కొందరు శాకాహారం కన్నా మాంసాహారమే బలం అనుకుంటారు.
సింహం బలమైనదే అయినా , ఏనుగు , అడవి దున్న వంటివి కూడా బలమైనవే కదా !
అడవిదున్న ( బైసన్ ) తన నుదుటితో లారీ అంత బలమైన వాహనాన్ని కూడా నెట్టివేయగలదని అంటారు.
ఇలా భగవంతుని సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
ఇంకా, సింహం కన్నా ఏనుగే ఎక్కువకాలం జీవిస్తుందట. (ఇతరత్రా ఆపదలు లేకపోతే ) .
ఏనుగు.. కొబ్బరి, వెలగ పండ్లు వంటి బలమైన ఆహారం తీసుకుంటుంది.
కొబ్బరి, తాటి, వెలగ .మామిడి, పనస వంటి వృక్షములు ఎక్కువకాలం జీవిస్తాయి.
అలాంటి చెట్ల నుంచీ వచ్చే పండ్లు ఆహారంగా తీసుకుంటే మానవులకు కూడా బాగా బలం వస్తుందట.
అందుకేనేమో పూర్వులు దైవ ప్రసాదంగా కొబ్బరిని ఎక్కువగా ఉపయోగించటం మనకు నేర్పించారు అనిపిస్తుంది.
ఈ రోజుల్లో కొబ్బరి తక్కువగా వాడుతున్నారు.
పెద్దవారికేమో డయాబెటిస్ ఉండటం, పిల్లలకేమో లావు అవుతారని భయం ఇలా ఎన్నో కారణాలు....
కొంతకాలం క్రిందట పిల్లలు పచ్చి కొబ్బరి ముక్కలు ఇష్టంగా తినేవారు.
ఇప్పటి పిల్లలకు పిజ్జాలు, బర్గర్లు, వెనిగర్, అజనిమోటో , సాస్, శాకరిన్ వంటి పదార్ధాలు వేసి చేసే ఆహారం అంటేనే ఇష్టం.
ఇవన్నీ, ఇంకా నిలవ ఉన్న పదార్ధాలు, తామసాహారం కోవలోకే వస్తాయి.
కొబ్బరి పచ్చిగా తినటం ఇష్టం లేకపోతే కొబ్బరిఉండలు చేయవచ్చు, ఇంకా పచ్చడి, కూరల్లోనూ వాడవచ్చు.
ఇంకా చిలగడదుంపలు, టమేటోలు, దోసకాయలు, వంటివి పచ్చిగానే తినేవారు.
ఇప్పుడు కూడా తింటున్నారు కానీ ఇదంతా మందులు కలిసిన సారంలేని ఆహారం.
దోసకాయ బాగా పండిన తరువాత అందులో పంచదార కలిపి తింటే మలబద్ధకం ఉండదని పెద్దవాళ్ళు చెబుతారు. వేసవిలో ఇలా ఎక్కువగా తినేవారు.
పండిన జామపండ్లు, అరటిపండ్లు కూడా మలబద్ధకం సమస్యకు ఉపయోగపడతాయి. .
కూరగాయలు తొక్క తీయకుండా వండితేనే బలం అంటారు కదా ! మేము కొన్నింటికి తొక్క తీసేసి వండుతున్నాము.
ఎందుకంటే, ఈ రోజుల్లో విచ్చలవిడిగా రసాయనిక మందులు చల్లుతున్నారు కదా ! అవి కూరగాయల తొక్కలపైన నిలవుంటాయన్న భయంతో.
అందుకే తొక్క తీసేస్తున్నాము.
బలం వచ్చే సంగతి అటుంచి , ఆ మందుల ఎఫెక్ట్ వల్ల జబ్బులు రాకుండా ఉంటే అంతే చాలు.
తొక్కపైనుంచి లోపలికి కూడా మందులు వెళ్తాయని నాకు అనుమానమే కానీ, ఏం చేయగలం ? ( నాకు అనుమానాలు బాగా ఎక్కువ మరి . )
ఏంటో కలికాలపు వింతలు..
పూర్వపువారు చకచకా 10 కిలోమీటర్ల దూరం అలా నడుస్తూ వెళ్ళిపోయేవారు.
అందరూ బాగా శారీరక శ్రమ చేసేవారు. అందుకే ఎలాంటి ఆహారమైనా శుభ్రంగా అరిగిపోయేది.
ఇప్పటి పిల్లలు పట్టుమని పది గజాలు నడవమంటేనే పడిపోతున్నారు నీరసంతో.
పూర్వం 100 ఏళ్ళ పైనే జీవించేవారని గ్రంధాలలో చెప్పబడింది.
ఇప్పుడు పిన్నవయసులోనే జుట్టు తెల్లబడటం, కళ్ళజోడు ,కట్టుడుపళ్ళవంటి పెద్దవయసు లక్షణాలు వస్తున్నాయి..
ఇదే కాబోలు అభివృద్ధి అంటే..
ఇది అలా ఉంచితే,
( గజేంద్ర మోక్షం కధలో... నీటిలోని ఒక మొసలి గజేంద్రుని పట్టుకుంటుంది. అప్పుడు గజేంద్రుని మొర విని శ్రీ మహావిష్ణువు వచ్చి రక్షిస్తారు. ఇది గుర్తు వచ్చి ఏనుగు కన్నా మొసలికే బలం ఎక్కువ అనుకోరాదు. మొసలిది స్థాన బలం. అంటే నీళ్ళలో ఉన్నంతవరకూ మొసలికి బలం. అదే నేల పైన ఇలాంటి సంఘటన జరిగితే మొసలి కన్నా ఏనుగుకే బలం... . ).
దయచేసి ఈ విడియో పూర్తయే వరకూ చూడండి.
When Lions, Buffaloes and Crocodiles Attack—At the Same Time
భగవంతుని దయ ఉంటే ఇలాంటి చిత్రాలు జరుగుతాయి. అపాయాలు వచ్చినప్పుడు దైవం దయ ఉండాలి . మనం కూడాఅపాయాన్ని తప్పించుకోవటానికి శాయశక్తులా కృషి చేయాలి. ఫలితాన్ని ఫలితం మాత్రం దైవానికే వదిలేయాలి.. ఈవీడియో తీసినవారికి కృతజ్ఞతలు. ...
No comments:
Post a Comment