koodali

Thursday, March 29, 2018

ఓం ..కొన్ని విషయాలు..


కొన్ని విషయాలలో కొన్ని సందేహాలు వస్తుంటాయి.

ఉదాహరణకు .. శివునికి శంఖు పుష్పాలు సమర్పించకూడదని అంటున్నారు.

అయితే, కాశీలో నీలం రంగు ముద్ద శంఖు పుష్పాల దండలను  ఎక్కువగా  అమ్మడాన్ని  చూసినట్లు గుర్తు.( ఒంటిరెక్క శంఖు పుష్పాలు కాదు). 

కొందరు ఏమంటున్నారంటే, విష్ణుమూర్తికి గన్నేరు పుష్పాలను సమర్పించకూడదని అంటున్నారు.

అయితే తిరుమల పుష్ప యాగం  సమయంలో గన్నేరు పుష్పాలను  కూడా సమర్పిస్తారని  గుర్తు. 

*************

చాలామంది ఇళ్ళలో అనేక దైవరూపాల పటాలు ఉంటాయి. పటాలపైన పుష్పాలను పెట్టి అలంకరిస్తుంటారు.

ఇలాంటప్పుడు,  ఏ దైవరూపానికి   ఏ పుష్పాలు సమర్పించవచ్చో ? ఏ పుష్పాలను సమర్పించకూడదో ? తెలియక సందేహాలు వస్తుంటాయి.

నాకు ఏమనిపిస్తుందంటే , పుష్పాలను దైవానికి సమర్పించే విషయంలో  సందేహాలు ఉన్నప్పుడు .. 

పుష్పాలను పటాలకు అలంకరించకుండా , తెచ్చిన  అన్ని పుష్పాలను  పటాలకు  ముందు ఉంచి , ఏ దైవరూపానికి ... ఆ  పుష్పం అని భావించి .. చేసే సమర్పణ బాగుంటుందని అనిపించింది. 

************
సందేహాలు  అలా  ఉంచితే... 

   దైవభక్తిని కలిగి ఉండటం, సత్ప్రవర్తనతో జీవించడానికి ప్రయత్నించడం వల్ల దైవకృపకు పాత్రులు అయ్యే అవకాశం ఉంది. 

**************
రి కొన్ని విషయములు....
 
వేదాలలో విగ్రహారాధన లేదని కొందరు అంటున్నారు. అయితే, చాలామందికి దైవాన్ని ఒక రూపంలో చూసుకోవాలని భావించి విగ్రహారాధన వచ్చి ఉంటుంది. విగ్రహారాధన, ఎన్నో ఆచారవ్యవహారాలు, నియమాలను ఏర్పరిచారు. వీటిలో ఎన్నో మంచివిషయాలున్నాయి. అయితే, క్రమంగా కొన్నిమూఢనమ్మకాలు కూడా ప్రవేశించాయి. ఇప్పుడు అన్నీ కలిసి బోలెడు అయ్యాయి.

ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, దైవభక్తి, ధర్మబద్ధంగా జీవించటం..వంటి విషయాల గురించి ఆలోచించటం కన్నా, ఇతరవిషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు.

ఉదా..పూజలో కొబ్బరికాయ కుళ్లవచ్చా..లేదా? కుళ్ళితే వారి బ్రతుకులు ఏమవుతాయి? కొబ్బరికాయ ఎలా పగిలితే ఏ ఫలితం ఉంటుంది? ఇంట్లో టీవీ ఎక్కడ పెట్టాలి..ఎక్కడ పెట్టకూడదు? ఇంటికి వచ్చిన మహిళలకు ఎన్ని బ్లౌసులు ఇవ్వాలి? ఏ రంగువి ఇవ్వాలి? ఏ రంగువి ఇవ్వకూడదు?..ఇలా సవాలక్ష ఉన్నాయి.  

భక్తి, జ్ఞానం గురించి ఎలా ఉన్నా, పైన వ్రాసిన సందేహాల గురించి ఆలోచనలతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. పూజకన్నా, పూజా విధానాన్ని సరిగ్గా ఆచరిస్తున్నామా లేదా? అనే సందేహాలతోనే సమయం గడిచిపోతుంది.

దైవము మెచ్చేలా ఎలా ప్రవర్తించాలి? ధర్మబద్ధంగా ఎలా జీవించాలి? దైవకృపను ఎలా పొందాలి? ఇలాంటి వాటిగురించి ఎక్కువగా ప్రజలకు చెప్పాలి..ప్రజలు కూడా వీటి గురించి ఎక్కువ ఆలోచించాలి.

జీవితంలో నియమాలు, ఆచారవ్యవహారాలు తప్పక  ఉండాలి. అయితే, అతి పెరిగితే మంచిది కాదు. ఆహారం అయినా అతిగా తింటే ఆరోగ్యానికి మంచిదికాదు. ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఆచారవ్యవహారాలను పద్ధతిగా పాటించాలి. అయితే, కొందరు ఆచారవ్యవహారాలను మూఢనమ్మకాలతో పాటిస్తారు. అలాంటివారికి చెప్పేదేమిటంటే, ఏ విషయంలోనైనా విపరీతధోరణి సరైనది కాదు.
 
ప్రతిదానినీ పెంచుకుంటూ ..ప్రతిదానికీ సవాలక్ష నియమాలు చెబుతూ వాటిని పాటించకపోతే కష్టాలొస్తాయని భయపెడుతుంటే.. భయపడి అన్నింటినీ పాటించలేక ఎందరో హిందువులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటప్పుడు తేలికగా దైవాన్ని ప్రార్ధించుకునే విధానాల గురించి ఎవరైనా చెబితే అటువైపు మనస్సు వెళ్ళటం సహజం. జనాలు ఈ గోలలో ఉంటే ఇతరులు తమపనితాము కానిచ్చుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా కూడా ప్రజల బాధ పట్టించుకోని కొందరు తమకు తోచినట్లు తాము చెపుతూనే ఉన్నారు.
 
మూఢనమ్మకాలను వదిలిపెట్టకుండా, పట్టువిడుపులు లేకుండా ఉన్నప్పుడు, మతం మారిపోతున్నారంటూ ఎంత గగ్గోలు పెట్టినా ఫలితం ఉండదు. మనమూ మన విధానాలను కొంత సరళం చేసుకోవాలి.

ప్రతిరోజూ ఏదో ఒక విశేషం అంటూ అన్నన్ని పాటించటం కన్నా, రోజూ నిత్యపూజ చేసుకుంటూ  ధర్మబద్ధంగా జీవిస్తూ దైవాన్నిస్మరించుకుంటూ చక్కగా ఉండవచ్చు.  

 చక్కగా దైవభక్తి, ధర్మబద్ధమైన జీవితం, నిత్యపూజ, కొన్ని పండుగలు,  దేవాలయాలకు వెళ్లటం..ఇలా తేలికైన మార్గాన్ని వదిలి, ఏవేవో నమ్మకాలతో తాము సతమతమవుతూ, అందరినీ అయోమయం చేయటం ఏమిటో? అన్నింటికీ దైవమే దిక్కు.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే ,  దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్దిస్తున్నాను.



No comments:

Post a Comment