సాయి బాబా వారి కధలోని కొంతమంది హిందువుల పేర్లు నానా సాహెబ్ డేంగలే, బాపూ సాహెబ్ బుట్టీ, కాకా సాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ బ్రాహ్మణులు.
ఈ పేర్లలో సాహెబ్ అనే పదం హిందువులలోనూ, ముస్లింలలోనూ కూడా ఉంటుంది.
కొందరు ఏమంటున్నారంటే, షిరిడిసాయి మహమ్మదీయుడు కాబట్టి పూజించకూడదని చెబుతున్నారు.
షిరిడి సాయి ఎప్పుడూ తాను మహమ్మదీయుడా, హిందువా, లేక మరెవరు ? అనే విషయాల గురించి చెప్పలేదంటారు.
వారి ఆచరణ గురించి పుస్తకాలలో చదివితే, చాలా మతాల ఆచారాలను కలగలిపి వారు ఆచరించినట్లు తెలుస్తుంది.
ఉదా..హిందువుల వలె తులసీ పూజ, ధుని వెలిగించటం, శిరిడిలోని హిందూదేవాలయాలను మరమ్మతు చేయించటం..వంటివెన్నో చేసారు.
ఇక మహమ్మదీయుల వలె అల్లాహ్ నామమును స్మరించటం వంటివి చేసేవారు.
సబ్ కా మాలిక్ ఏక్ హై.. అనేవారంటారు.
********************
కొందరు ఏమంటున్నారంటే, సాయి మాంసాహారం తినేవారు కాబట్టి.. అలాంటి వ్యక్తిని ఎలా పూజిస్తారని ప్రశ్నిస్తున్నారు.
పూర్వకాలంలో కొందరు బ్రాహ్మణులు కూడా కొన్ని సందర్భాలలో మాంసాహారం తినేవారంటారు.
ఉదా.. వాతాపి, ఇల్వలుల గురించిన కధలో అనేక విధములుగా ఉన్నది. ఒక చోట చదివిన ప్రకారం, ఇల్వలుడు బ్రాహ్మణ వేషము ధరించి తమ ఇంట భోజనానికి రమ్మని బ్రాహ్మణుణి పిలిచెడివాడు.
వాతాపిని మేకగా చేసి వండి బ్రాహ్మణులకు భోజనం పెట్టి .. బ్రాహ్మణులు భుజించిన తరువాత వాతాపిని బయటకు పిలవగా బ్రాహ్మణుల పొట్ట చీల్చుకుని వాతాపి బయటకు రావటం..ఈ విధంగా ఆ రాక్షసులు బ్రాహ్మణులను చంపటం జరిగేది...
ఈ కధ ద్వారా ఆ కాలంలో కొందరు బ్రాహ్మణులు కొన్ని సందర్భాలలో మాంసాహారం భుజించేవారని తెలుస్తుంది.
ఈ కాలంలో కూడా బెంగాల్ ప్రాంతపు బ్రాహ్మణులు చాలామంది చేపలు తింటారట.
అయినా సాయి మాంసాహారాన్ని అందరికీ పెట్టేవారు కాదు. మాంసాహారాన్ని తినేవారికే పెట్టేవారంటారు.
************
ఈ క్రింది విషయాలను ఈ పోస్ట్ వేసిన కొంతకాలం తరువాత వ్రాసి ప్రచురించటం జరిగింది..2024 లో..
హిందువులకు చాలామందిదేవతలు ఉన్నా కూడా, కొత్తవాళ్ళను ఎందుకు పూజిస్తున్నారంటూ కొందరు మాట్లాడుతున్నారు. అయితే, క్రొత్త దేవతలను ఆరాధించటం హిందువులకు క్రొత్తకాదు.
హిందువులకు చాలామంది దేవతలు ఉన్నాకూడా, తరతరాలనుంచి ఎందరినో దేవతలుగా పూజిస్తున్నారు. ఒక్కో యుగంలో దైవం అవతారాలను ధరించినప్పుడు, ఆ అవతారాలను పూజిస్తారు. ప్రాచీనగ్రంధాలలో లేని దేవతలు ఎందరినో ఇప్పుడు దేవతా అవతారాలుగా పూజిస్తున్నారు.
ఉదా.. కొందరు గొప్పవారు మానవులుగా జీవించినప్పుడు గొప్పమహిమలు కలిగి ఉంటారు. అలాంటి కొందరి శరీరత్యాగం తరువాత, వారిని కూడా దేవతలుగా గుడికట్టించి పూజిస్తున్నారు. వారి పూజా విధానాలు ఏర్పరుస్తారు.
మహిమలు గలవారు గొప్పవారే.. దేవతలవంటివారే. వారిని గౌరవించవలసిందే. అయితే, హిందువులకు మరింత ఎక్కువమంది దేవతలు పెరుగుతారు. భవిష్యత్తులో ఇంకా ఎందరిని దేవతాస్వరూపాలుగా పూజిస్తారో..చెప్పలేము.
హిందువులకు అనేకమంది దేవతలు ఉన్నా కూడా, అవధూతలను, ఇంకా చాలామందిని పూజిస్తుంటారు. అవధూతలు వంటివారు గొప్పవారే. అలాగని అవధూతలు ఎవరైనా పరమపదించితే వారి విగ్రహాలను తయారుచేసి, దేవాలయాలను నిర్మించి దేవతలుగా పూజలు మొదలుపెడితే .. బోలెడు పూజలు, బోలెడు ఆచారవ్యవహారాలు అవుతాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
దైవం సృష్టి అంతటా ఉంటారు. అలాగని ప్రతి జీవినీ దైవంగా భావించి విగ్రహాలు చేసి, గుడులు కట్టి పూజించలేరు కదా.. దైవాన్ని ఒకమహాశక్తిగా భావించి చక్కగా ఆరాధించుకోవచ్చు.
హిందువులు ఇంకాఇంకా ..కొత్త పూజావిధానాలను పెంచుకుంటూ వెళ్తే, భవిష్యత్తులో భక్తుల మధ్య గొడవలు వచ్చి, వివిధ శాఖలుగా చీలే అవకాశమూ ఉంది. ఇప్పటికే హిందువులు బౌద్ధులు, జైనులు..ఇంకా కొన్ని శాఖలుగా అయ్యారు.
ఇప్పటికే ఒకే మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. పూజా విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆచారవ్యవహారాల విషయంలోను అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.
దైవశక్తిని చక్కగా పూజించవచ్చు. భవిష్యత్తులో అయినా మరింతగా పూజావిధానాలను పెంచుకోకుండా పూజించుకుంటే సరిపోతుంది. వేదములలో, పురాణేతిహాసాలలో, ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో.. చెప్పబడిన దేవతలను చక్కగా పూజించుకుంటే చాలా గొప్ప.
ఇంకా కూడా కొత్తగా పూజించాలంటే, వారిని వేదములలో.. పురాణేతిహాసాలలో.. ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో..చెప్పబడిన దేవతాస్వరూపాలుగా భావించి, ఒకరితోఒకరు గొడవలు లేకుండా, హిందుమతంలో మరిన్ని విభజనలు జరగకుండా పూజించుకోవాలి.
ఎవరిని ఏ విధంగా పూజించాలి ? అనే విషయాల గురించి బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. హిందుత్వానికి నష్టం జరగకుండా ఉండాలి.
సమాజంలో అనేక అభిప్రాయాలుంటాయి. కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి. కొన్నిసార్లు ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదు. ఇలాంటి పరిస్థితిలో దైవమే దారి చూపాలి.