నేడు స్వాతంత్ర్యదినోత్సవం .
స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇంకా దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నందుకు , అనేక విషయాలలో సహాయం కోసం విదేశాల వైపు చేతులు చాపుతున్నందుకు మనం సిగ్గుతో తలదించుకోవాలి.
ఆకలితో అల్లాడుతున్న అభాగ్యులు కొందరు, ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలు కొందరు,
దేశం నుంచి దోచుకున్న వేలకోట్ల సొమ్మును విదేశాలకు తరలిస్తూన్న దేశద్రోహులు కొందరు, అనేక సమస్యలతో ఉన్న దేశంలో ఆడంబరాలతో , వినోదాలతో ఎంతో సమయాన్ని వృధా చేస్తున్న ప్రజలు కొందరు ,
ఇక , దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఏ విధంగా సంతోషించాలో అర్ధం కావటం లేదు.
సరే, అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా కొందరు నేతలు దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తామని గట్టిగా ఆశ పెడుతున్నారు. ఆ ఆశ వమ్ముకాకూడదని ఆశిద్దాము.
నేతలతో పాటు, అధికారులు, ప్రజలు, కలిసి ఎవరి ధర్మాన్ని వారు నిజాయితీగా ఆచరించినప్పుడు సమాజం తప్పక అభివృద్ధి చెందుతుంది.
..........................
సత్యయుగంలో ధర్మం నాలుగుపాదాలతో నడుస్తుంది. కలియుగానికి వచ్చేసరికి ఒంటిపాదంతో నడుస్తుందని అంటారు.
అంటే క్రమంగా ధర్మాన్ని పాటించే వారు తగ్గుతారని అర్ధం. అంతే కానీ , ధర్మం మారుతుందని అర్ధం కాదు .
సత్య యుగంలోనైనా కలియుగంలోనైనా ... పాపాలు చేసేవారికి నరకం... పుణ్యాలు చేసేవారికి స్వర్గం ప్రాప్తిస్తాయి.
ఏ యుగంలోనైనా మూలధర్మాలు మారవు. .మూలధర్మాలు అంటే....
ఉదా.. ఇతరులను బాధపెట్టేలా ప్రవర్తించటం ఏ యుగంలోనైనా తప్పే,
ఇతరుల సొమ్మును కాజేయటం ఏ యుగంలోనైనా తప్పే,
స్త్రీలు పురుషులు మనసును అదుపులో ఉంచుకోకుండా ప్రవర్తించటం ఏ యుగంలోనైనా తప్పే....
ధర్మం అంటే ... ఇతరులు నీకు ఏమి చేస్తే నీవు బాధపడతావో నీవు దానిని ఇతరులకు చేయవద్దు. అని నిర్వచిస్తారు .
ఏ కాలంలోనైనా ధర్మానికి నిర్వచనం ఇదే కదా !
అయితే , ఆచార వ్యవహారాలను పాటించటంలో కులధర్మాలు, దేశ ధర్మాలలో కొద్దిగా తేడాలు ఉంటే ఉండవచ్చు. అయినా కూడా మూల ధర్మం యొక్క ప్రాముఖ్యత అలాగే ఉంటుంది.
ఆపద్ధర్మం అని ఉంటుంది. ఆపదలో ఆపద్ధర్మాన్ని ఆచరించి , ఆనక ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉందంటారు. అంతేకానీ మూల ధర్మం ఎప్పటికైనా మూల ధర్మమే.
ఉదా..ఆపత్కాలంలో అసత్యం పలికి తప్పించుకోవటం ధర్మమే అంటారు.
అంతమాత్రాన, అసత్యం పలకటం తప్పు.. అనే మూల ధర్మం ప్రాముఖ్యత అలాగే ఉంటుంది.
.............................
అయితే , కలియుగంలో ఎక్కువమంది మానవులు శారీరికంగా, మానసికంగా బలహీనులు కాబట్టి కొన్ని సడలింపులను ఇచ్చారు.
ఉదా..సత్య యుగంలో ఎక్కువ పుణ్యం ఆచరిస్తే వచ్చే పుణ్యఫలం, కలియుగంలో కొద్దిమాత్రం పుణ్యం ఆచరించినంత మాత్రానే లభిస్తుంది.
ఇతర యుగాలలో యజ్ఞయాగాదిక్రతువులు చేస్తే వచ్చే పుణ్యఫలం కలియుగంలో దైవనామస్మరణ చేసినంతనే లభిస్తుంది.
ప్రజలు పాపాలను చేయకుండా పుణ్యాలే చేయాలన్నది పెద్దల అభిప్రాయం.
ప్రజల దృష్టి పాపకర్మల వైపు మళ్ళకుండా ,వారికి పుణ్యకర్మల పట్ల ఆసక్తి కలగజేయటానికి పెద్దలు ప్రయత్నించారు .
ఏ యుగంలోనైనా పాపకర్మలు ఆచరిస్తే లభించే ఫలితం నరకమే....
కలియుగంలోనైనా పాపపు పనులు ఆచరిస్తే లభించే ఫలితం పాపఫలితమే తప్ప పుణ్య ఫలితం కాదు.
........................
పెద్దలు సమాజానికి కొన్ని కట్టుబాట్లను ఏర్పరిచారు. ఉదా..ఇంద్రియనిగ్రహం వంటివి.
అయితే కొందరు ప్రజలు పెద్దలు చెప్పిన నీతులను ప్రక్కకు పెట్టి తమకు తోచినట్లు ధర్మాలను నిర్వచించుకుంటూ తప్పులను చేస్తున్నారు. ఇలాంటి వారు ఆ కాలంలోనూ ఉన్నారు. ఈ కాలంలోనూ ఉన్నారు.
........................
పెద్దలు తెలియజేసిన ధర్మాలకు , కొందరు పొరపాటు నిర్వచనాలను ఇచ్చారు, ఇస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు బాగా చదువుకున్న వారు కూడా ఉన్నారు .
ఉదా..శివకేశవుల మధ్య భేదాన్ని చూపటం తప్పు. అని పెద్దలు వేదాలు , పురాణేతిహాసాల ద్వారా తెలియజేసారు .
శివకేశవ భేదాలతో వాదులాడుకుంటూ సమాజంలో భేదభావాలను వ్యాపింపజేసిన వారిలో కొందరు పండితుల పాత్ర కూడా ఉండటం బాధాకరం . .........................
వేదాలలోనూ, పురాణేతిహాసాలలోనూ చెప్పబడిన విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోని కొందరు వ్యక్తుల వల్ల ... మరియు... స్వార్ధపరులైన కొందరు వ్యక్తుల వల్ల సమాజంలో కొన్ని దురాచారాలు వ్యాప్తిచెందాయి.
వేదాలలోనూ, పురాణేతిహాసాలలోనూ చెప్పబడిన విషయాలను సరిగ్గా అర్ధం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది.
Good
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి,
ReplyDeleteఊరు వెళ్ళి రావటం మరియు పనివత్తిడి వల్ల ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.