ఇప్పుడు సమాజంలో సవాలక్ష సమస్యలు ఉన్నాయి. పేదరికం, అవినీతి, ఆర్ధిక అసమానతలు, ఇంకా ఎన్నో సమస్యలున్నాయి.
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఈ సమస్యలను పరిష్కరించటం పెద్ద కష్టమేమీ కాదు.
నాయకులు, అధికారులు ఈ సమస్యలు ఇలా ఉండిపోవటానికి రకరకాల కారణాలు చెబుతారు.
కానీ, కొందరు వ్యక్తులు తమకు ఏ విధమైన అధికారం , గొప్ప ఆర్ధికవనరులు లేకపోయినా , తమకు తోచినంతలో ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
అలాంటి విశిష్టవ్యక్తుల గురించి. వార్తాపత్రికల్లో చదువుతుంటాము.
బాబా ఆమ్టే .కుటుంబం .... ప్రజలకు చేస్తున్న సేవ గురించి చాలా మందికి తెలుసు.
ఇంకొక ఊరిలో భార్యాభర్తలైన ఇద్దరు వ్యక్తులు అడవిలోని గిరిజనుల కష్టాలకు చలించి నగరంలోని జీవనాన్ని వదిలి , గిరిజనుల ఊరిలోనే వైద్యశాల కట్టించి వారికి వైద్యాన్ని అందిస్తున్నారు.
ఇంకొక మధ్య తరగతి వ్యక్తి వేసవికాలంలో కొందరు పేదవారికి ఉచితంగా రాగిజావ అందిస్తారని చదివాను.
ఒక వ్యక్తి విదేశాల్లో తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి వచ్చి ఆ ఊరినే ఒక ఆదర్శ గ్రామంగా మార్చివేశారట.
ఇలా ఎందరో మహోన్నత వ్యక్తుల గురించి వార్తాపత్రికల్లో చదువుతుంటాము.
వీరందరూ గొప్పవ్యక్తులు. వీరికి అధికారం, ఎక్కువగా ఆర్ధికవనరులు లేకపోయినా కూడా వీరు విజయాలను సాధిస్తున్నారు.
మరి అధికారం ఉన్నప్పుడు ఎంత ప్రజాసేవ చెయ్యవచ్చో కదా!
కాని స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి ఎన్నో ఏళ్ళు గడిచినా దేశంలో సమస్యలు చాలా అలాగే ఉన్నాయి. కారణాలు అందరికీ తెలిసినవే.
రాజకీయనాయకులు, అధికారులు, ప్రజలు కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ సమస్యలను పరిష్కరిచుకోవటం పెద్ద పనేమీ కాదు.
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఫ్లోరిన్ నీటి వాడకం వల్ల అవయవాలు వంకర్లు పోయిన వారు ఉన్నారు. వారిని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది.
ఇలాంటివి తక్షణం పరిష్కరించవలసిన సమస్యలు.
ప్రతి కుటుంబానికి తాగటానికి, వంట చేసుకోవటానికి రోజుకు రెండు బిందెలు శుద్ధి చేసిన నీటిని అందిస్తే చాలు , చాలావరకు ఈ సమస్య ను పరిష్కరించవచ్చు.
అందరికి ఆహారాన్ని అందించే రైతులు , చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు తగ్గ గిట్టుబాటు ధర లభించక , అప్పుల బారిన పడి వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
విలాసవంతమైన వస్తువులు తయారుచేసే పరిశ్రమలవారికి ఎంతో ఉదారంగా రాయితీలను అందించి ఆదుకున్నట్లే , ఈ బడుగు వర్గాల వారికీ తగినంత గిట్టుబాటు ధర ఇస్తే వారూ జీవిస్తారు కదా !
ఇక ప్లాస్టిక్ ఉత్పత్తులను ఇప్పటికిప్పుడు వాడకం ఆపటం కుదరనప్పుడు ,
ప్రతి వీధిలోనూ కేవలం ప్లాస్టిక్ వ్యర్ధాలను పారవెయ్యటానికి ప్రత్యేకమైన చెత్తబుట్టలు ఏర్పాటు చేస్తే ,
అవి గాలికి విచ్చలవిడిగా ఎగిరి కాలువలకు అడ్డంపడటం ,
వర్షాకాలంలో కాలువలు పూడిపోయి ఊళ్ళు వరదల్లో తేలటం వంటి సమస్యలు ఉండవు కదా !
ఇవన్నీ చేయటానికి డబ్బు ఖర్చు కన్నా , కావలసింది చిత్తశుద్ధి మాత్రమే.
ప్రజలు , నాయకులు తమ సొంత స్వార్ధాన్ని తగ్గించుకుని సమాజానికి మేలు చేస్తే (సమాజమంటే ప్రజలే కాబట్టి ) అందరూ సుఖంగా ఉంటారు.
రాజకీయనాయకులు, అధికారులు, ప్రజలు ఉమ్మడిగా కృషి చేస్తే ఈ సమస్యలను చాలా సులభంగా పరిష్కరించవచ్చు.
చాలా మంది నాయకులూ , అధికారులు మొదట్లో చిత్తశుద్ధితోనే ప్రజల సమస్యలను పరిష్కరించాలనే అనుకుంటారు. కానీ క్రమంగా రకరకాల కారణాల వల్ల....
ఉదా.. ఉద్యోగంలో చేరిన కొత్తలో నీతిగా ఉండే ఉద్యోగులు కొందరు కాలక్రమేణా రకరకాల కారణాల వల్ల వత్తిడికి లోనై వాళ్ళూ బాధ్యతలను మర్చిపోతారు.
స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరనుంచి అందరూ కలిసి చిత్తశుద్ధితో ప్రజాసమస్యలను పరిష్కరిస్తే ఈ నాడు దేశంలోగానీ, రాష్ట్రంలో గానీ ఈ ఇబ్బందికర పరిస్థితులు ఉండేవికాదు కదా!
ఏ సమస్య అయినా పరిష్కారం చెయ్యాలి అనే మార్గంలో ఆలోచిస్తే పరిష్కారం చెయ్యొచ్చు. మీరు చెప్పినట్లు ప్రతీ సమస్యా వారంతట వారే పరిష్కరించుకున్న గ్రామాలు ఉన్నాయని చదువుతూ ఉంటాము. వాటిని మోడల్ గ తీసుకుని పరిష్కరణకి ప్రయత్నించ వచ్చు. కానీ ప్రభుత్వంలో అటువంటి శాఖ ఉన్నట్లు కనపడుటలేదు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే ప్రజలు తిరగబడితే ప్రభుత్వం దిగి వస్తుందనే రాంగ్ కాన్సెప్ట్ నుండి నాయకులు బయటపడితేగానీ ప్రజా సమస్యల పరిష్కారాలు కావు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీరు చెప్పినట్లు "ఏ సమస్య అయినా పరిష్కారం చెయ్యాలి అనే మార్గంలో ఆలోచిస్తే పరిష్కారం చెయ్యొచ్చు." అన్నది నిజం.
కానీ సమస్యలను పరిష్కరించాలి అని గట్టిగా ప్రయత్నించేవారు ఈ రోజుల్లో తక్కువగా ఉన్నారు. అదే ఒక పెద్ద సమస్య.
కొందరికి కీర్తి కండూతి. కొందరికి అధికార దాహం. కొందరికి ప్రపంచంలో ఉన్న సంపదంతా తమకే కావాలనే ఆరాటం.
ఇలాంటివారు ఎలా ఆలోచిస్తారంటే , ప్రజల సమస్యలు పరిష్కరించబడి ,వారి పేదరికం పోతే , అప్పుడు ప్రజలు తెలివిమీరితే తమ ఆటలు సాగవేమో ! అని భావించి , ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ తమ స్వప్రయోజనాలను సాధించుకుంటూ ఉంటారు. ప్రజలు కూడా గొర్రె కసాయి వారినే నమ్మినట్లు ,ఇలాంటి వారినే నమ్ముతుంటారు. ఎవరి కర్మకు వారే బాధ్యులు కదండి !
ఎక్కువమంది ప్రజలు కూడా విలాసవంతమైన జీవితాల కోసం వెంపర్లాడుతూ స్వార్ధపూరితమైన పనులు చేస్తున్నారు.
అందుకని ఎవరినీ ప్రత్యేకంగా తప్పుపట్టటానికి లేదండి. అందరూ అందరే. ఎలాగైనా సరే బాగా డబ్బు సంపాదించి విలాసంగా జీవించటమే ఈ రోజుల్లో చాలామందికి జీవితధ్యేయమయిపోయింది.
కానీ, చిత్రమేమిటంటే వీరిలో పూర్తి సంతోషంగా ఉండేవారు ఒక్కరు కూడా కనబడరు. తాత్కాలికమైన సంతోషం కోసం వెంపర్లాడి వీరందరూ దీర్ఘకాల దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. అంతే.
సమాజం ఇలా ఉండటానికి అన్ని వర్గాల ప్రజలూ కారణమే. ప్రజలలో నైతికవిలువలు లోపించటం కూడా నేటి దుస్థితికి కారణం.
పూర్వం కొంతలో కొంతన్నా దైవం, పాపపుణ్యాల పట్ల భయం, భక్తి ఉండేవి. ఇప్పుడు చాలామంది ప్రజలు స్వార్ధపూరితమైన కోరికలతో దైవపూజలూ దండిగా చేస్తున్నారు. అదేసమయంలో అతితెలివిగా పాపాలూ నిర్లజ్జగా చేస్తున్నారు. దైవాన్నే మోసం చేయగలం అనుకుంటున్నారు... పాపం....