koodali

Monday, June 29, 2015

తెలుగువాళ్ళు....

 
కొందరు ఏమంటారంటే, తెలుగువాళ్లు కలుపుగోలుగా ఉండరు అంటారు..  అయితే, అది నిజం కాదు.

తెలుగువాళ్ళు ఇతరులతో సర్దుకుపోతారు కాబట్టే ఇతరరాష్ట్రాల లోనూ, ఇతరదేశాలలోనూ చక్కగా ఉండగలుగుతున్నారు.

అయితే, సమస్య ఏమిటంటే వాళ్లల్లో వాళ్లకు ఐక్యత అంతగా ఉండదు.

తెలుగురాష్ట్రంలో నివసించటానికి వచ్చిన ఇతర రాష్ట్రాల వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు అయినా తెలుగు నేర్చుకునే అవసరం అంతగా రాకపోవచ్చు.

 ఎందుకంటే మనమే వాళ్ళ భాషలో వాళ్ళతో  కలుపుగోలుగా మాట్లాడతాము. అదే  తోటి తెలుగువాళ్ళతోయితే  మనము సరిగ్గా మాట్లాడము.
 ............

ఇంకో సమస్య ఏమిటంటే, తెలుగువాళ్లకు ఆడంబరత్వం ఎక్కువ. అంటే తమకు ఉన్న సంపదను అందరికీ తెలిసేలా ఆడంబరంగా ప్రదర్శించటం.ఇందువల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.

మేము  వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు గమనించిన విషయం ఏమిటంటే, వాళ్ళలో  ధనవంతులు కూడా ఎక్కువమంది ఆడంబరంగా ఉండరు. 

షాపింగ్కు వచ్చిన స్త్రీలలో తెలుగువాళ్ళను తేలికగా గుర్తుపట్టవచ్చు అన్నది నా అభిప్రాయం.

షాపింగ్ కూడా పెద్ద  ఫంక్షన్ కు  వచ్చినట్లు ఆడంబరంగా వెళ్లే కొందరు స్త్రీలను చూసి వీళ్లు తెలుగువాళ్లు కావచ్చు... అనుకుంటే చాలాసార్లు నా అంచనా తప్పలేదు.

ఒకరిని చూసి ఒకరు ఆడంబరంగా జీవించటం నేర్చుకుంటున్నారు. 

తెలుగువాళ్ళు ఇతరుల నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడంబరాన్ని  తగ్గించుకోవాలి. ఐకమత్యాన్ని పెంచుకోవాలి.
 ...................

 తెలుగు వాళ్ళలో  చాలామంది జీవనవిధానం ఆడంబరంగా తెలుస్తూనే ఉంటుంది.

మాకు తెలిసిన వాళ్లు విదేశాలలో చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొందరు  ఇండియా నుంచి వడ్డాణాలు వగైరా ఆభరణాలు చేయించుకుని వెళ్తుంటారు. విదేశాల్లో జరిగే వేడుకలలో ఈ ఆభరణాలు ధరిస్తారట.

 ఇవన్నీ గమనించితే నాకు ఏమనిపించిందంటే,  విదేశాల్లో కూడా వీళ్ళకు సమస్యలు మొదలయ్యే రోజు ఎంతో దూరంలో లేకపోవచ్చు..అనిపించింది.

బంగారం , ఆస్తిపాస్తులు ఏర్పరుచుకోవటం..భారతీయుల్లో ఎక్కువ.తెలుగువాళ్లలో మరీ ఎక్కువ. విదేశాల్లో కొందరు భారతీయులపై దాడులు జరగటానికి ఆస్తులు దాచుకోవటం కూడా ఒక కారణమంటున్నారు.
...............

ఆస్తిపాస్తుల విషయం చూస్తే, తెలుగు ప్రాంతంలో  ఎందరో ఇతరరాష్ట్రాల వాళ్లు ఉన్నారు. వాళ్లూ ఇక్కడ ఎంతో ఆస్తి సంపాదించుకుంటున్నారు. 

అయితే, తాము ఎంతో ఆస్తిపరులైనప్పటికీ సాధారణమైన ఇళ్లలోనే నివసిస్తారు.

వీళ్ళు  తమ సేఫ్టీ కోసమో లేక మరెందుకో తెలియదు కానీ  ఎక్కువ ఆడంబరంగా జీవించరు. ఎంతో సంపద ఉన్నా సాధారణంగా జీవిస్తారు.

 మరి  సంపాదించిన  డబ్బంతా ఏం చేస్తారు ? అనే సందేహం వస్తుంది. ఇక్కడ తాము సంపాదించుకున్న సంపదను తమ మాతృరాష్ట్రాలలో దాచుకుంటారేమో ? అనిపిస్తుంది.
..................

ప్రాచీన భారతదేశ సంపద విదేశీయులను ఆకర్షించింది. వ్యాపారం అంటూ భారతదేశానికి వచ్చిన విదేశీయులు ఇక్కడ ఎంతో సంపదను ఆర్జించారు. 

అయితే వాళ్లు పొందిన  సంపదను భారతదేశంలో ఉంచకుండా తమ దేశాలకు తరలించుకుపోయారు.
..............

అయితే ఇప్పుడు విదేశాలకు వలస వెళ్లిన భారతీయులలో ఎక్కువమంది అక్కడ తాము సంపాదించిన సొమ్ముతో అక్కడే ఆస్తిపాస్తులు కొనుక్కుంటూ స్థిరపడుతున్నారు. విదేశాలే తమ మాతృదేశంగా భావించి అక్కడ స్థిరపడిపోవటానికి ఇష్టపడుతున్నారు.

 అయితే, మనం ఎంత కలుపుకుపోదామన్నా అవతలి వాళ్ళకూ  మనతో కలసిఉండాలనే   ఉద్దేశమూ, ఆ ఉబలాటమూ  ఉండాలి కదా! వాళ్ళ మనసులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు చెప్పగలరు ?
........................

ఇతర ప్రాంతంలో ఎక్కువ పెట్టుబడి పెడితే, భవిష్యత్తులో సమస్యలు వస్తే ఆస్తిపాస్తులను వదిలి కట్టుబట్టలతో మాతృదేశానికి తిరిగిరావలసి ఉంటుంది. 

అలాంటి పరిస్థితి వస్తే ఎలా ? అని ఆలోచించి అక్కడ కష్టపడి కూడబెట్టుకున్న సంపదలో కొంత భాగాన్ని అక్కడ పెట్టుబడి పెట్టుకుని, కొంత భాగాన్ని మాతృప్రాంతంలో పెట్టుబడులు పెట్టుకుంటారు  కొందరు.

 అయితే, స్వదేశంలో ఆస్తిని సురక్షితంగా ఎవరు చూస్తారు ? అనే ప్రశ్న ఎదురైతే విదేశాల్లోనూ ఆస్తి ఎంతవరకు సురక్షితం ? అనే ప్రశ్నా ఉంటుంది.
..............

కోరికలను అదుపులో పెట్టుకుని, అవసరమైనవరకే  సంపదను  కూడబెట్టుకోవటం మంచిది. 

సంపద ఎక్కువయ్యే కొద్దీ మాతృదేశంలో అయినా, విదేశంలో అయినా శత్రువులు  పెరుగుతారు.

 అతిగా ఆస్తులను కూడబెట్టుకోవటం అనేది అనేక సమస్యలకు కారణం. పరాయి దేశాలకు వెళ్లి ఆస్తులను కూడబెట్టుకోవటం మరిన్ని సమస్యలను తెస్తుంది.

ఆస్తి , అధికారం ..అనేవి సొంత అన్నదమ్ముల మధ్యే చిచ్చు పెడతాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మాతృదేశంలో నివసిస్తూ తృప్తిగా జీవించటం అన్నింటికన్నా మంచిది.అలా  కుదరనప్పుడు కనీసం మాతృదేశానికి  రాకపోకలు కొనసాగిస్తూ సంబంధభాంధవ్యాలను కొనసాగించాలి. 



No comments:

Post a Comment