కొందరు ప్రజలు తమకు నచ్చినదే ధర్మం అంటారు .
నాకు నచ్చినదే ధర్మం , నాకు తోచినట్లే నేను ప్రవర్తిస్తాను.. అంటూ ప్రతి ఒక్కరూ సమాజానికి హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. అలా ప్రవర్తిస్తే ఏ చట్టమూ , ఏ న్యాయస్థానమూ ఒప్పుకోవు కదా !
సమాజక్షేమం కోరి పెద్దలు కొన్ని కట్టుబాట్లను ఏర్పరిచారు. సమాజం సజావుగా సాగటానికి ఏర్పరుచుకున్న ధర్మాలను సరిగ్గా పాటించినప్పుడే సమాజం సజావుగా సాగుతుంది.
............
అయితే, ఏది ధర్మం ? ఏది అధర్మం ? అనే విషయంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తూంటాయి.
ఈ విషయములను ప్రజలకు మరింత వివరంగా తెలియజేయాలని భావించి , ఆ వివరాలను పెద్దలు పురాణేతిహాసాల కధల ద్వారా లోకానికి తెలియజేశారు.
ఎన్నో కధలు, ఎన్నో పాత్రలు, చిత్ర విచిత్రమైన మలుపులు, ఎన్నో విభిన్నమైన కోణాలు..ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేసారు.
...................
ఎంతటి గొప్పవాళ్ళైనా సరే పొరపాటుగా ప్రవర్తిస్తే....
ఒకసారి ఇంద్రుడు, దుర్వాస మునీంద్రుడు ఒకరికొకరు ఎదురుపడ్డారు.తనకు విష్ణుమూర్తి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని దుర్వాసుడు ప్రేమగా ఇంద్రునికి కానుక చేశాడు.
దాన్ని స్వీకరించి దేవేంద్రుడు కళ్ళకు అద్దుకుని శిరస్సు మీద పెట్టుకోవలసింది పోయి నిర్లక్షంగా తన ఐరావతం శిరస్సు మీదకు విసిరాడు. ఈ సంఘటనలో దుర్వాసుడికి మహాకోపం వచ్చి ఇంద్రుని శపిస్తాడు.
ఇంద్రుడు గజగజలాడుతూ దుర్వాసుని పాదాలపై పడి ప్రాధేయపడగా, మునీశ్వరుడు కాస్త మెత్తబడి ఎన్నో విషయములను ఉపదేశిస్తారు.
జరిగిన విషయములను ఇంద్రుడు బృహస్పతికి తెలియజేయగా ..
. ఒకరి శాపం గానీ ఒకరి ఆశీస్సు గానీ మన కర్మఫలాలే. మహాలక్ష్మి వరించినా మహాదైన్యం లభించినా కర్మఫలమే..అంటూ వారు ఎన్నో విషయములను వివరిస్తారు.
తరువాత కొన్ని ప్రయత్నముల తరువాత ఇంద్రుడు తన ఐశ్వర్యాన్ని తిరిగి పొందుతారు.
ఎంతటి గొప్పవాళ్ళైనా సరే , పొరపాటుగా ప్రవర్తిస్తే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారని ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు.
..................
సంధ్యావందనము యొక్క ప్రాముఖ్యత..
ఒకప్పుడు పరాశర మహర్షి అశ్వపతికి ఉపదేశించిన విషయములలో కొన్ని విషయములు..
.సంధ్యావందన పరిపూతుడైన బ్రాహ్మణుడి పాదధూళితో భూదేవి పవిత్రురాలవుతుంది. అతని స్పర్శతో నదీజలాలు పావనమవుతాయి. గరుత్మంతుణ్ణి చూసిన పాములలాగా పాపాలు పారిపోతాయి.
సంధ్యావందనం చెయ్యనివాడు అందించే పిండతర్పణాలను పితృదేవతలు స్వీకరించరు. పూజానైవేద్యాలను దేవతలు అంగీకరించరు.
..................
యమధర్మరాజు సావిత్రికి తెలియజేసిన విషయములలో కొన్ని విషయములు..
ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరి నుంచి కాజేసినా చోరుడు నక్రముఖి కుండములో నలిగిపోవలసిందే. మూడు శతాబ్దములు యమభటుల దండతాడనలు తినవలసిందే.
ఆ పైని రోగిష్టి ఎద్దుగా ఏడు జన్మలు దుఃఖించి మానవుడై మహారోగిగా అందరితోనూ ఏవగింపబడి కడపటికి పరిశుద్ధి పొందుతాడు.
ఏనుగుల్నీ గుర్రాల్నీ పశువులను చంపినవాడు గజదంశకూపంలో మూడుయుగాలపాటు యాతనలు అనుభవిస్తాడు. నాగదంతాలతో యమభటులు కుళ్ళబొడుస్తుంటే కుయ్యోం మొర్రో మని పెడబొబ్బలు పెడతాడు. అటుపైని ఆయాజంతువులుగా మూడేసి జన్మలు ఎత్తుతాడు. నరుడై శుచి అవుతాడు.
....
బ్రహ్మహత్యా సమానాలు...
బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపటం అనేకాదు. ఇంకా చాలా రకాలున్నాయి.
శ్రీకృష్ణాది దేవతల పట్ల భేదభావాన్ని పాటించి ఆదరానాదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్యా సదృశం. ..
గురు మాతాపితృ భార్యాపుత్రుల్ని పోషించకపోయినా అవివాహితుడిగా సంతానం పొందినా బ్రహ్మహత్య చేసినట్టే. ఇదే ఆతిదేశిక బ్రహ్మహత్య.
...........
పురుషుడికి పరిణయమాడిన స్త్రీ మాత్రమే గమ్య. తక్కిన వనితలందరూ అగమ్యలు. అంటే పొందుకోరరానివారు. అగమ్యాగమనం నూరు బ్రహ్మహత్యలతో సమానం. కుంభీపాక నరకమే శిక్ష.
..........
దేహస్వరూపాన్ని వివరిస్తూ...
స్థూల శరీరం పంచభూతాత్మకం. అది కృత్రిమ దేహం కనక నశ్వరం - బూడిద అయిపోతుంది.మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాలూ పంచభూతాలలో కలిసిపోతాయి. అటుపైని అంగుష్ఠప్రమాణంతో జీవుడు మిగులుతాడు. ఇది సూక్ష్మదేహం. దీనితోనే శుభాశుభకర్మఫలాలు అనుభవిస్తాడు. ఇది నశించదు. శిధిలం కాదు. అగ్ని దగ్ధం కాదు. శస్త్రాస్త్రాలకు లొంగదు. తప్తద్రవ తప్తతైల తప్తపాషాణాది కూపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కుచెదరదు. దుఃఖాలను మాత్రం అనుభవిస్తూంటుంది...ఇలా అనేక విషయాలను తెలియజేసారు.
...................................
పై విషయాలను గమనిస్తే మనకు అనేక విషయాలు తెలుస్తాయి.
అయితే, తెలిసో తెలియకో పాపాలు చేసి కష్టాలను అనుభవించే జీవుల పట్ల కరుణను కలిగి ఉన్నవాళ్ళకు పుణ్యం వస్తుంది .
ప్రతివారు ఇతరులు మారాలంటున్నారు, కాని తమరు మారే ఆలోచనే కనపడటం లేదు. స్వర్గం నరకం నువు చూశావా అని అడుగుతున్నారు. చూస్తే కాని ఏదీ నమ్మరు, నేటి పరిస్థితి అంతే.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteదైవం ఎంతో సమర్ధులు.
తగిన సమయం వచ్చినప్పుడు , నమ్మని వారికి నమ్మేవిధంగా చేస్తారు.