koodali

Wednesday, June 13, 2018

ఆరోగ్యం పాడవకుండా ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది......


పాతకాలంలో స్త్రీలు వంట చేసేటప్పుడు  క్రింద కూర్చుని  వంటచేసేవారు. పొయ్యిగట్టు  క్రింద ఉండేది. గట్టు  చుట్టూ వంటకు  అవసరమైన  వస్తువులు ఉండేవి.

ఈ రోజుల్లో కొందరు  క్రింద  కూర్చో లేకపోతున్నారు. దైవం దయవల్ల నాకు ఆ సమస్య లేదు. 

ఈ రోజుల్లో పొయ్యిగట్టు  ఎత్తుగా ఉంటోంది. ఎన్ని గంటలైనా నిలబడే వంట చేయవలసి వస్తుంది. ఇందువల్ల    చాలామంది  స్త్రీలు  కాళ్ళనొప్పులతో   బాధపడుతున్నారు.

పొయ్యిగట్టు   క్రింద కాకుండా, ఎత్తుగా కాకుండా మధ్యస్తంగా ఉంటే బాగుంటుంది. 

ఉదా..  ఈ   టీవిలో..  అమ్మ చేతి వంట … వంటి  ప్రొగ్రాం లో పొయ్యిగట్టు  ఉండే విధానం  బా గుంది. కుర్చీ  వేసుకుని  కూర్చుని  వంట చేయవచ్చు. 

*********************
ఇస్త్రీ చేసేవాళ్ళు గంటల తరబడి నిలబడి ఇస్త్రీ చేస్తుంటారు.

 అలా కాకుండా  వెడల్పు బల్ల ముందు క్రింద కూర్చుని   ఇస్త్రీ   చేసే విధంగా ఏర్పాటు చేసుకుంటే  కాళ్ళు నొప్పులు ఉండవు.
**************

రోడ్డుప్రక్కన పండ్లు, ఫలహారాలు అమ్మేవారు కూడా గంటల తరబడి  ఎండలో నిలబడి వ్యాపారం చేస్తుంటారు.  

ఎండ  తగలకుండా గొడుగు కానీ,   టోపీ కానీ , తుండుకానీ   వేసుకుని  ఎండ తగలకుండా చూసుకోవాలి. వీటికి పెద్ద ఖర్చేమీ అవదు.

గంటలతరబడి నిలబడటం కాకుండా,   ఒక కుర్చీ  వేసుకుని   అప్పుడప్పుడైనా కూర్చోవాలి.

స్టూల్ పైన కూర్చుంటే పొరపాటున పడిపోయే అవకాశం ఉంది. కుర్చీలో కూర్చోవటమే మంచిది. 

****************
  వేసవిలో మిట్టమధ్యాహ్నం  మండుటెండలో తలపై ఏ ఆచ్చాదన లేకుండా బయటకు వెళ్తుంటారు కొందరు. 

పని హడావిడి వల్ల కావచ్చు, ఏమవుతుందిలే అనే అశ్రద్ధ వల్ల కావచ్చు, కొందరు జాగ్రత్తలు తీసుకోరు.  

ఎండాకాలంలో బయట తిరిగేవారు తలకు, చెవులకు వస్త్రం కట్టుకుంటే మంచిది.

    **************
ఎక్కువ సమయం నిలబడే వారికి .. వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధి వచ్చే అవకాశముంటుందని అంటున్నారు. 

అలా అని అస్తమాను కూర్చుని ఉద్యోగాలు చేసేవారికి కూడా సమస్యలు వచ్చే అవకాశముందంటున్నారు.
************

  ఇక,   స్కూల్ పిల్లలను    క్లాస్ రూములో   కుర్చీలో   గంటల తరబడి   కూర్చోబెట్టి,   ఒక క్లాస్ తరువాత వెంటనే మరొక  క్లాస్     చెప్పడం కాకుండా, 

ఒక క్లాసుకు మరొక క్లాసుకు పది నిముషాలు గాప్ ఇస్తే,   పిల్లలు  కొంత సేద తీరుతారు . 

బాత్రూం  కు  వెళ్లడానికి కూడా అనువుగా ఉంటుంది. 

ప్రొద్దున్ననగా  ఇంటి  నుండి   బయలుదేరిన పిల్లలకు   క్లాసుల మధ్యలో కొంత విరామం ఇవ్వాలి.
.......................
 
టాయ్లెట్స్ కడిగేటప్పుడు ఘాటైన రసాయనాల ఘాటు కళ్లలోకి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాంటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవాలి. కళ్లుబాగా కవరయ్యేలాంటి కళ్లజోడు తయారు చేస్తే బాగుంటుంది. 
......................

వంట చేసేటప్పుడు వెంట్రుకలు క్రింద పడకుండా కాప్ పెట్టుకుంటారు. ప్లాస్టిక్ కాప్ వల్ల తల వేడెక్కి చెమట వస్తుంది.  ప్లాస్టిక్ కాప్ బదులు పల్చటి స్కార్ఫ్ తలకు కట్టుకోవచ్చు. తలపైనుంచి కప్పుకుని మెడ క్రింద ఒకముడి వేసుకోవచ్చు. 
 
ముడి గట్టిగా వేయకుండా తేలికగా తీసేలా ఒక్క ముడి వేస్తే మంచిది. వెంట్రుకలు పడవు, తల వేడెక్కదు, చెమట వచ్చినా క్లాథ్ పీలుస్తుంది. 

**************
ఇవన్నీ చిన్నచిన్న ఏర్పాట్లే.   తరువాత అనారోగ్యం   వచ్చి  బాధపడేకన్నా ,  ముందే   కొన్ని   జాగ్రత్తలు   తీసుకుంటే మంచిది.



Tuesday, June 12, 2018

కొన్ని విషయాలు...అనేక సందేహాలతో, అనేక నియమాలతో ..


 
ప్రాచీనులు  ఎన్నో ఆచారవ్యవహారాలు, నియమాలను ఏర్పరిచారు. వీటిలో ఎన్నో మంచివిషయాలున్నాయి.  అయితే,  క్రమంగా కొన్నిమూఢనమ్మకాలు ప్రవేశించాయి. ఇప్పుడు అన్నీ కలిసి బోలెడు అయ్యాయి.


ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, దైవభక్తి, ధర్మబద్ధంగా జీవించటం..వంటి విషయాల గురించి ఆలోచించటం కన్నా, ఇతరవిషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు.

  
భక్తి, జ్ఞానం గురించి ఎలా ఉన్నా,  అనేక  సందేహాల గురించి ఆలోచనలతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. పూజకన్నా, పూజా విధానాన్ని సరిగ్గా ఆచరిస్తున్నామా లేదా? అనే సందేహాలతోనే సమయం గడిచిపోతుంది.


దైవము మెచ్చేలా ఎలా ప్రవర్తించాలి? ధర్మబద్ధంగా ఎలా జీవించాలి? దైవకృపను ఎలా పొందాలి? ఇలాంటి వాటిగురించి ఎక్కువగా ప్రజలకు చెప్పాలి..ప్రజలు కూడా వీటి గురించి ఎక్కువ ఆలోచించాలి.


జీవితంలో నియమాలు, ఆచారవ్యవహారాలు తప్పక  ఉండాలి. అయితే, అతి పెరిగితే మంచిది కాదు. ఆహారం అయినా అతిగా తింటే ఆరోగ్యానికి మంచిదికాదు. ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఆచారవ్యవహారాలను పద్ధతిగా పాటించాలి. అయితే, కొందరు ఆచారవ్యవహారాలను మూఢనమ్మకాలతో పాటిస్తారు. అలాంటివారికి చెప్పేదేమిటంటే, ఏ విషయంలోనైనా విపరీతధోరణి సరైనది కాదు.
 
 
ప్రతిదానినీ పెంచుకుంటూ ..ప్రతిదానికీ సవాలక్ష నియమాలు చెబుతూ వాటిని పాటించకపోతే కష్టాలొస్తాయని భయపెడుతుంటే.. భయపడి అన్నింటినీ పాటించలేక ఎందరో హిందువులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. 
 
 
ఇలాంటప్పుడు తేలికగా దైవాన్ని ప్రార్ధించుకునే విధానాల గురించి ఎవరైనా చెబితే అటువైపు మనస్సు వెళ్ళటం సహజం. జనాలు ఈ గోలలో ఉంటే ఇతరులు తమపనితాము కానిచ్చుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా కూడా ప్రజల బాధ పట్టించుకోని కొందరు తమకు తోచినట్లు తాము చెపుతూనే ఉన్నారు.

 

 ఇహానికి, పరానికి మంచిగా ఉండేలా ప్రాచీనులు ఎన్నో విషయాలను తెలియజేసారు. అయితే ఇప్పుడు   అనేక సందేహాలతో, అనేక నియమాలతో దైవపూజనూ సరిగ్గా చేయలేకపోతున్నారు. అనేక సందేహాలతో, అనేక నియమాలతో అయోమయంతో స్వధర్మాన్ని కూడా సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు.
 
 
ఈ విధంగా  ఇహానికి, పరానికి కూడా  సరిగ్గా   ప్రయత్నించలేకపోతున్నారు. కొందరు వారు భయపడుతూ అందరినీ భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.


మూఢనమ్మకాలను వదిలిపెట్టకుండా, పట్టువిడుపులు లేకుండా ఉన్నప్పుడు, మతం మారిపోతున్నారంటూ ఎంత గగ్గోలు పెట్టినా ఫలితం ఉండదు. మనమూ మన విధానాలను కొంత సరళం చేసుకోవాలి.


 
రోజూ నిత్యపూజ చేసుకుంటూ  ధర్మబద్ధంగా జీవిస్తూ దైవాన్నిస్మరించుకుంటూ చక్కగా ఉండవచ్చు.  


 
చక్కగా దైవభక్తి, ధర్మబద్ధమైన జీవితం, నిత్యపూజ, కొన్ని పండుగలు,  దేవాలయాలకు వెళ్లటం..ఇలా తేలికైన మార్గాన్ని వదిలి, ఏవేవో నమ్మకాలతో తాము సతమతమవుతూ, అందరినీ అయోమయం చేయటం ఏమిటో? అన్నింటికీ దైవమే దిక్కు.

.......................

ఒక సాధువు ఒక చెరువు లో స్నానానికి వెళ్ళదలచి, తన కమండలాన్ని  గట్టున ఇసుకలో దాచి, గుర్తుగా పైన ఇసుకతో గోపురంలా చేసి స్నానానికి వెళ్తారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక వ్యక్తి విషయం తెలియక, సాధువు చేసినట్లు తనుకూడా ఇసుకతో గోపురాన్ని నిర్మిస్తే తనకు మంచి జరుగుతుంది కాబోలు అని భావించి , తాను కూడా గోపురాన్ని నిర్మిస్తారు. అదిచూసిన మరికొందరు తాముకూడా ఇసుకతో  గోపురాలను చేస్తారు.... సాధువు స్నానం చేసి వచ్చి కమండలం కొరకు చూడగా ఎన్నో ఇసుకగోపురాలు కనిపించి అయోమయం అవుతారు. 
 
 
ఈ కధను గమనిస్తే సమాజంలో కొన్ని ఆచారవ్యవహారాలు, నమ్మకాలు ఇలా తెలిసితెలియక కూడా వచ్చి ఉండవచ్చనిపిస్తుంది. ఎన్నో మంచి విషయాలతో ప్రాచీనులు ఆచారవ్యవహారాలను ఏర్పరిచారు. అయితే కాలక్రమేణా కొన్ని మార్పులుచేర్పులతో ఎన్నో కొత్తవి కూడా వచ్చిఉండవచ్చు.


విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుల గురించి ఒకసారి నారదుల వారికి తెలుసుకోవాలనిపించిందట. విష్ణుమూర్తి వారు ఒక రైతును చూపించి, అతను కూడా తనయొక్క గొప్ప భక్తులలోని వారని చెప్పటం జరిగిందట. ఆ రైతు దైవభక్తుడు.. అయితే, పెద్దగా పూజలు చేయని ఆ రైతు గొప్ప భక్తుడు ఎలా అవుతాడని నారదుల వారికి సందేహం రాగా, విష్ణుమూర్తి ఒక పరీక్ష పెడతారు......
 
 
 
 ఒక గిన్నెనిండా తైలమును పోసి ..ఒక్క చుక్కైనా ఒలకకుండా ప్రదక్షిణ చేసి రమ్మనగా.. వచ్చిన తరువాత ఎన్నిమార్లు దైవస్మరణ జరిగిందని అడిగితే, నూనె ఒలకకూడదనే గాభరాలో తాను ఒక్కసారి కూడా స్మరించలేకపోయానని నారదులవారు చెపుతారట. ఈ కధ ద్వారా చాలా విషయములు తెలుసుకోవచ్చు. గొప్ప సాధనలు చేయలేకపోయినా, సామాన్య భక్తులు కూడా దైవకృపకు పాత్రులవచ్చని కూడా తెలుసుకోవచ్చు.


ఆడంబరాలు లేకున్నా కూడా  మనస్సులో ప్రేమభక్తితో దైవాన్ని స్మరించుకున్నా కూడా దైవకృపను పొందవచ్చు.


ఈ రోజుల్లో చాలామంది పూజ కన్నా పూజా విధానాల గురించి ఎక్కువ తాపత్రయపడటం, భయపడటం జరుగుతోంది. సమాజం సరిగ్గా ఉండాలంటే దైవభక్తిని కలిగి ఉండాలి. ఇంకా, నైతికవిలువలు కలిగి, ఎవరి పనిని వారు సరిగ్గా నిర్వర్తించాలి. అప్పుడు దైవకృపను పొందవచ్చు. అంతేకానీ, దైవంపట్ల ధ్యాస సరిగ్గా లేకుండా..స్వధర్మాన్ని సరిగ్గా పాటించకుండా..మూఢత్వంతో ప్రవర్తించటం సరైనది కాదు.


వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే ,  దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్దిస్తున్నాను.

Monday, June 11, 2018

చర్మంపై దురద.... వంటి వ్యాధులు ...


కొన్నిసార్లు  చర్మంపై  దురద....  వంటి  వ్యాధులు  వస్తుంటాయి. 

వ్యక్తిగత శుభ్రత లేనప్పుడు, ఇంకా  హాస్టల్స్ వంటి పరిస్థితిలో కూడా  ఒకరి నుంచి ఒకరికి ఇలాంటి చర్మవ్యాధులు పెరిగే అవకాశం ఉంది. 

ఇంట్లో కూడా చర్మవ్యాధి ఉన్న వారు వాడిన సబ్బులను  ఇతర కుటుంబసభ్యులు వాడినా ఒకరి నుంచి ఒకరికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. 

ఈ మధ్య ఒక పేపర్లో నేను చదివిన విషయం ఏమిటంటే,  

చర్మంపై  దురద వంటి వాటికి   మందులు వాడినప్పుడు  తాత్కాలికంగా  తగ్గి , తిరిగి వస్తున్నట్లు  గమనించారని వ్రాసారు. 

ఈ  విషయం ఎలా ఉన్నా , ఇలాంటి వ్యాధి వచ్చినప్పుడు చాలామంది వైద్యుల వద్దకు వెంటనే వెళ్ళరు. 

ముఖ్యంగా పిల్లలు  దురద ఉన్నప్పుడు  చాలా ఇబ్బంది పడతారు.

ఇలాంటి పరిస్థితిలో అశ్రద్ధ చేయకుండా  వైద్యుల వద్దకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి.  

పిల్లలు హాస్టల్లో ఉన్నా కుడా  పెద్దవాళ్ళు  ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

అయితే,  డాక్టర్ వద్దకు  వెళ్లే లోపు దురద నుంచి ఉపశమనం పొందటానికి ఒక చిట్కా  వ్రాస్తాను. దీనికి  ఉప్పు ద్వారా  ఉపశమనం ఉంటుంది.

కొంచెం  మెత్తటి  ఉప్పు తీసుకుని , నీటితో తడిపి  దురద ఉన్న దగ్గర పూయాలి. 

ఉప్పునీరు  కూడా పూయవచ్చు.

ఇలా చేస్తే దురద నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

నాలుగు,  అయిదు   రోజులు ఇలా చేస్తే దురద తగ్గిపోయే అవకాశం ఉంది.

కొన్ని రోజుల తరువాత తిరిగి  దురదగా  అనిపించినా , ఇలాగే చేయవచ్చు.  

 అయితే, ఉప్పును సీసానుండి తీసుకునేటప్పుడు మురికి చేతితో తీయటం కాకుండా స్పూన్ తో తీసుకోవాలి.  

లేకుంటే విడిగా కొంచెం ఉప్పును ఒక పాకెట్లో ఉంచుకోవాలి.

పెద్దవాళ్ళకయినా ఇలాంటి ట్రీట్మెంట్ వాడవ చ్చు. 
  
  ఉప్పు వల్ల బాక్టీరియా చనిపోతుందని అంటున్నారు. అయితే, ఉప్పు ఎక్కువ రోజులు పూస్తే చర్మం నల్లగా అవుతుందేమో తెలియదు.

 భరించలేని దురద ఉన్నప్పుడు ఉప్పు రాయడం వల్ల ఉపశమనం ఉంటుంది.

 అయితే, ఉప్పు వంటి  గాఢమైనవి ఎక్కువరోజులు పూయకూడదు. చర్మం కమిలే అవకాశం ఉంది  కాబట్టి 4 లేక 5 రోజులు వాడి ఆపేయాలి.

 అలోవేరా జెల్ రాయడం వల్ల కూడా  దురదల నుంచి ఉపశమనం ఉంటుందట. 

ఇవి   పొడి చర్మంపై  కాకుండా  ...   చర్మం తడి చేసి   పూయాలట.
.............
 
 కొంచెం వేపనూనె మరియు కొంచెం కొబ్బరినూనె  కలిపి కొంతకాలం వ్రాయవచ్చు.  
 
 **********
చర్మం దురద రావడానికి అనేక కారణాలుంటాయి. అందువల్ల   వైద్యులను సంప్రదించడం మంచిది.
 

కుప్పింటాకు (పిప్పింటాకు)ఈ మొక్కలు చాలాచోట్ల ఉంటాయి. ఈ మొక్క ఆకులు రెండు నలగ్గొట్టి రసం తీసి ఆ రసాన్ని దురద ఉన్న చోట రాస్తే దురద తగ్గుతుంది.
 
link... Learn Ayurveda | Free Classes 197 | Ringworm (Tamara) | Kuppintaku | B Anjaneya Raju #sreesannidhitv
Sr
.............
చర్మ వ్యాధి ఏదైనా ఈ ఆకుతో ఇట్టే ఎగిరిపోతుందిగజ్జి, తామర, చిడుముసిరియాసిస్ మరెన్నిటికో |Dr. Ravivarma AYUR MANTRA 
............
 రుబ్బిన ఆకులపొడి రాసుకున్నప్పుడు, ఆ పొడి ఇంట్లో పడకుండా, రుబ్బిన ఆకులరసాన్ని వడకట్టి, ఆ రసాన్ని దురద ఉన్నచోట రాయవచ్చనిపిస్తుంది.
 
***********
ఈ రోజుల్లో మన  వస్త్రధారణలో ఎన్నో మార్పులు వచ్చాయి. పాతకాలంలో   స్త్రీలు అయితే   చీర కట్టుకుని  కొన్ని కుచ్చెళ్ళను  కాళ్ళ మధ్య  గోచీలా  మడిచి  కట్టుకునేవారు. 

పురుషులు పంచె కూడా  గోచీలా  మడిచి  కట్టుకుంటారు.  ఈ వస్త్రధారణ వల్ల చాలా  ఉపయోగాలున్నాయి.

ఆధునిక కాలంలో స్త్రీలు, పురుషులు ధరిస్తున్న ఒంటికి అంటిపెట్టుకునే అండర్ వేర్ ల వల్ల వ్యాధులు వచ్చే అవకాశముంది.  

 బిగుతుగా  ఉండే  ప్యాంట్  వల్ల   కూడా  మగవారిలో వీర్యం బలహీనమయ్యి సంతానోత్పత్తి తగ్గే అవకాశాలున్నాయని  కొన్ని పరిశోధనల ద్వారా   తేలినట్లు వార్తలు వచ్చాయి.


ఇంట్లో ఉన్నప్పుడు   చీరలు, లుంగీలు  ధరించి   అండర్ వేర్   వేసుకోకుండా  తిరిగితే, టాయ్ లెట్ నుండి  బయటకు వచ్చి ఇంట్లో నడుస్తున్నప్పుడు కొన్ని నీటిబొట్లు ఇంట్లో పడే అవకాశముంది.

  అలాగని  ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒంటికి అంటిపెట్టుకునే  అండర్వేర్లు  ధరిస్తే  చర్మవ్యాధులు వచ్చే అవకాశముంది. పాతకాలంలోని వస్త్రధారణ వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉండవు.

 పంచెలు  , చీరలు  రెండుకాళ్ళ మధ్య నుంచి   మడిచి దోపటం వల్ల  టాయ్లెట్ నుంచి వచ్చి ఇంట్లో నడిచేటప్పుడు నీటిచుక్కలు క్రింద పడవు. బిగుతుగా  ఒంటికి అంటిపెట్టుకోవటం  ఉండదు కాబట్టి  చర్మవ్యాధులు కూడా రావు. 

పాతకాలంలో మగవాళ్లు, పిల్లలు కూడా లాగూలు ధరించేవారు. ఇవి బిగుతుగా కాకుండా వదులుగా ఉండేవి. ఇలాంటి అండర్వేర్లను ధరించవచ్చు. 

ఇఈ లాగూలు  ఎలాంటివంటే, ఇప్పటి వాళ్ళు ధరిస్తున్న బెర్ముడా షార్ట్స్  వంటివి.

అయితే, ఈ షార్ట్స్ ను మందపాటి వస్త్రంతో కాకుండా  పల్చటి వస్త్రంతో  వదులుగా  కుట్టించుకుని  అండర్వేర్ లా  ధరించవచ్చు.

 ***************

ఈ రోజుల్లో చీరలను మడిచి  పాతకాలంలా మడిచి  ధరించటం  అంటే కష్టం కాబట్టి,  చీర ధరించే వారు వదులుగా ఉండే అండర్వేర్  ధరించవచ్చు. 

 పంజాబీ డ్రెస్ ధరించే  స్త్రీలు  వదులుగా  ఉండే అండర్ వేర్ వేసుకోవాలంటే  వదులుగా  ఉండే  పటియాలా టైపు  పాంట్ అనువుగా  ఉంటుంది.

మగవాళ్ళకు  వదులుగా ఉండే అండర్ వేర్లు ధరించాలంటే,   పాంట్లు కొంత వదులుగా కుట్టించుకోవాలి. లేదంటే  వదులుగా ఉండే లాల్చీ, పైజమా అనువుగా ఉంటుంది.

 ***************
 పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఆహారపదార్ధాలను దాటకూడదని తెలియజేసారు. ఇలా చెప్పటంలో శుభ్రత  మరియు ఆరోగ్యం ఇమిడిఉన్నాయి.

కొందరు పిల్లలు, పెద్దవాళ్లు కూడా ఇంట్లో నడుస్తూ గబుక్కున నేలమీద  ఉన్న ఆహారపాత్రల  ప్రక్కనుంచి వెళ్ళకుండా..వాటిని  దాటి వెళ్తుంటారు. పిల్లలు పరిగెడుతూ కూడా పాత్రలను దాటుతుంటారు. ఇలా చేయకూడదు.

 ఇలాంటి సున్నితమైన విషయాలు రాయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కాబట్టి,  మాట్లాడుకోవటం లో తప్పులేదు.  


Friday, June 8, 2018

కొన్ని ఆహార విషయాలు... మూడవ భాగం......



మన పూర్వీకులు నవధాన్యాలు, కొబ్బరి వంటి మంచి ఆహారం, ఖర్జూరం, బాదాం వంటి ఎండుపండ్లు,  ఉసిరి, నిమ్మకాయలవంటి ఎన్నో చక్కటి వాటి గురించి తెలియజేసారు. 

రాగి అంబలి వంటివి కూడా పూర్వీకులు తెలియజేసారు. 
తామర విత్తనాలు(పూల్ మఖానా), తామర తూళ్ళను ఆహారంలో  వాడటం ఎంతో మంచిది.
............................
పాలు, నెయ్యి లేని పాయసం..అరకప్పు బియ్యాన్ని, పావుకప్పు పెసరపప్పును నానబెట్టాలి. అరగంట అయ్యాక కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. ఉడికాక మెత్తగా మెదిపి, యాలక్కాయ పొడి, అరకప్పు కొబ్బరిపాలు, కప్పు తురిమిన బెల్లం వేసి అంతా చిక్కగా దగ్గరకు అయ్యేవరకు మాడకుండా తిప్పుతూ ఉడికించాలి. వేయించిన జీడిపప్పు పలుకులు కలపాలి.  
 
కావాలంటే మరికొద్దిగా బెల్లం ఎక్కువ వేయవచ్చు.
 
కుక్కర్లో కాకుండా మట్టిపాత్ర.. ఇత్తడిగిన్నె..స్టీల్ గిన్నెలో కూడా వండుకోవచ్చు.
  (ఈ స్వీట్లో కొబ్బరిపాలు పోయకుండా కూడా తయారు చేయవచ్చు.)
.....................................
 
 కడ ప్రసాదం....  ఈ ప్రసాదం పంజాబ్ వాళ్ళు  బాగా చేస్తారట. కప్పుగోధుమపిండి.. కప్పు సన్ ఫ్లవర్ నూనె.. కప్పు బెల్లం..రెండుకప్పుల నీరు ..యాలకాయల పొడి, వేయించిన జీడిపప్పు పలుకులు.
 
వెడల్పుగా ఉన్న కడాయిలో నూనెవేసి,  గోధుమపిండి వేసి దోరగా వేయించుకోవాలి. (ముప్పావు కప్పు నూనె వేసుకోవచ్చు. ) 
 
 గిన్నెలో బెల్లం వేసి నీరుపోసి, ఇలాచిపొడి వేసి బెల్లం కరిగేలా వేడిచేయాలి...పాకం రానవసరం లేదు. 

గోధుమపిండి నూనెలో 5 నిమిషాలు వేగాక, కరిగించిన బెల్లం నీటిని నిదానంగా ...గోధుమపిండి లో పోయాలి.

 ఆ నీరంతా దగ్గరకు రావటానికి చాలా సమయం పడుతుందని భయపడనక్కరలేదు. ఆశ్చర్యంగా రెండునిమిషాల్లోనే నీరంతా దగ్గరకు వచ్చి హల్వాలా అవుతుంది.  
5 నిమిషాలు అంతా  దగ్గరకు అయ్యేవరకు మాడకుండా తిప్పుతూ ఉడికించాలి.  వేయించిన జీడిపప్పు వేసి దించేయాలి. 

 వేడి బెల్లం నీరు గోధుమ పిండిలో ఒకేసారి పోస్తే,  చేతికి వేడి తగిలే అవకాశం ఉంది. ..నిదానంగా  పోయాలి.

 కొద్దిగా ముందే బెల్లంలో నీళ్లు పోసి కరిగించి పక్కన పెట్టుకోవచ్చు. పొడుగుగా ఉన్న గరిటెతో తిప్పితే చేతికి వేడితగలదు.
 
 వాసనలేని నూనె (సన్ ఫ్లవర్ నూనె) వేయాలి. వేరుశనగనూనె.. శనగపప్పు వాసన వస్తుంది కాబట్టి, ఈ స్వీటులో వేస్తే బాగోదు...పాతవాసన రాని ఫ్రెష్ కొబ్బరినూనె కూడా వేయవచ్చు. 
 
ఒక కప్పు పిండికి ఒక కప్పు నెయ్యి లేక నూనె వేయాలట. నేను ముప్పావు కప్పు అని రాసాను. అరకప్పు కూడా వేయొచ్చు కాని, స్వీట్ కొంచెం డ్రై గా ఉంటుంది. 
...........................................
 
పానీపూరీ...పూరీలు బయట అమ్మేవి తెచ్చుకోవచ్చు. 

కొద్దిగా నీటిలో కొంచెం చింతపండు నానబెట్టుకుని,  రసం తీసి వడకట్టాలి.  అందులో ఒకలీటర్ నీళ్లు కలపాలి.  నీటిలో కొద్దిగా మిరియాలపొడి, ఉప్పు , ఒక tea స్పూన్ నల్ల ఉప్పు .. వేసుకుని కలుపుకోవాలి.  
 
 ఒక కట్ట  పుదీనా, ఒక  కట్ట కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు  ..ఇవన్నీ ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. 

ఈ పేస్ట్లో నీళ్లు పోసుకుని వడకట్టి , పిప్పిని వేరుచేసి,  వచ్చిన రసాన్ని ముందే ఉంచుకున్న  లీటర్  నీటిలో  కలుపుకోవాలి. 

చింతపండు రసం వద్దనుకుంటే నీటిలో నిమ్మకాయ పిండుకోవచ్చు.  ఆలు , శనగలు కలిపి కూర లేక  ఉడకబెట్టిన పెసలు  పూరీలలో వేసుకుని పానీ పోసుకుంటే పానీపూరీ తినవచ్చు.

పానీపూరి కొరకు చేసే  పానిలో  వేసే   నల్లఉప్పు,   పుదీనా,   కొత్తిమీర, జీలకర్ర.. మిరియాలపొడి, చింతపండురసం... ఇవన్ని   ఆరోగ్యానికి మంచిది. అప్పుడప్పుడు  ఈ  నీటిని మాత్రమే తయారుచేసుకుని త్రాగినా  మంచిదే.  

పావుబాజీ ....నానబెట్టుకున్న శనగలు,   కొన్ని  ఆలూ , రెండు  కారట్.....ఇవన్నీ కుక్కర్లో ఉడికించుకుని ఉంచుకోవాలి.  

బాణలిలో నూనె వేసి , ఉల్లిముక్కలు, మిర్చి వేసి వేయించుకుని,  ఇష్టమున్నవారు   అర టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించి,  సన్నగా తరిగిన కాప్సికం , టమేటో ముక్కలు వేసి వేయించుకోవాలి. 
 
(టమేటో ముక్కలు ఇష్టం లేకపోతే,  టమేటోముక్కలుని.. మిక్సీలో రుబ్బి,  ఆ గుజ్జును వేయించవచ్చు.)

ఇందులోనే  ఉడికించిన శనగలు, ఆలూ, కారెట్..మొదలైనవి వేసి....  ఉప్పు , పసుపు, ధనియాలపొడి,  పావుబాజీ మసాలా పొడి వేసుకుని మెత్తగా మెదపాలి. కొద్దిగా వెన్న కూడా  వేసుకుంటే బాగుంటుంది. 

పచ్చివాసన పోయిన తరువాత,  కొత్తిమీర వేసి దించుకోవాలి. పావు రొట్టెలు లేక మామూలు బ్రెడ్ ను కాల్చుకోవాలి. 

సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,  కొత్తిమీర, నిమ్మరసం పిండుకుని ప్రక్కన ఉంచుకోవాలి. బ్రెడ్ తో కూర, ఉల్లిముక్కలు కలిపి తినవచ్చు.

***************
* ఓక టేబుల్ స్పూన్ అంటే...  సుమారుగా మూడు టీ  స్పూన్లు. 
 
* కప్పు అంటే, మా ఇంట్లో రైస్ కుక్కర్ కొన్నప్పుడు వాళ్లు ఒక కప్పు ఇచ్చారు. దానిపైన కొలతలు రాసి ఉన్నాయి. కప్పుకానీ గ్లాసుకానీ పైనుంచి కింద వరకు ఒకేలా ఉండాలి. మన ఇళ్ళలో ఉండే గ్లాసులు కింద సన్నగా, పైన వెడల్పుగా ఉంటే కొలతలు సరిగ్గా తెలియవు. వాటి పైన కొలతలు రాసిఉంటే ఫరవాలేదు.

 *************
ఫ్రైడ్ రైస్ ... అన్నం పలుకుగా వండుకుని,  బాణలిలో కొద్దిగా నూనె వేసుకుని, అర టీ స్పూన్ తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి.

అందులో సన్నగా  తరిగిన కారెట్, కాబేజ్, కాప్సికం, పచ్చిబటాణి..వేసి వేయించాలి. మరీ ఎక్కువగా వేయించకూడదు.
 
 ఫ్రైడ్ రైస్లో సన్నగా తరిగిన అల్లం తరుగు, కాబేజ్ తక్కువ వేయాలి...కాబేజ్ వెయ్యకపోయినా ఫరవాలేదు. కాప్సికం, మిరియాలపొడి, కారెట్, వెల్లుల్లి తరుగు తప్పనిసరి. బఠాణి,ఉల్లికాడలతరుగు కూడా ఉంటే వేసుకోవచ్చు.

అందులో మిరియాల పొడి, ఉప్పు వేసి అన్నం కలిపి వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకుండా కొద్దిగా పెద్ద మంటలో తక్కువసేపు వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లి కాడలను  వేసి అంతా మరొకసారి గరిటతో తిప్పుకోవాలి.

కొందరు పిల్లలు తరిగిన అల్లం ముక్కలు తినరు, దానిబదులు ఒక టీస్పూన్ అల్లం పచ్చడి వేసికలపవచ్చు.

ఫ్రైడ్  రైస్ లో , సోయాసాస్  వంటివి వేస్తారు.   అయితే, నేను కొన్ని కారణాల వల్ల  సోయాసాస్ ,  వెనిగర్..వంటివి 
 .  వేయను.  ఎప్పుడైనా ఎప్పుడైనా అరుదుగా ఇంట్లోవాళ్లు  అడిగితే   వేస్తాను.
 .............................................
మరీ నూనె లేకుండా తిననవసరం లేదు. శరీరానికి కొంత ఆయిల్ కూడా అవసరం. 
 
నూనె పదార్ధాలు ( కొవ్వు)  కూడా శరీరానికి అవసరమే. కొవ్వు తీసుకోవటం బొత్తిగా  మానేయటం వల్ల చర్మం ఎండిపోయినట్లు అవుతుంది. కీళ్ళలో గుజ్జు అరిగిపోతుంది. 

మితిమీరి కాకుండా అవసరమైనంత వరకు  క్రొవ్వు పదార్ధాలు, పప్పుధాన్యాలు తినాలి.  

 పండ్లు కూడా తినాలి.
 
ఆర్గానిక్ నూనె ఖరీదు ఎక్కువ. బజ్జీలు, కారప్పూస ఇలాంటి..స్నాక్స్ కు మామూలు నూనె వాడి, మిగతా వంటలకు ...అంటే, కూరలు, టిఫిన్స్, పొంగలి..ఇలా అన్నింటికి ఆర్గానిక్ నూనె వాడవచ్చు.

****************
 కరివేపాకు ఎక్కువగా తెచ్చి కడిగి నీడలో ఆరబెట్టి, కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆకుపచ్చ రంగు పోకుండా, తడిపోయేలా కరివేపాకును వేయించుకోవాలి. అరకప్పు పచ్చిశనగపప్పు, పావుకప్పు మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేయించి అన్నీ పొడి కొట్టుకోవాలి. పచ్చిశనగపప్పు బదులు వేయించిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కూరలో వేస్తాము కాబట్టి ఈ పొడిలో కొద్దిగా వేసుకోవచ్చు. 
 
 బాణలిలో  1 tea spoon  నూనె వేసి ,   ఆవాలు, జీలకర్ర  వేయించుకుని  పక్కన పెట్టుకుని, కరివేపాకు పొడిలో కలుపుకోవాలి.

కరివేపాకు అందుబాటులో లేనప్పుడు.. కూరల్లో ఈ పొడిని వేసుకోవచ్చు. 

 తిరగమోత చింది పొయ్యి జిడ్దు అవుతోందనుకుంటే... తిరగమోత బదులు ఈ పొడిని వేసుకోవచ్చు. మూకుడులో కొద్దిగా నూనెవేసి ఈ పొడిని వేసి, వెంటనే  కూరగాయలముక్కలు వేసి వేయించుకోవాలి.(వేయించిన పొడే కాబట్టి వేగనక్కరలేదు.) 
 
లేదంటే, మూకుడులో నూనెవేసి వెంటనే కూరముక్కలు వేసి వేయించి ఆఖరికి తిరగమోత పొడి కూడా కలుపుకోవచ్చు.కూరల్లో వేసుకుని కూరలో కొన్ని పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. 
 
 *********************
 అనేక కారణాల వల్ల  ఈ రోజుల్లో ఎక్కువమంది  పిల్లలు  జంక్ ఫుడ్ వంటివి తినేసి కడుపు నింపుకోవలసి వస్తోంది...

ఇందువల్ల రాబోయే తరాలు బలహీనంగా తయారయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా బలవర్ధకమయిన ఆహారం తినాలి. 

మరీ ఎక్కువ ఆహారం, తక్కువ ఆహారం కాకుండా అవసరమైనంతవరకు తీసుకోవాలి. తిన్న ఆహారం పుష్టినిచ్చేదిగా ఉండాలి. 

 జంక్ ఫుడ్ ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు.  ఆహారం గురించి ఎన్నో విషయాలుంటాయి. అయితే,  కొన్ని వంటలను   పై టపాలలో క్లుప్తంగా వ్రాసాను. 
 
****************************
  కొన్నిరకాల ఆహారపదార్ధాలను కొన్ని వారాలు, నెలలపాటు  బాగా పులవబెడితే వాటినుంచి ఆల్కహాల్ తయారవుతుంది. దానిని తీసుకుంటే మత్తు వస్తుంది. ఆ మత్తులో మానసికబలహీనత వచ్చి ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో.. వారికే తెలియదు. అలాంటప్పుడు ఎన్నో నేరాలు ఘోరాలు జరిగే అవకాశముంది. మత్తుపదార్ధాల వల్ల అనారోగ్యం కలిగే అవకాశం  కూడా ఉంది. లివర్ చెడిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మత్తుపదార్ధాలను తీసుకోవటం తప్పని పెద్దలు తెలియజేసారు.


అయితే, పదార్ధాలు కొద్దిగా పులవటం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందంటున్నారు. ఉదా..అంబలి, ఇడ్లీ, దోసె.. వంటివి. వీటిని సుమారు 5లేక 10గంటలు నిల్వ ఉంచుతారు. అంబలి వల్ల ఎంతో ఆరోగ్యం అని చెబుతున్నారు. B12 కూడా లభిస్తుందంటున్నారు. కొద్దిగంటలే నిల్వ ఉండటం వల్ల మత్తురాదు.

చలికాలంలో అప్పుడప్పుడు ఉదయం వండుకున్నవి రాత్రికి, రాత్రి వండి మిగిలితే ఉదయం తింటారుకదా. మంచో చెడో తెలియదు కానీ, ఈ రోజుల్లో ఫ్రిజ్లో నిల్వ ఉంచి కూడా తింటున్నారు.

 పచ్చళ్ళు కొన్ని నెలలు నిల్వ ఉంటాయి కానీ, వాటి వల్ల మత్తు రాదు. కొన్ని రకాల పదార్ధాలను కొన్ని వారాలు, నెలలు పులవబెట్టటం వేరే పద్ధతి. అదంతా ఆ పదార్ధాలను బట్టి, నిల్వ ఉంచే పద్ధతిని బట్టి ఉంటుంది.


Friday, July 2, 2010

.link....జలుబు, దగ్గు తగ్గటానికి ఈ పానకం..........

...........................
 
 #Health
link....The Best Eating times by Ravi Varma // తినడానికీ ఓ టైముంది ... అది తెలుసుకోండి.