koodali

Monday, August 25, 2014

.వరుణ పూజలు...

 
వర్షాలు  సరిగ్గా  పడటంలేదని  వరుణపూజలు  చేసారు. వరుణపూజలు  ఫలించి    వానలు కురిసి  నదులలోకి  నీరు  వచ్చింది. 


ఉత్తరభారతంలో  విస్తారంగా  వానలు  కురిసాయి. కర్ణాటక  ఎగువన  కురిసిన  వానల వల్ల   దక్షిణాదిన  కూడా నదులలోకి  నీరు  వచ్చింది.  రెండుమూడునెలల  క్రిందట  కన్నా  పరిస్థితి  చాలా  వరకు  చక్కబడింది. 


  అయితే  వర్షాకాలం  లాగా ఎక్కడికక్కడ  బాగా  వానలు  పడకపోవటంవల్ల   ఉష్ణోగ్రతలు  పెరుగుతున్నాయని  అంటున్నారు.  ఇలా  సకాలంలో  వానలు  పడని  పరిస్థితికి  మనుషుల  స్వయంకృతాపరాధాలే  కారణం.  


అభివృద్ధి  పేరుతో మనుషులు  సాగిస్తున్న  విచ్చలవిడి  పర్యావరణ కాలుష్యం  వల్ల  ఉష్ణోగ్రతలు  క్రమంగా  పెరుగుతున్నాయి. ఒక దగ్గర  వరదలు, ఒక దగ్గర విపరీతమైన ఎండలు ఉంటూ  వాతావరణం  అస్తవ్యస్థంగా  మారుతోంది. 


వానలు  కురవకపోతే  పూజలు  చేయటం  మంచిదే  కానీ, వాతావరణ విధ్వంసాన్ని  మానుకోవాలి. 


.మనుషులు  తమ అంతులేని  కోరికలతో  పర్యావరణాన్ని  విధ్వంసం చేస్తుంటే ,  దైవం  మాత్రం  మనుషులు  చేసే  పూజలకు  మురిసిపోయి  సకాలంలో చక్కగా   వర్షాలు  కురిపించాలని  ఆశపడుతున్నాము.


 దైవం  దయామయులు  కనుక , మనుషులు  ఎన్ని  తప్పులు  చేస్తూన్నా  ఇంకా   వానలు  కురిపిస్తూనే  ఉన్నారు. 


మనుషులు  చేస్తున్న  విధ్వంసం  వల్ల  పర్యావరణం  పాడయ్యి  ఎన్నో  జీవజాతులు  ఇబ్బందులు  పడుతున్నాయి.   ఇంతకుముందు  కొండల  పైన  వృక్షాలు  దట్టంగా  పెరిగేవి. అందువల్ల  ఆ  ప్రాంతములో  వానలు  పడేవి.  ఇప్పుడు  రాళ్ళకోసం  కొండలనూ  పిండిచేసి  మాయం  చేసేస్తున్నారు. 


 మరికొందరు  జనాలు  నేలమీద  స్థలం  దొరకటం  లేదంటూ  కొండలపైకి  ఎక్కి  ఇళ్లు  కట్టేస్తున్నారు.  ఇక  కొండలపైన  చెట్లకు  స్థానం  ఎక్కడిది  ? 


ఇంతకు ముందు  సిమెంట్  రోడ్  లేక  తారు  రోడ్  ఉన్నా ,  కనీసం  రోడ్డుకు  ఇళ్ళకు  మధ్య  మట్టినేల  ఉండేది. 


ఇప్పుడు  నగరాల్లో  మట్టి అనేది   కనబడకుండా  సిమెంట్ తో నేలను  కప్పేస్తున్నారు.   కొందరు , తమ  ఇంటికి  రోడ్ కు  మధ్య  కూడా  మట్టి  కనబడకుండా  సిమెంట్  వేసి,  అదే  గొప్ప  అనుకుంటున్నారు.


మట్టి  నేలంటూ  లేకపోతే  వానలు  కురిసినప్పుడు  పడే  వాననీరు  నేలలో  ఇంకేదెలా  ?  నీరు  నేలలో  ఇంకితేనే  కదా  భూగర్భజలాలు  పెరుగుతాయి. 


 ఇక, కొందరు  పరిశ్రమల  వారు  తమకు  వేలకొలది  ఎకరాల  స్థలం  కావాలంటున్నారు. ఎక్కువగా  యంత్రాలతో  పనులు  చేయించుకుంటూ  కొద్దిమందికి  మాత్రమే  ఉద్యోగాలు  ఇస్తారు. వాళ్ళు  ఇచ్చే  వందల  ఉద్యోగాలకు  స్థలం  మాత్రం  వేల  ఎకరాలు  కావాలంటారు. 


కొన్ని  పరిశ్రమల  భూమి  కోసం  అడవులను  కూడా  కొట్టివేస్తారు.

మనుషులకు  ఎక్కడి  స్థలమూ  చాలటం  లేదు.  భూమి  అంతటా  కాంక్రీట్  కట్టడాల మయం  అయిపోయి,  పర్యావరణం  అంతటా  కాలుష్యంతో  నిండి, ఉష్ణోగ్రతలు  పెరుగుతుంటే  సకాలంలో  వానలు  ఎలాపడతాయి  ?


 మనుషులు తాము  పర్యావరణానికి   కలగజేస్తున్న  విధ్వంసాన్ని  గ్రహించాలి. లేకపోతే  ముందుముందు  ఏం  జరుగుతుందో  ఊహించటం  కష్టమే.


2 comments:

  1. గజ స్నానం అలవాటయిపోయిందండీ! చెప్పేవారు చెబుతున్నా వినేవారే లేరు...మళ్ళీ సులభా పురుషా రాజన్ సతత్ః ప్రియవాదినః......చేతులు కాలుతున్నా వినరు....పట్నాలే కాదు పల్లెలూ అలాగే ఉన్నాయి...


    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి, పట్నాలే కాదు పల్లెలూ అలాగే ఉన్నాయి...

    ReplyDelete