నిన్నటితో ఈ సంవత్సరపు అమర్నాధ్ యాత్ర ముగిసింది.
శ్రీ సువర్చలా దేవి సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారికి అనేక వందనములు.
.................
పూర్వం భూమిపై జనాభా తక్కువ ఉండేదని, అందువల్ల అప్పటి ప్రజలు సంతానం కోసం తాపత్రయంతో ఎలాపడితే అలా సంతానాన్ని కనేవారనే అర్ధం వచ్చేటట్లు ఒకరు వ్రాసారు.(ఇలా భావించటం తప్పు. )
జనాభా విస్ఫోటనం వల్ల జరిగే పరిణామాల గురించి పెద్దలు ఎప్పుడో తెలియజేసారు.
ఉదా..వీరిణీ దక్షులను ప్రజా సృష్టి చెయ్యమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు కలిగిన అధిక సంతానాన్ని చూసి నారదుడు పరిహసించాడు.
వీరిణీ దక్షులారా! భూగోళం ఏపాటి ఉందో తెలుసుకోకుండా మీరు ఇలా సంతానాన్ని వృద్ధిపరిస్తే ఎలాగ ? ముందుగా పృధివీ ప్రమాణాన్ని తెలుసుకోండి. అటుపైని సంతానోత్పత్తి చేయండి...
ఈ విధంగా అధిక జనాభా పర్యవసానాల గురించి పెద్దలు ఎప్పుడో తెలియజేసారు.
........
తనకు పుట్టిన పిల్లలు తన రక్తం పంచుకుపుట్టిన పిల్లలే అని స్త్రీ నమ్మకంగా చెప్పుకోగలదు. ఎందుకంటే , గర్భం ధరించి సంతానాన్ని పొందే అవకాశం స్త్రీకే ఉంది కదా ! అయితే, తన సంతానం తనకు పుట్టిన వారే అయ్యుండాలనే ఆశ పురుషునికి కూడా ఉంటుంది.
అయితే, అరటాకు ముల్లు సామెత ప్రకారం పొరపాటున స్త్రీ అత్యాచారానికి గురై తద్వారా గర్భాన్ని ధరిస్తే ఆ స్త్రీ యొక్క భర్తకు అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించే పూర్వీకులు కుటుంబ రక్షణ కొరకు కొన్ని ఆంక్షలను విధించారు.
అయితే, పొరపాటున ఏ స్త్రీ అయినా బలాత్కారానికి గురైతే ఆమెను వెలివేయకుండా రజస్వలానంతరం ఆమె శుద్ధి అవుతుందనే వెసులుబాటును ఏర్పరిచారు.
అత్యాచారం జరిగిన తరువాత స్త్రీ ఋతుమతి అయితే అత్యాచారం చేసిన వ్యక్తి వల్ల గర్భం వచ్చే ప్రమాదం ఉండదు. ఆ విధంగా ఆమె శుద్ధిని పొందిందని అనుకోవాలి.
ఈ ఉద్దేశంతోనే పూర్వపు వాళ్ళు స్త్రీ ఋతుమతి అయితే శుద్ధి పొందుతుందని చెప్పి ఉంటారు.
అంతేకానీ, స్త్రీలు ఎలాపడితే అలా పరపురుషులతో తిరిగినా ఋతుమతి అయితే చాలు శుద్ధి అయిపోతారు. అని పెద్దల ఉద్దేశం కానేకాదు.
స్త్రీలకు అన్యాయం జరగకూడదనే విశాలహృదయంతో పెద్దలు చెప్పిన విషయాన్ని కొందరు వక్రీకరించటం అత్యంత విషాదకరం.
ఇక ఈ విషయానికి కన్యాత్వానికి సంబంధమే లేదు. ఉదా..వివాహం కాని వారిని కన్య అంటారు. వివాహం అయిన వారిని కూడా .. కొన్ని సార్లు కన్య అనే పద ప్రయోగంతో గౌరవిస్తారు.
కన్యా ధర్మం, కన్యాత్వం అంటే మాత్రం పురుషసంబంధం లేకపోవటమే.
కుంతి, సత్యవతి విషయంలో వారికి కన్యాత్వం పోకుండా సంతానాన్ని పొందటమనే వరం ఇవ్వబడింది.
ఏ స్త్రీ అయినా ఋతుమతి అవుతుంది. శుద్ధి పొందుతుంది. వారికి కన్యాత్వం అనే వరాన్ని ప్రత్యేకంగా ఇవ్వనవసరం లేదు.
సూర్యుడు, పరాశరుడు అలా వరాన్ని ఇచ్చారంటే అందులో ప్రత్యేకత ఉంటుంది. కన్యాత్వము పోకుండా సంతానాన్ని ఇవ్వటం అంటే, పురుష కలయిక లేకుండా సంతానాన్ని ఇవ్వటమనే అర్ధం.
సత్యవతి చేతిని పట్టుకోవటం.. వంటి చర్యలు పరాశరుని విషయంలో జరిగినట్లు అనుకున్నా కూడా ... కలయిక జరిగిందని అనుకోనవసరం లేదు.
పరాశరుడు సత్యవతికి కన్యాత్వం పోకుండా వరాన్ని ఇచ్చాడు. ఇచ్చిన మాటను తప్పలేదు.
దేవతలు, గొప్ప మహర్షులు అద్భుతమైన మహిమలు గలవారు.
స్త్రీపురుష కలయిక లేకుండానే సంతానం కలిగిన ఉదాహరణలు గ్రంధాలలో ఉన్నాయి. ఉదా..వ్యాసునికి శుకుడు జన్మించటం.
అందువల్ల కుంతి, సత్యవతి విషయంలో ఏదో జరిగిపోయిందని ఇప్పటి వారు దిగులు చెందనవసరం లేదు.
ఇప్పటి రోజుల్లో స్త్రీపురుష కలయిక లేకుండానే సంతానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఉదా..టెస్ట్ ట్యూబ్ పద్ధతి.
ఇప్పటి వారికే ఇలాంటి పద్ధతులు తెలిసినప్పుడు ఎన్నో మహిమలు గల దేవతలకు, రుషులకు మరెన్నో విద్యలు తెలుస్తాయి కదా !
..................
స్త్రీలలో భేదాలను గురించి యమధర్మరాజు సావిత్రికి తెలియజేసిన కొన్ని విశేషాలు...
( శ్రీ దేవీ భాగవతము నుంచి తెలుసుకున్నవి.. )
పతివ్రతా చైకపతౌ ద్వితీయే కులటాస్మృతా
తృతీయే ధర్షిణీ జ్ఞేయా చతుర్ధే పుంశ్చలీత్యపి
వేశ్యా చ పంచమే షష్ఠే పుంగీ చ సప్తమే2ష్టమే
తత ఊర్ధ్వం మహావేశ్యా సాస్పృశ్యా సర్వ జాతిషు
ఒకడిని అగ్నిసాక్షిగా పరిణయమాడి త్రికరణశుద్ధిగా అతడితో జీవించేది పతివ్రత.
రెండవ వాడితో సంపర్కం పెట్టుకుంటే కులట.
ముగ్గురితోనైతే ధర్షిణి.
నలుగురితో పుంశ్చలి.
అయిదుగురితో వేశ్య.
ఇంకా ఆపైని మహా వేశ్య.
కులట నుంచి మహావేశ్య వరకు ఎవరిని పొందినా..నరకానికి పోవడం తధ్యం.
............................
ఇంకా, వివాహసమయంలో నాతిచరామి అనిపించటం ద్వారా ..భార్యను మీరి చరించను . అని వరుని చేత అనిపిస్తారు.
పై విషయాలను గమనించితే స్త్రీలు పురుషులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటాన్ని పెద్దలు ఒప్పుకోలేదని తెలుస్తుంది.
...............................
పరాశరుడుసత్యవతి కధలో...
ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునానది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చాడు పరాశర మహర్షి. ... నావలో నదిని దాటించమని దాశరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్ళాలని త్వరపెట్టాడు.
భోజనం చేస్తున్న దాశరాజు మధ్యలో లేవటం ఆచారం కాదు కనక మత్శ్య గంధిని పురమాయించాడు. అమ్మాయీ! ఆవలి ఒడ్డుకు చేర్చిరా.వెళ్ళాలని తొందర పడుతున్నాడు. పైగా తపస్వి. అన్నాడు సరేనంది మత్శ్యగంధి.
పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేసి నడుపుతోంది. ఆమె నవయౌవనం పరాశరుణ్ణి ఆకర్షించింది. చిరునవ్వులూ వాలుచూపులూ గెడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉంది..
తరువాత పరాశరుడు తనను కోరుకోవటం చూసి సత్యవతి భయపడుతుంది.
పరాశరుడు సత్యవతికి మధ్య జరిగిన సంభాషణలో కొంత భాగం ...
పరాశరుడు..నీ కన్యాత్వం చెడదు. ఇది నేనిస్తున్న వరం. భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు.
సత్యవతి.. మహా తపస్వీ! మా తల్లితండ్రులకు గానీ లోకానికి గానీ ఈ సంగతి తెలియకూడదు. నా కన్యాత్వం చెడకూడదు.అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యౌవనం ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి.
పరాశరుడు..సుందరీ ! తధాస్తు.విష్ణ్వంశతో కొడుకు పుడతాడు. ఇదేమిటో వింతగా ఉంది. ఎందరెందరో అప్సరసల ఒయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనస్సు చలించలేదు. దుర్గంధం ఉన్నా నల్లగా ఉన్నా నిన్ను చూసి మనస్సు పడ్డాను. వింత కాదూ!..
...............
ద్రౌపది గురించి శ్రీ పాద శ్రీ వల్లభస్వామి సంపూర్ణ చరితామృతము గ్రంధము లో ఎన్నో వివరములు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చదవవచ్చు.
...................
పెద్దలు మనకు కుంతి కధ ద్వారా ఎన్నో పాఠాలను నేర్పించారు.
కుంతి కధను ఈ కాలపు దృష్టితో చూస్తే ,
వివాహానికి ముందు తమ పిల్లలు తప్పటడుగు వేయకూడదని తల్లితండ్రి తాపత్రయపడతారు. వివాహానికి ముందే సంతానాన్ని పొందటం వల్ల కలిగే నష్టాలను తల్లితండ్రులు పిల్లలకు చెప్పటానికి ఇబ్బందిగా ఫీలవుతారు.
అలాంటప్పుడు పురాణేతిహాసాల ద్వారా కుంతి, శకుంతల వంటి వారి కధలను వినిపిస్తే పిల్లలు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది.
అయితే, కుంతీదేవి భర్త మరణం వల్ల కలిగిన కష్టాన్ని తనలోని దాచుకుని ఎంతో నిబ్బరంగా పిల్లలను పెంచుకుంది.
శకుంతల తనకు ఎదురైన కష్టాన్ని నిబ్బరంగా ఎదుర్కుని విజయాన్ని సాధించింది.
.....................
ఎదిగీఎదగని వయస్సు పిల్లలకు కొన్ని విషయాలను అందించకూడదు అనే పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు.
చిన్నపిల్ల కుంతికి దుర్వాస మహర్షి సంతాన మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళారు.
ఆ వయస్సుకు తగ్గ ఉత్సుకతతో దుర్వాసముని ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనుకుని కుంతి మంత్రాన్ని పఠించింది.
మంత్రాధీనుడైన సూర్యుడు వచ్చి సంతానాన్ని ప్రసాదించారు. కుంతి జీవితం చిక్కుల్లో పడింది.
కర్ణుడికి జన్మనిచ్చింది. లోకనిందకు భయపడి పిల్లవాడిని వదిలివేసింది. కర్ణునికి అన్యాయం చేసానని జీవితాంతమూ కుమిలిపోయింది.
పిల్లలకు తెలియనక్కరలేని ఎన్నో విషయాలు ఈ రోజుల్లో మీడియా ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
వాళ్ళు ఉత్సుకతతో వాటిని చూస్తారు. వాటి ప్రభావం సమాజంపై చాలా ఉంటోంది.
.....................
ఇక సత్యవతి పరాశరుల కధను ఈ కాలపు దృష్టితో చూస్తే , ( అంటే, పరాశరుడు ఏ మహిమలూ లేని సాధారణ వ్యక్తి అనుకుని చూస్తే...)
స్త్రీ పురుషుడు ఒంటరిగా ఉండే సమయం చిక్కితే కొందరు గొప్పవారికి కూడా మనస్సు అదుపు తప్పే అవకాశం ఉందనే పాఠాన్ని ఈ సంఘటన ద్వారా నేర్చుకోవచ్చు.
..................................
పురాణేతిహాసాలలోని కధలలో పైకి కనిపించే సామాన్య అర్ధాలే కాకుండా వాటిలో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.
........................
ఈ కధలలో ఉన్న నీతిని సమాజానికి అందించితే మంచిని చేసిన వాళ్ళమవుతాము.
అంతేకానీ , అప్పటి వాళ్ళను నెగటివ్ గా చూపించటానికి ప్రయత్నిస్తే సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళవుతారు.
పురాణేతిహాసాల పాత్రల ద్వారా ఎన్నో పాఠాలను పెద్దలు మనకు అందించారు.
దైవం , ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం మహా భారతం వంటి జీవిత కధలను నడిపించారని పెద్దలు తెలియజేసారు. దేవతలు మరియు ఎందరో మహర్షులు లోకానికి ధర్మాధర్మాలను నేర్పే జగన్నాటకంలో పాత్రధారులు అయ్యారు.
......................
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
నేటి కాలం వాళ్ళమే మేధావులమనుకోడం, నాటి వారంతా చేతకాని వారనుకోడం, అప్పటి ధర్మాన్ని బట్టి జరిగినవాటిని ఇప్పటి ధర్మంతో బేరీజు వేయడం కొంతమంది వాటికి వంత పాడటం, నేటి ఫేషన్. నిజానికి నాటి స్త్రీకి ఉన్న స్వాతంత్ర్యం నేడు లేదు, ఇది సత్యం.
ReplyDelete
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మీ వ్యాఖ్యలోని భావం నాకు సరిగ్గా అర్ధం కాలేదు.
ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు, పురాణేతిహాసాలలోని విషయాల గురించి తప్పుడు అర్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం కదా !
కొందరు ఏమంటున్నారంటే, పురాణేతిహాసాలలోని పాత్రల ప్రవర్తన తప్పుగా ఉందని అంటున్నారు. ప్రాచీనులు చెప్పిన నియమాలలో విచ్చలవిడితనమే ఉందంటున్నారు.
మీరే చెప్పండి. వారి అభిప్రాయాలను ఖండించి పురాణేతిహాసాలలో ఉన్నది అధర్మం కాదు అని చెప్పటం తప్పా ? పురాణేతిహాసాలను ఎగతాళి చేస్తున్నవారి అభిప్రాయాలను ఖండించనవసరం లేదా ?
నేనూ ఒకప్పుడు పురాణేతిహాసాలను అపార్ధం చేసుకున్నాను. అయితే, క్రమంగా పురాణేతిహాసాలలోని ధర్మం అర్ధం అవుతున్న కొద్దీ నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది.
ఇంతకుముందు పురాణేతిహాసాలను అపార్ధం చేసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. అంతా దైవం దయ.
ReplyDeleteపురాణేతిహాసాలు విజ్ఞాన సర్వస్వాలు. వాటి ద్వారా ఎన్నో విషయాలను పెద్దలు మనకు తెలియజేశారు.
ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ పురాణేతిహాసాలలో ఉన్నాయి.
ప్రపంచంలో మంచి ఉన్నది చెడు ఉన్నది... అలాంటప్పుడు ప్రపంచంలో ఉన్న మంచి - చెడు కూడా పురాణేతిహాసాలలో ప్రతిఫలిస్తుంది.
ఆటలలో వినోదం కోసం గెలుపు ఓటములను ఏర్పరుచుకుంటాము. అలాగే జగన్నాటకం అనే ఆటలో వినోదం కోసం ప్రపంచంలో మంచి చెడు కూడా ఉంటాయని మనం అనుకోవచ్చు.
మనం జీవితంలో పొరపాట్లు చేయకుండా ఉండాలంటే పొరపాట్లు అంటే ఏమిటో ముందు మనకు తెలియాలి కదా !
జీవితంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో , ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో పురాణేతిహాసాల ద్వారా పెద్దలు మనకు తెలియజేసారని నాకు అనిపించింది.
పురాణేతిహాసాలను సరిగ్గా అర్ధం చేసుకోకపోవటం వల్ల ఎన్నో అపార్ధాలు వస్తున్నాయి.....పురాణేతిహాసాలను సరిగ్గా అర్ధం చేసుకుంటే అంతా ధర్మమే కనిపిస్తుంది.
నా అభిప్రాయం ఏమిటంటేనండి, అప్పటి ధర్మం ఇప్పటి ధర్మం అంటూ వేరుగా ఉండదు. ఎప్పుడైనా ధర్మం ధర్మమే.
ReplyDeleteఇతరులను బాధపెట్టేలా ప్రవర్తించటం అప్పుడైనా తప్పే, ఇప్పుడైనా తప్పే.
ఇతరుల సొమ్మును కాజేయటం అప్పుడైనా తప్పే, ఇప్పుడైనా తప్పే.
స్త్రీలు పురుషులు మనసును అదుపులో ఉంచుకోకుండా ప్రవర్తించటం అప్పుడైనా తప్పే, ఇప్పుడైనా తప్పే.
ధర్మం అంటే ... ఇతరులు నీకు ఏమి చేస్తే నీవు బాధపడతావో నీవు దానిని ఇతరులకు చేయవద్దు. అని నిర్వచిస్తారు కదా !
అప్పటి రోజుల్లో అయినా ఇప్పటి రోజుల్లో అయినా ధర్మానికి నిర్వచనం ఇదే కదా !
ఈ విషయాన్ని గమనిస్తే ధర్మం అనేది ఏ రోజుల్లో అయినా ఒకటే అని తెలుస్తోంది.
స్త్రీలు పురుషుల విషయంలో పెద్దలు కొన్ని కట్టుబాట్లను ఏర్పరిచారు. వాటిని సక్రమంగా పాటిస్తే సమాజం సజావుగా సాగుతుంది.
అయితే , కొన్ని సార్లు పరిస్థితుల ప్రాబల్యం వల్ల కావచ్చు లేక ఇతరత్రా కారణాల వల్ల కావచ్చు గొప్ప వాళ్ళు కూడా పొరపాట్లను చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎంత గొప్పవాళ్ళయినా వారు చేసిన కర్మకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.
ఇతరుల పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకుని తాను ఆ పొరపాట్లు చేయకుండా ఉండటమనేది విజ్ఞుల లక్షణం.
గొప్పవాళ్ళే పొరపాట్లు చేశారు . నేను చేస్తే తప్పేమిటి ? అని పొరపాట్లు చేస్తే అది దురదృష్టవంతుల లక్షణం.
స్త్రీ అయినా పురుషుడైనా పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. హద్దులు దాటినప్పుడు అప్పటి కాలం వాళ్ళయినా , ఇప్పటి కాలం వాళ్ళయినా దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది.
నా అభిప్రాయాలను మరింత వివరంగా తెలియజేయాలనిపించి ఇవన్నీ వ్రాసాను.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించండి.