*బ్రహ్మ దేవుడు , నారదునితో పరమాత్మను గురించి చెప్పిన సందర్భంలో..
*సర్వప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి-ఆదిపురుషుల తత్వం.అది తేజస్సు...ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు.సర్వ ప్రాణికోటిలోనూ మిశ్రాభూతులై ఏకరూపులై అవ్యయులై నిర్గుణులై నిర్మలులై చిదాత్మలై ఉంటారు. పరాశక్తియే పరమాత్మ.పరమాత్మయే పరాశక్తి. ఏమీ భేదం లేదు. అంటూ ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.
ప్రాచీన గ్రంధాలలో ఎన్నో గొప్ప విషయాలు చెప్పబడ్డాయి.
నాకు అవన్నీ పూర్తిగా అర్ధం చేసుకునే పాండిత్యం లేదు గానీ, నాకు తోచిన కొన్ని అభిప్రాయాలు మీతో చెప్పుకోవాలని అంతే.
నా అభిప్రాయాలు అన్నీ సరైనవే అని నేను చెప్పటం లేదు... కొన్ని పొరపాట్లూ ఉండవచ్చు.
అయితే పెద్దలు ఎన్నో పాత్రలు సృష్టించి , వాటి ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలియచెప్పారని నా అభిప్రాయం.
ఉదా.. భారతంలో శంతన మహారాజు గురించి చెప్పబడింది... వారి పుత్రుడు గాంగేయుడు ( భీష్ముడు. )
శంతన మహారాజు సత్యవతీదేవిని వివాహం చేసుకోగోరిన సందర్భంలో ..
సత్యవతీదేవి తండ్రి అయిన దాశరాజు ,.. శంతనునితో,
" మా అమ్మాయికి పుట్టే కొడుకు మాత్రమే మీ తరువాత పట్టాభిషిక్తుడు కావాలి.
అలా అయితేనే ఈ వివాహానికి ఒప్పుకుంటాను " అంటారు .
అది విని శంతన మహారాజు విచారంగా తిరిగి వచ్చేస్తారు.
జరిగిన విషయాన్ని మంత్రుల ద్వారా తెలుసుకుని, గాంగేయుడు ( భీష్ముడు ),దాశరాజు వద్దకు వెళ్ళి తాను రాజ్యాన్ని స్వీకరించబోను. అని చెప్పగా .......
దాశరాజు " నీ మాట నమ్ముతాను ,.కానీ నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనుమడి నుంచి రాజ్యాన్నిలాక్కుంటే ఎలా "? అని సందేహం వ్యక్తం చేస్తారు కదా !
అప్పుడు గాంగేయుడు తాను " రాజ్యాన్ని చేపట్టబోను , వివాహం చేసుకోను " అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తారు .......
( భీష్ముడు, ఒక శాపం వల్ల భూమిపై జన్మించారు. )
దాశరాజు తన కుమార్తె ఎంతో సంతోషంగా ,గొప్పగా ఉండాలని అలా కోరి ఉంటారు.
కానీ ఇతరులను కష్టపెట్టి తాము గొప్పవాళ్ళం అయిపోవాలని కోరుకోవటం అన్యాయం కదా !
దాశరాజు అంత తాపత్రయపడినా సత్యవతీదేవికి జీవతంలో ఎక్కువ భాగం సంతోషం లేదనే చెప్పుకోవాలి.
శంతనుడుసత్యవతీదేవులకు కలిగిన కుమారులైన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు చిరకాలం రాజ్యాన్ని పాలించలేకపోయారు.
చిత్రాంగదుడు ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించారు.
విచిత్రవీర్యుడు అంబ, అంబాలికలను వివాహమాడిన కొంతకాలానికి వ్యాధి వల్ల మరణించారు.
ఇక దృతరాష్ట్రుల వారు అంధులు, పాండురాజు, వారిది కూడా అకాల మరణమే.
ఇవన్నీ సత్యవతీదేవికి బాధను కలిగించే విషయాలే.
ఇవన్నీ చూస్తే .......
దాశరాజు భీష్ములవారికి రాజ్యాధికారం, వివాహం లేకుండా అడ్డుకున్నా కూడా ........
సత్యవతీదేవి జీవితంలోకి కష్టాలు రాకుండా విధికి అడ్డంపడలేకపోయారు.
* భీష్ముడు రాజ్యాధికారం చేపట్టటం ,వివాహం చేసుకోవటం జరిగితే మహాభారత గాధ ఎలా ఉండేదో ?
* అయితే ,మహాభారతయుద్ధం జరగాలని ఒక ప్రణాళిక ,ముందే దైవం ద్వారా నిర్ణయించబడింది.
అందుకే దాశరాజు వారి నోట విధి అలా పలికించి ఉంటుంది అనుకోవచ్చు.
* కానీ మనం ఏం తెలుసుకోవాలంటే,
మన సంతోషం కోసం ఇతరులను కష్టపెట్టినంత మాత్రాన మన జీవితంలో సంతోషాన్ని పొందలేము..
అలా ఇతరులను కష్టపెడితే వారి ఉసురు మనకు తగిలి మరిన్ని కష్టాలు వచ్చే అవకాశం కూడా ఎంతో ఉంది.అని..
ఇంకా, దృతరాష్ట్రులవారి మితిమీరిన పుత్ర ప్రేమ కూడా భారత యుద్ధం జరగటానికి ,తద్వారా ఎక్కువ జననష్టం జరగటానికి , ఒక కారణమని అంటారు.
అయితే దృతరాష్ట్రుడు మంచి చెబితే దుర్యోధనుడు వినే పరిస్థితి ఉందా ? అంటే అది వేరే విషయం.
కనీసం 5 ఊళ్ళు ఇస్తే చాలు .అని పాండవులు అడిగినా కూడా వినని అధికారదాహం, అసూయ గల వ్యక్తి దుర్యోధనుడు.
ఇలాంటి కొందరి వ్యక్తుల వల్ల చుట్టూ ఉన్న బంధువులకు, దేశంలోని ప్రజలకూ కష్టాలు తప్పవు. వారి స్వార్ధానికి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తారు.
అలా జరగకుండా ఉండాలంటే, పిల్లలను చిన్నతనం నుంచే నయానో, భయానో మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి తల్లిదండ్రులు .చేతనయినంత వరకు ప్రయత్నించాలి .
తల్లిదండ్రులు కూడా తమ స్వార్ధాన్ని తగ్గించుకోవాలి....... లేకపోతే చివరికి చింతించవలసిందే.
ఇంకా, .దుర్యోధనుడు అలా తయారవటానికి శకుని కూడా ఒక కారణమని కొందరు అంటారు.
* ఏమైనా ఒక వ్యక్తి ప్రవర్తన వెనుక ఎన్నో కారణాలుంటాయి.
అతని పూర్వజన్మ కర్మ,ఇప్పుడు చేస్తున్న కర్మ, తల్లిదండ్రుల ప్రవర్తన,సమాజం, స్నేహితులు, బంధువులు,..ఇలా ఎన్నో కారణాలు కలిసి ఒక వ్యక్తి ప్రవర్తనకు కారణాలుగా చెప్పుకోవచ్చు..
వ్రాసిన దానిలో పొరపాట్లు ఏమైనా ఉన్నచో భగవంతుడు క్షమించాలని ప్రార్ధిస్తున్నానండి.
No comments:
Post a Comment