లౌకిక విషయాల ద్వారా మనకు సంతోషం లభించినా, ఆ సంతోషానికి ఒక హద్దు ఉంటుంది. కొన్నిసార్లు ఆ సంతోషానికి వెనుక దుఃఖమూ ఉండే అవకాశం ఉంది.
లౌకిక విషయాలంటే.. రుచికరమైన ఆహారం పట్ల మక్కువ, బంధుమిత్రుల పట్ల ఆప్యాయత, అధికారం, ధన సంపాదన పట్ల మక్కువ, పేరుప్రఖ్యాతులు పొందాలనే ఆరాటం..ఇలాంటివి లౌకికపరమైన కోరికల జాబితాలో ఉంటాయి. ఇవన్నీ ఒక హద్దువరకే మానవులకు సంతోషాన్ని కలిగించగలవు.
ఉదా..ఆహారం విషయంలో గమనిస్తే, మనకు ఎంత ఇష్టమైన పదార్ధాలను అయినా కొంతవరకే తినగలం. ఎక్కువగా తింటే శరీరం అరాయించుకోలేదు.అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
బంధుమిత్రులతో సంబంధభాంధవ్యాల విషయంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎన్నో కారణాల వల్ల అపార్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు.
అధికారం, సంపద..అనేవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు.
పేరుప్రఖ్యాతులు..అనేవి కూడా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు.
జీవితంలో చిన్న పొరపాటు చేసినా అప్పటివరకూ ఉన్న మంచిపేరు ఊడ్చిపెట్టుకుపోయే అవకాశం ఉంది. కొందరు అసూయాపరులు మాయచేసి, నిజాయితీపరులనూ ఉచ్చులో బిగించి, చేయని తప్పుకు బాధ్యులను చేసి ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టే సంఘటనలూ ఉంటాయి.
..................
అశాశ్వతమైన లౌకికవిషయాల పట్ల ఎంతగా పరుగులు తీసినా ఆయాసమే తప్ప, శాశ్వతమైన ఆనందం లభించటం జరగదు.
శాశ్వతమైన దైవాన్ని శరణువేడితే లభించేది శాశ్వతమైన ఆనందం.
లౌకిక విషయాల విషయంలో సంతోషానికి ఒక హద్దు ఉంటుంది. కొన్నిసార్లు ఆ సంతోషానికి వెనుక దుఃఖమూ ఉండే అవకాశం ఉంది.అయితే, దైవస్మరణ వల్ల లభించే ఆనందానికి ఎటువంటి హద్దూ, ఎటువంటి దుఃఖమూ ఉండదు.
దైవాన్ని స్మరించిన కొద్దీ లాభమే తప్ప నష్టం ఇసుమంతైనా ఉండదు. దైవాన్ని స్మరించిన కొద్దీ ఆనందం పెరుగుతూ ఉంటుంది. తద్వారా హద్దులు లేని శాశ్వతమైన ఆనందం లభిస్తుంది.
మనిషికి ఇహలోకంలో ఉండే బంధుమిత్రులు శాశ్వతం కాదు.దైవం తోటి బంధమే శాశ్వతమైన బంధం. జన్మజన్మల నుంచి జీవుని వెన్నంటి ఉండే ఆత్మ బంధువు దైవం.
అశాశ్వతమైన విషయాల వల్ల లభించేది పరిమితులతో కూడిన ఆనందం. శాశ్వతమైన దైవాన్ని శరణువేడితే లభించేది పరిమితులు లేని శాశ్వతమైన పరమానందము( మోక్షము).
....
అయితే, ఇవన్నీ చెప్పటానికి బాగుంటాయి. ఆచరించటం మాత్రం చాలా కష్టం. అశాశ్వతమైన విషయాల పట్ల మనస్సు ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటుంది.
స్వధర్మాన్ని నిష్కామంగా నిర్వర్తిస్తూ భగవంతుని శరణు వేడి జీవితాన్ని గడపగలిగితే శాశ్వతమైన ఆనందం లభిస్తుంది.
అయితే, నిష్కామకర్మయోగాన్ని అవలంబిస్తూ జీవించటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకు దైవాన్ని శరణువేడి దైవకృపను పొందటం తప్ప వేరే మార్గం లేదు.
No comments:
Post a Comment