మీడియా ద్వారా ఎన్నో మంచివిషయాలను తెలియజేస్తున్న గొప్పవారు ఎందరో ఉన్నారు.
అయితే, కొందరేమో ప్రజలలో మూఢనమ్మకాలు పెరిగేవిధంగా చెబుతున్నారు. మీరు అలా చేయకూడదు, ఇలానే చేయాలి..లేకపోతే మీబ్రతుకులు అధోగతే..అంటూ చెపుతారు.ఇక వినేవారికి ఏంచేస్తే ఏం తప్పో? అనే పరిస్థితి వస్తుంది. ప్రజలు ఇలా నిరాసక్తంగా తయారయితే సమాజం ఏమవుతుంది? వేరేవారు ఆక్రమించుకుంటారు..దయచేసి ఆ పరిస్థితి రాకూడదంటే అందరూ విచక్షణతో ప్రవర్తించాలి. .
దైవభక్తి, సత్ప్రవర్తన..వంటి వాటి కన్నా, మూఢనమ్మకాలు బాగా పెరిగిపోయాయి.
రోజూ ఏదో పండుగ అన్నట్లు చెబుతారు కొందరు. రోజూ ఉపవాసాలు, తలస్నానాలు, బ్రహ్మచర్యం.. అయితే ఇక గృహస్థాశ్రమం అనేది ఎందుకు? సన్యాసాశ్రమం ఒక్కటే హిందువులకు మిగులుతుంది.
సనాతనధర్మంలో నాలుగురకాల వ్యవస్థలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్తం, సన్యాసాశ్రమం ఉండేవి. దానికి తగ్గట్లు ఆచరణ ఉండేది.
**************
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ స్వధర్మాన్ని పాటించాలని అర్జునునికి తెలియజేసారు. ఇంకా ఎన్నో విషయాలను తెలియజేసారు.
విరక్తితో యుద్ధం చేయనని అన్న అర్జునునికి.. నీ స్వధర్మాన్ని నీవు పాటించాలని తెలియజేసారు. అంతేకానీ, ఈ యుద్ధాలు అవీ అన్నీ వ్యర్ధం .. అని చెప్పలేదు. స్వధర్మం యొక్క ప్రాముఖ్యతను బోధించి, యుద్ధానికి సిద్ధం చేసారు.
వైరాగ్యం అని చెప్పి యుద్ధం చేయకుంటే, రాజ్యం చెడ్దవాడైన దుర్యోధనుని చేతికి వెళ్ళిపోతుంది, అప్పుడు సమాజం అతలాకుతలమవుతుంది. సమాజం బాగుండాలంటే, ఎవరి స్వధర్మాన్ని వారు చక్కగా ఆచరించాలి.
గృహస్థాశ్రమంలో ఉంటూ రోజూ తలస్నానాలు, ఉపవాసాలు, బ్రహ్మచర్యం.. పాటించటం సరైనది కాదు. అతిగా ఉపవాసాలు , తలస్నానాలు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. రోజూ బ్రహ్మచర్యం అంటే కుటుంబంలో భార్యాభర్త మధ్య కలహాలు వచ్చే అవకాశముంది. దగ్గరకు పిలిస్తే రోజూ ఏదో ఒక పూజ అంటావు మరి పెళ్ళెందుకు చేసుకున్నావు?.. అని భర్త విసుక్కుంటే భర్తతో ఏం చెప్పాలో తెలియక, అలాగని పూజ చేసిన రోజున భర్తకు చేరువయితే దోషమేమో? అని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ భార్య పూజ కూడా సరిగ్గా చేయలేదు. ఇలాగే పరిస్థితి ఉంటే అక్రమసంబంధాలు కూడా పెరిగే అవకాశముంది.
స్త్రీపురుషులకు విచ్చలవిడి శృంగారం లేకుండా, పద్ధతిగా ఉండటం కొరకు కుటుంబవ్యవస్థ ఏర్పడింది. కుటుంబవ్యవస్థ పాడయితే సమాజమూ విఛ్చిన్నమవుతుంది.
రోజూ దైవ పూజ చేసుకోవాలి. అయితే, తలస్నానాలు, ఉపవాసాలు, బ్రహ్మచర్యం..వంటి నియమాలను కొన్ని ప్రత్యేకమైన పూజలు, పండుగలు అప్పుడు ఆచరిస్తే సరిపోతుంది.
అంతేకానీ, అతిగా ఆచారవ్యవహారాలను పెంచేసుకుని ..ఏ పని చెయ్యాలన్నా యూట్యూబ్ చూసి, వారి సలహాలతో గానీ చెయ్యలేమేమో? అనుకుంటూ సందేహాలతో బ్రతికితే హిందువులు శారీరికంగా, మానసికంగా బలహీనమైపోతారు. కుటుంబవ్యవస్థ బలహీనమవుతుంది. సమాజం కూడా అస్త వ్యస్థమయి, ఇతరుల చేతిలోకి వెళ్ళే అవకాశముంది.
మరి ఎప్పుడూ లౌకికమైన విషయాలేనా.. జీవితానికి అంతిమలక్ష్యం దైవసన్నిధిని పొందటం కదా.. అని సందేహాలు కలుగవచ్చు. ఏం చేయాలని భయపడనక్కరలేదు. అందుకు సనాతనులు చక్కటి పద్ధతులను తెలియజేసారు.
చతురాశ్రమధర్మాలను చక్కగా పాటిస్తూ బ్రహ్మచర్యంలో చక్కగా విద్యను అభ్యసించి, గృహస్థాశ్రమంలో ధర్మాలను చక్కగా పాటిస్తూ..ధర్మబద్ధమైన సుఖాలను పొంది, వానప్రస్థంలో అడవులకు వెళ్లకపోయినా ఉన్న చోటే ఉండి కూడా.. క్రమంగా కోరికలను తగ్గించుకుంటూ, ఇంట్లో ఉండి కూడా మనస్సును సన్యాసాశ్రమానికి తగ్గట్లు మార్చుకుని దైవభక్తితో నిండి దైవంలో లీనమవ్వచ్చు.
అంతేకానీ, అంతులేని కోరికలతో పాపాలు చేస్తూ, ఎన్ని ఆచారాలను పాటించినా వ్యర్ధమే.
జీవితంలో దైవమే దిక్కు, జీవితపరమార్ధం దైవమే ..అనే సత్యం తెలుసుకునే
పరిస్థితి చాలాసార్లు ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుకు
తెచ్చుకుంటూ ఉండాలి.
సినిమాలు, సీరియల్స్ వల్ల కూడా మూఢనమ్మకాలు పెరిగాయి.
అతిచేష్టలను తగ్గించుకోమని ఎవరైనా చెబితే వారిని తిడుతూ, హిందూత్వం మంటకలిపేస్తున్నారు..అంటూ గగ్గోలు పెడతారు.. హిందువులు ఎప్పుడూ మూఢత్వంలోనే ఉండాలని కోరుకునే కొందరు ఇలా గగ్గోలు పెడతారు.
సనాతనులు ఎంతో విజ్ఞానవంతులు. ఎన్నో విషయాలను గ్రంధాల ద్వారా తెలియజేసారు.
అయితే, కాలక్రమేణా కొందరు తెలిసీతెలియనివారు, కొందరు అవకాశవాదులు గ్రంధాలలో ప్రక్షిప్తాలను చేర్చటం జరిగింది.గ్రంధాలలో ఉన్న విషయాలను మార్చటం, క్రొత్తవి చేర్చటం చేస్తే ప్రక్షిప్తాలు అంటారు.
నాకు చాలాసార్లు అనిపించింది. నియమాల పేరుతో ఇన్ని ఆంక్షలు ఎందుకున్నాయి?
అతి ఆంక్షల వల్ల అనర్ధమే. నాకు తెలిసిన ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబం పండుగ రోజు 21 ప్రసాదాలు చేయాలని చేసేవారు. ఆ తరువాత ఎందుకో ఏమో? వారు మతం మారటం జరిగింది. ఈ విషయాలను ఇంతకు ముందే బ్లాగులో వ్రాసాను.
పండుగ వస్తోందంటే ఎంతో పని ఉంటుంది. పని అంటే, ఇవన్నీ టెన్షన్ తో కూడిన పనులు కదా.. పూజ సరిగ్గా చేయగలమో లేదో? పనులన్నీ ఎలా అవుతాయో?
అని భయంగా ఉంటుంది.పండుగ అంటే ప్రశాంతంగా ఉండాలి .
అంతేకానీ, కనీసం రోజూ మామూలుగా దైవాన్ని ప్రార్ధించుకునేలా కూడా పరిస్థితి ఉండదు. రకరకాల సామానులను సమకూర్చుకోవాలి.
పూజలలో ఎన్నో నియమాలు. వాటిని సరిచూసుకోవటానికే ధ్యాస ఉంటుంది. ఉపవాసాల వల్ల నీరసమూ ఉంటుంది. ప్రతిపూజకూ బంధుమిత్రులను పిలిస్తే వారికి అల్పాహారం, భోజనాలు కూడా చూడాలి. ఇవన్నీ కాకుండా, సులభంగా ప్రశాంతంగా దైవస్మరణ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. పనులు చేసుకుంటూనే వీలైనంతలో దైవస్మరణ చేసుకోవాలి.
మా చిన్నప్పుడు శ్రావణమాసం పేరంటాలు అయితే స్త్రీలు ఇరుగుపొరుగు ఇళ్లకు పేరంటానికి వెళ్ళి పూజచూసి కొద్దిసేపు కబుర్లు చెప్పుకుని కొద్దిగా శనగలు, తాంబూలం పుచ్చుకుని వచ్చేవారు. అప్పట్లో అలా సింపుల్ గా ఉండేది.
జీవితంలో ఎన్నో సందర్భాలలో అతి ఆచారవ్యవహారాల వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి.
నాకు చాలాసార్లు అనిపిస్తుంది..మతం అనేది లేకుండా నాకు నచ్చినట్లుగా స్వేచ్చగా దైవస్మరణ చేసుకుంటే ఎంత బాగుంటుంది..అని, లేకపోతే ఉన్నమతంలోనే ఉంటూ మనకు నచ్చినట్లు, మన శక్తి కొలది దైవాన్ని పూజించుకుంటే బాగుంటుంది కదా..అనిపిస్తుంది.
కొన్ని దేవాలయాలలో ఎన్నో ఉపాలయాలు ఉంటాయి. అందరు దేవతలను ప్రత్యేకంగా ప్రార్ధించుకుంటారు కొందరు. అలా ప్రార్ధించుకోవచ్చు.
హడావిడిగా ఉన్నప్పుడు, శ్రీమాత శ్రీపరమాత్మ
అనుకుంటే ..అందరు దేవతలను ప్రార్ధించుకున్నట్లే.. అని నాకు అనిపిస్తుంది.. లేదంటే శ్రీపరమాత్మ అని ఒక్క నామముగా కూడా అనుకోవచ్చు.
టీవీలు, యూట్యూబ్ వచ్చిన క్రొత్తలో అందులో చెప్పినవి చాలామంది పాటించడానికి ప్రయత్నిస్తారు. క్రొత్తలో ఉత్సాహంగానే ఉండవచ్చు. ఆచారవ్యవహారాలలో అతి ఎక్కువయితే క్రమంగా విసుగు అనిపిస్తుంది.అప్పుడు మొదటికే మోసం వస్తుంది.
ఇవన్నీ చూసి, విసుగొచ్చి చాలా కుటుంబాలలో కొందరు మేము ఇవన్నీ చేయం .. అని అంటున్నారు.
అందరూ అన్ని పూజలూ చేయాలని ప్రాచీనులు చెప్పలేదు. కొందరికి, పెద్దగా పూజలు చేయకపోయినా ఫరవాలేదు. కొద్దిగా పూజచేసుకుని, మీ స్వధర్మాన్ని మీరు చక్కగా పాటించితే చాలు చక్కటి ఫలితం వస్తుందన్నారు. ఆచారవ్యవహారాల విషయంలో కూడా అందరికీ ఒకే విధంగా చెప్పలేదు. అలాంటప్పుడు, అందరికీ అన్నట్లుగా ఇన్ని ఆచారవ్యవహారాలను, విధివిధానాలను చెప్పటం ఎందుకో అర్ధం కావటం లేదు.
కొన్ని కుటుంబాలలో ఇన్ని ఆచారవ్యవహారాలను పాటించరు. అలాంటప్పుడు యూట్యూబ్ లో ఇవన్నీ చూసి, ఇవన్నీ అందరూ చేయాలి కాబోలు అనుకుని ఎవరైనా మొదలుపెడితే కొన్ని కుటుంబాలలో కుదరకపోవచ్చు.కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా వస్తాయి.
మాంసాహారాన్ని తినే వారింట్లో ఎక్కువ నియమాలను పాటించాలంటే కష్టం. మాంసాహారం తిని పూజ చేయవచ్చా? అని అడుగుతారు కొందరు. తలస్నానం చేసి చేయవచ్చని చెబుతారు కొందరు. ఇక చిన్నపిల్లలకు కూడా అదేపనిగా చన్నీటితో తలస్నానాలు చేయించి పూజలు చేస్తుంటారు. పిల్లలకు తల తడి బాగా ఆరాలి. లేకపోతే, జలుబు చేసే అవకాశముంది.
కలియుగంలో బ్రాహ్మణులకు కూడా కొంత సులభమైన విధానాలే ఉంటాయి. కాలపరిస్థితులకు తగ్గట్లుగా కూడా ఉండాలి. అందువల్లే కాబోలు కలియుగంలో దైవస్మరణ,
దైవనామస్మరణ సులభోపాయం ..అని ప్రాచీనులు తెలియజేసారు.
లోకంలో ఎంతో విజ్ఞానం ఉంది. ఎన్నో విద్యలున్నాయి. అన్ని విద్యలను ప్రతి ఒక్కరు నేర్చుకోనవసరం లేదు. నేర్చుకోలేరు కూడా. ఎవరు నేర్చుకునేవి వారు నేర్చుకోవచ్చు.
దైవం ఎప్పుడూ అందరికీ ఒక్కరే. దేశాలు, సంస్కృతులు వేరు కాబట్టి అనేక మతాలు ఏర్పడ్దాయి. ఎవరి మతాన్ని వారు చక్కగా ఆచరించుకోవచ్చు. అయితే, కొందరు మనుషుల్లో ఇన్ సెక్యూరిటీ, ఇతరులపైన ఆధిపత్యం చేయాలనే ధోరణుల వల్ల ఎవరి మతాన్ని వారు కాపాడుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒక విషయం మాత్రం నిజం. అతి ఆచార వ్యవహారాలను తగ్గించుకోకుంటే హిందూ మతానికి నష్టం జరిగే అవకాశముంది. ఆచారవ్యవహారాలను పూర్తిగా వదిలేయమని నా అభిప్రాయం కాదు.
ఈ రోజుల్లో భక్తులమని చెప్పుకుంటున్నవారిలో ఎంతమంది పాపాలు చేయకుండా ఉంటున్నారు?
దైవభక్తి, సత్ప్రవర్తన..ఉంటే
సమాజంలో చాలావరకు సమస్యలు సమసిపోతాయి. పాపాలు చేయటం వల్ల కష్టాలు వస్తాయి.
పాపాలు చేయకపోతే దైవం కూడా కష్టాలను ఇవ్వరు. పాపాలు చేస్తూ ఉంటే ఎన్ని
పాటించినా కష్టాలు రాక తప్పదు.
రావణాసురుడు కైలాసానికే
వెళ్ళగలిగిన గొప్ప శివభక్తుడు. అయితే అతడు చేసిన పాపాల వల్ల అతని సంతానంతో
సహా నాశనమయ్యాడు. సీతాదేవిని శ్రీరామునికి అప్పగించాలని శివాంశసంభూతుడైన
ఆంజనేయుల వారు ముందుగా హెచ్చరించినా రావణాసురుడు వినలేదు. అందుకు తగ్గ
శిక్ష పడింది. ఎవరైనా సరే ఒక ప్రక్కన పాపాలు చేస్తూ ఎన్ని ఆచారాలను
పాటించినా మంచి ఫలితం ఉండదు.
ఎవరైనా తరించటానికి దైవభక్తి, సత్ప్రవర్తన..ఎంతో అవసరం. ఆచారవ్యవహారాలను అతి క్లిష్టంగా చేసుకోనవసరం లేదు. సులభంగా ఉంటే మంచిది. ఆధునిక కాల పరిస్థితులకు ఇది చాలా అవసరం.
దైవం మెచ్చేటట్లు జీవించితే అది కూడా పూజయే.
........
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
వ్రాసిన విషయాలలో ఒప్పులు దైవం దయవల్ల వ్రాసినవి. తప్పులుంటే అవి నేను చేసినవి.