koodali

Wednesday, January 19, 2011

.ఆ ఆదిశక్తియే దైవం .

 

కొందరు ప్రజలు చాలా చిత్రమైన వారు. తల్లిదండ్రులను, పొరుగువారిని, ఇలా ఎందరినో గౌరవించమని చెబుతుంటారు.

కానీ మనకు ఊపిరితో సహా అవసరమైన ఎన్నిటినో అందిస్తున్న దైవం విషయంలో మాత్రం పొరపాటుగా ఆలోచిస్తారు. దైవం అని ఎవరూలేరు అంటారు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే నేనూ ఒకప్పుడు దైవాన్ని నమ్మని వ్యక్తినేలెండి.


దైవము సైన్స్ వేరువేరు కానేకాదు. సైన్స్ అన్నది ఇవాళ కొందరు కొత్తగా కనుక్కున్నది కాదు. విశ్వ ఆవిర్భావం లోనే సైన్స్ ఉంది.


పురాణములలో సృష్టిని గురించిన విజ్ఞానం ఎంతో చెప్పబడింది. అయితే ఈనాటి వస్తూత్పత్తి విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్ అన్న పేరుతో మనం పిలుచుకోవచ్చు.

కొందరు ఆధునిక శాస్త్రవేత్తలు దేవుడని ఎవరూ లేరని, ఈ విశ్వం భౌతిక నియమాల వల్ల మాత్రమే ఏర్పడిందని వింతగా చెబుతుంటారు. అయితే మనస్సు, ఆలోచనలు, వాటిమాటేమిటి ?


అనేక రకముల ప్రాణులు , వాటి జీవనశైలికి అనుగుణంగా ఏర్పరచబడ్డ వాటి శరీరనిర్మాణం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

అనన్యసాధ్యమైన ఆలోచనాశక్తిగల మహాశక్తికే ఇలాంటి సృష్టిరచన సాధ్యపడుతుంది.


ఈ సృష్టిలో ఎంతో చిన్నవారమయిన మానవులకే ఇన్ని సంకల్పాలు, తెలివితేటలు ఉన్నప్పుడు........... ఆ ఆదిశక్తికి ఎంత గొప్ప సంకల్పశక్తి, తెలివితేటలు ఉంటాయో ఆలోచించండి. అందుకే ఆ మహాశక్తి అండ కావాలని భక్తులు ఆ శక్తిని దైవంగా
భావించి ఆరాధిస్తారు.


పరమాత్మ యొక్క అనిర్వచనీయమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను అని శ్రీ దత్త ప్రభువు చెప్పటం జరిగింది.

ఈ క్రింది విషయాలు " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో చెప్పబడినవండి........

బ్రహ్మాండం యావత్తూ సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. ......... రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం దేవుడి కల. ........ మానవుడు తన స్వప్నచేతనలో, సకలజీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు , తన మనస్సులోంచే సర్వ వస్తు సముదాయాన్నీ సృష్టిస్తాడు.


" ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడు..... తరవాత దానికి జీవం ఇచ్చాడు. పరమాణు శక్తీ ఆ తరవాత పదార్ధమూ పుట్టాయి. ..... భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఘనగోళాకృతిగా రూపొందించాడు.... దాని అణువులన్నీ దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి. ... ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తనం చెందుతాయి..... అణుశక్తి, తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది.... భూభావం , స్థూలత్వంలో నుంచి అదృశ్యమవుతుంది. "


"దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించి, ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచి, ప్రయోజనం తీరగానే దాన్ని అదృశ్యం చేయటం జరుగుతుంది..."...... ఇలాగే......... మనిషి, కళ్ళు మూసుకుని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు......... మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు... .."...... ఈ విషయాలు ఒక యోగి ఆత్మ కధ గ్రంధములో చెప్పబడ్డాయి.


మనము కలకంటున్నసేపు నిజమనే భ్రమలో ఉంటాము. కలలో కనిపించిన వస్తువులు ఎలా నిర్మించబడ్డాయి అని ఆలోచించము. నిజమే కలలో వస్తువులు ఏ పదార్ధంతో నిర్మించబడ్డాయో ? ఏమిటో అంతా మాయ.
అందులో ఇంకా ....... సృష్టి అనేది కేవలం, బృహత్తరమైన ఒక చలనచిత్రమేననీ కూడా చెప్పబడింది.


మనస్సు, బుద్ధి, ఆలోచనలు, ఆత్మ మనకు తెలియని ఏ కొత్త పదార్ధములతో ఏర్పడుతాయో మనకు తెలియదు, కానీ అవి ఉన్నవని అందరికి తెలిసినదే. అలాగే కలలు కూడా సృష్టించబడతాయేమో ... !


ఈ విశ్వంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. శూన్యం అంటే ఏమీ ఉండదు అని మన అభిప్రాయం.

 

 శూన్యమే అనంతము......అనంతమే శూన్యమూ కావచ్చు. అదే ....... సంకల్పం, ఆలోచన గల అనంతశక్తికి ఆద్యస్థానం కావచ్చు. విశ్వమంతటా ప్రతి అణువులోను ఆ శక్తి చైతన్య రూపంలో ఉంటుంది. ఆ చైతన్యానికి ప్రాణం, ఎన్నో సంకల్పాలు, ఆలోచనలు, భావాలు, ఇలా ఎన్నో ఉంటాయి.


అందుచేత , ప్రస్తుతానికి నాకు ఇంకా ఏమనిపిస్తోదంటే....... శూన్యం నుంచి ఈ అనంతమైన విశ్వంలో గల అన్ని తత్వములను తనలో కలిగిఉన్న అనంత శక్తి ఆవిర్భవిస్తుంది. ...... ఆ అనంతమయిన శక్తి ......... ప్రాణం, జీవము , భావములతో కూడిన అనంతమయిన చైతన్యము......... ఈ ఆదిశక్తి తన సంకల్పానుసారం రెప్పపాటులో బ్రహ్మాండములను సృష్టించనూగలదు, లయించనూగలదు. ఆది శక్తియే దైవం.


జగదీశచంద్రబోస్ అనే భారతీయ శాస్త్రవేత్త మొక్కలు, లోహాల్లో కూడా చైతన్యం ఉంటుందని మనం వాటిని బాధ పెట్టినప్పుడు అవి మనలానే బాధను అనుభవిస్తాయని క్రెస్కోగ్రాపు అనే పరికరం సహాయంతో వెల్లడించారు. ఆ విధంగా సృష్టి అంతా ప్రాణంతో స్పందిస్తుందన్న విషయం నిజమని తేలింది.


అందుకే విశ్వంలో చిన్నవారమైన మనకు తెలియని విషయాలు అనంతంగా ఉన్నాయి.

బావిలో ఉండే కప్ప తాను ఉండే బావి కన్నా వేరే ప్రపంచం లేదని తనకన్నా తెలివికలవారు వేరే ఉండరని భావిస్తుందట. అలాగే మనకన్నా తెలివిగల దేవతల వంటివారు ఉంటారు. వారికన్నా అధికశక్తి గలవారు ఆదిపరాశక్తి.


అందుకే అనవసరపు ఆలోచనలతో ఈ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. అందుకే పరమాత్మను పొందాలనుకునేవారు, విశ్వరహస్యాలను తెలుసుకోవాలనిగానీ అనుకునేవారు చేయవలసినది ఏమిటంటే ....
దైవభక్తిని కలిగి, పెద్దలు చూపిన దారిలో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఆ దైవం యొక్క కృపను పొందగలిగితే ఎప్పటికయినా అన్నీ ఆ దైవమే దారి చూపించటం జరుగుతుంది. ........ ఈ విషయం ఎందరో పెద్దల జీవితాల ద్వారా మనకు తెలిసినదే......

ఇందులో తప్పులున్నయెడల దైవం దయచేసి క్షమించవలయును.

 

2 comments:

  1. devuni gurinchi meeru vrasina blog chaalaa manchigaa undi.inkaa devuni gurinchina vishayamulanu vrayandi.Devudu mimmunu deevinchunu gaaka

    ReplyDelete
  2. ధన్యవాదములండి.

    ReplyDelete