దీపావళికి ముందు రోజున నేను బయటకు వెళ్ళినప్పుడు, రోడ్డుపైన చాలామంది ఒకరితోఒకరు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు,.
వారి మధ్యన ఒక బిచ్చమెత్తుకునే వ్యక్తి తిరుగుతూ , అందరినీ భిక్షం అడుగుతున్నాడు.
మాకు తెలిసినవారు కూడా నాకు శుభాకాంక్షలు చెబుతుంటే , ఆ వ్యక్తి నా వద్దకు వచ్చి , ఆకలిగా ఉంది ఏమైనా డబ్బు ఇవ్వమని అడగటం జరిగింది.
నాకు తోచింది కొద్దిగా ఇచ్చాను కానీ, మనసంతా బాధగా, చిరాగ్గా అయిపోయింది.
ఒకోసారి మనం బయటకు వెళ్ళినప్పుడు కొందరు చిన్నపిల్లలు మన వెనకాలే పడి డబ్బులు అడుగుతుంటారు.
పెద్దవాళ్ళు వెనకాల ఉండి ఈ పిల్లలను పంపిస్తుంటారు. ఇలాంటివి చూసినప్పుడు పిల్లలమీద జాలి , పెద్దవాళ్ళమీద కోపం వస్తాయి.
వాళ్ళకు డబ్బు ఇచ్చి ప్రోత్సహించకూడదు అనిపిస్తుంది.
కానీ, ఈ రోజుల్లో బ్రతకటానికి వాళ్ళకి వేరే దారి లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ? అనిపిస్తుంది.
కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఇంకాఇంకా సంపాదన కోసం ప్రజలను తినేస్తుంటే ఇలాంటి పేదవాళ్ళను ఏం అనగలం ?
వాళ్లకు బ్రతకటానికి మంచి ఉపాధి చూపాలి. అప్పుడు వాళ్ళు మాత్రం అలా భిక్షమెత్తి ఎందుకు బ్రతుకుతారు. ?
ఒక వైపు శుభాకాంక్షలు...మరొక వైపు ఆకలికేకలు ఏమిటో ఇదంతా ? అనిపించింది .
కొందరికి కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లు ఉంటాయి. కొందరికి కూటికి కూడా కరువే.
ఇలా సంపద కొందరి దగ్గర అతి ఎక్కువగా ,కొందరి దగ్గర అతి తక్కువగా ఉండటం అన్యాయం కదా !
భూమి మీద అభివృద్ధి జరిగి(పోయింది ) .ఇక అంగారకుడి పైకి వెళ్ళిపోతున్నాము అంటున్నారు కానీ, అంగట్లో సరుకుల రేట్లే అందరానంతగా పెరిగిపోతున్నాయి.
ఎంతోమంది మేధావులు ఉన్నారు.
అయినా దేశంలో ఆకలికేకలు, విపరీతమైన మురికి, చెత్తకుప్పలు , గబ్బుకొట్టే గవర్నమెంట్ ఆస్పత్రులు, తుపుక్కున ఊసే వీధులు ....... సిగ్గుగా అనిపిస్తున్నది కదూ !
టివి సీరియల్స్లో చూపించే ఇళ్ళను చూస్తే , ఇండియా ఇంత గొప్పగా ఉంటుంది కాబోలు అని భ్రమపడి విదేశీయులు ఎవరైనా ఇక్కడికి వస్తే .....అంతే సంగతులు.
దేశాన్ని కొద్దిగానైనా బాగుచేసుకోలేనంత చేతకానివాళ్ళంగా మనం ఎందుకు తయారయ్యామో ?
ఆ మధ్యన హజారే సాబ్ అవినీతి గురించి దీక్ష చేసినప్పుడు జనంలో కొద్దిగా కదలిక వచ్చింది.
క్రికెట్ ఆటలు, చీర్ లీడర్ల చిందులు, అర్ధనగ్నసినిమాల నుంచి కొద్దిగాపక్కకు వచ్చి హజారే సాబ్కు మద్దతు ఇచ్చినప్పుడు,
దేశానికి మంచి రోజులు వచ్చేస్తున్నాయేమో ? ఇక నేను నీతులు చెప్పటానికి కుదరదేమో ? అని తెగ కంగారుపడ్డాను.
ఇప్పుడు పాపం పెద్దాయన కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు.
ఆయన ( హజారే ) ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ దీక్ష చేసేవరకూ జనం ఇలా రెస్ట్ తీసుకుంటూ కాలక్షేపం చేస్తారు కాబోలు.
అయినా, ఎవరికీ వారు నిజాయితీగా,సక్రమంగా జీవిస్తే అవినీతి...వంటివి ఎందుకు ఉంటాయి ?.
ఈ మధ్యన ఒక వార్త చూశాను. అవినీతి సొమ్ము విదేశాల నుంచి తెచ్చేసి జనాలపేరిట ఉచితంగా వేస్తున్నారని ప్రచారం జరిగిందట,
ఇక చూడండి. జనం వేలం వెర్రిగా పోస్ట్ ఆఫీసులముందు క్యూలు కట్టి మరీ నించున్నారట,( ఇది మన రాష్ట్రంలోనే జరిగింది. )
ఇది చూశాక నాకు అనిపించింది.
ఈ ప్రజలను ఎవరు మాత్రం బాగుచెయ్యగలరు ? వాళ్ళ ఖర్మకు వాళ్ళను వదిలెయ్యటం తప్ప ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు ? అని.
హజారేగారి దీక్షకు ప్రజలు ఇచ్చిన మద్దతు చూస్తే చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది.
ఇంతమంది అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు .
మరి లంచాలు ఇస్తున్నదెవరు ? పుచ్చుకుంటున్నదెవరు ? అని అయోమయంగా అనిపించింది.
దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వేలాదిమంది జనాన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ,
ఈ భక్తులు అందరూ నిజజీవితంలో సత్ప్రవర్తనతో ఉంటే లోకంలో ఇన్ని అన్యాయాలు జరగవు కదా ! అని.
నైతికవిలువలు పాటించకుండా చేసే పూజలు ఎటువంటివంటే , పూర్వం రాక్షసులు చేసిన తపస్సులు, పూజల వంటివి.
అటువంటి పూజలను దైవం మెచ్చుకోవటం జరగదు..
మళ్ళీ , ఇలా కూడా అనిపిస్తుంది ...ఇలా దైవభక్తి, పాపపుణ్యాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఇంకా ఉండటం వల్లే లోకంలో ధర్మం ఇంకా ఉంది అని .
మీ కడుపు సల్లగుండ ..... అద్భుతం గ చెప్పారు..... :) :) :)
ReplyDeleteరాజేష్
8008585080
మీకు ఈ టపా నచ్చినందుకు కృతజ్ఞతలు.
ReplyDeleteమీతో సహా అందరూ బాగుండాలని నేనూ కోరుకుంటున్నాను. అండీ అని ఎందుకు అనలేదంటే మీరు స్టూడెంట్ అని చదివాను , మీరు నాకన్నా వయసులో చిన్న కాబట్టి . భావిభారత పౌరులైన మీలాంటివారైనా ఈ దేశాన్ని బాగుచెయ్యాలని ఆశిస్తూ....
WELL SAID.
ReplyDeleteతమ్ముడూ , మీకు ఈ టపా నచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు అందరూ కూడా మరింతగా ఈ దేశాభివృద్ధికి కృషిచెయ్యాలని ఆశిస్తూ.....
ReplyDelete