koodali

Tuesday, October 25, 2016

కొన్ని విషయములు...




   
సాయి బాబా వారి కధలోని కొంతమంది హిందువుల పేర్లు నానా సాహెబ్ డేంగలే, బాపూ సాహెబ్ బుట్టీ, కాకా సాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ బ్రాహ్మణులు. 
 
ఈ పేర్లలో సాహెబ్ అనే పదం హిందువులలోనూ, ముస్లింలలోనూ కూడా ఉంటుంది.

కొందరు ఏమంటున్నారంటే, షిరిడిసాయి మహమ్మదీయుడు కాబట్టి పూజించకూడదని చెబుతున్నారు.

 షిరిడి సాయి ఎప్పుడూ తాను మహమ్మదీయుడా, హిందువా, లేక మరెవరు ? అనే విషయాల గురించి చెప్పలేదంటారు.

వారి ఆచరణ గురించి పుస్తకాలలో చదివితే,  చాలా మతాల ఆచారాలను కలగలిపి వారు ఆచరించినట్లు తెలుస్తుంది. 

ఉదా..హిందువుల వలె తులసీ పూజ, ధుని వెలిగించటం, శిరిడిలోని హిందూదేవాలయాలను మరమ్మతు చేయించటం..వంటివెన్నో  చేసారు. 

ఇక మహమ్మదీయుల వలె అల్లాహ్ నామమును స్మరించటం వంటివి చేసేవారు.

 సబ్ కా మాలిక్ ఏక్ హై.. అనేవారంటారు.

తన గుర్రం పోతే వెదుక్కుంటున్న ముస్లిం వ్యక్తి పేరు చాంద్ పాటీలు. అంతేకానీ, చాంద్ మియా అనే పేరు సాయిబాబాకు ఉన్నట్లు ఎక్కడా లేదు ..

********************

 కొందరు ఏమంటున్నారంటే, సాయి మాంసాహారం తినేవారు కాబట్టి.. అలాంటి వ్యక్తిని ఎలా పూజిస్తారని ప్రశ్నిస్తున్నారు.

పూర్వకాలంలో కొందరు బ్రాహ్మణులు కూడా కొన్ని సందర్భాలలో మాంసాహారం తినేవారంటారు.
 
 ఉదా.. వాతాపి, ఇల్వలుల గురించిన కధలో అనేక విధములుగా ఉన్నది. ఒక చోట చదివిన ప్రకారం, ఇల్వలుడు బ్రాహ్మణ వేషము ధరించి తమ ఇంట  భోజనానికి రమ్మని బ్రాహ్మణుణి పిలిచెడివాడు.

వాతాపిని మేకగా చేసి వండి బ్రాహ్మణులకు భోజనం పెట్టి .. బ్రాహ్మణులు భుజించిన తరువాత వాతాపిని బయటకు పిలవగా బ్రాహ్మణుల పొట్ట చీల్చుకుని వాతాపి బయటకు రావటం..ఈ విధంగా ఆ రాక్షసులు బ్రాహ్మణులను చంపటం జరిగేది...

 ఈ కధ ద్వారా ఆ కాలంలో కొందరు బ్రాహ్మణులు కొన్ని సందర్భాలలో మాంసాహారం భుజించేవారని తెలుస్తుంది.

ఈ కాలంలో కూడా  బెంగాల్ ప్రాంతపు బ్రాహ్మణులు చాలామంది చేపలు తింటారట.

 అయినా సాయి మాంసాహారాన్ని అందరికీ పెట్టేవారు కాదు. మాంసాహారాన్ని తినేవారికే పెట్టేవారంటారు.

 
 
 

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. సంపద, అధికారం కొరకు ప్రపంచంలో అనేక యుద్ధాలు జరగటం ఆశ్చర్యంగా అనిపించదు. అయితే, మతాల పేరుతో యుద్ధాలు, గొడవలు జరగటం ఏమిటో? అర్ధం కావటం లేదు. ఒకే మతంలో కూడా గొడవలు జరుగుతుంటాయి. దైవం అందరికీ ఒక్కరే. ఒక్క దైవశక్తే ప్రపంచంలో అందరినీ సృష్టిస్తారు. అంతేకానీ, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దైవం సృష్టించరు. అయితే, ప్రపంచం ఎంతో విశాలంగా ఉండి, వివిధ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అనేక మతాలు పద్ధతులు ఏర్పడ్డాయి.

    అన్ని మతాల వారు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ చక్కగా మంచిగా ఉండాలి. అయితే, కొందరి వల్ల ఎవరి మతాన్ని వారు కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో సరిగ్గా అర్ధం కాదు. దైవమే దారి చూపాలి.

    పరమతసహనం కొందరికి ఉంటే సరిపోదు..అందరికీ ఉండాలి. మతాల పేరుతో జరుగుతున్న దారుణాలను గమనిస్తే అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో? ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో? దైవమే దిక్కు.

    ReplyDelete
  3. దైవం అందరికీ అవసరమే. దైవం అంటే భయంతో కాకుండా , జీవితంలో కష్టసుఖాలను దైవంతో చనువుగా, ప్రశాంతంగా, అరమరికలు లేకుండా పంచుకోవాలని ఉంటుంది. అయితే దైవం.. పూజలు అంటే..చాలా జాగ్రత్తగా ఉండాలి..అనుకునేవిధంగా పరిస్థితి ఉంది. ప్రతిదానికి విపరీతమైన నియమాలను చెబితే, అనేక సందేహాలు కలుగుతాయి. నాకు కూడా కొన్ని ఆచారవ్యవహారాలతో కష్టంగా ఉంటుంది. ఉదా..పండుగ అంటే..దైవాన్ని స్మరించుకోవటం కన్నా, పనులు ఎలా జరుగుతాయో? అని టెన్షన్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అతిని చాలావరకూ తగ్గించుకుని, నాకు తోచినంతలో ప్రశాంతంగా దైవాన్ని ఆరాధించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను.

    ReplyDelete
  4. హిందువులకు చాలామందిదేవతలు ఉన్నా కూడా, సాయిబాబాను ఎందుకు పూజిస్తున్నారంటూ కొందరు మాట్లాడుతున్నారు. అయితే, క్రొత్త దేవతలను ఆరాధించటం హిందువులకు క్రొత్తకాదు.

    హిందువులకు చాలామంది దేవతలు ఉన్నాకూడా, తరతరాలనుంచి ఎందరినో క్రొత్తగా దేవతలుగా జేర్చి ఆరాధిస్తుంటారు. ప్రాచీనగ్రంధాలలో లేని దేవతలు ఎందరినో ఇప్పుడు దేవతా అవతారాలుగా పూజిస్తున్నారు. ఉదా.. కొందరు గొప్పవారు మానవులుగా జీవించినప్పుడు గొప్పమహిమలు కలిగి ఉంటారు. అలాంటి కొందరి శరీరత్యాగం తరువాత, వారిని కూడా దేవతలుగా గుడికట్టించి ఆరాధిస్తుంటారు. వారి పూజా విధానాలు ఏర్పరుస్తారు.

    మహిమలు గలవారు గొప్పవారే.. దేవతలవంటివారే. వారిని గౌరవించవలసిందే. అయితే, ఇలా దేవతాస్వరూపాలను పెంచుకుంటూ వెళ్తే హిందువులకు మరింత ఎక్కువమంది దేవతలు పెరుగుతారు. భవిష్యత్తులో ఇంకా ఎందరిని దేవతాస్వరూపాలుగా ఆరాధిస్తారో చెప్పలేము.

    హిందువులకు అనేకమంది దేవతలు ఉన్నా కూడా, అవధూతలను, ఇంకా చాలామందిని పూజిస్తుంటారు. అవధూతలు వంటివారు గొప్పవారే. అలాగని అవధూతలు ఎవరైనా పరమపదించితే వారి విగ్రహాలను తయారుచేసి దేవతలుగా పూజలు మొదలుపెడితే బోలెడు దేవతలు, బోలెడు పూజలు, బోలెడు ఆచారవ్యవహారాలు అవుతాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.

    దైవం సృష్టి అంతటా ఉంటారు. అలాగని ప్రతి జీవినీ దైవంగా భావించి విగ్రహాలు చేసి, గుడులు కట్టి పూజించలేరు కదా.. దైవాన్ని ఒకమహాశక్తిగా భావించి చక్కగా ఆరాధించుకోవచ్చు.

    దైవశక్తిని ఎలాగైనా ఆరాధించుకోవచ్చు. భవిష్యత్తులో అయినా మరింతగా దేవతలను పెంచుకోకుండా ఉన్న దేవతలను ఆరాధించుకుంటే సరిపోతుంది.

    ఇప్పటికే ఒకే మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. పూజా విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆచారవ్యవహారాల విషయంలోను అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.

    వేదాలలో అసలు విగ్రహారాధన లేదంటారు కొందరు. ఎవరు చెప్పేది నమ్మాలో తెలియటం లేదు. అయితే, విగ్రహారాధన వల్ల చాలామంది భక్తులకు దైవాన్ని చూసినట్లు అనుభూతి కలుగుతుంది. అందువల్ల మంచిదే.

    ప్రపంచంలో కొందరు మనుషుల ఆలోచనలు గమనిస్తే ప్రపంచం ఎటుపోతుందో అర్ధంకావటంలేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. అందువల్ల, ఎవరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. దైవమే దిక్కు.
    ......
    కొంతకాలం క్రిందట సాయిబాబాను గురించి గొప్పగా చెప్పి సమాజంలో వ్యాపింపచేసినది హిందువులే. సామాన్యజనం ఆకర్షించబడి సాయిపూజలు ఎక్కువయ్యేసరికి, ఇప్పుడేమో సాయికి పూజలు చేయవద్దని చెప్తున్నవారు కూడా హిందువులే.

    సాయిని పూజించినవారు చాలామంది హిందువులే. హిందువులకు బోలెడుమంది దేవతలుండగా ..కొత్త వారిని ఎందుకు పూజిస్తారో? అందరూ ఆలోచించవలసి ఉంది.

    నాకు ఏమనిపిస్తుందంటే, ప్రాచీనకాలం నుంచి ఎందరో దేవతలున్నారు..నిజమే. అయితే, హిందువులలో ఉన్న కొన్ని ఆచారవ్యవహారాలను చాలామంది హిందువులు పాటించలేకపోతున్నారు.

    షిర్డిసాయిబాబావారు చెప్పిన విధానాలు తేలికగా ఉంటాయి. అందువల్ల అనేకమంది మతం మారకుండానే సాయినీ ఆరాధించుకుంటున్నారు.

    సాయిబాబా హిందుదేవతలతో పాటు ఇతరమతాల దేవతలను కూడా స్మరించేవారు కాబట్టి, కొందరు హిందువులకు సమస్యగా అనిపించవచ్చు.. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయంతో కొందరు హిందువులు .. షిర్డిసాయిని పూజించవద్దని అంటుండవచ్చు.

    తాము ఆరాధించే దేవతలతో పాటు.. బాబానూ నమ్మి ఆరాధించిన వారి అభిప్రాయాలు, వారికి కలిగిన భక్తి అనుభవాలు వారికిఉంటుండవచ్చు.

    ఎవరి అభిప్రాయాలు వారివి. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో సరిగ్గా అర్ధం కాదు. దైవమే దారి చూపాలి.

    ReplyDelete