koodali

Sunday, January 1, 2017

పాలు, తేనె ఆహారంగా..మరియు..అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.....




అందరికి.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.


******

  ఈ క్రింద విషయాలను ఈ పోస్ట్ వేసిన చాలాకాలం తరువాత వ్రాసి, ఇక్కడ పోస్ట్ చేయటమైనది.
**
 
తేనెను వాడటం గురించి కొన్ని సందేహాలు వస్తాయి. తేనె కొరకు తేనెపట్టును పిండేటప్పుడు అందులో ఉండే గుడ్లు, చిన్న తేనెటీగలు చనిపోయి తేనెలో 
 కలుస్తాయంటారు.( నాకు తెలిసినంతలో)..

మరి అలాంటి తేనెను ఆహారంగా తినాలంటే.. మాంసాహారం తినకూడదనుకునే వారికి సందేహంగా ఉంటుంది.

 
తేనెటీగల వల్ల ప్రపంచానికి అనేక లాభాలుండటం నిజమే. పుష్పాల మధ్య పరపరాగసంపర్కం జరిగి పశుపక్ష్యాదులకు, మనుషులకు శాకాహారం లభిస్తుంది. 
 
ప్రకృతిలో సమతుల్యత కొరకు అయితే మాత్రం, మనుషులు తేనెటీగల్ని చంపితీరవలసిన అవసరం ఏమీ లేదు.

 
ప్రకృతిలో సమతుల్యత కొరకు అంటూ.. మనుషులు అన్ని జీవులను చంపి తినవలసిన అవసరం లేదు. ప్రకృతి సమతుల్యత కొరకు ప్రకృతిలోనే ఏర్పాట్లు ఉన్నాయి. మనుషులు ప్రకృతిని పాడుచెయ్యకుండా ఉంటే చాలు. 
 
ఈ రోజుల్లో మనుషుల అవసరాల కొరకు తేనెపట్టులను పెంచి మరీ తేనెను పిండి వాడుకుంటున్నారు.
 
 తేనెటీగల సంఖ్య విపరీతంగా పెరగకుండా ప్రకృతిలోనే ఏర్పాటు ఉంది. 
 
ఉదా.. ఎలుగుబంట్లు తేనెపట్లను తీసుకుని ఎంతో ఇష్టంగా  తింటాయి. తద్వారా పట్టులోని గుడ్లు, చిన్నతెనెటీగలు చనిపోతాయి. అలా తేనెటీగల సంఖ్య విపరీతంగా పెరగదు.
 
 
Honey Buzzards అనే పెద్ద పక్షులు, Honey Badger అనే జంతువులు కూడా తేనెతుట్టెల వద్ద తేనెను ఇష్టంగా తింటాయట.. కొన్ని రకాల చీమలు, కొన్ని రకాల కీటకాలు , పాములు..వంటివి కూడా తేనెతుట్టెల వద్దకు వెళ్ళి తేనెను, అక్కడ ఉండే తేనెటీగల గుడ్లను తింటాయట.

******** 
ప్రాచీనకాలంలోని వారు, పొడుగైనకర్రతో తేనెపట్టుకు చిన్న గాటు పెట్టి, బొట్టుబొట్టుగా క్రింద పడే తేనెను కొంత సేకరించేవారేమో?  మరల ఆ భాగాన్ని మూసేసేవారేమో?ఈ పద్ధతిలో తేనెను సేకరించవచ్చో? లేదో? నాకు తెలియదు. అలా అనిపించింది.
 
 
  తేనెపట్టులో ఉన్న జీవులకు హాని కలగకుండా తేనెను తీయటం గురించి కొన్ని పద్ధతులు ప్రాచీనకాలంలోని  వారికి తెలిసి ఉండవచ్చు. ప్రాచీనులు ఎంతో గొప్పవారు. వారిలో కొందరికి ఎన్నో మహిమలు కూడా ఉంటాయంటారు.
 
 మధువుకు సంస్కృతంలో అనేక అర్ధాలుండవచ్చు. ప్రాచీనకాలంలో పువ్వులనుండి మనుషులే తేనెను సేకరించే విధంగా, తేనె బాగా ఉండే పెద్ద పువ్వులు ఉండే  మొక్కలు ఉండిఉండవచ్చు.  
 
ఇవి చదివి కొందరికి నవ్వు వస్తుందేమో..సృష్టిలోనూ, ప్రాచీనగ్రంధాలలోనూ అంతుబట్టని రహస్యాలెన్నో ఉంటాయి.
 
***** 
మేము చిన్నప్పుడు Ixora పువ్వులను తెంపి, వాటి సన్నకాడలను నోట్లో పెట్టుకుని పీల్చితే,  తియ్యటి తేనె కొద్దిగా వచ్చేది.   
 
ఆ పువ్వులను తినవచ్చో లేదో..నాకు తెలియదు. మేము  కొన్నిసార్లు తిన్నాం అంతే. తెలిసితెలియక ఏదో పువ్వులను ఎవ్వరూ తినకండి. కొన్ని విషపు పువ్వులు కూడా ఉంటాయి. మొక్కల గురించి బాగా తెలిసిన వారిని అడిగి తినాలి.
 
*******
తేనె లేని జైన్ చ్యవన్ ప్రాస్ కూడా లభిస్తుంది. 
 
 జీవహింస చేయకుండా నూటికినూరుపాళ్ళు ఉండటం చాలా కష్టం. 
 
ఉదా..ఇంట్లో బొద్దింకలు, దోమలు, చీమల్ని చంపుతాము. మనం తినే పప్పులు, కూరగాయల్లో కూడా అప్పుడఫ్పుడు కొన్ని చిన్నపురుగులు, వాటి గుడ్లు ఉండే అవకాశం ఉంది.
 
*************
కొన్ని పశుపక్ష్యాదులు ఒకదానిని మరొకటి చంపి తినటం బాధాకరమే. మరి సృష్టిలో ఇలా ఎందుకు ఉందో దైవానికే తెలుస్తుంది. పాపాలు చేసిన మనుషులు వచ్చే జన్మలో పశుపక్ష్యాదులుగా జన్మించి, ఇంకో జంతువు చేతిలో చంపబడతారేమో?
 
 
సృష్టిలో భూమితో పాటు ఎన్నో లోకాలు ఉంటాయంటారు. ఆ లోకాల్లో పాపాలు చేసే జీవులు కూడా ఆ పాప ఫలితాలను,  పుణ్యం చేస్తే పుణ్య ఫలితాలను   అనుభవించటానికి భూమిపై కూడా జీవులుగా జన్మించటం జరుగుతుందేమో?
 
భూమి ఒక పరీక్షాలోకం  అనిపిస్తుంది. ఎలాంటిపరిస్థితిలోనైనా దైవాన్ని నమ్మి ఇక్కడ సత్ప్రవర్తనతో జీవించిన వారికి ఉత్తమగతి 
లభిస్తుంది.

సృష్టిలో ఏది ఎలా ఉండాలో అలా ఉంది. ఉదా..నీటిలో ఈదే చేపలు ఈదగలిగేలా, గాలిలో ఎగిరే పక్షులకు ఎగిరేలా రెక్కలు..ఇలా ఏర్పాటు చేయబడి ఉంది. 
 
ఇంత అద్భుతమైన సృష్టి చేసిన దైవానికి ఏది ఎలా చేయాలో అంతా తెలుస్తుంది. 
 
 ప్రపంచంలో జీవులు విపరీతంగా పెరిగిపోకుండా సృష్టిలో ఏర్పాటు ఉంది. 
 
జీవులు విపరీతంగా పెరిగితే వాటికి ఆహారం సరిపోదు.

  మొక్కలను తినే జీవులు.. ఆ జీవులను తినే చిన్నజంతువులు.. వాటిని తినే పెద్ద జంతువులు.. ఇలా ఉంది. 
 
 అలాని, మనుషులు ఏ జీవిని చంపి తిననవసరం లేదు. మనకు తగినంత శాకాహారాన్ని చక్కగా తినవచ్చు.
 
  ఎప్పుడైనా అత్యవసర పరిస్థితిలో కానీ, తప్పనిసరి పరిస్థితిలో కానీ, ఏదైనా జంతువు దాడి చేసినప్పుడు కానీ, వాటిని మనుషులు చంపవచ్చు. 
 
అంతేకానీ, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని మనుషులు తమ అవసరాల కొరకు వాడకూడదు. 
**************
మంచివాళ్లు, పశుపక్ష్యాదులు, ఇతర మూగజీవులు ...  కష్టాలలో ఉంటే, ఎప్పుడో పాపం చేయటం వల్ల కష్టాలు వస్తాయి, అనుభవించనీ.. అనుకోవటం తప్పు. చేతనైనంత సాయం చేయటం మంచిది.

మనుషులు తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి రక్షించమని దైవాన్ని వేడుకోవాలి...నీతిగా జీవించటానికి శాయశక్తులా ప్రయత్నించాలి.
 
 
**************
మరికొన్ని విషయములు...
 
 కొందరు ఏమంటారంటే... ఆవులు, గేదెలు విషయంలో వాటి దూడలు పాలను త్రాగగా ఇంకా బోలెడు పాలు ఉంటాయి. ఆ పాలను పిండకపోతే పెద్దవాటికి జబ్బు చేస్తుంది కాబట్టి, మనం మిగిలిన పాలను పిండితీరాలని చెబుతున్నారు.

 
 ఇక్కడ, నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఆవుల సంగతి అలా ఉంచితే,  గేదెలను కూడా పెంచి పాలు పిండుతారు. 
 
 
అడవులలో గేదెల వంటి..అడవిదున్నలు.. ఉంటాయి. అడవిదున్నలకు దూడలుంటాయి. మరి వాటి దూడలు త్రాగగా మిగిలిన పాలను అడవుల్లోకి వెళ్ళి ఎవరూ పిండరు కదా. అయినా అడవిదున్నలు బాగానే జీవిస్తున్నాయి కదా..
 
అడవిదున్నల జీవనవిధానం గురించి నాకు అంతగా తెలియదు. నాకు తెలిసినంతలో, అడవిదున్నలు  గేదెలలానే ఉంటాయి.

 
బహుశా, ప్రకృతిసహజంగా అడవుల్లో తిరుగుతూ ఆహారాన్ని తింటూ బ్రతికే వాటికి కొంచెం ఎక్కువతక్కువగా వాటి దూడకు సరిపడా మాత్రమే పాలు వస్తాయేమో?
 
 
 మనుషుల వద్ద పెరిగే వాటికి, వాటిని బయట తిరగనివ్వకుండా..వాటి సహజ పద్ధతులకు విరుద్ధంగా ఒకచోట కట్టివేసి, రకరకాల ఆహారం ఇవ్వటం, పాలు ఎక్కువగా రావటానికి మందులు వాడటం వల్ల ఎక్కువపాలు వచ్చి, ఆ పాలను పిండుకుంటున్నారేమో? అనిపించింది.

 
అంటే, మనుషులు తమ అవసరాలకొరకు వాటి సహజత్వాన్ని మార్చివేసి, ఇప్పుడు వాటినుండి పాలు పిండకపోతే వాటికే నష్టం.. అంటున్నట్లుంది.

 
మనుషుల్లో గమనిస్తే, కొందరు స్త్రీలలో తక్కువ పాలు వస్తాయి. కొందరిలో బాగా వస్తాయి. ఇలా జరగటానికి..వారి ఆహారపు అలవాట్లు, మానసికవిషయాలు, పరిసరాల ప్రభావం, తీసుకునే మందులు..ఇలా అనేక కారణాలుంటాయి...
 
 
తల్లివద్ద పాలు సరిపడా రానప్పుడు, ఆ చంటిపిల్లలకు ఆవు లేక గేదె పాలను పడతారు.తల్లులకు పాలు బాగా రావటానికి స్థన్యవర్ధిని వంటి ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి.
***********
ఆవుపాలు, పెరుగు, నెయ్యి..వీటిని ...వైద్యంలో కూడా వాడతారు.  కొందరి విషయంలో అనారోగ్యం చక్కగా తగ్గిపోతుంది. కొందరి విషయంలో ఎన్నిమందులు వాడినా తగ్గకపోవచ్చు. ఇలా జరగటం వెనుక వారి కర్మఫలాల ప్రభావం కూడా ఉండవచ్చు. ఏది ఎందుకు జరుగుతుందో దైవానికి తెలుస్తుంది.

************
 ప్రాచీనకాలంలో మనుషులు కొన్ని వందల సంవత్సరాలు జీవించేవారట. అప్పట్లో కొన్ని పశుపక్ష్యాదులు కూడా భారీ శరీరాన్ని కలిగి ఉండేవంటారు. 
 
 
శ్రీకృష్ణుని కాలంలో, ఆ యుగంలో ఆవులనుండి ఎక్కువ పాలు వచ్చేవంటారు. అప్పట్లో ఆవులను ఎంతో ఆప్యాయంగా పెంచుకునేవారు. ఆ యుగంలోని ఆవులు ఎక్కువ పాలను ఇచ్చేవి కావచ్చు.

జనాభా తక్కువగా ఉండి, పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు వాటిదూడలు త్రాగగా మిగిలిన కొద్దిపాలను కలిపితే (అన్నింటి నుండి మిగిలిన పాలను)  చాలా పాలు అవుతాయి. వాటిని పిండి వాడుకునేవారు కావచ్చు.
 
***********
ఆవుపాలు, పెరుగు, నెయ్యి..వీటిని యజ్ఞయాగాదులలో వాడతారు....వైద్యంలో కూడా వాడతారు.  యజ్ఞయాగాదుల్లోను, వైద్యంలోనూ వాడే మూలికలు, పాలు, నెయ్యి.. కల్తీలేని స్వచ్చమైనవి వాడాలి. లేకపోతే సరైన ఫలితాలు లభించకపోవచ్చు.
 
 
ఈ రోజుల్లో అయితే, కొన్ని వనమూలికలు లభించటం కూడా తగ్గిపోయిందట. వాతావరణకాలుష్యం వల్ల వనమూలికల యొక్క సహజస్వభావం, సహజగుణం మారే  పరిస్థితి కూడా ఉండవచ్చు.
 
 
ప్రాచీనకాలంలో స్వచ్చమైన వాతావరణం, స్వచ్చమైన పదార్ధాలు, స్వచ్చమైన మనుషులు ఎక్కువగా ఉండటం వల్ల, అప్పుడు యజ్ఞయాగాదుల వల్ల చక్కటి ఫలితాలు వచ్చేవి.

 
 ఈ రోజుల్లో కల్తీలేనివి పెద్దమొత్తంలో లభించటం కష్టంగా ఉంది. మరి, స్వచ్చమైనవి పెద్దమొత్తంలో లభించనప్పుడు ఏం చేయగలరు? ఉన్నవాటినే జాగ్రత్తగా వాడాలి.

ఇవన్నీతెలిసే కాబోలు, ప్రాచీనులు కలియుగంలో దైవనామస్మరణ సులభోపాయమని తెలియజేసారు.

 దైవస్మరణ, దైవనామస్మరణ. ఎవరైనా చక్కగా చేయవచ్చు. ఈ విషయంలో కల్తీ ఉండదు.
 
 మంత్రాలు పఠించటంలో తప్పులు రావచ్చు కానీ, నామాన్ని తప్పులు లేకుండా అనుకోవచ్చు. 
 
దైవాన్ని..దైవనామాన్ని.. భక్తితో స్మరించుకోవటం వల్ల మంచి ఫలితాలుంటాయి.
 
  ధ్యానం, దైవనామ స్మరణ..ద్వారా ప్రపంచంలో అనేక సమస్యలను పోగొట్టవచ్చని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. ఇంకా, అనారోగ్యాలను కూడా పోగొట్టుకోవచ్చని తెలుస్తుంది. అయితే, చక్కగా సాధన చేయాలి.
 
 ఎవరికివారు దైవాన్ని చక్కగా స్మరించుకోవచ్చు. ఎవరైనా తమకుతాము దైవనామాన్ని ఎక్కువగా అనుకోలేకపోతే, ఎవరైనా అంటున్న నామాలను వినవచ్చు, భక్తి గీతాలను, భజనలను, పాటలను కూడా వినవచ్చు.తప్పులు లేకుండా ఉన్న మంత్రాలను కూడా కేసెట్ ద్వారా వినవచ్చు. 
 
ఎవరికైనా అనారోగ్యం కలిగి మంచాన ఉన్నప్పుడు, వారి బంధువులు ..మంత్రాలను, దైవనామాలను, భక్తిగీతాలను.. రోగికి వినిపించవచ్చు. కాసెట్ ద్వారా కూడా వినిపించవచ్చు.
పెద్ద సౌండ్ కాకుండా చిన్న శబ్దంతో వినిపిస్తే మంచిది.
*******
 అందరు దైవభక్తి కలిగి..నైతికవిలువలతో జీవించటానికి ప్రయత్నిస్తూ..దైవస్మరణ.. దైవనామస్మరణ..శ్రద్ధగా చేయటం మంచిది.

ఈ రోజుల్లో కూడా కొంతవరకు అయినా యజ్ఞయాగాదులను చేయాలి...యజ్ఞయాగాదుల కొరకు,  వైద్యం కొరకు, కొందరు చంటిపిల్లల  కొరకు..చక్కగా పాలు లభించాలంటే  ఇతరత్రా పాలు, పాల ఉత్పత్తుల  వాడకాన్ని తగ్గించుకోవాలి. 
 
 
రుచికొరకు  తీసుకునే కాఫీలు, టీలు, పన్నీరు, పాల ఉత్పత్తుల తో స్వీట్లు..తినటాన్ని తగ్గించుకుంటే మనుషుల కొరకు కష్టపడుతున్న  పశువులకు కష్టాలు  కొంతయినా తగ్గుతాయి. 
 
 
సాటిజీవులైన వాటి కష్టాలను తగ్గిస్తే చాలా పుణ్యం వస్తుంది. ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకుంటే, జీవితంలో కష్టనష్టాలు తగ్గుతాయంటారు కదా.
 
 వాతావరణాన్ని కలుషితం చేయకుండా ప్రకృతిసిద్ధంగా జీవించటం, నైతికవిలువలతో జీవించటం..చేస్తే అనేక సమస్యలు ఉండవు.
 
  అయితే, కొందరు చేసే పనుల వల్ల అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. 
 
********
ఏ సమస్యకైనా కూడా భక్తిగా దృఢంగా దైవస్మరణ చేస్తే చక్కటి ఫలితాలుంటాయి. కొన్నిసార్లు ఫలితం ఆలస్యం కావచ్చు కానీ, మంచిఫలితం మాత్రం ఎప్పటికైనా తప్పక లభిస్తుంది.
 
******
 వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
*******
konni  links..ఆసక్తి ఉన్నవారు లింక్స్ నుండి చదవవచ్చు.
 
 

 

No comments:

Post a Comment