koodali

Wednesday, January 18, 2017

కొన్ని విషయాలు...


ఈ రోజుల్లో మన దేశంలో చాలామంది.. కొన్ని విషయాలలో విదేశాల వారిని అనుకరించటానికి బాగా ప్రయత్నిస్తున్నారు.

 ఇతరులలో ఉన్న మంచిని  మనం గ్రహించాలి.  చాలామంది మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు ఉన్నవారు ఉంటారు.

****************
 రసాయనిక పురుగుమందులను విదేశీయులే కనుగొన్నారు.

అయినా,  వాటివల్ల కలిగే నష్టాలను గుర్తించి .....  రసాయన పురుగుమందులను వాడని ఆహారాన్ని తీసుకోవటానికి వాళ్ళు  ప్రాముఖ్యత ఇస్తున్నారు.

భారతదేశం నుంచి ఎగుమతి అయిన కొన్ని పంటల ఉత్పత్తులను పురుగుమందుల అవశేషాలు ఉన్నాయనే కారణంతో విదేశాల వాళ్ళు తిరస్కరించటం కూడా జరిగింది.

అయినా మనలో చాలామంది రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు.... భారతీయులు  తిరిగి మన సేంద్రియవ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది.

ఉదా.సుభాష్ పాలేకర్ గారు తెలియచేస్తున్న సేంద్రియ వ్యవసాయం చేయాలి.

***********
ఇంకో విషయం ఏమిటంటే,  ఎందరో విదేశాల వాళ్ళు  తమ విద్యుత్ అవసరాల కోసం  సోలార్ విద్యుత్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

అపారంగా సూర్యరశ్మి లభించే మనదేశం వాళ్ళేమో సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తూనే, ఇంకా ధర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించటం కోసం తాపత్రయపడుతున్నారు.

***********
ఎంతో గొప్ప విలువలు, విజ్ఞానం వారసత్వంగా కలిగినది భారతదేశం.

అయితే, మన దేశంలోనే  కొందరు .. భారతీయ విధానాలను తక్కువచేసి మాట్లాడుతుంటే ఎందరో విదేశాల వాళ్ళు యోగా, ధ్యానం, భారతీయ ఆయుర్వేద పద్ధతులు.. మొదలైన విషయాల గురించి ఆసక్తి చూపటం  ఆశ్చర్యకరమైన విషయం.
..........................
* క్రింద విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలా కాలం తరువాత వ్రాసి, ఇక్కడ ప్రచురించటం జరిగిందండి.
.............
లోకంలో కొందరు బలవంతులు బలహీనమైన జీవులపట్ల పెత్తనం చేస్తుంటారు. కొందరుమగవాళ్లు స్త్రీలపట్ల పెత్తనం చేస్తారు.కొందరుస్త్రీలు కూడా సాటి  స్త్రీల పై పెత్తనం చేస్తారు. కొందరుస్త్రీలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తారు.  కొందరుమనుషులు జంతువులను చంపుతారు.  అలా కాకుండా బలమైన మంచివాళ్ళు, తమ బలాన్ని, తెలివితేటలను బలహీనులకు సాయపడటానికి ఉపయోగించాలి. మనుషులు మానవత్వంతో జీవించాలి.
***************
జన్మ ఎత్తాక ఎవరికీ వందశాతం అంతా సుఖమే ఉండకపోవచ్చు. సమాజంలో ఎవరి కష్టసుఖాలు వారికున్నాయి.

బ్రాహ్మణులు చాలా నియమాలను పాటించాలి. వేదవిద్య నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు చాలా కష్టపడాలి.ఎంత చేసినా తగినంత ధనం లభిస్తుందో లేదో తెలియదు. క్షత్రియులు, సైనికులు యుద్ధవిద్యలు నేర్చుకోవాలి.వాళ్లు యుద్ధానికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తారో రారో? తెలియదు.వైశ్యులకు వ్యాపారం కొంత ఫరవాలేదు కానీ, వాళ్లు అధికలాభాలను తీసుకోకుండా, ధర్మంప్రకారం మాత్రమే వ్యాపారంలో లాభాలను పొందాలి.శూద్రులకు బ్రాహ్మణులకులా చాలా నియమాలు లేకుండా, కొంత సడలింపులు ఉంటాయి.కొంత స్వేచ్చ ఉంటుంది.ఈ రోజుల్లో ఎందరో గొప్పగా భావిస్తున్న ఇంజనీరింగ్ ఉద్యోగాలు కూడా శూద్రులు చేసే వృత్తివిద్యలే.

ప్రాచీనకాలంలో కొందరు విదేశీయాత్రికులు తమ గ్రంధాలలో భారతదేశంలో పేదరికం లేదని వ్రాసారు. అంటే, అన్ని వృత్తులవారు చక్కగానే ఉన్నారనే కదా అర్ధం.

అయితే, కాలక్రమేణా కొందరు స్వార్ధపరులు అంటరానితనం వంటివి సమాజంలో ప్రవేశపెట్టి ఉంటారు.

భారతదేశం ఎంతో గొప్పది. సనాతనధర్మము ఎంతో గొప్పది.  భారతదేశం ఎందుకు అంతకాలం విదేశీపాలనలో ఉంది, ఎందుకు విదేశీమతాలు ఇక్కడకు వచ్చాయి? అనే సందేహాలు కలుగుతాయి.
 
ఇక్కడి ప్రజలలో ఐకమత్యం లేకపోవటం, దేశంలోని కొందరు చేసిన తప్పులు, పొరపాట్ల వల్ల,  కొందరు ప్రజలు నమ్మిన కొన్ని మూఢనమ్మకాల వల్ల కొందరు బాధలుపడటం..వంటి కారణాల వల్ల కూడా అలా జరిగి  ఉండవచ్చు.. అనిపిస్తుంది.

 కొన్ని గ్రంధాలలో కొన్ని మూఢనమ్మకాల గురించి వ్రాసిన విషయాలు బాధగా అనిపిస్తాయి...ఇలాంటివి ప్రక్షిప్తాలని నా అభిప్రాయం. సమాజం కొరకు ఎన్నో చక్కటి విషయాలను గ్రంధాల ద్వారా తెలియజేసిన ప్రాచీనులు, మూఢత్వంతో ప్రవర్తించమని ఎవరికీ చెప్పరు.

******
సమాజం సజావుగా నడవాలంటే ఎన్నో పనులుంటాయి. ఉపవాసం ఉన్నప్పుడు పనులు చేయటానికి శక్తి సరిపోదు. ఎవరి పని వారు చేయకుండా అందరూ పనులు మాని, ఎప్పుడూ ఉపవాసాలు ఉంటూ, ఒక దగ్గర కూర్చుని పూజలు చేస్తూ కూర్చుంటే ఎలా? సమాజం సవ్యంగా సాగాలంటే ఎవరిపని వారు సక్రమంగా చేయాలి. ఎవరైనా ఉపవాసాలు కొంతవరకు పాటిస్తే ఆరోగ్యమే కానీ, అదేపనిగా ఉపవాసాలు చేస్తే నీరసం వస్తుంది. అనారోగ్యం వచ్చే పరిస్థితి కూడా రావచ్చు.

రోజూ నిత్యపూజ చేసుకుని, తమ పనులు తాము చేసుకోవాలి. తమ పనులు చేస్తూకూడా కుదిరినంతలో  దైవాన్ని స్మరించుకోవచ్చు. కొన్నిపండుగలు, నోములు, వ్రతాలు సమయంలో కొంతవిశేషంగా దైవాన్ని పూజించుకుంటారు. అంతేకానీ, ప్రతిరోజు విశేషమే అన్నట్లు ఉపవాసాలు వంటివి పాటించాలంటే అందరికి కుదరదు.
................
 మంచివాళ్లు తమపనిని వదిలేస్తే , చెడ్దవాళ్లు విజృంభించి సమాజాన్ని తమ ఇష్టం వచ్చినట్లు బాధపెట్టే పరిస్థితి వచ్చే ప్రమాదముంది. అలా జరగకుండా ఉండాలంటే మంచివాళ్లు తమ స్వధర్మాన్ని చక్కగా పాటించాలి. స్వధర్మాన్ని చక్కగా పాటించటం కూడా దైవపూజయే.

మహాభారతసంగ్రామంలో శ్రీకృష్ణపరమాత్మ.. యుద్ధం చేయలేనని  పలికిన అర్జునునితో స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను గుర్తుచేసారు. అంతేకానీ, జీవితంలో వైరాగ్యమే ముఖ్యం అని, తన స్వధర్మాన్ని మాని, విరాగిగా ఉండమని చెప్పలేదు.మోక్షాన్ని పొందటం జీవితపరమలక్ష్యమే కానీ, చతురాశ్రమాల ప్రకారం చక్కగా జీవించి దైవాన్ని పొందాలి.

జనకమహారాజు నిష్కామకర్మయోగంతో చక్కగా జీవించారంటారు.


No comments:

Post a Comment