాహానికి తరువాత భర్త యొక్క వర్ణము(కులము..) ఉండి ఉండవచ్చని కొందరి అభిప్రాయం.
 
 అప్పట్లో చాలామంది స్త్రీలు ఇంటిపట్టున ఉండి ఆహారం వండటం, ఇల్లు చక్కదిద్దుకోవటం, చంటిపిల్లల సంరక్షణ, పిల్లలను చక్కగా పెంచటం..చేసేవారు. మరల బయటకొచ్చి ఉద్యోగాలు అని బోలెడుపని చేసేవారు కాదు.
.........................................

ఈ రోజుల్లో.. ఎవరైనా  వేరేవేరే కులాల వాళ్లు వివాహం చేసుకుంటే  జన్మించిన పిల్లలకు తండ్రి యొక్క కులాన్ని చెప్పే పద్ధతి పాటిస్తున్నారు.  తల్లి తండ్రి విడిపోయినా లేక కొన్ని సందర్భాలలో...తల్లి లేక తండ్రిలో ఎవరి కులం పిల్లలకు రావాలనేది.. ఎంచుకునే అవకాశం కూడా ఉందట.

విజ్ఞాన సూత్రాల సహాయంతో..ఒక్క స్త్రీ మాత్రమే లేక ఒక్క పురుషుడు మాత్రమే సంతానాన్ని పొందితే, ఆ పిల్లలకు ఆ ఒక్క పేరెంట్ కులమే వస్తుంది కావచ్చు.
................................................
 
 విషయాలను గమనిస్తే ఏమనిపిస్తుందంటే, సమాజంలో పనివిభజన, వృత్తులు ఏర్పడ్దాయి.

పిల్లలకు తండ్రి చేసే వృత్తి కాకుండా, వేరే వృత్తి నేర్పించాలంటే ఉన్న ఊరిలో అవకాశాలు లేక,  వేరే ఊరికి పంపటం ఇష్టం లేని పరిస్థితిలో కూడా వంశపారంపర్య వృత్తులు కొనసాగిఉండవచ్చు.   ఇలా కూడా పుట్టుకతో ఒకకులం అనేది కొనసాగుతుంది. 

 కులాలు ఏర్పడి, ఎవరివృత్తులు వారికి ఉన్నాకూడా, కొన్నిసార్లు ఇతరవృత్తులను కూడా చేసినట్లు తెలుస్తోంది.

 ప్రపంచంలో వివక్ష అనేది అనేక   విషయాలలో ఉంది. ప్రాచీనకాలంలో ఏం జరిగిందో కాని, ఇప్పటినుంచి ప్రపంచంలో వివక్ష అనేది లేకుండా అందరూ  ప్రయత్నించితే మంచిది.
........................................
 
గ్రంధాలలో ఉన్న ప్రాచీనకాలం నాటి విషయాలలో, కధలలో ఎన్నో విషయాలుంటాయి. ఎన్నో అంతరార్ధాలుంటాయి. ఎన్నో కోణాలుంటాయి. ఎన్నో విధాలుగా విశ్లేషించి తెలుసుకోవాలి. పైపైనచూసి గబుక్కున నిర్ణయానికి రాకూడదు.వారి పూర్వజన్మకర్మలను బట్టి కూడా కధలలో విషయాలుంటాయి. 
 
గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు (మార్పులుచేర్పులు) జరిగాయని తెలుస్తుంది.ఏది ప్రక్షిప్తమో సరిగ్గా తెలియకపోవచ్చు.

గ్రంధాలలో  ప్రాచీనకాలపు కధలలో చెప్పబడిన 
వాళ్లు ఇతర లోకాల్లోనివాళ్లు కావచ్చు.   కొందరు, ఇతరగ్రహాలవాళ్లు కూడా ఉంటారు. భూమిపైన రాజ్యాలవాళ్లు, దేశాలవాళ్లు, రాష్ట్రాలవాళ్లు కూడా ఉంటారు.

ప్రాచీనకాలంలో భూమిపై వివిధఖండాలు కాకుండా, ఒకే ఖండముగా ఉండేదంటున్నారు.
.............................................

 విశ్వంలో ఎన్నో డైమెన్షన్లున్నాయంటారు. సృష్టిలో అపారమైన విజ్ఞానం ఉంది.  ఎన్నో రహస్యాలుంటాయి. అన్నీ దైవానికి మాత్రమే తెలుస్తాయి.

 
మనుషులు సృష్టిలోఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోలేరు. కొన్ని విషయాలను, సందేహాలను తెలుసుకోవచ్చు.
 
ఇంకా సందేహాలు ఉన్నాకూడా, వాటిగురించి అదేపనిగా ఆలోచించటం కన్నా, అవసరమైనంతలో కొన్ని తెలుసుకుని, అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుంటే సరిపోతుంది.   
 
 ప్రాచీన గ్రంధాలలో ఎంతో విజ్ఞానం ఉంది..గ్రంధాలలోని ఆయుర్వేదాన్ని కాని, ఇంకా ఏదైనా విద్యనుకాని నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. అయితే, గ్రంధాలలోని విజ్ఞానాన్ని అంతా తెలుసుకోవాలని, ఎప్పుడూ సందేహాలతో సతమతమవుతూ ఉంటే చాలాకష్టం.
 
జీవితంలో ప్రతి సందేహాన్ని తీర్చుకోవటమే మన జీవితలక్ష్యం కాదుకదా, దైవకృపను పొందటం..ముఖ్యము. దైవముదయ ఉంటే అన్నీ ఉంటాయి.

సృష్టిలో ఎన్నో విషయాలుంటాయి. ఎన్నో రహస్యాలుంటాయి. దైవానికే అన్నీ సరిగ్గా తెలుస్తాయి.
.................................
  వ్రాసినవాటిలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 ....................................
 
భారతీయ విజ్ఞానం గురించి కొన్ని లింక్స్..
 
 
 

No comments:

Post a Comment