koodali

Monday, December 4, 2017

తరచూ తలస్నానాలు చేయటం..వంటి..


కొంతకాలం క్రిందట మా బంధువుల అమ్మాయి వివాహానికి వెళ్లాను. వాళ్ళను చూసి చాలాకాలమయ్యింది. 

పెండ్లికూతురు జడ సన్నగా ఉంది. 

ఇంతకుముందు నేను చూసినప్పుడు జడ ఒత్తుగా ఉన్నట్లు గుర్తు. ఇదేమిటి ఇలాగయింది. ..అనడగితే   ఒకామె  ఏమన్నదంటే , 

పూజలు  చేయటం కోసం  తరచూ  తలస్నానాలు చేయటం వల్ల జడ సన్నగా అయిందని చెప్పింది.  

జడ సన్నగా ఎందుకు అయిందో కానీ...  పూజలకోసం తలస్నానం చేయటం వల్ల అనేసారు. 

ఉదయాన్నే తలస్నానం చేసి పూజకు ఆలస్యం అవుతోందని హడావిడిగా తడితల సరిగ్గా తుడుచుకోకుంటే  జలుబు వంటివి వచ్చే అవకాశముంది.

చుండ్రు వచ్చే అవకాశం కూడా  ఉంది.  అలాంటప్పుడు  జుత్తు  ఊడిపోయే అవకాశముంది. 

అయితే, వారానికి రెండుసార్లు తప్పనిసరిగా తలస్నానం చేయటం వల్ల చుండ్రు వంటివి రావంటున్నారు.  తలస్నానం చేసినా కూడా, జుత్తు ఆరిన తరువాత,   అదే రోజు తలకు నూనె రాస్తే జుట్టు ఎండిపోదు.

*************
తల ఎక్కువగా తడితో  నానితే , తలకు  నీరు వెళ్లి  అనారోగ్యం వచ్చే అవకాశముందని కూడా కొందరు పెద్దవాళ్లు అంటారు.

పాతకాలంలో స్వచ్చమైన నీరు, వాతావరణం వల్ల ఎన్నిసార్లు తలస్నానం చేసినా ఆరోగ్యం బాగుండేది కావచ్చు.

 ఈ రోజుల్లో నీరు, గాలి,  వాతావరణం లో ..పొల్యూషన్ ఎక్కువయ్యింది.  నీటిలో పొల్యూషన్ తగ్గడానికి కూడా రసాయనాలు కలుపుతున్నారు. 

ఇలాంటి పరిస్థితిలో  రసాయనాలు కలిసిన నీటితో, షాంపూలతో .. తరచూ తలస్నానం చేస్తే  సరిపడకపోవచ్చు.  

మనుషుల అంతులేని కోరికల వల్ల ..  స్వయంకృతాపరాధాల వల్ల ..  వాతావరణం కలుషితమయ్యింది. 

*******************

 పాతకాలంలో పుష్టికరమైన తిండి తినేవారు.

ఈ రోజుల్లో  లభించే ఆహారంలో ... సత్తువ ఉండటం లేదు... చాలామంది విషయంలో .. తినే తిండి వల్ల   లావు అవుతున్నారే కానీ ,  సరైన శక్తి లభించటం లేదు.

మా ఇంటి పొరుగున ఒకామెకు ( సుమారు 35 సంవత్సరాల వయస్సుంటుదేమో ?) ఆ మధ్య కడుపులో నొప్పి అంటూ హాస్పిటల్కు వెళ్ళి మందులు వాడింది.  

ఆమె ఏమన్నదంటే,  పని అయి ..  పూజ అయేసరికి మధ్యాహ్నం 12 అయేదట. అప్పటివరకూ   ఏమీ  తినేదికాదట.

 అందుకే  కడుపులో నొప్పి వచ్చిందేమోనంటూ సందేహం వ్యక్తం చేసింది. ఇప్పుడు అలా  చేయకుండా ఉదయాన ఏదో ఒకటి తింటోందట. 

**************
  ఇలా సంశయం ఉన్నవాళ్ళు .. ఉదయం   కొంత పూజ చేసుకుని , ఏమైనా ఆహారం తీసుకుని ,  ఇంటి పని   తరువాత ..  మరల పూజ చేసుకోవచ్చు.

లేదంటే  సూర్యోదయానికి ముందే   లేచి పూజ చేసుకోవాలి.

 ************


కొందరు ఏ కాలం అయినా చన్నీటితోనే స్నానం చేస్తారట. అందరూ అలా చేయలేరు. 
 
హైదరాబాద్ వంటి ఊళ్ళలో పాతరోజుల్లో చలి చాలా ఎక్కువగా ఉండేది. అలాంటప్పుడు డాబాలపైన టాంకులలో నీరు చాలా చల్లగా ఉంటుంది. 
 
 
టాంకులలో బాగా చల్లగా ఉన్న నీరు తలస్నానానికి మంచిదికాదని అంటున్నారు. బోరుపంపుల నుంచి వచ్చే నీరు బాగా చల్లగా ఉంటుందో లేదో.. నేను గమనించలేదు.
 
.......................
 
  తరచూ తలస్నానం, ఉపవాసం ..చేయటం వంటివి ఎవరి పరిస్థితిని బట్టి  వారు చేసుకోవటం మంచిది.

 తరచూ తలస్నానాలు, కఠిక ఉపవాసాలు ఆచరించకపోయినా  పూజ చేసుకోవచ్చు.  దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

భక్తి, సత్ప్రవర్తన కలిగి  ఉంటే  దైవకృపను పొందవచ్చు ...  అని నాకు అనిపిస్తున్నది. 
..............................
 
దైవపూజ అంటేనే ప్రశాంతంగా చేసుకోవాలి. అలాంటి విషయాన్ని   విపరీతధోరణితో కొందరు హిందువులు క్లిష్టం చేసేసారు.  అవన్నీ విన్న ప్రజలకు అనేక సందేహాలు, భయాలు కలుగుతాయి.

 ఎన్నో విధివిధానాల గురించి భయాలతో, సందేహాలతో మనస్సు దైవము పట్ల ధ్యాస లేకుండా, విధివిధానాల పట్లే ధ్యాసను ఉంచేలా, ఎన్నో విషయాలను చెబుతున్నవారికి.. ప్రజలకు దైవాన్ని దూరం చేస్తున్న పాపం, హిందువులను హిందుత్వానికి దూరం చేస్తున్న పాపం తగిలే అవకాశముంది.

హిందు ధర్మాన్ని తప్పమని ఎవ్వరూ అనరు. కొన్ని అనవసర నియమాలను తగ్గించుకోవాలి అంతే.

కలికాలంలో ప్రజలు శారీరికంగా, మానసికంగా కొంత బలహీనంగా ఉంటారని తెలిసిన ప్రాచీనులు కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ సులభోపాయమని తెలియజేసారు. ప్రాచీనులే అలా తెలియజేశారు కదా..చేయగలిగినవారు ఎంతైనా పాటించవచ్చు. ఎవరిశక్తి వారిది.

Saturday, December 2, 2017

ఓం , కొన్ని విషయాలు ..ఇతరజీవులను చంపిన పాపానికి మరల ....


ఈ రోజు తిరువణ్ణామలై దీపోత్సవం   .
 
రేపు .. దత్త జయంతి .. పూర్ణిమ.... 
 
..........................
ఈ క్రింద వ్రాసిన విషయాలను ఈ పోస్ట్ వేసిన కొంతకాలానికి వ్రాసి, ఇక్కడ ప్రచురించటం జరిగిందండి.
 marikonni vishaya.mulu...
 
హిందువుల్లో కొందరు ఏం చెపుతారంటే, మీ కష్టాలు, కోరికలు తీరాలంటే, పశుపక్ష్యాదులను బలి ఇచ్చి పూజలు చేయాలంటారు. తమ కోరికలు, కష్టాలు తీరాలని  ఇతర జీవులను బలి ఇచ్చి చంపే వాళ్ళను,  వాటిపట్ల  క్రూరంగా ప్రవర్తించేవాళ్లని ఏమనాలి?

ఇలాంటివి చేస్తే తా
త్కాలికంగా ఎవరికైనా కొన్ని  కష్టాలు, కోరికలు తీరినట్లు అనిపించినా , ఇతరజీవులను చంపిన పాపానికి మరల కష్టాలను అనుభవించవలసి వస్తుంది. కర్మ ఎక్కడికి పోదుకదా..

కష్టాలు, కోరికలు తీరాలంటే, దైవస్మరణ చేయటం, ఇతర జీవులకు సాయం చేయటం.. వంటి మంచి పనులు చేస్తే మంచిది.
............................
 
.దైవానికి జీవులను చంపి బలి ఇస్తే , బలి అయిన మూగజీవులు ఉత్తమ జన్మను పొందుతాయని, మోక్షాన్ని పొందుతాయని కూడా కొందరు చెపుతున్నారు. అవన్నీ విని, బలి అయితే, మనుషులు కూడా ఉత్తమజన్మను, మోక్షాన్ని పొందుతారేమోనని భావించి, ఎవరైనా అలా తాము  బలి అవ్వాలని, ఇతరులను బలి ఇవ్వాలని.. ప్రయత్నిస్తే? అందువల్ల, దయచేసి ఇలాంటివి చెప్పవద్దు.

 మనుషులు పాపాలు చేయకుండా, ధర్మంగా జీవిస్తే దైవానికి ఇష్టం. మరి, అలా ఉండటానికి ప్రయత్నించాలి కాని, తమ కోరికలు తీరటానికి, మూగజీవులను దైవానికి బలి ఇవ్వాలని,  తమ స్వార్ధానికి దైవము పేరు వాడటం ఏమిటో?

 మనుషులు తమ కోరికలు తీరటం కొరకు మూగజీవులను బలి ఇచ్చి, వాటికి పుణ్యం వస్తుందని చెప్పటం ఏమిటో? 

దైవానికి, పశుపక్ష్యాదులు.. మనుషులనే తేడా ఉండదు. అన్ని జీవులు దైవసృష్టిలోని వారే కదా.. 
 
తమ కోరికలు తీరటానికి  పశుపక్ష్యాదులను బలిచ్చే వాళ్లను కూడా, వారు చేసిన జీవహింసకు ఫలితంగా , ఈ జన్మలో కష్టాలు,  మరుజన్మలో పశుపక్ష్యాదులుగా పుట్టి చంపబడటం.. పరిస్థితి ఉంటుందేమో?
.................................
   ఇంత సృష్టి చేసిన దైవానికి ఏది ఎలా చేయాలో అంతా తెలుస్తుంది.
..............................
 
ప్రపంచంలోని చెడు...పోవాలి.. 
 ...........................
 సమాజంలో పాపాలు చేస్తూ రాక్షసప్రవృత్తితో జీవులను బాధలు పెట్టేవారిని దైవము తమ శక్తులతో సంహరిస్తారు.
..................... 
జీవులను బాధపెట్టిన నరకాసురుడు, రావణాసురుడు..  దైవము చేత సంహరించబడ్దారు.
.................................. 

 మూగజీవులు మనుషులకు ఎదురుచెప్పలేవని, వాటిని చంపుతున్నారు.
 పశుపక్ష్యాదులను వాటి మానాన వాటిని బతకనివ్వండి.
 
  పశుపక్ష్యాదుల మరుజన్మ గురించి, మోక్షం గురించి ఇంత సృష్టి చేసిన దైవము చూసుకుంటారు.  సృష్టిలో అన్ని జీవుల యొక్క జన్మలు, మోక్షం గురించి దైవము చూసుకుంటారు. 
 
అయితే, మనుషులు తమకు కష్టాలు వచ్చినప్పుడు, కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తారు. పశుపక్ష్యాదులకు కష్టం వస్తే తమను కాపాడమని దైవాన్ని ప్రార్ధించే జ్ఞానం వాటికి ఉంటుందో? ఉండదో?  
 
పశుపక్ష్యాదులపై నిజంగా దయ ఉంటే,  వాటిని బలివ్వటం కాకుండా ,  మూగజీవులకు కూడా కష్టాలు వచ్చినప్పుడు   కాపాడమని,  మనుషులు  దైవాన్ని ప్రార్ధించాలి.  మంచి పనులు చేస్తే, మనుషులకు కూడా మంచి జరుగుతుంది. 
 .............................
 
మూగజీవులైన పశుపక్ష్యాదులను చంపితే తప్పులేదన్నట్లు అనుకునేవారు , తమకు ఏదైనా అనారోగ్యం వచ్చి చావుబతుకుల సమస్య వస్తే, చచ్చిపోయినా ఫరవాలేదు, ఉత్తమజన్మ వస్తుందని, మోక్షం వస్తుందని ఊరుకుంటారా?  మందులు వాడరా? కాపాడమని దైవాన్ని ప్రార్ధించరా? 
 
మనుషులు తమకు చిన్న దెబ్బ తగిలినా కూడా, కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తారు కదా. 
..................................
 
 మొక్కలకు ప్రాణం ఉంటుంది కాబట్టి, మొక్కలను తిన్నట్లే జంతువులను చంపి తింటే తప్పేమిటని... అతి తెలివిగా మాట్లాడుతున్నారు కొందరు.  మనుషులను కూడా తినొచ్చని  అంటారేమో  కూడా?

 మొక్కలు, పశుపక్ష్యాదులు, మనుషులు..అన్నింటికి ప్రాణం 
ఉంటుంది.  అన్నింటిని తినరు కదా... మొక్కలను, జంతువులను పోల్చటం కూడా ఏమిటో? మొక్కలకు, పశుపక్ష్యాదులకు వాటి శారీరిక, మానసిక వ్యవస్థ వేరుగా ఉంటుంది కదా..

మొక్కలకు, జంతువులకు నొప్పి విషయంలో తేడాలుంటాయని అంటారు...ఈ విషయాల గురించి ఇంకా పూర్తి అవగాహన లేదు కాని, జంతువులు, మనుషుల్లా..మొక్కల శరీరం ఉండదు.
 
  మొక్కలనయినా (శాకాహారం అయినా) మనకు ఎంత అవసరమో అంతవరకే తినాలి. అతిగా తింటే అనారోగ్యం కలిగే పరిస్థితి రావచ్చు.
.............................
 
 మనుషులు మాంసాహారాన్ని తినకపోయినా చక్కగా జీవించగలరు.
మనుషులకు దైవము ఎన్నో తెలివితేటలను ఇచ్చారు. మనుషులు పర్యావరణాన్ని పాడుచేయటం వల్ల ఇప్పటికే కొన్ని జీవులు అంతరించిపోయాయట. మనిషి తమ తెలివిని మంచికి ఉపయోగించాలి.

..............................
 
ఆశ్చర్యం ఏమిటంటే, రోజూ కబేళాల్లో వేలు, లక్షలుగా పశుపక్ష్యాదులను చంపి తింటున్నారు. అలాంటి వాళ్లు కూడా దేవాలయాల్లో బలుల గురించి మాట్లాడుతారు. అలా మాట్లాడేవాళ్లు ముందు తాము పశుపక్ష్యాదులను చంపి తినటం మానాలి.
 
 కబేళాలో పశుపక్ష్యాదులను చంపి తిన్నందుకు ఈ జన్మలో కష్టాలు, మరుజన్మలో పశుపక్ష్యాదులుగా పుట్టి చంపబడటం జరగొచ్చు.
............................
 
మనం నేల మీద నడుస్తున్నప్పుడు కొన్ని జీవులు చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలా అవి చనిపోతే మనం ఏం చేయలేం. మనం భూమ్మీద నడవకుండా ఉండలేము కదా. సృష్టిలో అలా ఉంది. అందువల్ల మనుషులకు ఏమి పాపం రాదు...

ఏదైనా జీవుల వల్ల మనుషులకు అనారోగ్యం కలగటం, హానికలగటం జరిగే పరిస్థితిలో ఆ జీవులనుండి మనుషులు తమనుతాము రక్షించుకుంటారు. మనుషులను ఏదైనా జీవి హాని చేయటానికి దాడి చేస్తే,  అయ్యో,  వాటిని ఏం చేయకూడదని ఊరుకోరు కదా..వాటిని ఎదుర్కుంటారు, అవసరమైతే వాటిని చంపుతారు.
 
 
తప్పనిపరిస్థితిలో జీవులను చంపవలసి వస్తే, బాధ లేకుండా చంపటానికి ప్రయత్నించాలి.
 
 మనుషుల నుండి తమ ప్రాణాలను రక్షించుకోవటానికి జంతువులు కూడా దాడి చేస్తాయి. 
 
జీవులు తమ ప్రాణాన్ని రక్షించుకోవటం తప్పుకాదు. సృష్టిలో చాలా విషయాలున్నాయి.  భూమి జీవులకు ఒక పరీక్షాలోకం కావచ్చు.
 ...........................
 
 మనుషులు సాత్వికగుణాన్ని వృద్ధి చేసుకోవాలి.  రాజస, తామస గుణాలను అదుపులో ఉంచుకోవాలి. మనస్సును అదుపులో ఉంచుకుని, ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించి దైవకృపను పొందినవారికి..మోక్షానికి అర్హులయ్యే అవకాశం ఉంటుంది.
...........................
 
 మాంసాహారం విషయంలో చాలామంది మాట్లాడేది భక్తకన్నప్ప మాంసాహారాన్ని దైవానికి నివేదించటం గురించి. భక్తకన్నప్ప విషయానికి, తమ కోరికల కొరకు పశుపక్ష్యాదులను బలి ఇచ్చేవారి విషయాలకు పోలిక లేదు. 

భక్తకన్నప్ప అడవులలో పుట్టిపెరిగిన వ్యక్తి. అతను అడవుల్లో సులభంగా లభించే పశుపక్ష్యాదులను ఆహారంగా తిని జీవించే వ్యక్తి. అతను పరమశివుని కంటి పరిస్థితి చూసి బాధతో చలించి, తన కన్నును దైవానికి సమర్పించటానికి సిద్ధమయిన అంతటి భక్తి ఉన్న వ్యక్తి. 

 పశుపక్ష్యాదులను చంపినప్పుడు అవి బాధను అనుభవిస్తాయి.  
అందువల్ల,  అలా చేసినవాళ్ళు  ఎంతోకొంత పాపఫలితాన్ని అనుభవించవలసి వస్తుందేమో..అని నాకు అనిపించింది.

భక్తకన్నప్ప తన కన్నును తీసి దైవానికి సమర్పించాలని సిద్ధపడటం..అప్పుడు జరిగినవిషయాలు..అవన్నీ సామాన్యమైన విషయాలు కాదుకదా.  ఆ సమయంలో భక్తకన్నప్ప
 ఎంతో భక్తితో దైవము పట్ల ఎంతో ప్రేమతో  ఉన్నారు.
.......................................
 
 ఎవరికైనా గతంలో చేసిన తప్పుల ఫలితంగా కష్టాలు వస్తాయంటారు.
 
 అయితే, ఎవరైనా గతంలో పాపాలు చేసి, పశ్చాత్తాపాన్ని పొంది, దైవాన్ని ప్రార్ధించటం, మంచిగా జీవించటానికి ప్రయత్నించటం జరిగితే, చాలాపాపఫలితం కరుగుతుందని, మిగిలిన కొంత పాపఫలితాన్ని అనుభవించే సమయంలో పెద్ద బాధతెలియకుండా లేక బాధ తెలియకుండానే ఆ కష్టసమయం గడిచిపోతుందట.   
 ..........................
 
మనుషులు తమ కష్టాలు పోవాలన్నా, కోరికలు తీరాలన్నా సాత్వికంగా దైవపూజ చేస్తూ ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తే గత జన్మల పాపకర్మ పలుచబడి, క్రమంగా కష్టాలు తీరే అవకాశం వస్తుంది.

 అంతేకాని, కష్టాలు, కోరికలు తీరాలని జీవహింస చేస్తే  మరింత పాపకర్మ కలిసి, ఎప్పటికైనా అదంతా అనుభవించవలసి వస్తుంది కావచ్చు...అందువల్ల జాగ్రత్త.
 ......................
గ్రంధాలలో ఉన్న విషయాలలో అంతరార్ధాలు అంతగా అర్ధంకాకపోవచ్చు.అందువల్ల, వాటిని అర్ధం చేసుకోవటంలో జాగ్రత్తగా ఉండాలి.
......................
సృష్టిలో ఎన్నో రహస్యాలున్నాయి..  దైవానికే అన్నీ సరిగ్గా తెలుస్తాయి.

.......................................

వ్రాసిన వాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 


Wednesday, November 29, 2017

ఏక శ్లోక (ఏక శ్లోకీ ) భగవద్గీత ..




 
శ్లో|| యత్ర యేగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః
 
తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రువా నీతిర్మతిర్మమ||



పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.






Tuesday, November 28, 2017

.భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..... ..


ఈ రోజుల్లో కొన్ని పధ్ధతులు పాటించటం కుదరకపోవచ్చండి.

ఉదా.......ఏదైనా గుడికి గానీ పుణ్యక్షేత్రములకు గానీ వెళ్ళేముందుగానీ, తిరిగి అక్కడినుండి వచ్చేటప్పుడు గానీ ఇతరుల ఇళ్ళకు వెళితే మన పుణ్యములు వారికి, వారి పాపములు మనకు తగులుతాయని నేను ఒక దగ్గర చదివానండి. ఇది పాటించటం ఒకోసారి చాలా కష్టంగా ఉంటుంది. 
 
అయితే పాతకాలంలో కొందరు ఊళ్ళు తిరుగుతూ బంధువుల ఇళ్ళలో రోజులతరబడి ఉండేవారట. 
 
 ఇప్పటికీ తిరుపతిలో నివసించేవారికి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికి ఒకవేళ పెద్దలు పై విధముగా చెప్పారేమోనని నా ఊహ.

అయితే ఒకోసారి మనకు బాగా దగ్గర బంధువుల ఇళ్ళకి వెళ్ళాలని మనకీ ఉంటుంది. అంతదూరం వెళ్ళి వెళ్ళకపోతే వారూ బాధపడతారు. ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో నాకు అర్ధం కాదు. 

ఇంకో సంఘటన. ........మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక గుడికి వెళ్ళామండి. తిరిగి వచ్చేటప్పుడు షాపింగ్ కు వెళ్ళాలని మా
  ఇంట్లోవారి కోరిక. నాకేమో గుడినుంచి సరాసరి ఇంటికి వెళ్ళాలని.

నిజం చెప్పాలంటే నాకూ షాపింగ్ కు వెళ్ళాలని ఉంది. కానీ గుడినుంచి షాపింగ్ కు వెళ్తే మన పుణ్యం షాప్ వారికి, వారి పాపం మనకు వస్తే ఏది దారి ?......ఆఖరికి ఇంటికే వెళ్ళామనుకోండి.

కానీ గుడికి వెళ్ళివచ్చిన ప్రశాంతత ఏమాత్రం లేదు. ఇంట్లో అందరూ సీరియస్ గా కూర్చున్నారు. సెలవు రోజు అంత దూరం వెళ్ళి షాపింగ్ కు వెళ్ళలేదని వారి బాధ.

ఇలా కొన్ని సార్లు జరిగాక నేను గుడికి రమ్మంటే మాకు పనులున్నాయి అని ........ అలా ఏదో వంక చెప్పి తప్పించుకోవటం మొదలుపెట్టారు మా కుటుంబసభ్యులు.

వారి దృష్టిలో నాది చాదస్తం. భక్తి ఉండాలి గానీ చాదస్తం ఉండకూడదని మా కుటుంబసభ్యుల కామెంట్. 


నిజమే కానీ నేను చదివిన మరియు , విన్న దాని ప్రకారం అలా చేయకపోతే కష్టములు వస్తాయేమోననే భయంతో అలా చేసాను మరి..

ఆ తరువాత నాకు ఏమనిపించిందంటే,  కుదరనప్పుడు ఏం చేస్తాము ఇలాంటిపరిస్థితులలో పిల్లలకు మరియు మనకు కూడా దేవుని యందు కొంచెమయినా భక్తి ఉండేలా చూసుకుంటే అదే పదివేలు అని. 
 
కానీ, నాకు సందేహం ఏమిటంటే, మరి టిఫిన్, భోజనం.. తినడానికి హోటల్స్ కు వెళ్ళకుండా కుదరదు కదా.. అనిపిస్తుంది.
 
విచారించదగ్గ విషయమేమిటంటేనండీ , షాపింగ్ లాంటి ఇతర విషయాలలో ఎంతసేపయినా విసుగు రాకపోవటము ఏమిటో అర్ధం  కాదు. 

 ఇంకా ఏమని అనుకున్నానంటేనండి .......భగవంతుడా నాకు ఇంతే ఓపిక దయచేసి నన్ను క్షమించు అని..
 
Saturday, September 18, 2010

 

Monday, November 27, 2017

దైవానికి దూరం కాకుండా ఉండటం ఎంతో ముఖ్యమయిన విషయం.

 
నేను ఇంతకుముందు ఒకోసారి చాలా చాదస్తముగా ప్రవర్తించటం జరిగేదండి.

ఉదా.......ఒకోసారి మా ఇంట్లోని వాళ్ళని ప్రొద్దున్నే గుడికి వెళ్తే మంచిదని చెప్పి తీసుకువెళ్ళటం జరిగేది. 


 నా అభిప్రాయమేమిటంటే,  గుడికి సాయంత్రం వెళ్తే అప్పటికి ఏదోఒకటి తినటం జరుగుతుంది కదా అని .

.ఇక్కడ ఏమి జరిగేది అంటే,  ఉదయం  పిల్లల స్కూల్ కు సమయము మించిపోతుండేది.


గుడిలో ఒకోసారి అభిషేకం తరువాత .. అలంకరణ చేసే సమయములలో దేవుని ముందు తెర వేసి ఉంటుంది.

ఒకోసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు దర్శనం ఆలస్యమవుతుంది.

ఇలాంటప్పుడు పిల్లలు స్కూల్ టైం అయిపోతోందని కంగారు పడతారు. 


 వాళ్ళ అభిప్రాయం సరి అయినదే. గుడికి వెళ్ళటం వల్ల ఆలస్యమయిందని చెబితే టీచర్ ఊరుకోరుగదా !

ఏదిఏమైనా నేను వాళ్ళను వదలక ఇంకొంచెము సేపట్లో దర్శనం అయిపోతుందిలే.. అని సర్దిచెబుతాను. 


నాకు మనస్సులో అయ్యో స్కూల్ సమయం మించిపోతోదని కంగారుగానే ఉంటుంది.

కానీ దర్శనం చేసుకోకుండా వెళ్తే ఏమిజరుగుతుందో అని శంక... ఇలా నేను ఇంట్లో వాళ్ళను చాలా సతాయించాను పాపం.

ఇప్పుడు కొద్దికొద్దిగా అలాచేయటం మానివేసి నాకు ఎంత వీలయితే అంతే చేయడానికి ప్రయత్నిస్తున్నాను.  వాళ్ళకి  దేవుడంటే భక్తి  ఉంది. 



నేను గనక ఇలా చాదస్తముగా కంటిన్యూ చేస్తే వాళ్ళు నాస్తికులవుతారేమోనని ఒక భయం వచ్చింది.

ఇంకా నాకు ఏమని అనిపించిందంటేనండీ , నాలో కోపము, చిరాకు, నెగెటివ్ ఆలోచనలు ఇలా ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి.  ఇలాంటివి భగవంతునికి అస్సలు నచ్చవు.  



ఇలాంటివాటి విషయములో నా మనస్సును అదుపులో ఉంచుకోవటం  చేతకాక , పూజవిధివిధానాల పేరిట ఇంట్లో వాళ్ళని సతాయించటం ఏమి న్యాయం.. అని అనిపించింది.


ఇలా విధివిధానాల వెంపర్లాటలో పడి..  భగవంతుని యందు ధ్యాస, ప్రేమ, భక్తి కి దూరమవుతున్నానేమో..  అని కూడా సందేహమొచ్చిందండి.


అందుకే పూజలో లోటుపాట్లకు దైవాన్ని క్షమించమని కోరుకుంటూ ...భగవంతుని యందు ప్రేమ భక్తికి ప్రాధాన్యత ఇవ్వటం మంచిదని అనిపిస్తోదండి.

 

ఇప్పుడు స్కూల్ కు వెళ్ళే తొందరలో గుడికి వెళ్ళటం లేదు... వెళ్ళినా ఒకవేళ దర్శనం కాకపోతే అసంతౄప్తి చెందక బయటనుంచి నమస్కరించి వచ్చేయటం మంచిపద్దతి అని అనిపిస్తోంది.


భోజనం చేసినా గుడికి ప్రశాంతముగా సాయంకాలం వెళ్ళటం మంచిదని అనిపిస్తోదండి..

దైవానికి దూరం కాకుండా ఉండటం ఎంతో ముఖ్యమయిన విషయం.


Monday, September 20, 2010

 

Friday, November 24, 2017

ఓం ..కొన్ని విషయాలు ..బొట్టు పెట్టుకోవటం..

శ్రీ సుబ్రహ్మణ్య షష్టి ( షష్ఠి ).. సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి.  

నాగులచవితి , నాగపంచమి .. వంటి  పండుగల సందర్భాలలో పుట్టవద్ద   పూజ చేస్తారు. 

ఇలాంటప్పుడు కొందరు  పుట్ట వద్ద అగరుబత్తిలు, దీపాలు వెలిగించి పెడతారు. 

అలా కాకుండా పుట్టకు దూరంగా వెలిగించి ఉంచటం  మంచిది. 
*************
marikonni vishayalu...

హిందువులు అంటే బొట్టు పెట్టుకోవాలంటారు.  అది సరైనదే.  
 
ఈ రోజుల్లో కుంకుమ మంచిగా తయారుచెయ్యకపోవటం వల్ల చాలామందికి కుంకుమ పెట్టుకుంటే మచ్చ, దురదలు వస్తున్నాయి. అందువల్ల కొందరు స్టిక్కర్స్ ధరిస్తున్నారు. 
 
స్త్రీల పరిస్థితి ఇలా ఉంటే, పురుషులు కూడా కుంకుమ పెట్టుకోవాలంటున్నారు. ఎవరైనా కూడా స్వచ్ఛమైన కుంకుమ ధరిస్తే మంచిది. ఎలర్జి సమస్య ఉంటే కుంకుమ వద్దని వైద్యులే చెబుతారు.

కొందరు మగవాళ్ళు విభూతిని ధరిస్తున్నారు. ప్రతిరోజు బొ
ట్టు  పెట్టుకోవాలనుకునే పురుషులు కుంకుమ బదులు, విభూతి పెట్టుకోవచ్చనిపిస్తుంది.
 (నాకు తెలిసినంతలో విభూతి వల్ల ఎలర్జి ఉండకపోవచ్చు. )
 
స్వచ్ఛమైన కుంకుమను అందరూ చక్కగా పెట్టుకోవచ్చు. 
 
 దేవాలయాల్లో ఇచ్చే కుంకుమను ఎవరైనా తీసుకుని పెట్టుకోవచ్చు.
................
ఇక కొందరు విదేశీయులు భారతదేశానికి వచ్చినప్పుడు, మన సంస్కృతి అని వారికి కుంకుమ పెడతారు. 
కొందరు  విదేశీయులకు కుంకుమ పెట్టించుకోవటం ఇష్టం లేకపోవచ్చు. 
 
 కొన్నిసార్లు ఈ కుంకుమ కంటిలో పడితే కష్టం.  కల్తి కుంకుమ వల్ల  ఎలర్జి వచ్చే అవకాశముంది. ఇలాంటప్పుడు విదేశీయులకు కుంకుమ పెట్టకపోవటమే మంచిదనిపిస్తుంది.
..............................

వ్రాసిన వాటిలో  అచ్చుతప్పులు   ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

 

Wednesday, November 22, 2017

ఈ విషయంలో ఇలా ఆలోచించటం అతి కాదు...


కొందరు ఏం చేస్తారంటే , దైవ చిత్రాలను పడుకునే పరుపుల క్రింద ఉంచుతారు. ఇలా చేయటం మంచిదికాదని నా అభిప్రాయం. ఇలా చేసినవారికి కష్టాలు రావటం నేను గమనించాను.  

ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ పద్ధతి వచ్చాక క్రింద పోర్షన్ వాళ్ళ దేవుని  మందిరం పైన.. పై పోర్షన్ వాళ్ళ బెడ్రూం లేక బాత్రూం వచ్చే  అవకాశముంది.  

క్రింద పొర్షన్లో  దైవ మందిరం , దైవ  విగ్రహాలు ఉంటే పైన నడవటం ...ఇవన్నీ ఆలోచిస్తే ఎలాగో ఉంటుంది. 

అపార్ట్మెంట్ల విషయంలో .. ప్రతి ఇంటి పూజా మందిరం..క్రింద పొర్షన్ నుంచి పై పోర్షన్  వరకు  ..  ఒకే వరుసలో  వచ్చే విధంగా ప్లాన్ చేసి కట్టుకుంటే  పూజామందిరం పైన బెడ్రూం రావటం వంటివి జరగకపోవచ్చు.

 ఇంట్లో ఉన్న దేవుని  విగ్రహాలు, క్యాలెండర్లు అన్నీ ఇల్లంతా  ఉంచటం  కాకుండా,  కేవలం పూజగదిలో మాత్రమే ఉండేటట్లు చూసుకోవచ్చు.

అపార్ట్మెంట్ కాకుండా డాబా ఇళ్లయినా క్రింద దేవుని గది ..పైన టెర్ర స్ ..పైన  నడుస్తారు. 

క్రింద దేవుని మందిరం ఉన్న దగ్గర.. టెర్రస్ పైన  కొంతభాగం నడవకుండా,  అక్కడ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు  లేదా  కొంత ఎత్తులో నాలుగు  ప్రక్కల గోడ కట్టవచ్చు.

పాతకాలంలో ఇలా అపార్ట్మెంట్ పద్ధతి లేదు .  డాబా పైకి ఎక్కే విధంగా ఇళ్లూ ఉండేవి కాదు.  

అంతస్తులు ఉండే  రాజభవనాలలో  దేవాలయం  కొంచెం దూరంగా ఉండేది కావచ్చు.  

 ఈ రోజుల్లో దైవ చిత్రాలను యంత్రాలతో  విరివిగా ముద్రించి తరువాత బయటపడేయటం కూడా జరుగుతోంది.

విదేశాల వాళ్లు చెప్పులపై  దైవ చిత్రాలను ముద్రించారని తెలిసి ఆందోళనకు గురయ్యినప్పుడు.. మనం ఇక్కడ దైవచిత్రాలను ముద్రించి  తరువాత చెత్తలో పడేయటం కూడా తప్పేకదా! 

దైవపూజ తరువాత వచ్చే నిర్మాల్యాన్నే ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు.. నీటిలోనో, చెట్లపైనో  వేయాలని పెద్దలు తెలియజేసారు.  


పూజ చేయడానికి ఉపయోగించిన పువ్వులు, పత్రి వంటివి  పడేయటానికే అన్ని నియమాలు  ఉన్నప్పుడు... 


సాక్షాత్తూ దైవచిత్రాల విషయంలో ఎన్ని నియమాలు పాటించవలసి ఉంటుందో ఆలోచించండి. 


అలాగని ఈ రోజుల్లో ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న చిత్రాలను, లేని చిత్రాలను అన్నింటినీ  నీటిలో వేస్తే నీటిలో పెద్ద ఎత్తున పూడిక పెరిగే అవకాశముంది. 


  ఇలా ఆలోచించటం  కొందరికి అతిగా  అనిపించవచ్చు... అయితే, ఈ విషయంలో ఇలా ఆలోచించటం అతి కాదు.

కొన్ని ఆచారవ్యవహారాల విషయంలో   ఎక్కువగా  ఆలోచించటం అవసరం లేదేమో కానీ,  దైవ చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  

దైవ చిత్రాన్ని దైవానికి ప్రతిరూపంగా భావిస్తాము.  దైవచిత్రాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 

ఈ మధ్య ఒకరు మాకు వారి పిల్లల  వివాహ ఆహ్వానపత్రికను  ఇచ్చారు.

 ఆ పత్రికను పెద్దగా ముద్రించి ఎందరో దేవతల చిత్రాలను ముద్రించారు. 

ప్లాస్టిక్ కోటింగ్ తో ఆ పత్రిక చాలా దృఢంగా ఉంది. దాన్ని ఎక్కడ పడేయాలో తెలియటం లేదు. ఇంకేం చేస్తాం బయటే వేస్తాం.

ఇలా వచ్చిన ఆహ్వాన పత్రికలను, దైవ చిత్రాలున్న స్వీట్ ప్యాకెట్లను, విజిటింగ్ కార్డులను, వార్తాపత్రికలను ..ఇలాంటివన్నీ  ఇంట్లోనే అట్టిపెట్టుకోవాలంటే కష్టం కదా!

ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగాయి.. మేమేం చేయగలం?

 దైవచిత్రాలను చెత్త వద్ద పడేసిన  పాపం .. దైవ చిత్రాలను అలా ముద్రించిన వారికి వస్తుంది.