ఈ మధ్య జరిగిన విషయాన్ని తెలియజేస్తాను. మాకు తెలిసినవాళ్ళు వాళ్ళింటికి రమ్మని ఎప్పటినుంచో పిలుస్తున్నారు. మేము కూడా వాళ్ళింటికి వెళ్ళాలని అనుకున్నాం.
అనుకోకుండా మా బంధువులు కూడా మొన్న వారింటికి వెళ్దామని అనటంతో బయల్దేరటం జరిగింది. అయితే, అప్పటికే సాయంత్రమవుతోంది.
తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యమవుతుందేమో అనిపించి, త్వరగా సాయంకాలపు దీపారాధన కొంచెం పూజ చేసి మరికొంచెం పూజ తిరిగి వచ్చాక చేద్దాములే అనుకుని వాళ్ళింటికి వెళ్ళాము.
అక్కడ మాటల్లో ఆ ఇంటామె ఏమన్నదంటే, వాళ్ళ దూరపుబంధువు మరణించటం వల్ల మైల కారణంగా ప్రస్తుతం పూజ చేయటం లేదని చెప్పటం జరిగింది.
ఆ మాటలు వినటంతోనే నా మనసులో అయ్యో !తిరిగివెళ్ళాక కొంచెం సేపు పూజ చేయాలనుకున్నాను కదా! ఇప్పుడు మళ్లీ తలస్నానం చేసి పూజ చేయాలి కాబోలు లేక పసుపు నీళ్లు జల్లుకుని పూజ చేస్తే సరిపోతుందా ? ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాకూడా పరిపరివిధాలా ఆలోచనలు వచ్చాయి.
ఇంటికి వచ్చాక ..తలస్నానం చేయాలా ? వద్దా ? అనుకుంటూ..కొద్దిసేపటి క్రితం వాళ్ళింటికి వెళ్ళేముందు స్నానం చేసే వెళ్ళాను కదా! ఇప్పుడు అసలే దేశంలో ఎందరో నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే, మళ్ళీమళ్ళీ స్నానాలు చేస్తూ నీళ్లు వేస్ట్ చేయటం మరింత పాపం..అని సర్ది చెప్పుకోవటానికి ప్రయత్నించాను కానీ, కుదరలేదు.
అయితే, నా పీకులాటను జయించలేకపోయాను.
ఇష్టం లేకపోయినా తలస్నానం కానిచ్చాను. మళ్ళీ కొద్దిసేపు పూజ చేసాను కానీ ...ఆలోచనలతో మనస్సు అయోమయంగా అనిపించింది.
ఇవన్నీ పాటించాలంటే కష్టంగా ఉంది. అలాగని పాటించకుండా ఉండాలన్నా భయంగా ఉంది.
వచ్చేటప్పుడు ఆమె కొన్ని కమలా పండ్లు ఇవ్వటం జరిగింది. మైల ఉన్న ఇంటినుంచి తెచ్చిన కమలాపండ్లు ఏం చేయాలి? వాటిపై కూడా పసుపు నీళ్లు జల్లి తినవచ్చా? లేక బైట పడేయాలా? బైట వేస్తే ఆ పండ్లు ఎవరైనా తీసుకుంటే మైల వారికి అంటుకుని నాకు పాపం తగులుతుందా? ఇలా ఎన్నో సందేహాలు వచ్చాయి.
నాకు ఏమనిపించిందంటే, ఆలోచనలకు అంతుండదు. మరీ ఎక్కువ ఆలోచించకుండా కుదిరినంతలో ఆచారాలను పాటించటం మంచిది. అనిపించింది.
ఉదా..మైల ఉన్న ఇంటికి వెళ్ళి వచ్చాక స్నానం చేయటం కుదరనప్పుడు కాసిని పసుపునీళ్ళు జల్లుకుంటే సరిపోతుందనిపించింది. పసుపు నీళ్ళు జల్లుకుని శుద్దిచేయటం కూడా పెద్దలు చెప్పినదే కదా!
అయినా, ఎక్కడో దూరపుబంధువుల వల్ల వచ్చిన మైలకు పెద్ద పట్టింపులు ఉండకపోవచ్చు. పరిస్థితిని బట్టి మనం ప్రవర్తించాలి.
డాక్టర్ల విషయంలో అయితే, ఇలాంటి పట్టింపులు పాటించాలంటే అస్సలు కుదరదు.
********************
ఇలాంటి ఆచారాలు ఏర్పరచటం వెనుక కొన్ని కారణాలు ఉండిఉంటాయి. సమీప బంధువులు మరణించిన వారికి మైల అనటంలో కొన్ని కారణాలు ఉంటాయి.
విచారంలో ఉన్నవారు కొద్దిరోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలనటంలో ఎన్నో అర్ధాలుంటాయి.
ఉదా..శుభకార్యం వెంటనే పెట్టుకుంటే పోయినవారు గుర్తు వచ్చి దుఃఖం కలిగితే ,శుభకార్యం జరుగుతున్న వేళ చుట్టుప్రక్కల ఇతరులకూ విచారం కలిగే అవకాశముంది.
ఇంకా, మైల ఉన్న వారింటికి పలకరింపులకు వెళ్ళి తిరిగి వచ్చిన వారు స్నానం చేయటం వల్ల అక్కడి వారు వెలిబుచ్చిన విచారం నుంచి కొంత మనసు తేలికవుతుంది.
అయితే, దూరపు బందువుల వల్ల మైల వచ్చిన వారికి అంత విచారం ఉండకపోవచ్చు కాబట్టి, పలకరింపులకు వెళ్ళి వచ్చిన వారు తప్పనిసరిగా తలస్నానాలు చేయనవసరం లేదేమో... కొన్ని పసుపునీళ్ళు జల్లుకుంటే సరిపోతుందని నాకు అనిపించింది.
ఏమైనా పరిస్థితిని బట్టి ఎవరి విచక్షణతో వారు నిర్ణయాలు తీసుకోవాలి.
అంతేకానీ, ఆచారాలు అనుకుంటూ..అతిగా ఆలోచిస్తే ..గందరగోళం లో పడి .. జీవితలక్ష్యమైన దైవభక్తికే దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది.
No comments:
Post a Comment