యయాతి కధలో కొన్ని వ్యాఖ్యలను కష్టేఫలి శర్మగారి బ్లాగులో వ్రాసాను. ఒకచిన్న పొరపాటు వల్ల దేవయానికి శర్మిష్టకు గొడవ జరిగి శర్మిష్ట దేవయానిని నూతిలో తోయటం , దేవయాని పట్టుదలతో శర్మిష్టను దాసిగా చేసుకోవటం , యయాతికి దేవయానికి వివాహం జరగటం, శర్మిష్ట కూడా యయాతి వల్ల సంతానాన్ని పొందటం ఇలా కధ సాగింది కదా !
దేవయాని శర్మిష్టను క్షమించి ఊరుకుంటే ఆమెకు ఈ బాధలన్నీ ఉండేవి కాదు. దేవయానిది స్వయంకృతాపరాధం.
శర్మిష్ట పాత్ర విషయంలో చూస్తే ఆమె ఒక రాక్షసుల రాజు కూతురట. ఒక గొడవ కారణంగా శర్మిష్ట దేవయానిని నూతిలో తోసి వెళ్ళిపోతుంది. యయాతి రక్షించకపోతే దేవయాని చనిపోయుండేది కాబట్టి శర్మిష్ట చేసింది హత్యాప్రయత్నమే. పూర్వం చిన్న నేరాలకు కూడా శిక్షలు బాగానే ఉండేవి . దేవయాని శర్మిష్టను దాసిగా చేసుకోవటం వల్ల శర్మిష్ట యొక్క పచ్చటి జీవితం వ్యర్ధం అయిపోయిందని , అందుకే యయాతిని ఆమె వివాహం చేసుకోవటం ధర్మమేనని కొందరు భావిస్తారు.
కానీ లోకంలో ప్రజలు తెలిసిచేసినా, తెలియక చేసినా చట్టం వారికి శిక్ష విధిస్తుంది. ఈ రోజుల్లో కూడా యుక్తవయసులో ఉన్న వ్యక్తులు హత్యాప్రయత్నం, హత్య వంటి నేరాలు చేస్తే , ( తెలిసిచేసినా తెలియకచేసినా ) కొన్ని సంవత్సరాలు కారాగారంలో వేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు అయ్యో ! వారి జీవితం అంతా వృధా అయిపోయిందే అని ఎవరూ జాలిపడటం లేదు కదా !
పూర్వం రాజులు కూడా శత్రురాజ్యంతో యుద్ధం చేసినప్పుడు అక్కడి వారిని పట్టుకొచ్చి చంపెయ్యటం, లేక కారాగారంలో వేసెయ్యటం చేసేవారట. మరి వారి గురించి, వారి కుటుంబసభ్యుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి ? వాళ్ళు తప్పు చేసారు కదా ! అంటారు.
...................................
పూర్వం చ్యవనుడనే మహర్షి తపస్సు చేసుకుంటుంటే క్రమంగా ఆ మహర్షి చుట్టూ పుట్టలు ఏర్పడతాయి. సూర్యవంశంలో శర్యాతి అనే గొప్పరాజుకి కూతురు సుకన్య . చెలికత్తెలతో సమీపంలోని అడవికి వాహ్యాళికి వచ్చిన సుకన్య ఆ పుట్టను చూసి చిత్రంగా అనిపించి , ఎందుకో సన్నపాటి పుల్లతో ఆ పుట్టలో పొడుస్తుంది. పుల్లకు తడి అంటగా విషయం అర్ధం కాని సుకన్య ఇంటికి తిరిగి వచ్చేస్తుంది.
ఆ పుల్లలు గుచ్చుకుని పుట్టలో ఉన్న చ్యవన మహర్షికి కళ్ళు పోతాయి. మహర్షికి కలిగిన బాధ వల్ల ఆయన శపించకపోయినా , వెంటనే రాజపరివారానికి మూత్రసంబంధమైన చిత్రమైన బాధలొస్తాయి. కారణం వారికి అర్ధం కాదు. ఇదంతా గమనిస్తున్న సుకన్య ముందుకు వచ్చి తాను పుట్టలో పుల్లతో గుచ్చటం అంతా చెప్పి ఏం జరిగిందో తనకు తెలియదంటుంది.
రాజు సైనికులతో అక్కడకు వెళ్ళి పుట్టను తొలగించగా , బాధపడుతున్న చ్యవనుల వారు కనిపిస్తారు. రాజు భయంతో చ్యవనునికి క్షమాపణ చెప్పి , ఆయన సేవకు సైనికులను నియమిస్తానంటారు. అప్పుడు చ్యవనుడు , సైనికులు తనకు సరిగ్గా సేవలు చేయరని శంకించి, రాజుకి ఇష్టమైతే సుకన్యను తన సేవకు నియమించమని అడుగుతారు. ఈ మాటలు విన్న రాజు బాధతో రాజ్యానికి తిరిగివెళ్ళిపోతారు.
అప్పుడు సుకన్య ముందుకొచ్చి తండ్రీ ! చ్యవనులవారిని భర్తగా పొంది సేవ చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు . నాకు సంతోషమే . అని చెబుతుంది. ఇక చేసేదేమీలేక రాజు సుకన్యను చ్యవనునికిచ్చి వివాహం చేస్తాడు.
సుకన్య రాజభోగాలను వదిలి నారచీరలు ధరించి అడవిలో భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది. ఒకరోజు సూర్యపుత్రులైన అశ్వినులు అటుగా వెళ్తూ సుకన్యను చూసి ఆమె అందానికి అబ్బురపడి వివరాలు అడుగుతారు. ఆమె తాను చ్యవనమహర్షి యొక్క భార్యను అని చెబుతుంది.
అప్పుడు వాళ్ళు అయ్యో ! ఎంత అన్యాయం జరిగిపోయింది. , ఆ వృద్ధ అంధ తాపసి నీకు భర్తా ! మాలో ఒకరిని వివాహం చేసుకుని దేవలోకపు సుఖాలు అనుభవించమని ఆమెను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు.
వారి మాటలు విన్న సుకన్య కోపించి , సూర్యుని పుత్రులైన మీరు ఇలా ధర్మవిరుద్ధంగా మాట్లాడవచ్చునా ... అని కోపించగా , అశ్వినులు తాము ఆమె పాతివ్రత్యానికి సంతోషించామని చెప్పి , తాము దేవవైద్యులమని చెప్పి, తాము చ్యవనుని తమంతటి అందంగా , ఆరోగ్యవంతునిగా చేస్తామంటారు. , అయితే , చిన్న పరీక్ష పెడతారు.
సుకన్య ఈ విషయాలన్నీ భర్తతో చెబుతుంది. చ్యవనుడు సంతోషించి , తాను సుకన్యను వివాహం చేసుకుని ఆమెను కష్టపెడుతున్నానని , అందుకు ఎంతో బాధపడుతున్నానని చెప్పి , అశ్వినులను వెంటనే పిలవమని సుకన్యకు చెబుతారు.
అశ్వినులు చ్యవనుని సరస్సులో మునగమని చెప్పగా, అలా చేసిన చ్యవనునికి అశ్వినులను పోలిన రూపం వచ్చేస్తుంది. ఒకే రూపంలో ఉన్న ఆ ముగ్గురిలో తన భర్త అయిన చ్యవనుని గుర్తించటమే సుకన్యకు అశ్వినులు పెట్టిన పరీక్ష.
సుకన్య జగన్మాతను ప్రార్ధించి , జగన్మాత దయవల్ల ఆ ముగ్గురిలో తన భర్త అయిన చ్యవనుని గుర్తించగా సుందర రూపాన్ని పొందిన చ్యవనుడు ఎంతో ఆనందిస్తాడు. తరువాత ఈ విషయాలన్నీ తెలిసిన శర్యాతి దంపతులు తమ కూతురి జీవితం బాగుపడిందని ఆనందిస్తారు.
...................
...................
ఇక్కడ మనం గమనిస్తే, సుకన్య తెలిసిచేసినా తెలియకచేసినా పుల్లతో గుచ్చటం వల్ల చ్యవనుని కళ్ళు పోయాయి. ఆమె తన తప్పు తెలుసుకుని వృద్ధుడు, అంధుడైన చ్యవనుని వివాహం చేసుకుని ధర్మం తప్పకుండా సేవించింది. అందమైన అశ్వినులు ప్రలోభపెట్టినా ధర్మాన్ని తప్పలేదు. జగన్మాత ఆమెకు అందమైన జీవితాన్ని ప్రసాదించింది.
శర్మిష్ఠకు సుకన్యకు చాలా తేడా ఉంది. శర్మిష్ట తెలిసే దేవయానిని నూతిలో తోసివేసింది. తరువాత యయాతిని కోరుకోవటం, యయాతి శాపాలు పొందటం , తన వార్ధక్యాన్ని భరించమని యయాతి పిల్లలను అడగటం ఇలా....... కధ సాగింది.
ఈ రోజుల్లో కూడా సమాజంలో ఇలాంటి కధలను పోలిన కధలు జరుగుతున్నాయి.సమాజంలో శర్మిష్ట లాంటి వాళ్ళూ ఉంటున్నారు...సుకన్య లాంటి వాళ్ళూ ఉంటున్నారు.
సుకన్యలా ఓపికగా ఉంటే ఈ జన్మలోగానీ, వచ్చే జన్మలోగానీ దైవకృప తప్పక లభిస్తుంది.
మంచి ప్రయత్నం. బాగుంది
ReplyDeleteకృతజ్ఞతలండి. అంతా దైవం దయ.
ReplyDeleteగుడికి వెళ్తే పూజారి ద్వారా ప్రసాదం అందినట్లు , అమ్మవారి భక్తులైన మీ ద్వారా అమ్మ నాకు ఈ టపాను వ్రాసే శక్తిని కలిగించింది అనుకుంటున్నానండి.
ఎప్పుడో చదివినట్టు గుర్తు ఈ కథ. కాని మళ్ళీ గుర్తు చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. బాగుందండి.
ReplyDeleteకృతజ్ఞతలండి. అవునండి చక్కటి కధ. ఇలాంటి ఎన్నో చక్కటి విషయాలను అందించిన పెద్దలకు కృతజ్ఞతలు.
Deleteఅమ్మా... చిన్న సవరణ.
ReplyDeleteశర్మిష్ట రాజు కుమార్తె. దేవయాని పురోహితుని కుమార్తె. స్వభావ రీత్యా శర్మిష్టకు రాజసమూ, దేవయానికి సాత్వికమూ అయిన లక్షణాలు ఉండాలి. అందువల్ల శర్మిష్ట దేవయానిని నూతిలో తోసేయడాన్ని చూడవచ్చు, సమర్ధించలేమనుకోండి.
అలాగే... ఆ నూయి ప్రాణాపాయం కలిగించేంత లోతైనది కాదు. నిజానికి దేవయాని స్వయంగా ఆ బావిలో నుంచి బయటపడగలిగేంత చిన్నది. ఐతే అవమాన భారంతో దేవయాని (వివస్త్రగా ఉండి కూడా) ఎవరో ఒకరు వచ్చేంత వరకూ బావిలోనే ఉండిపోయింది. శర్మిష్ట దుడుకుతనానికీ దేవయాని అహంకారానికీ పోలిక లేదు,
ఈ మధ్యనే విశ్వనాథ వారి "నన్నయ గారి ప్రసన్న కథా కలితార్థ యుక్తి"లో ఈ కథకు వ్యాఖ్యానాన్ని చదివి చెబుతున్నా. వీలయితే మీరూ ఆ పుస్తకం చదవండి. యయాతి - శర్మిష్ట - దేవయాని కథలోని సొబగులెన్నో తెలుస్తాయి. ధన్యవాదాలు.
సర్ ! నాకు ఇంతకుముందు తెలియని విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
ReplyDelete" ఆ నూయి ప్రాణాపాయం కలిగించేంత లోతైనది కాదు." అన్న విషయం నాకు తెలియదు. ఎండిపోయిన లోతైన నూయి కాబోలు అని నేను భావించాను.
శర్మిష్టకు రాజస లక్షణాలు ఉంటాయి అన్నారు. రాజు యొక్క రాజసం ఇతరుల రక్షణకు ఉపయోగపడితేనే పద్ధతిగా బావుంటుంది. ఇతరులను రక్షించటం అనేది రాజు యొక్క బాధ్యత కూడా.
తోటి స్త్రీని అలా నూతిలో తోసి ఒంటరిగా వదిలి , శర్మిష్ట తన మానాన తాను వెళ్ళటమనేది మరింత పొరపాటు. స్త్రీకి ప్రాణం కన్నా మానమే ముఖ్యం కదా !
( నాకు తెలిసినంతలో శర్మిష్ట పొరపాటున దేవయాని దుస్తులు ధరించింది. జరిగిన పొరపాటుకు శర్మిష్ట దేవయానికి క్షమాపణ చెప్పి ఊరుకుంటే బాగుండేది. )
( రాజకుమారి అయిన సుకన్య పొరపాటుగా చ్యవనుని కళ్ళు పోగొట్టినా.... తరువాత ఓపికగా చేసిన తప్పును సరిదిద్దుకుంది. అందమైన అశ్వినులు ఎదురైనా కూడా ప్రలోభపడలేదు . )
దేవయాని యయాతిని వివాహం చేసుకోమని గట్టిగా అడగటంలోని ఒక అంతరార్ధం, తనను యయాతి చూడకూడని పరిస్థితిలో చూడటం వల్లనే కావచ్చు. అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది.
ఇక దేవయాని, శర్మిష్టను దాసిగా చేయకుండా క్షమించి ఉంటే ఆమెకు ఎంతో బాగుండేది.
దుస్తుల విషయంలో జరిగిన చిన్న పొరపాటు , తదనంతరం వారి ప్రవర్తన వల్ల అందరి జీవితాలు ఎన్నో మలుపులు తిరిగాయి. అందుకే పంతాలకు పోవటం కన్నా సర్దుకుపోవటంలోనే సంతోషం ఉందంటారు పెద్దలు.
ఇలాంటి కధలను తెలుసుకుంటే జీవితంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో పిల్లలకు తెలుస్తుంది.