koodali

Friday, May 24, 2013

ఓం..ఊరు వెళ్ళినప్పుడు కుండీలలోని మొక్కలకు నీటిని అందించటం........


ఓం
శ్రీ  లక్ష్మీసమేతనరసింహస్వామివారికి  వందనములు.
.................................


కుండీలలో  మొక్కలను  పెంచటమంటే ..... పంజరంలో  పక్షులను  పెంచినట్లు,  వాటిని  స్వేచ్చగా  పెరగనీయకుండా  అడ్డుకోవటం  అని  నాకు   అనిపిస్తుంది.  మా  వద్ద  చాలా  తక్కువ  సంఖ్యలో  మొక్కల  కుండీలున్నాయి.  ఆ  విషయం  అలా  ఉంచితే ,

 కుండీలలో  మొక్కలను  పెంచుకునేవారు  ఏదైనా  ఊరు  వెళ్ళవలసివస్తే  మొక్కలకు  నీరు  పోయటం  ఎలా  అనేది  పెద్ద  సమస్య.

 కొందరు  నీళ్ళు  బాగా  పోసి ,  ఎండవేడికి   తడి  ఆరిపోకుండా  మొక్కల  మొదటిలో  కొబ్బరి  పీచు,  స్పాంజ్ ....  వంటివి  వేస్తారు.


నేను  ఏం  చేస్తానంటే  ఒక  బకెట్లో  నీరు  పోసి  మట్టి  కుండీని  అందులో  పెడతాను.   అప్పుడు   ఆ  నీటిని  కుండీ  గోడల  ద్వారా  లేక  కుండీకున్న    చిన్న  కన్నం  ద్వారా  మొక్కల  వేళ్ళు  పీల్చుకుంటాయి. 

 ఇలా  చేయటానికి   మట్టి  కుండీలు  చాలా  అనుకూలంగా  ఉంటాయి. సిమెంట్  కుండీలు  అంత  అనుకూలంగా  ఉండవు.   ( సిమెంట్  కుండీల గోడలు  తడిని  పీల్చుకోవు  కదా  !

  ఊరు  వెళ్ళినప్పుడు  బాత్రూంస్ లోని  బకెట్స్  ఖాళీగా  ఉంటాయి   కదా  !    ఒక్కొక్క  బకెట్లో  ఒక  కుండీని  ఉంచుతాము. 

కుండీని  బకెట్లో  పెట్టిన  తరువాత  కుండీ  అంచుకు  కొంచెం  కిందవరకు  నీటిని  పోయాలి. 

 (  ఇలా  నీరు  పోసినప్పుడు   కుండీ  అంచు  వరకు  నీరు  పోయాలి.  అంతే. కుండీ  నీటిలో  మునిగిపోయేవరకూ  నీటిని  పోయకూడదు. )


 ఇలా  ఏర్పాటుచేసిన  బకెట్ + కుండీలను  నీడలోనే  ఉంచాలి.  ఎండలో  పెడితే  మనం  ఊరినుండి  వచ్చేసరికి    బకెట్లోని  నీరు  ఆవిరైపోయి  మొక్కలు  ఎండిపోతాయి.   అందువల్ల  నీడలోనే  ఉంచాలి. 
చలికాలంలో  అయితే  నీరు  త్వరగా  ఆవిరైపోదు .
 
 
 ఇలా  చేయటం  వల్ల  ఊరు  వెళ్ళి  వారం  తరువాత  వచ్చినా  మొక్కలు  చక్కగా  ఉన్నాయి.  అప్పుడు  కుండీని   బయటకు  తీసి  బకెట్లోని  నీటిని    తీసివేయాలి.

.................... 


పై  పద్ధతిలో   సిమెంట్  కుండీలలోని  మొక్కలకు  నీరు  అందించవచ్చా  ?  లేదా  ?  అన్నది  నాకు  తెలియదు. 

అయితే  సిమెంట్  కుండీలకు  కూడా  అడుగున  చిన్న  రంధ్రం  ఉంటుంది  కదా  ! ఆ  రంధ్రం  ద్వారా  నీటిని  వేర్లు  పీల్చుకుంటాయేమో  ?    మా  ఇంట్లో  సిమెంట్  కుండీలు  లేవు. 

..................................

మట్టి  కుండీలలో  మొక్కలను  పెంచితే   మొక్కలకు  చల్లగా  ఉంటుంది.   ఈ  రోజులలో    ఎక్కువమంది   సిమెంట్  కుండీలను  వాడుతున్నారు. 

(  పగలకుండా  గట్టిగా   పడుంటాయని .)  
............................

 సిమెంట్  కుండీలు,  సిమెంట్  ఇళ్ళు  వేడిగా  ఉంటాయి.   ఈ  రోజులలో  రోడ్లను  కూడా  సిమెంట్ తో  వేస్తున్నారు. 

వర్షం  పడితే  నీరు    భూమిలో  ఇంకటానికి   మట్టి  నేల    ఎక్కువగా  కనిపించకుండా  సిమెంట్  రోడ్లను  వేసేస్తున్నారు.   టెక్నాలజీ  పెరిగిపోయింది  కదా  ! మరి.

...........................................


అడుగు  భాగం  పోయిన  మట్టి  కుండీ  .......... 

 ఒకసారి  నేను  ఊరు వెళ్ళి  వచ్చిచూస్తే,   అన్ని  కుండీలలోని   మొక్కలు  చక్కగా  ఉన్నాయి.   ఒక కుండీలోని  మొక్క  మాత్రం కుళ్ళిపోయినట్లు  అనిపించింది. 

ఇదేంటి  చెప్మా  నీరు  ఎక్కువైపోయిందా  ?  అనుకుని  కుండీని  పరీక్షిస్తే  ఆ  కుండీ  యొక్క  అడుగు భాగం    కొంతకాలం  క్రిందట  పగిలిపోయిందన్న  విషయం  నాకు  గుర్తు  వచ్చింది.  


అప్పుడు   నాకు  తెలిసింది  ఏమిటంటే .... అడుగు  భాగం  పోయిన  మట్టి  కుండీలను   నీటిలో  పెడితే  నీరు  ఎక్కువై   మొక్క  కుళ్ళిపోయే  అవకాశం  ఉంది  అని. 

 అందువల్ల  అడుగుభాగం  పోయిన  కుండీని  నీళ్ళ  బకెట్లో  పెట్టాలంటే  కుండీకి  క్రింద  ఏదైనా  ప్లేట్  ఉంచాలి.  

.........................................

వడదెబ్బకు   మరణించిన  వారి  గురించి   వార్తలను    చూస్తుంటే  చాలా బాధగా అనిపిస్తోంది. ఏమిటో జీవితం?  ప్రకృతి  ముందు  మనిషి  ఎంత  ?  అనిపిస్తోంది.


2 comments:

  1. మీ సలహా బాగుంది.ఆచరించటానికి వీలుగా చెప్పారు.

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మేము ఊరు వెళ్ళి నిన్న రాత్రి వచ్చాము. అందువల్ల రిప్లై ఇవ్వటం ఆలస్యమయింది. దయచేసి క్షమించండి.

    మేము ఊరు వెళ్ళేముందు కుండీలను నీళ్ళ బకెట్లలో పెట్టి వెళ్ళాము. వచ్చేసరికి ఎండలకు నీరు ఆవిరైపోతుందేమో ? అని భయపడ్డాము.
    ( అంటే బకెట్లో నీరు సరిపడా పోసామో లేదో ? అని సందేహం వచ్చింది.. )

    ఎక్కువ రోజులకు సరిపడా నీరు కావాలి కదా ! మేము ఊరు వెళ్ళి దగ్గరదగ్గర వారం రోజులు అయింది.

    అయితే వచ్చి చూస్తే మొక్కలు పచ్చగా బాగున్నాయి.

    నిన్న ఉదయం వాన పడిందట. వాన వచ్చిన తరువాత ఇంకో ఆలోచన వచ్చిందండి.

    బాగా వాన వస్తే బకెట్ నిండిపోయి మొక్క కుళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి నీళ్ళ బకెట్ కన్నా మొక్కల కుండి అంచు ఎత్తు ఎక్కువగా ఉండాలి అని.
    ( వాన నీరు పడ్డా కుండీమట్టిలో నీరు నిలువ ఉండకుండా....)

    ReplyDelete