koodali

Friday, May 17, 2013

ప్రహ్లాదునితో చ్యవనుల వారు..

ఓం

వ్యాసులవారు  జనమేజయునికి  తెలియజేసిన  కొన్ని  విషయాలు..


ఒకప్పుడు  ప్రహ్లాదుడు  భూలోకంలో  ఉన్న  తీర్ధాలను  గురించి తెలియజెప్పమని  చ్యవనుని  అభ్యర్ధించాడు.


చ్యవనుడు  అన్నాడు  కదా...


హిరణ్యకశిపునందనా! మనోవాక్కాయాలను  శుద్ధిగా  ఉంచుకున్నవారికి  అడుగడుగునా  తీర్ధాలే.  మలిన మనస్కులకు  గంగానది  సైతం  పాపపంకిలమే. మనస్సు  పాపరహితంగా  పరిశుద్ధంగా  ఉంటేనే  ఏ  తీర్ధాలైనా  పావనాలయ్యేది.  గంగానదికి  ఇరువైపులా  పొడుగునా  ఎన్నెన్నో  గ్రామాలున్నాయి. నగరాలున్నాయి.  అడవుల్లో  గిరిజనావాసాలున్నాయి. 



ఇన్ని  జాతులవారూ  రోజూ  ఆ  గంగలోనే  ముప్పొద్దులా   మునుగుతున్నారు.  బ్రహ్మసమానమైన  ఆ పవిత్రజలాన్నే  గ్రోలుతున్నారు.  అయితేనేమి  ఒక్కడంటే ఒక్కడు  ముక్తి  పొందాడా ? విషయలంపటులు  వెళ్ళి  ఎంతటి  పవిత్రతీర్ధంలో  మునిగినా  ఫలితం  శూన్యం. అన్నింటికీ  మనస్సే  ముఖ్యం.  దాన్ని  శుద్ధి  చేసుకుంటే  అన్నీ  శుద్ధి  పొందుతాయి. 



అలా  కాకుండా తీర్ధయాత్రలకు  వెళ్ళి  అక్కడ ఆత్మవంచన  పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు.



ఇంద్రవారుణం(పెదపాపరకాయ) పక్వమైనా  ఇష్టం  కానట్టే  దుష్టస్వభావుడు దివ్యతీర్ధంలో  కోటిసార్లు  మునిగినా  పవిత్రుడు  కాలేడు. 


అందుచేత  అన్నింటికంటే  ముందు  మనశ్శుద్ధి  ఉండాలి. అది  ఉంటేనే  ద్రవ్యశుద్ధి  సిద్ధిస్తుంది.  అటుపైని  ఆచారశుద్ధి.  ఇవన్నీ  ఉన్నవాడికే  తీర్ధం  తీర్ధమవుతుంది.  లేకపోతే  అదొక  రేవు  మాత్రమే.  అక్కడ  ఏవేవి  ఎంతెంత  చేసినా  "శుద్ధ దండుగ " . నిజానికి  వీటన్నింటికంటే  భూతదయ  చాలా  గొప్పది. 



 అయినా నువ్వు  తీర్ధాలను  గురించి  అడిగావు  కనక  వాటినే  చెబుతాను...విను. భూలోకంలో  లెక్కలేనన్ని   తీర్ధాలున్నాయి. వాటికేంగానీ  ఉత్తమోత్తమమైన  తీర్ధరాజం  ఒక్కటేఒక్కటి.  నైమిశంలో  చక్రతీర్ధం. దాన్నే  పుష్కరతీర్ధమని  కూడా  అంటారు......అంటూ తెలియజేశారు.


No comments:

Post a Comment